''ఇంట్లో పురుషాహంకారం
ఒక చెంప ఛెళ్ళుమనిపిస్తే
వీధిలో కులాధిపత్యం
రెండో చెంప పగలగొడుతుంది
కూలీ డబ్బులకోసం పొలంపనులకెళ్తే,
అక్కడ కామందు చెమటతో పాటు
నన్నుకూడా దోచుకోవాలని, కాపేసినప్పుడు
నన్ను నేను విత్తనంగా భూమిలో పాతుకోవాలనిపించింది''
ఇవ్వాళ శ్రామిక స్త్రీకి ఇంటా బయటా ఎదురవుతున్న పరిస్థితిని ప్రతిబింబించే ఓ కవయిత్రి వేదనను ఆవిష్కరించే మాటలివి. మేడే ఉత్సవాలు ప్రారంభమై 130 ఏళ్ళవుతున్నప్పటికీ భారతీయ స్త్రీ కార్మికులు, చిరుద్యోగుల పరిస్థితిలో అంతగా మార్పు రాలేదు. కొత్త టెక్నాలజీ, కొత్త దోపిడీ పద్ధతుల ద్వారా మరింత దోపిడీకి, అణచివేతకు, అవమానానికి, లైంగిక వేధింపులకు గురవుతోంది శ్రామిక స్త్రీ. ఈ రోజు మేడే సందర్భంగా ఈ పరిస్థితిని మానవీయ కోణంలో మీ కందిస్తోంది ఈ వారం 'సోపతి' కవర్ స్టోరీ.
ఇప్పటి వరకు ఎన్నో కథనాలు, వ్యాసాలు రాశాను కాని ఇటువంటి స్త్రీ మూర్తి కథ నేనెప్పుడూ వినలేదు, చూడలేదు. అందుకే ఎక్కడ నుంచి ప్రారంభించాలో అర్థం కాక మనసు చికాకు పడుతోంది. మొదటగా ఎయిడ్స్‌తో భర్త చనిపోయే నాటికి ఆమె పరిస్థితి ఎట్లా ఉందో చెప్పాలా... చిన్నతనంలోనే పెళ్ళయిన వైనం చెప్పాలా... బతికున్నప్పుడు మొగుడు తాగి తన్నేవాడని చెప్పాలా? భర్త చనిపోయిన తరువాత బీడీలు చుట్టే పని కూడా ఎవరు ఇవ్వలేదని చెప్పాలా? తండ్రిలా కాపాడవలసిన మామ లైంగిక దాడులకు ప్రయత్నించడం గురించి చెప్పాలా?.. ముందుగా ఏ పాయింట్ నుంచి ప్రారంభిస్తే ఆమె కథ పాఠకులకు అర్థమవుతుందా అని మల్లగుల్లాలు పడ్డాను. చివరికి ఏదో ఒక చోటు నుంచి ప్రారంభించాలి కదా అని రాయడం ప్రారంభించాను.
ఆమె ఓ మారుమూల తెలంగాణ పల్లెలో పుట్టి పెరిగిన అమ్మాయి. పేరు మీకు చెప్పవలసిన పనిలేదనుకుంటాను. ప్రస్తుతం ఆమెను కథానాయకి అని వ్యవహరిస్తాను. మన కథానాయకి పదో తరగతి చదివిందో లేదో తల్లిదండ్రులు ఆమెకు పెళ్ళి చెయ్యాలని నిశ్చయించారు. కాయకష్టం చేసుకునే తల్లిదండ్రులు 'ఓ అయ్య' చేతిలో పెట్టి భారం దించుకుందామనుకున్నారు. చదువుకుంటాను మొర్రో అన్నా ఎవరూ ఆమె గోడును ఆలకించలేదు. బంగారు బొమ్మ అంటారే అచ్చంగా అట్లా ఉంటుంది ఆ చిన్నారి తల్లి. వెంటనే ఓ కుర్రాడ్ని చూసి పెండ్లి చేసేశారు. అతడు సకల గుణాభిరాముడని పెండ్లయ్యేవరకు అమ్మాయికి, బంధువులకు తెలియదు. పెళ్ళయిన తరువాతే అతగాడి అవతారం బయటపడింది. చేసేది లేక అమ్మాయి సర్దుకుపోతూ కాపురం చేసుకుంటోంది. ఓ పాపకూడా పుట్టింది. బతుకుదెరువు కోసం బీడీలు చుట్టడం చేస్తోంది. భర్త తాగుడుకు బానిసయ్యాడు. చీటికి మాటికి కొట్టేవాడు. ఇంతలో మళ్లీ నెలతప్పింది. మరో రెండు నెలలు గడిచేటప్పటికి భర్త బలహీనంగా తయారవ్వడంతో వైద్యపరీక్షలు చేయించారు. ఎయిడ్స్ అని తేలింది. జబ్బు బాగా ముదిరిపోయిందప్పటికే. చనిపోవడానికి కొన్ని రోజులే పట్టింది.
