Sat 03 Oct 22:57:24.728323 2015
Authorization
అవి నేను నిజాం కళాశాలలో బి.ఎ. చదివే రోజులు. లెక్చరర్లు చాలా గొప్ప మనసు కలవారు, అంతకు మించి సబ్జెక్ట్‌లో ప్రావీణ్యం కలిగి ఉండేవారు. పాఠ్యాంశాలతో పాటు డిబేట్సు, వ్యాసరచన పోటీలు జరుగుతుండేవి. విద్యార్థుల్లో పేద విద్యార్థులు, మధ్య విద్యార్థులు సంపన్న కుటుంబీకులతో కళాశాల కళకళలాడుతుండేది. నాడు ర్యాగింగ్ బూతం పేరుకైనా కనిపించేది కాదు, తోటి విద్యార్థులను గౌరవించడం గొప్ప సాంప్రదాయం. నా స్నేహితులు హరీష్, సంపన్నకుటుంబంలో నుంచి వచ్చినవాడు, ఆయన తండ్రి రిటైర్ట్ ఎస్.పి. వారికి ఆబిడ్స్‌లో మూడు పెట్రోల్ బంకులు ఉండేవి. వారిది పూర్వికుల నుండి వచ్చిన ఆస్తులు. నేను హరీష్ ఇంకొక స్నేహితుడు శ్రీహరి కలిసి తిరిగేవాళ్ళం. లంచ్ అవర్‌లో ప్రక్కనే ఉన్న జాన్ Ê కంపెనీలో సమోసాలు తిని, కోకాకోలలను మొదటి సారిగా నేను శ్రీహరి తాగాము. హరీష్ మాత్రం డబ్బులు తానే చెల్లించేవాడు. ఆబిడ్స్ సెంటర్‌లో ప్యాలెస్ టాకీస్‌లో తరువాత వచ్చే సినిమా కోసం చూసి వచ్చేవాళ్ళం. మా క్లాస్ ముందు ఉన్న చింత చెట్టును చూసి, ''చింత చెట్టు ఇంత పెద్దగా ఉంటే, మనం తినే అన్నం చెట్టు ఎంత పెద్దగా ఉంటుందని'' హరీష్ అమాయకంగా అడిగేవాడు. హరీష్ సహృదయుడు. పేద వాళ్ళకు తానే ఫీజ్ చెల్లించేవాడు.
శ్రీహరి సెలవుల్లో వాళ్ళ ఊరు రామారం పోతున్నాను, అక్కడ ఇంట్లో వచ్చే సోమవారం రోజు నోము ఉందని, నన్ను తప్పక రమ్మనిచెప్పాడు. నేను వస్తానని మాట ఇచ్చాను. రైలు టికెట్‌కు పది రూపాలయు తక్కువగా ఉన్నందున ఓల్డ్ సిటీలో లాల్ దర్వాజలో మా అత్తమ్మ వద్ద పదిహేను రూపాయలు తీసుకున్నాను. మా అత్తమ్మ మా నాయనకు చిన్న చెల్లె, నన్నెంతగానో ప్రేమించేది. ఎప్పుడు పోయినా అన్నం తినకుండా వెళ్ళనిచ్చేది కాదు. ఆమె సల్ల చారు ఎంతో రుచిగా చేసేది.
