Sat 09 May 23:28:37.352475 2015
Authorization
ఎంత వద్దనుకున్నా మనిషి జీవితాంతం వచ్చేది అమ్మ ప్రేమ ఒక్కటే. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ప్రతి దశలో కష్టసుఖాల్లో మొదట గుర్తొచ్చేది అమ్మ. అమృతం లాంటి అమ్మ చేతి స్పర్శ ఎంతటి బాధనైనా మర్చిపోయేలా చేస్తుంది. మనం ఎలా వుండాలో తండ్రి చెప్తే, ఎలా ఉన్నామో తల్లి చెప్తుంది అంటారు పీటర్ డేవిసన్. తన బిడ్డల్ని అనునిత్యం కంటికి రెప్పలా కాపాడే అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి అమ్మ పాత్రకి సినిమాల్లోనూ ప్రముఖ స్థానమే ఉంది. మాతృదినోత్సవం సందర్భంగా అమ్మ పాటలు కొన్ని...
అమ్మ జోల పాట వింటూ, నాన్న ఒడిలో నిద్రపోవాల్సిన పసివాడు మనషిన్నవాడు కనిపించని ఎడారిలో తప్పిపోతే... తల్లిదండ్రుల కోసం తపించిపోయే చిన్నారి పాడే పాటని విని మనసు ద్రవించని ప్రేక్షకులు లేరు. జగ్గయ్య, జమున నటించిన 'పాపం పసివాడు' చిత్రంలో ''అమ్మా చూడాలి నిన్నూ నాన్నను చూడాలి'' ఆత్రేయ రాసిన ఈ పాటని సుశీల పాడారు.
మనిషి తప్పులు చేయడం సహజం. ఆ తప్పుల్ని తెలుసుకుని సరిదిద్దుకోవడం మంచి లక్షణం. సరిదిద్దుకోలేని తప్పు తల్లిదండ్రుల పట్ల చేసి, తర్వాత ఎప్పటికో ఆ తప్పును తెలుసుకున్న ఓ కొడుకు తన తల్లిదండ్రుల కోసం ఆవేదన చెందుతూ పాడే పాట ఎన్టీఆర్, అంజలి నటించిన 'పాండురంగ మహత్మ్యం' చిత్రంలో ''అమ్మా అని పిలిచినా ఆలకించవేమమ్మా, ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా'' పాటను జూనియర్ సముద్రాల రాయగా, టి.వి.రాజు సంగీత దర్శకత్వంలో ఘంటసాల పాడారు.
అమ్మ స్థానాన్ని వేరెవరూ భర్తీ చేయలేరు. రిటైర్మెంట్ లేని ఉద్యోగం అమ్మది. పిల్లల్ని పెంచడం బాధ్యత అని కొంతమంది తండ్రులు అనుకుంటారేమో కానీ ఏ తల్లీ అలా అనుకోదు. ఎంతో ఇష్టంగా పిల్లల పనులన్నీ చేస్తుంది. పుట్టినప్పటి నుండి వాళ్ళ పెళ్ళిళ్ళయి, మనుమలు, మనుమరాళ్ళు పుట్టినా విశ్రాంతి అనేది ఎరుకగ అందరికీ ఎంతో శ్రద్దగా సేవలు చేస్తుంది. కానీ పిల్లలు మాత్రం తల్లిదండ్రుల్ని బరువుగా, ఆంక్షలు పెట్టి శాసించే ఛండశాసనులుగా చూసి, నిర్లక్ష్యం చేసి వీళ్ళెప్పుడు ఇంట్లో నుండి వెళ్లిపోతారా అని చూస్తే... ఆ బాధ చెప్పనలవి కాదు. శారద, సత్యనారాయణ నటించిన 'అమ్మ రాజీనామా' చిత్రంలో చక్రవర్తి సంగీతానికి కె.జె.ఏసుదాసు పాడిన పాట ''సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ''. ఇదే చిత్రంలోనే ''చనుబాలు తాగితేనే బ్రతుకు తీపి తెలిసింది'', ''ఎవరు రాయగలరూ అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం'' అనే లో మరో రెండు పాటలు అమ్మ గొప్పదనాన్ని తెలిపేవే.
