Sat 26 Dec 19:52:19.676315 2015
Authorization
బుంగి, నేను, విద్యార్థులం కలిసి అంధుల పాఠశాలక వెళ్ళాం. అక్కడి పిల్లలతో ఆట - మాట - పాట కలిసి చేశాం. కాలం తెలియలేదు. పిల్లల నైపుణ్యం పట్ల, వారి చురుకుదనం పట్ల ముగ్దులమయ్యాం. తెలియకుండానే వారి పట్ల సానుభూతి కలిగింది.
''పిల్లలకు పండ్లు పంచుదాం'' ఆత్రంగా అన్నాడు బుంగి.
''సరే అట్లాగే'' అన్నాను.
''మాకు పండ్లు పంచి సానుభూతి ప్రదర్శించకండి. ఇక్కడ మాకేం తక్కువ లేదు'' అన్నాడో పిల్లవాడు.
ఆలోచన మానుకుని తిరుగు ప్రయాణం అయినాము.
ఆ మధ్య నేనో సభకు వెళ్ళిన. ఒకరెనుకొకరు వచ్చి సానుభూతితో కూడిన ప్రోత్సాహక వాక్యాలు మాట్లాడినారు. తరువాత వికలలాంగుల ఆట - పాట కార్యక్రమం కాళ్ళు పోగొట్టుకున్న వ్యక్తి నృత్యంతో మొదలయింది. ప్రేక్షకులు ఒక్కసారిగా లేచి నుంచుని, నృత్యం చూసి చప్పట్లతో దుప్పట్లు నేశారు. తరువాత ఓ గుడ్డి అమ్మాయి పాడటానికి వచ్చి...
''అందరికీ నమస్కారం. మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటరు. కాని 'సర్వం ప్రధానం' అని నేనంటున్న. మానసికంగా మేం సంపూర్ణ ఆరోగ్యవంతులం'' అని పాట మొదలు పెట్టింది. ఆ రోజు ఆమె ఆత్మ స్థైర్యానికి పులకించిన. స్థిరీకరించబడ్డ విలువను కాదని 'సర్వం ప్రధానం' అని అనడం ఈ రోజు గుర్తుకొస్తుంది. ఈనాటి పిల్లవాని మాటలు పాటగత్తెను గుర్తుకు తెచ్చినయి. పోటెత్తిన ఆత్మగౌరవం వీరిలో కనపడింది అని తిరుగు ప్రయాణంలో బుంగి చెప్పిండు.
''అనగననగ రాగమతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ''
- డా||బి.వి.ఎన్.స్వామి, 924717732