Sat 16 Jan 16:20:30.178634 2016
Authorization
నిశ్చల హృదయం మనం నిరంతరం ప్రశాంతంగా ఉండేందుకు, ఉల్లాసంగా జీవితాన్ని గడపడానికి తోడ్పడుతుంది. అలాంటి హృదయాన్ని మీరు కలిగి ఉండేందుకు సాధన అవసరం. మీ ఆత్మీయులందరినీ మనస్ఫూర్తిగా అభిమానించడం, ప్రేమించడం విజయసాధనకు ఎంతో తోడ్పడుతుంది. మీరు ఏ స్థాయిలో ఆత్మీయులను అభిమానిస్తే, అదే స్థాయిలో వారి నుంచి మీకు ప్రతిఫలం లభిస్తుంది. మీరు ఎంత ఎక్కువ మందిని అభిమానిస్తే, అంత ఎక్కువ మంది మిమ్మల్ని అభిమానిస్తారు.
మీరు ఎంచుకున్న రంగంలో విజయం సాధించాలంటే మీకు వీలయినంత ఎక్కువ మంది తోడ్పాటు అవసరం. అదే విధంగా మీకు ఎప్పుడైనా వైఫల్యాలు ఎదురైతే వాటిని తట్టుకునేందుకు తిరిగి ముందుకు సాగడానికి కూడా ఇతరుల సహాయ సహకారాలు అవసరమవుతాయి. మీరు మంచి ప్రవర్తన అలవర్చుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ పొందగలుగుతారు. మంచి ప్రవర్తన అలవర్చుకునేందుకు గొప్ప వ్యక్తుల జీవితాలను పరిశీలించాలి. చీకటి గదిలో కూర్చొని వెలుతురు గురించి ఆలోచిస్తే లాభంలేదు. లేచి దీపం వెలిగించాల్సిందే. మనం కష్టపడకుండా దేనినీ సాధించలేం. ఖాళీగా కూర్చొని పని గురించి ఆలోచిస్తే లాభంలేదు. లేచి కష్టపడాల్సిందే. చేసే ప్రతిపనిలో ఆనందం ఉండక పోవచ్చు కానీ ఏ పని చెయ్యకుండా మాత్రం ఆనందాన్ని పొందలేం. కొంతమంది కష్టపడకుండానే అన్నీ తమకు లభించాలని కోరుకుంటారు. ప్రతి పనికి షార్ట్‌కట్ ఆలోచిస్తారు. ఇది సరికాదు.
మనకు జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురై ఉండవచ్చు. గతంలో మనం ఎన్నో పొరపాట్లు, తప్పులు చేసి ఉండవచ్చు. వాటిని పదే పదే తలుచుకుని బాధపడడం వల్ల సమయం వృధా అవుతుంది తప్ప ఎలాంటి ప్రయోజనం చేకూరదు. జీవితానుభవాన్ని మనం గుణపాఠంగా తీసుకోవాలి. జీవితంలో ఏయే సందర్భాల్లో పొరపాట్లు చేశామో వాటిని గుర్తించండి. వాటిని కాగితంపై రాసుకోండి. తిరిగి ఆ తప్పులు జరగకుండా జాగ్రత్త వహించండి. నిర్ణయించుకున్న గమ్యాన్ని చేరుకునేందుకు ఏం చేయాలో ఆలోచించాలి. అలాగే ఎప్పుడో ఏదో గొప్ప అవకాశం వస్తుందని ఎదురు చూడకుండా, లభించిన అవకాశాలను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. లేదా మనమే ఆ అవకాశాలను సృష్టించడానికి ప్రయత్నించాలి. జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును సహృదయంతో స్వీకరించాలి. మీ శక్తినంతా కూడగట్టుకుని ఆ సవాలును పరిష్కరించుకోవాలి. ఈ వర్గ సమాజంలో ప్రతి చోట స్వార్థమే స్వారీ చేస్తున్నది. కొంత మంది డబ్బు సంపాదనే ప్రతి వ్యక్తి జీవితంలో ముఖ్యమనుకుంటారు. దాని ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయనుకుంటారు. అయితే డబ్బు సంపాదన అవసరమే. కానీ అదొక్కటే జీవిత లక్ష్యం కాకూడదు. అనేక మంది వ్యక్తులు డబ్బు సంపాదనకే పరుగులు తీస్తారు. డబ్బులున్నాయని విచ్చల విడిగా వ్యయం చేస్తారు. తిరిగి దానిని సంపాదించడానికి నానా అగచాట్లు పడతారు. అలా కాకుండా మనకు ఉన్న ఆర్థిక వనరులను చక్కగా, ప్రణాళికా బద్ధంగా ఉపయోగించుకుంటే సరిపోతుంది. ఏ పద్దుకు ఎంత వ్యయం చేయాలి. అత్యవసరాల కోసం కొంత డబ్బును ఎలా పొదుపు చేసుకోవాలనే విషయాలను తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలోని గొప్ప వ్యక్తులు డబ్బు సంపాదనకు మాత్రమే తమ సమయాన్ని కేటాయించలేదు. తమకున్న ప్రతిభను ఉపయోగించి సమాజ హితం కోసం పాటుపడ్డారు. మన మధ్య అలాంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకోవచ్చు. దీని కోసం గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదివితే ఎన్నో విషయాలు అవగతమవుతాయి. అలాంటి వ్యక్తులు సంక్షోభాలు తలెత్తినప్పుడు ఎలా ప్రవర్తించారనే విషయాలను నేర్చుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇతరుల బాగుకోసం కష్టపడుతున్నామనే ఆత్మ సంతృప్తే వారికి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అదే వారిని ముందుకు నడిపిస్తుంది. పాత్రికేయుడిగా ఒకసారి ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారేను ఇంటర్య్వూ చేసేందుకు మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధికి వెళ్లాను. ఆ సమయంలో ఆయన ఎంతో ఉల్లాసంగా కనిపించారు. దానికి కారణమేమిటి? అని ప్రశ్నిస్తే, ఇతరుల బాగు కోసం పని చేయడంలోనే ఆనందం లభిస్తుందని, ప్రతి వ్యక్తి కొంత సమయాన్ని సమాజ హితం కోసం కేటాయించాలని కోరారు. మన కోసం కాకుండా ఇతరుల కోసం పని చేసే సమయంలో రెట్టించిన ఉత్సాహాన్ని పొందగలుగుతామని ఆయన స్వానుభవంతో చెప్పారు.ఆయన మాటలు అక్షరసత్యాలని అనిపించింది.
- జి.గంగాధర్ సిర్ప, 9010330529