మొదటిసారి అమ్మ అయినప్పుడు స్త్రీ ఆనందం అంతా ఇంతా కాదు. ఆ బిడ్డని చూసుకుని మురిసిపోతుంది. మైమరచిపోతుంది. ఆ సంతోషంలో తనూ ఓ పసిపాపై ఆడుతుంది. పాడుతుంది. ఆ బిడ్డే తన సర్వస్వం అవుతుంది. శ్రీకాంత్, రమ్యకృష్ణ, సుహాసిని నటించిన 'ఊయల' చిత్రంలో ''పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబుకు మెత్తని ఉయ్యాల, పొత్తిల లోని పున్నమి రాజుకు పువ్వుల ఉయ్యాల'' పాటను ఎస్.వి.కృష్ణారెడ్డి సంగీత సారధ్యంలో సునీత పాడారు.
అమ్మ కావాలని పరితపించని మహిళ వుండదు. అమ్మతనం దొరకనప్పుడు ఏ బిడ్డనైనా తెచ్చి పెంచుకుంటుంది. తన పేగు తెంచుకుని పుట్టకపోయినా ఆ బిడ్డమీద ప్రాణాలు పెట్టుకుని పెంచుతుంది. అమ్మ అని ఆ బిడ్డ పిలుస్తుంటే తన జీవితమే ధన్యమయినంత సంబరపడే పాట వెంకటేష్, సౌందర్య నటించిన 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' చిత్రంలో ''అమ్మనే అయ్యానురా నీ రాకతో కమ్మని ఆనందమే నిండాలి నీతో''. సామవేద షణ్ముఖశర్మ రాసిన ఈ పాటని కోటి సంగీత దర్శకత్వంలో చిత్ర పాడారు.
అందరికీ తల్లిదండ్రులిద్దరి ప్రేమ దొరకకపోవచ్చు. అలాంటప్పుడు తల్లే తండ్రి బాధ్యత కూడా తీసుకుని పెంచినప్పుడు ఆ ప్రేమను పొందిన కొడుక్కి తల్లి పట్ల ఉండేది ప్రేమానురాగాలే కాదు, స్నేహం కూడా. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకే పుడతానమ్మా అని చెప్పే పాట రవితేజ, అసిన్, జయసుధ నటించిన 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి'' చిత్రంలో ''నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా''. పెద్దాడ మూర్తి సాహిత్యాన్ని చక్రి స్వీయ సంగీతంలో గానం చేశారు.
నవమాసాలు మోసిన కన్న తల్లి ఆ బిడ్డని లాలించి పడుకోబెట్టాలని, గోరు ముద్దలు తినిపించాలని ఆశపడుతుంది. అది సహజమైన కోరిక. కానీ అది సాధ్యం కాకపోతే ఆ తల్లి వేదన అంతా ఇంతా కాదు. ఆకలని ఏడుస్తున్నా తన అనారోగ్యం కారణంగా దగ్గరికి తీసుకుని బుజ్జగించలేని ఆ తల్లి బాధను వర్ణించడానికి మాటలు చాలవు. రాజశేఖర్, సాక్షి శివానంద్ నటించిన 'సింహరాశి' చిత్రంలో ''అమ్మ అని పిలిచి పిలిచి గుండె పిండకురా, ఆకలని ఏడ్చి నన్ను ఏడిపించకురా''.
'అల్లుడుగారు జిందాబాద్' చిత్రంలో ''ఇదో అమ్మ పాట ఇదే లాలి పాట, ఇదో ప్రేమ పాట ఇదే జాలి పాట'', 'స్వాతి చినుకులు' చిత్రంలో ''మా కంటి పాపా నీవే మా కాంతి రేఖా నీవే'', 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్'లో ''అమ్మ అని కొత్తగా మళ్ళీ పిలవాలని'', 'బుల్లెమ్మ-బుల్లోడు' చిత్రంలో ''అమ్మ అన్నది ఒక కమ్మని మాటా.. అది ఎన్నెన్నో తెలియని మమతల మూటా'', 'బంగారు కుటుంబం' చిత్రంలో ''అమ్మంటే ప్రేమకు రూపం, నాన్నంటే ఆమెకు దీపం''... ఇలా ఎన్నో పాటలు అమ్మ ప్రేమకు అద్దం పడతాయి.
- బి.మల్లేశ్వరి