Sat 24 Oct 13:06:08.364245 2015
Authorization
ఓసారి కొంతమంది వర్తకులు తమ సరుకులను బళ్ళమీద వేసుకొని సుదూర ప్రాంతానికి వర్తకం కోసం బయలుదేరారు. బాగా అనుభవజ్ఞుడైన ఒక వృద్ధ వర్తకుడు వారి నాయకుడు. కొంతసేపటి తరువాత ఆ బృదం ఒక పల్లె శివారులో మధ్యాహ్నం బోజనం కోసం విడిది చేసింది. అప్పుడు కొందరు ఒక పళ్ళ చెట్టును చూశారు. దాని పండ్లు అచ్చం మామిడి పండ్లను పోలి ఉన్నాయి.
వాటిని చూసిన కొందరు వర్తకులు ఆ పండ్లు కోయటానికి సిద్ధ పడ్డారు. అది చూసిన మరో వర్తకుడు పరుగెత్తుకెళ్ళి వాళ్ళ నాయకునికి ఆ సంగతి చెప్పాడు.
ఆయన కంగారుగా వచ్చి ''వాటిని తినకండి. అవి మామిడి పండ్లు కావు. విషఫలాలు'' అని హెచ్చరించాడు.
ఆ పండ్లు తెంపుకున్న వారందరూ వెంటనే వాటిని కింద పడేశారు. కొందరు మాత్రం అప్పటికే వాటిని తినడంతో వాళ్ళకు ఆకు తాగించి తిన్నదాన్ని కక్కించాడు వాళ్ళు నాయకుడు. అందరూ ప్రమాదం నుంచి బయటపడ్డారని నిర్ధారించుకున్నాక ''మనం వెళ్ళే ముందు ఆ చెట్టును సమాలంగా సరికేయ్యాలి. ఇదో మృత్యు కుహరం'' అన్నాడు.
దాంతో అందరూ కలిసి ఆ చెట్టును కులదోశారు. ఫెళఫెళమంటూ కూలిన ఆ చెట్టు శబ్దానికి, దాపులో ఉన్న గ్రామస్తులంతా పరుగెత్తుకొచ్చి, ''ఏంటి, మీరు చేసిన పని? మా జీవనాధారాన్ని కూల్చివేశారు. ఈ చెట్టు పళ్ళు తిన్న ఎవరైనా చనిపోతే, అతని దగ్గర ఉన్న డబ్బు, దస్కం పంచుకుని బతుకుతున్నాం మేం. ఇక మేమెట్లా బతకాలి?'' అని ఆక్రోశించారు.
''ఎంత అమానుషం! మనుషులు ప్రాణాలతో ఆటలాడుకుంటారా? ఇతరులను చంపి మీరు బతకడం ఘోరం. ఏదన్నా నిజాయితీగా జీవించే మార్గం చూసుకోండి'' అన్నాడు వర్తకుల నాయకుడు.
అసలా చెట్టు మిషపూరితమైనదని మీరెలా తెలుసుకున్నారు? అది ఎన్నో సంవత్సరాల నుంచి ఉందిక్కడ. దాని పళ్ళ ఆకర్షణకు లోనుకాకుండా ఉండడం ఎవరి తరమూ కాదు'' అన్నారు గ్రామస్తులు.
''అది కనుక్కోవడం అంత పెద్ద విషయమేం కాదు. ఏదైనా ఊరికి దగ్గరలో పండ్ల చెట్టు ఉంటే ఆ ఊరి వాళ్ళు, ముఖ్యంగా పిల్లలు వాటిని తినడం సహజం. మరి ఇంత ఆకర్షణీయంగా, నోరూరించేలా ఉన్న పండ్లను ఎవరూ తెంపకుండా ఉన్నారంటే అవి కచ్చితంగా విషపూరితమైనవే అనుకున్నాను'' అన్నాడు వృద్ధ నాయకుడు. అతని తెలివి తేటలకు గ్రామస్థులు, వర్తకులు అతణ్ణి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.