ఇప్పుడు ఆమె పరిస్థితి దయనీయంగా మారింది. చేతిలో ఓ పాప, కడుపులో మరో శిశువు. వాడుకోడానికి చిల్లిగవ్వ లేదు. ఎప్పటిలాగే బీడీలు చుడదామంటే ఆ పనీ ఎవరూ ఇవ్వడంలేదు. కారణం ఆమెకు కూడా ఎయిడ్స్ వ్యాధి సోకిందేమోననే భయం. పల్లెటూరి జనానికి ఎయిడ్స్‌పై అవగాహన లేకపోవడం వల్ల ఆమెను ఒక విధంగా సాంఘిక బహిష్కరణకు గురిచేశారు. ఈలోపు కానుపయింది. పండంటి పాప జన్మించింది. తల్లి, పిల్లకు ఎయిడ్స్ వ్యాధి సోకిందేమోనని పరీక్షలు చేశారు. వారికి వ్యాధి సోకలేదని నిర్థారణయింది. ఇద్దరు చిన్న పిల్లలతో భర్త లేని ఒంటరి నిరుపేద మహిళ పరిస్థితి ఊహించండి. అమ్మగారింటికి వెళదామంటే వారూ నిరుపేదలే. అందుకే అత్తమామలతో కలిసి పిల్లల్ని పెంచుతూ బీడీలు చుట్టుకుంటూ బతకాలని నిర్ణయించుకుంది. కానీ చాలా మంది ఆమెకు పని ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. అతి కష్టంమీద మళ్ళీ పని సంపాదించుకుంది.
అందమైన ఆ పుత్తడిబొమ్మపై మగతోడేళ్ళు అనేకం కన్నేశాయి. అందులో ముఖ్యమైన తోడేలు తన మామగారే కావడం ఆమెను ఆశ్చర్యపరిచింది. అనేక సార్లు ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. లొంగకపోయేటప్పటికి అభాండాలు వేయడం ప్రారంభించాడు. బయటవాళ్ళతో తిరిగే బదులు తనతో గుట్టుగా కాపరం చెయ్యమన్నాడు. తండ్రిలాంటి మామ ఇట్లా వేధింపులకు గురిచేస్తుండటంతో కులపెద్దలకు చెప్పింది. మామను హెచ్చరించారు పెద్దలు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఈసారి లాభం లేదని పోలీస్ స్టేషన్ గడప తొక్కింది. పోలీసుల హెచ్చరిక తాత్కాలిక ఉపశమనాన్నే మిగిల్చింది. కానీ మామ మాత్రం వేధింపులకు దిగుతూనే ఉన్నాడు. అట్లాగని ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఉందామంటే బయటి తోడేళ్ళతో మరింత ప్రమాదం పొంచి ఉందాయె! ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ బీడీలు చుట్టుకుంటూ, ఇతర చిన్నా చితక పనులకెళ్తూ తన పెద్ద కుమార్తెను పదవ తరగతి వరకు చదివించింది. తరువాత పెండ్లి చేసింది. ఇప్పుడు చిన్నమ్మాయి హైస్కూల్ చదువులో ఉంది.