నేను రామారం రైల్వే స్టేషన్ దిగి 1 కిలోమీటరు దూరంలో ఉన్న శ్రీహరి ఇంటి వైపు నడిచి వెళ్ళాను. త్రోవలో రైలు గేటు దాటవలసి ఉంటుంది. అప్పుడు రైలు పోవడం వల్ల గేట్‌మ్యాన్ గేట్ తెరిచారు. జనం అటువైపు ఇటు వైపు పోవడం మొదలు పెట్టారు. గేటు చివర మూలకు పోచమ్మ గుడి, ఆ ప్రక్కనే ఒక ముసలి అవ్వ. అక్కడ కొందరు గేటు పోచమ్మను మొక్కి పోదామనుకుంటున్నారు. ఇంతలో ముసలి అవ్వ నన్ను చూసి ''ఓ బిడ్డా పోచమ్మ తల్లి బొట్టు పెట్టుకొని పోవా'' అన్నది. ఆ మాటలో ఎంతో ఆర్తి, ఆ్ధత తోచింది. మరి కొందరు గేటవ్వ పిలుస్తుందని ఆ వైపు వస్తున్నారు. నేను కూడా వారిని అనుసరించి వెళ్ళాను. ముడతల తేలిన వళ్ళు, వంగిన నడముతో ఆమె నిల్చుంది. గేటవ్వ నడికట్టులో ఆకుల చెక్కుడు సంచివేలాడుతుంది. ''పాపం దిక్కులేనిది ఏ ఊరో, ఏ పల్లెనో ఎన్నో ఏళ్ళ నుండి గేటు మైసమ్మను నమ్ముకొని సేవ చేస్తుంది'' అని జనంలో నుండి ఆడ గొంతు వినిపించింది. గేటవ్వ అందరికి బొట్టు పెడుతుంది, కొందరు పది పైసల బిల్లలు, ఐదు పైసల బిల్లలు వేస్తున్నారు. మరి కొందరు పరిగెత్తే రైలు కిటికీలో నుండి పైసలు విసిరివేస్తుంటారు. కొందరు అసలు వేయడం లేదు. అయినా అవ్వ అందరికి బొట్టు పెడుతూనే ఉంది. నేను కూడా అమ్మగారి గుడి ముందు మొక్కి బొట్టు పెట్టించుకున్నాను. గేటవ్వ ముఖంలో మా నాయనమ్మ పోలికలు కనిపించాయి. నేను వంటనే రూపాయి బిల్లను వేసాను. గేటవ్వ మొఖంలో ఒక వెలుగు కనిపించింది ''సల్లగ బతుకు బిడ్డా'' అని ఆశీర్వదించింది. నన్ను నేను సగర్వంగా అభినందించుకున్నాను. ఏదో ఉత్సాహం నన్ను ఆవహించింది. నేను గేటు దాటి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న శ్రీహరి ఊరి వైపు పయనించాను.
స్కూటర్‌పై పాల డబ్బాల వాళ్ళు ఎదురుగా వస్తున్నారు. ఒక ఆడ మనిషి గడ్డిమోపుతో నా వెనక వస్తూ కనిపించింది. ''అమ్మా రామారం ఇంకెంత దూరంలో ఉంది'' అని అడిగాను, అదే ''కనబడేదే ఆ బురుజు దాటితే పంచాయతి కచేరి వస్తుంది, అక్కడనే'' అని అనడంతో నేను వేగం పెంచాను, త్రోవలో తాడి చెట్లను కౌగిలించుకున్న మర్రి చెట్లు పచ్చని పొదలపై ప్రాకిన తీగలు, ఎటు చూసినా పచ్చదనం, ఇంతలో మా ఊరి ఎండిపోయిన చెరువు జ్ఞప్తికి వచ్చింది, బ్రతుకు దెరువులేక వలసులు పోయే జనం కళ్ళల్లో కనిపించారు. రామారం చెరువు నిండుగా ఉండడానికి పిల్లయేరు చెరువులోనికి పారుతుంది. అందుకే ఆ చెరువు ఎండిపోదు అన్న శ్రీహరి మాటలు జ్ఞప్తికి వచ్చాయి. టెలిఫోన్ తీగలపై పాలపిట్టలు ఆహ్వానం పలుకుతున్నట్లు తోచాయి. ఇంతలో ఊరి శివారులోనికి వచ్చాను. ఆ తాటిచెట్ల అందానికి నిజంగా మైమరచిపోయాను. కొన్ని నిటారుగా, మరికొన్ని వయ్యారంగా వంగి స్వాగతం పలుకుతున్నట్లు కనిపించాయి. అసలు ఊరుకు తాటిచెట్లకు ఏదో అనుబంధం ఉన్నట్లు అనిపిస్తుంది. శ్రీహరి ఇంటికి చేరుకున్నాను. సున్నం వేసిన ఇల్లు, ఇంటి గోడలకు ఎర్రని జాజు, ఇల్లంతా అలికి ఉంది, ఎన్నాళ్లో చిన్ననాటి సువాసనలు జ్ఞప్తికి వచ్చాయి.
శ్రీహరి తల్లి ప్రేమతో పలుకరించి కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు ఇచ్చింది. శ్రీహరి తాత బల్లపీఠపై కూర్చొని దగ్గుతో బాధపడుతున్నాడు. శ్రీహరి, నేను వాళ్ళ తమ్ముడు ముగ్గురం భోజనానికి కూర్చున్నాము, ఇస్తరాకులో ముందు అమ్మగారికి పూజ చేసిన పరమాన్నం వడ్డించారు. చిక్కటి పెరుగు, ఎంతో తృప్తిగా తిన్నాను. చివరకు సజ్జబూరెలు రెండు వేసారు. అవి తినేశాను. అయినా ఇంకొకటి కావాలని అడిగి వేసుకున్నాను. శ్రీహరి కొన్ని కట్టిస్తానని ఇంటికి కట్టుకపొమ్మని అన్నాడు. నేను వద్దులే అన్నాను.
