Sat 10 Oct 22:23:41.381969 2015
Authorization
మా పిల్లల చిన్నతనంలో మేం హైదరాబాద్‌లో కాపురముండేవాళ్ళం. మేం ఉన్న ఇంటి ఎదురుగా ఖాళీ స్థలంలో గుడిసె వేసుకుని మణెమ్మ, ఆమె భర్త ధంజి ఆ స్థలానికి కాపలా ఉండేవారు. ధనుంజయకి వాడుక పేరే ధంజి. మణెమ్మ నాకు ఇంట్లో పనికి కుదిరింది. ఆమె వెంట రోజూ 13 ఏళ్ళ ఆడపిల్ల వచ్చేది. ఒక్క మాట మాట్లాడేది కాదు. మణెమ్మ వెనకాల సాయం చేస్తూ పని నేర్చుకునేది. ఆ పిల్ల పేరు బతుకమ్మ. బతుకమ్మ తంగేడు పువ్వంత మెత్తగా అమాయకంగా నవ్వేది. వాళ్ళ పల్లెటూరి భాష, యాస నాకు అర్థం అయ్యేది కాదు. బతుకమ్మ మణెమ్మ కూతురనుకునేదాన్ని నేను చాలా కాలం వరకు. ఎంతో కాలానికి తెలిసింది, మణెమ్మ తమ్ముడి కూతురట బతకమ్మ. తమ్ముడు చనిపోయాక మరదలు మారు మనువు చేసుకుందని ఏడాది క్రితం బతుకమ్మని ధంజి మణెమ్మలు తమ దగ్గరకు తెచ్చుకున్నారట. పిల్లలు లేని ధంజి మణెమ్మలు అలా చేసినందుకు నాకు సంతోషం అనిపించింది. ధంజిని అప్పుడప్పుడు పలకరించడం మొదలుపెట్టాను. ఒకసారి ఎప్పుడో బతుకమ్మని వాళ్ళమ్మ వచ్చి, ధంజిని బతిమిలాడి తీసుకెళ్ళినా ధంజి రెండు రోజులకల్లా మళ్ళీ వెనక్కి తీసుకువచ్చాడట.
రెండేళ్ళు గడిచినై. ఈ మధ్యలో ఎప్పుడూ బతుకమ్మ వాళ్ళమ్మ దగ్గరకు వెళ్ళడం కానీ, వాళ్ళమ్మ పిల్ల దగ్గరకి రావడం కానీ వినలేదు. మణెమ్మ మాటిమాటికీ ఒంట్లో బాగులేదని రాకపోవటం, బతుకమ్మ వచ్చి మాటా పలుకు లేకుండా కొంచెం పని సాయం చేయడం ఎక్కువగా జరుగుతోంది ఈ మధ్య. ఒకరోజు ధంజి వచ్చి బతుకమ్మకి పెళ్ళి చేస్తున్నానని, ఇల్లరికపుటల్లుడు దొరికాడని, కొంచెం డబ్బు సాయం కావాలని అడిగాడు. ఈ చిన్న పిల్లకి పెళ్ళేమిటని బాధేసినా, బతుకమ్మ ఇంటి నుండి బయటకు వెళ్ళనందుకు కొంచెం సమాధానపడ్డాను. పెళ్ళై 15 రోజులు గడిచినై. ఆ పెళ్ళికొడుకు పారిపోయాడని, రెండు రోజులైనా ఇంటికి రాలేదనీ మణెమ్మ పనికొచ్చి చెప్పింది. మరో ఆరు నెలలు గడిచాయి. బతుకమ్మకి మళ్ళీ పెళ్ళి చేశారు. ఈసారీ ఇల్లరికపుటల్లుడే. ఈ పెళ్ళికొడుకు నాలుగు రోజులకే పారిపోయాడు. మరో రోజు మణెమ్మకి మళ్ళీ ఒంట్లో బాగోలేక బతుకమ్మ పనికొచ్చింది. పని అందుకోకుండా నా వెనకాల నేరుగా వంటింట్లోకి వచ్చి గోడనానుకుని కూర్చుని ఏడవడం మొదలు పెట్టింది. కారణం ఏమిటని ఎంతసేపడిగినా మాట మాట్లాడలేదు. పెళ్ళికొడుకు పారిపోయినందుకేమో అనుకున్నాను.
మరు రోజూ అదే! బతుకమ్మే పనికొచ్చింది, మణెమ్మకి ఒంట్లో బాగోలేదని. వచ్చిన అమ్మాయి మళ్ళీ వంటింట్లో గోడనానుకుని ఏడుస్తూ కూర్చుంది. ఏం చేయాలో తోచలేదు. టీ ఇచ్చి బుజ్జగించి అడిగాను. బతుకమ్మ కట్టలు తెంచుకుని ఏడ్చింది. ఏనాడూ మాట్లాడని బతుకమ్మ మొదటిసారిగా మాట్లాడటం మొదలెట్టింది. తన కథ చెప్పింది. ఆమె తల్లిదగ్గరి నుండి బతుకమ్మని లాక్కొచ్చాడట ధంజి. వాళ్ళమ్మ ఎంత ఏడ్చినా, బతిమాలినా బతుకమ్మని తల్లి దగ్గరికి పంపడట. మణెమ్మని మాటిమాటికీ కొడతాడట. ఈ మధ్య ఓపిక కూడా తగ్గి ఆ దెబ్బలకి మణెమ్మకి జ్వరం వస్తోంది. బతుకమ్మతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తాడట. అశ్లీలమైన పనులు చేస్తాడట. పెళ్ళికొడుకుల్ని పారిపోయేటట్టు అతనే చేశాట్ట.