పుర్రెగుర్తులు పస్తులు పెడుతోంది
ఇన్ని కడగండ్ల కోర్చి బతుకు పోరాటం చేస్తున్న మన కథానాయికకు కొత్తగా పెద్ద సమస్య ఎదురయింది. బీడీలు చుడదామంటే పనిలేదు. బీడీ కంపెనీలు లాకౌట్ ప్రకటించడమే ఇందుకు కారణం. ప్రభుత్వం బీడీ కట్టలపై అంతకు ముందుకన్నా పెద్ద సైజులో పుర్రె గుర్తును ముద్రించాలని నిర్ణయించడం ఈ లాకౌట్లకు దారితీసింది. అంత పరిమాణంలో పుర్రె గుర్తును ముద్రిస్తే తమ కంపెనీ బ్రాండ్ కనిపించకుండా పోతుందని యాజమాన్యాలు భావించాయి. ఇటువంటివే మరికొన్ని సాకులు చూపించి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కంపెనీలను మూసివేశాయి యాజమాన్యాలు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏడు లక్షల మంది బీడీ కార్మికుల జీవితాలు బజారున పడ్డాయి. అందులో మన కథానాయకదీ ఒకటి. ఇంకా సమస్య ఒక కొలిక్కి రాలేదు. ఇప్పుడు ఆ తల్లి తన బిడ్డను చదివించుకుంటూ పట్టెడన్నం అన్నా పెట్టాలి కదా. దీనికి మార్గం ఏంటి? అసలే కరువు పరిస్థితులు నెలకొన్న తెలంగాణ పల్లెల్లో బీడీ పరిశ్రమే జీవనాధారంగా ఉంది. బీడీ కార్మికుల్లో 98 శాతం స్త్రీలే అని ట్రేడ్ యూనియన్లవారు లెక్కలు చెబుతున్నారు. మరి ఇన్ని లక్షలమంది మాతృమూర్తులు, అక్కలు, చెల్లెండ్రు మేడే నాడూ పస్తులుండవలసిందేనా?
పైన పేర్కొన్న మన కథానాయికల్లాంటివారు వందలు వేలల్లో ఉన్నారు. పంటచేలల్లో, దుకాణాల్లోనే కాదు ఆశావర్కరుగ్లా, అంగన్‌వాడీ టీచర్లుగా, సకల ఉత్పత్తి కార్యకలాపాల్లోనూ స్త్రీకార్మికులు ఉన్నారు. ఉత్పత్తి కార్యకలాపాల్లో స్త్రీ పురుషులు ఇద్దరూ సమానంగా పనిచేస్తున్నా కొన్ని రంగాల్లో పురుషునికి ఎక్కువ జీతం, స్త్రీకి తక్కువ జీతం లభిస్తోంది. చట్టబద్ధంగా ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయించాల్సిన యజమానులు పది పన్నెండు గంటలు పనిచేయిస్తున్నారు. వీటిన్నింటికన్నా దారుణమైనది పని ప్రదేశంలో మహిళా కార్మికులకు లైంగికపరమైన వేధింపులు ఉండటం. మరీ ముఖ్యంగా దళిత బహుజన స్త్రీల విషయంలో ఈ వేధింపులు సర్వ సాధారణం అయ్యాయి.
''అందరి తల్లులు ఆదమరచి సుఖనిద్రలు పోతున్నప్పుడు
నా కూలి తల్లి పంట కుప్పల మధ్య పరాభవమై పోయింది
..... .... ...
అందరి తల్లులు అపర నాయకురాళ్ళయి ఏలికలు
చేస్తున్నప్పుడు
నా అలగా తల్లి ప్రభుత్వాఫీసుల ముందు ధర్నాలు చేస్తూ ఉంది
ఎవరికైనా అమ్మంటే పాలు పడుతూనో జోలపాడుతూనో
స్ఫురిస్తే
నాకు మా అమ్మ కలుపు తీస్తూనో తట్టలు మోస్తూనో
గుర్తుకొస్తుందండీ''
అంటాడు మద్దూరి నగేష్‌బాబు. మన శ్రామిక స్త్రీల స్థితిగతులను ఎంత బాగా చెప్పాడు!
పిల్లల్ని కనేదెట్లా?
