Sat 09 Jan 18:19:37.624091 2016
Authorization
నిండైన కట్టు బొట్టు, విలక్షణ గాత్రం, అబ్బురపరిచే హుషారుతో ఆమె పాడుతుంటే వింటున్న వారి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ గాత్రంతో మైమరచిపోయి తెలియకుండానే ఆ పాటకు తగ్గట్టు శరీరంలో కదలికలు మొదలవుతాయి. ఆ గొంతులో కచ్చితంగా ఏదో మ్యాజిక్ ఉంది అనుకోకుండా ఉండలేరు ఎవరైనా. ఆమె పాట ఉవ్వెత్తున ఎగసిపడే కెరటం. విన్నవారెవరైనా ఎగరి గంతెయ్యాల్సిందే. భారతీయ పాప్ గీతాలను చిరునామాగా ఉన్న ఆమే ఉషా ఉతుప్. ఆమె పేరు వింటే ''డిస్కోడ్యాన్సర్, షాలిమార్, షాన్' వంటి చిత్రాల్లో ఆమె పాడిన పాటలు ఇప్పటికీ నాటి యువతనే కాదు, ఈనాటి కుర్రకారునూ ఉర్రూతలూగిస్తాయి. ఇక తెలుగులో 'కీచురాళ్ళు' చిత్రంలో ఆమె పాడిన ''కీచురాళ్ళు చీకటింట మగ్గు చిచ్చురాళ్ళు... కీచురాళ్లు గొంతు చించుకున్న రేయికోళ్ళు''. ఈ పాట పాటతోనే తెలుగులో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగులో వేళ్ళమీద లెక్కపెట్టగలిగే పాటలే పాడినా ఆమె తెలియని సంగీత ప్రియులు ఉండరు. ''దమ్ మారో దమ్... మిత్ జాయే గమ్...'' పాట వింటూ ఎవరూ కదల్లేరు!
చిత్రపరిశ్రమలో పాప్ సింగర్లు చాలా తక్కువ సంఖ్యలో వున్నప్పుడే ఉషా ఉతుప్ తన అద్భుతమైన ప్రతిభతో పాప్ గాయనిగా ఎదిగారు. 1960లోనే పాప్ గీతాలు పాడటంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారీమె... బెంగాలి, హిందీ, పంజాబీ, అస్సామీ, ఒరియా, గుజరాతి, మరాఠీ, కొంకణి, మలయాళం, కన్నడ, తమిళ్, తుళ, తెలుగు వంటి భారతీయ భాషలలో మాత్రమే కాదు.. ఇంగ్లీష్, డచ్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, సింహళీస్, స్వాహిలి, రష్యన్, నేపాలీస్, అరబిక్, క్రియోల్, జులు, స్పానిష్ వంటి అనేక విదేశీ భాషలలో కూడా తన గానంతో ప్రేక్షకులను మైమరిపించారు. బహుశా ఇన్నిభాషల్లో పాటలు పాడిన పాప్ గాయని మరొకరు లేరేమో!
1947 నవంబర్ 8వ తేదీన తమిళనాడులోని చెన్నైలో ఉష జన్మించారు. సంగీతంలో సాంప్రదాయపరమైన శిక్షణ పొందనప్పటికీ పాప్ పాటల వాతావరణంలో పెరిగారు. శ్రేయోభిలాషుల సలహాతో భారతీయ సంప్రదాయ సంగీతాన్ని అభ్యసించారు. వీటికితోడు రేడియోలో వచ్చే హిందూస్తానీ, కర్ణాటక సంగీతాన్ని వినడం... ఇలా మిశ్రమ సంగీతం వినడం, నేర్చుకోవడంతో తనకంటూ ప్రత్యేక ముద్ర వేయించుకుని.. నేడు భారతీయ ప్రసిద్ధ పాప్ గాయకురాలిగా రాణించారు.
నైట్ క్లబ్‌లో లైవ్ సింగర్‌గా మొదలు పెట్టిన ఉష క్రమంగా స్టేజ్ సింగర్‌గా, ప్లే బ్యాక్ సింగర్‌గా ఎదిగారు. ''హరే రామ హరే కృష్ణ'' తో సినీ ప్రస్థానం మొదలైంది. 1970, 1980 దశాబ్దాలలో ఆర్.డి.బర్మన్, బప్పిలహరి సంగీత దర్శకత్వంలో ఆమె పాడిన పాటలు లెక్కలేనన్ని. అన్నీ విజయవంతమైనవే. ఆర్.డి.బర్మన్ ''మెహబూబా మెహబూబా'', ''దమ్ మారో దమ్'' వంటి ఇతరులు పాడిన పాటలను తిరిగి ఉషతో వైవిధ్యమైన రీతిలో పాడించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 'షాలిమార్'లోని ''వన్ టూ చ చచ''కి, 'ప్యారే దుష్మన్'లోని ''హరి ఓం హరి'' పాటలకు ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. బాగా పాపులర్ అయిన ఆమె పాటల్లో మరోటి 'అర్మాన్'లోని ''రంభ హౌ''.
ఓ సందర్భంలో హైదరాబాద్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ... తన మొట్టమెదటి షో రవీంద్ర భారతిలో జరిగిందని, ఇక్కడి గోంగూర, ఆవకాయ మహా ఇష్టమంటారు. గాజులంటే ఎంతో ఇష్టపడే ఆమె వద్ద ఇప్పటికి పదివేల గాజుల కలెక్షన్ ఉంటుందట. హైదరాబాద్ వస్తే లాడ్ బజార్‌లోనే ఒక రోజంతా గడుపుతానంటారు ఉష. తలలో పూలు, చేతుల నిండా గాజులు, కాంచీవరం జరీ చీర... లాంటి ప్రత్యేక అలంకరణంతా తాను పుట్టి పెరిగిన మధ్యతరగతి నుండి వచ్చిందంటారు.
తన గాత్రంతో 49 ఏళ్లుగా సంగీత ప్రియులను అలరిస్తూ, ప్రపంచ నలుమూలల నుంచి వేల మంది అభిమానులను సంపాదించుకున్నారు ఉషా ఉతుప్. ఆమె పాడటం మొదలు పెట్టిన తొలి రోజుల్లో ఎంత హుషారుగా పాడారో, ఇప్పటికీ అదే హుషారుతో, జోష్ తో గతేడాది వచ్చిన 'రేసుగుర్రం'లో పాడారు. ఉషా ఉతప్ గాయనే కాదు, నటి కూడా. 'సాథ్ కూన్ మాఫ్', 'రాక్‌ఆన్-2' అనే బాలీవుడ్ చిత్రంలో నటించారు.
- మల్లేశ్వరి