ఊహించని నిజాల్ని అకస్మాత్తుగా విని హడలిపోయాను. ఏమీ తోచలేదు. ఏం చేద్దామని అనుకుంటున్నావని బతుకమ్మని అడిగాను. వాళ్ళమ్మ దగ్గరకి వెళ్ళిపోతానని చెప్పింది. తనకి వాళ్ళ ఊరు దారి గుర్తుందని, డబ్బులిస్తే బస్సెక్కి వెళతానని చెప్పింది. అంత భయంభయంగా ఉండే బతుకమ్మకి ఇంత ధైర్యం ఎలా వచ్చిందో తెలియలేదు. అలా ఒక్కత్తినీ పంపానంటే పెనం మీంచి పొయ్యిలోకి తోసినదాన్నవుతానని భయం వేసింది. చివరికి నేనే దింపటానికి నిర్ణయించుకుని కారులో సీటు కిందగా బతుకమ్మని కూర్చోబెట్టి ధంజి, మణెమ్మల కంట పడకుండా వీధి దాటించాను. బతుకమ్మ చెప్పిన ఊరివైపు కారు తిప్పాను.
వాళ్ళది 30 గడపలున్న చిన్న గూడెం. బతుకమ్మ వాళ్ళమ్మ పరుగెత్తుకొచ్చి కూతుర్ని పట్టుకుని ఏడ్చేసింది. ఒక ఇరవైమంది గుమిగూడారు. ఆమె సవతి తండ్రి వచ్చాడు. అందరూ భరోసా ఇచ్చారు, బతుకమ్మని జాగ్రత్తగా చూసుకుంటామని. మంచి చేశానో, చెడు చేశానో అనుకుంటూ బతుకమ్మ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయంతో ఆమెని అక్కడే వదిలేసి వెనక్కి తిరిగాను. నా కారు కనిపించే వరకు సంతోషంగా చెయ్యి ఊపుతోంది బతుకమ్మ. మలుపు తిరిగాక నా స్టీరింగ్ పక్క అద్దంలోంచి బతుకమ్మ మాయమైంది. ఆ తరువాత బతుకమ్మ సంగతి నాకు తెలియదు.
ఆ సంవత్సరం దసరాకి వరంగల్ మా పుట్టింటికి వెళ్ళాను. నేను చిన్నప్పుడు బతుకమ్మలాడిన చెరువు గట్టుకు మా పిల్లల్ని తీసుకెడదామనిపించింది. గట్టు పొడవునా గుంపులుగా బతుకమ్మలు పేర్చి ఉన్నాయి. పేర్చిన పళ్ళేలలో తంగేడు పూలు అందంగా నవ్వుతున్నాయి. నేను ఊళ్ళో వదిలి వచ్చిన బతుకమ్మ గుర్తుకు వచ్చింది ఆ పూలు చూస్తే. బతుకమ్మ ఎలా ఉందో అనే బాధ మళ్ళీ వచ్చింది. వెళ్లి పక్కగా కూర్చున్నాను. బతుకమ్మ ఆట, పాట జోరందుకుంది. మా అమ్మాయి పరుగెత్తుకెళ్ళి వాళ్ళతో పాటూ కలిసి ఆడుతోంది. ఆ ప్రతి పాటల్లోనూ ఆడపిల్ల ఎంత సహనంగా ఉండాలి, కుటుంబంలోనూ, సమాజంలోనూ ఎలా ఒదిగి ఉండాలి, ఎక్కడా ఎదురు సమాధానం చెప్పకూడదనీ, తనుగా ఏ నిర్ణయమూ తీసుకోకూడదనీ, పవిత్రత ఎంత ముఖ్యమో చెప్పే ఎల్లమ్మ, బతుకమ్మ కథలు పాటలుగా పాడుతూ ఆడుతున్నారు స్త్రీలందరూ.
అక్కడ పేర్చి ఉన్న బతుకమ్మలు ఒక్కొక్క కథగా కనిపించినై ఆ పాటలు వింటుంటే. భర్త కొడుతున్నా భరిస్తున్న మణెమ్మ, అసభ్యాలు భరించలేక మాయమైన బతుకమ్మ, కూతుర్ని దగ్గరికి తెచ్చుకోలేని ఓ తల్లి కథ... అలా ఎన్నో బతుకమ్మలు, వాళ్ళ కథలు చెప్తూ తంగేడు పూలల్లె నవ్వాయి. ఈ కథలన్నీ ఎప్పుడూ మర్చిపోవద్దనేమో తంగేడు పువ్వు కనిపిస్తే జడలో పెట్టుకోవాలంటారు.
ఇంతలోనే పాటల వరుసలు మారినై. స్త్రీలు ఎదగాలని, అన్యాయాన్ని సహించవద్దనీ, నడుం కట్టి అన్ని విధాలా అభివృద్ధికి పాటుపడాలనీ కొత్త రకం పాటలు పాడుతున్నారు.
(ఓ జరిగిన కథను గుర్తు చేసుకుంటూ రాసిన వాస్తవ గాథ)
రచయిత సెల్ : 8106713356