బెంగళూరు కేంద్రంగా పనిచేసే కాఫీ డే కంపెనీకి సంబంధించి దేశవ్యాప్తంగా వేలాది షాపులు ఉన్నాయి. రోజూ ఉదయం 9గంటల నుంచి ఒంటి గంట వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు ఈ షాపులు పనిచేస్తాయి. హైదరాబాదులో ఉన్న ఓ షాపులో పనిచేసే శాంతి అనే అమ్మాయి మనోవేదన మనకూ బాధనే మిగులుసుతంది. ఇది రోజుకు పన్నెండు గంటలు పనిచేసే ఎందరో సేల్స్‌గర్ల్స్ జీవితాన్ని ప్రతిబింబించే ఉదాహరణ. ఉదయం షాపు కొస్తే సాయంత్రం ఇంటికి వెళ్ళిన తరువాతే టాయిలెట్‌కు వెళ్లే పరిస్థితి ఈమెది. ఎన్నో షాపుల్లో పనిచేసే అమ్మాయిలకు ఈ పరిస్థితి సర్వ సాధారణం. మగవాళ్ళు బయట ఎక్కడో చోట అవసరాలు తీర్చుకుంటారు. స్త్రీలకు ఇది కుదరని పని. కనీస అవసరాలు కల్పించని యజమానుల నిర్లక్ష్యానికి మౌనంగా రోదించే ఇటువంటి అమ్మాయిలు ఎందరో! ''తప్పనిసరి పరిస్థితుల్లో తెలిసినవారిని అడిగి వెళ్ళాలి.. పబ్లిక్ టాయిలెట్ కూడా ఇక్కడెక్కడా లేదు. కష్టమర్ల నుంచి అనేక ఇబ్బందులుంటాయి. ఆఫర్ల మీద గొడవపడతారు. మా మేనేజ్‌మెంటువారు టార్గెట్ ఇస్తారు. దాన్ని రీచ్ కాకపోతే తిడతారు. అదే నాకు బాధ. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌వల్లే బయటికి వచ్చి జాబ్ చేస్తాం. ఇంటికి వెళ్ళేటప్పటికి రాత్రి పదవుతుంది. మా సార్లు తిడుతుంటే ఏమనిపిస్తుందంటే ఆడవాళ్ళను వీళ్ళు అర్థంచేసుకోరెందుకు, నాకే డబ్బులుంటే ఈడకొచ్చి చేయాల్సిన అవసరం ఏంటి? (కళ్ళల్లో తిరిగిన కన్నీరు తుడుచుకుంటూ) ఒకరికింద పనిచేస్తున్నాం కాబట్టి మనం పడాలి. ఏదైనా అన్నామనుకోండి ఎదురుచెబుతున్నవ్ ఎళ్ళిపోమ్మా అంటారు. అందుకే ఎంత బాధపడినా తలదించుకొని ఉంటాం. తిట్టుకోనీ అని గమ్మున ఊరుకుంటం. అంతకంటే ఏం జేస్తం?'' అంటూ కన్నీటి పర్యంతం అయింది.
''నాకు పిల్లలు లేరు. పరీక్షలు చేయించుకొని ట్రీట్ మెంట్ తీసు కుందామంటే ... ముందు డబ్బులు... కట్టు పదివేలు. కట్టు ఇరవై వేలు అంటారు. మా భార్యాభర్తలిద్దరికి కలిపి 15 వేల రూపాయలు వస్తే ఇల్లు ఎట్లా గడుస్తుంది. ట్రీట్‌మెంట్ ఎట్లా తీసుకుంటాం'' అంటూ చాలీ చాలని జీతం వల్ల పిల్లల్ని కనే భాగ్యానికీ నోచుకోవడంలేదని వాపోయింది.
శాంతి అనుభవాలు చాలా మంది శ్రామిక స్త్రీల అనుభవాలే. ''చాలామంది మగాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మేం పట్టించుకోం. నీటిమీద బుడగలాగ లైట్ తీసుకుంటా. అవన్నీ పట్టించుకుంటే బయటికొచ్చి పనిచేయడం చాలా కష్టం. నీ ఫోన్ నెంబర్ ఇస్తావా? నీవు మంచిగ మాట్లాడుతున్నావు. బాగున్నావు అని వచ్చిన కష్టమర్స్‌లోనే అనేవాళ్ళుంటారు. అప్పుడు నేనే సంయమనంతో ఏం సార్ అట్లా మాట్లాడుతున్నావు... నీకేం కావాలో తీసుకొని వెళ్ళమని చెబుతూ ఉంటాను. మాది కాఫీడే షాపైతే ఒకడు పెరుగు పాకెట్ ఉందా అని వస్తాడు. మాటలు కలిపి అసహ్యంగా మాట్లాడే ప్రయత్నాలు చేస్తాడు. ఇది నా ఒక్కదాని అనుభవం కాదు. పనులకు, ఉద్యోగాలకు వెళ్ళే స్త్రీలందరికీ ఉండే అనుభవమే'' అంది శాంతి. ఇలా ఆడకూతురు దు:ఖాన్ని దిగమింగుకుని పనిచేసుకుపోయే దురవస్థ ఇంకెన్నాళ్ళో.!
- జి.శివరామకృష్ణయ్య, 7702508259
మహిళలు కాబట్టి...