శ్రీహరి శ్రీహరి నేను తరువాత ఊరి చెరువు చూడటానికి చెరువు కట్టపై నడుస్తూ ఉంటే చెరువు సముద్రంలా కనిపించింది. చెరువు గట్టుపైన సీమచింతకాయ చెట్టు, పక్కనే మేడి చెట్టు విరగ గాచాయి. ఇంకా కోతులు ఊరిలో అల్లరి పిల్లల కళ్ళలో పడినట్లు లేవు. మేము సీమచింతకాయలు మనసారా తిని ఇల్లు చేరుకున్నాము. శ్రీహరి నన్ను ఆ రాత్రి ఉండమన్నాడు. అయినా నేను స్కాలర్‌షిప్ కోసం అప్లై చేసుకోవలని శ్రీహరిని ఒప్పించి, ఆ ఊరిలోని ఆసామి కరెంటు మోటరు చెడిపోయిందని రామారం మెకానిక్ వద్దకు ఎడ్ల బండిలో తీసుక పోతున్నాడు. శ్రీహరి నన్ను ఎడ్ల బండిలో ఎక్కించి స్టేషన్ వద్ద దించమని బండి నడిపే వ్యక్తికి చెప్పాడు. నేను రామారం స్టేషన్‌లో దిగి ప్యాసింజర్ ఎక్కి ఆ తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఇంటికి తిరిగి వచ్చాను.
చాలా కాలం గడిచిపోయింది. శ్రీహరి బి.ఎ. చదువు ముగించుకొని ఊరిలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. నేను ఎం.ఎ. పాసయి జాబ్ కోసం ఎదురుచూస్తున్నాను. శ్రీహరి చెల్లెలి పెండ్లి నిశ్చయమై ఊరిలో జిల్లా పరిషత్ స్కూల్‌లో వివాహం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీహరినాకు పెళ్ళి పత్రిక పంపించాడు. నేను పెళ్ళి తేది గుర్తుంచుకొని రామారం బయలుదేరాను. రైలు దిగి గేటు వద్దకు వచ్చాను. అక్కడ గేటు లేదు. అంతా నిశ్శబ్దం. గేటు పోచమ్మ గుడి చుట్ట్టూ గడ్డి పెరిగి పిచ్చి మొక్కల్లో కలిసి పోయింది. ''ఓ కొడుకా పోచమ్మ తల్లి బొట్టు పెట్టుకోవా'' అనే మాటలు వినిపించలేదు. గేటవ్వ కనిపించలేదు. గేటుకు బదులుగా పైన బ్రిడ్జి లాంటి ఫ్లై ఓవర్ కట్టారు. పైన లారీలు బస్సులు అటు ఇటు తిరుగుతున్నాయి. ఒక ముసలి తాత అడుగులో అడుగు వేసుకుంటూ నా వైపు చేయి చాచిండు. ''తాత ఇక్కడ గేటవ్వ ఉండేది ఎక్కడ పోయింది'' అని అడిగాను. ''ఇంకెక్కడి గేటవ్వ బిడ్డా, పట్టాల నడుమ పది పైసల బిల్ల తీసుకోవడానికి అటు ఇటు చూడకుండా వంగింది, ముసల్ది రైలు తాకి రెండు తునుకలై జీవిడిచింది ఊళ్ళో వాళ్ళంతా గేటవ్వా గేటవ్వా అని కన్నీళ్ళు పెట్టుకున్నారు. అందరు చందా చేసుకొని సావు చేసిండ్రు. దాని సావు అట్లా రాసిపెట్టుంది. నన్నెట్ల తీసుకపోతడో'' అని ముసలి తాత పైకి చూశాడు. తాత చాచిన చేతిలో రూపాయి బిల్ల వేసి రామారం ఊరిలోకి బరువుగా బాధగా బయలుదేరాను. గేటవ్వ పిలిచినట్లు ప్రతిధ్వని నన్ను వెంటాడుతూనే ఉంది.
- ప్రొ|| పి.లక్ష్మీ నారాయణ
రచయిత సెల్ : 9542656636