మహిళలకు మొత్తం కార్మికులకుండే సమస్యలతో పాటు అదనంగా కొన్ని సమస్యలుంటాయి. ఈ అదనపు సమస్యలతో పాటు వివక్షకు కూడా గురవుతున్నారు. ఇచ్చే పనిలో, వేతనం లేక కూలిలో వ్యత్యాసం చూపిస్తున్నారు. ముఖ్యంగా అసంఘటిత రంగంలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు భవన నిర్మాణ కార్మిక రంగాన్నే తీసుకోండి. వీరు సుమారు అరవై లక్షలమంది ఉన్నారు. ఇందులో సుమారు యాభరు శాతం మహిళలే. స్త్రీ పురుషులిద్దరూ ఒకే విధమైన పనిచేసినప్పటికి వేతనాల్లో తేడా చూపిస్తున్నారు. పురుషునికి 200 రూపాయలు ఇస్తే స్త్రీకి 150 రూపాయలే ఇస్తున్నారు. స్త్రీలకు సహజంగా ఉండే సమస్యలు కొన్ని ఉంటాయి. అవి అనివార్యమైనవి. ఉదాహరణకు గర్భం ధరించడం ఆడవారికి మాత్రమే సాధ్యమయ్యే వ్యవహారం. ఆ సమయంలో తగిన విశ్రాంతి, పౌష్టికాహారం అవసరం. కానీ పనిచేస్తేనే వేతనం అనే రూలు పెట్టి ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికులను, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నానా ఇబ్బంది పెడుతోంది. ఇందుకు తాజా ఉదాహరణ నిమ్స్‌లో ఉద్యోగం నుండి తొలగించబడిన నర్సులు. 2015 డిసెంబర్‌లో 150 మంది నర్సుల్లో 13 మంది గర్భం దాల్చి ముందుగా అధికారులకు తెలియచేసి ప్రసవానికి సెలవు పెట్టి ఇంటికి వెళ్ళిపోయారు. రెండునెలల్లో వారు తిరిగి వచ్చి డ్యూటీలో జాయినవుతామంటే అధికారులు ఒప్పుకోలేదు. వారిని ఉద్యోగం నుంచి తొలగించామని చెప్పారు. అంటే గర్భం ధరించినందువల్ల ఉద్యోగాల నుంచి తొలగించారన్నమాట.
ఏడు లక్షలమంది బీడీ కార్మికులు ఉన్నారు. నూటికి 98 శాతం మంది మహిళలు. వీరు రోజుకు 14 గంటలు పనిచేస్తారు. ఎన్ని బీడీలు చేస్తే అంత డబ్బు అని చెప్పి చాలా తక్కువ వేతనాన్ని నిర్ణయిస్తున్నారు. కనీస వేతనం కోసం బీడీ కార్మికులు అనేక పోరాటాలు చేశారు. 2010లో నెలకు పైగా సమ్మె చేశారు. అప్పుడు ప్రభుత్వం కనీసవేతనం జీవో 41 ఇచ్చింది. రోజుకు కనీసం 137.50 రూపాయలు ఇవ్వాలని ఫిక్స్ చేసింది. ప్రయివేటు కంపెనీలవారు ఇంత జీతాలు ఇవ్వలేం అని చెప్పి కార్మిక శాఖ మంత్రిని కలిశారు. అప్పుడు ఈ జీవోను తాత్కాలికంగా అమలు చెయ్యవద్దు అంటూ జీవో 81 ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ఈ జీవో ఇప్పటికీ అమలులోనే ఉంది. జీవో నంబర్ 41 అమలులో ఉంటే ఇప్పటికి బీడీ కార్మికుల కనీస వేతనం 250 రూపాయలు ఉండేది. ఇప్పుడు కేవలం 140 నుంచి నూట యాభరు రూపాయలే ఇస్తున్నారు. ఈ అన్యాయంపై పోరాడటానికి వారికి బలం చాలటం లేదు. ఈ కార్మికులందరూ మహళలు కావడం, అందులోనూ ఎక్కువగా బలహీన వర్గాలకు చెందినవారు కావడంతో సంఘటిత శక్తిగా పోరాడటానికి ఇబ్బంది అవుతోంది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక స్కీముల్లో ఎక్కువ మంది మహిళలే పనిచేస్తున్నారు. అంగన్‌వాడీ సెట్రల్ గవర్నమెంట్ స్కీం. 70 వేలమంది ఈ స్కీంలో పనిచేస్తున్నారు. మధ్యాహ్న భోజనం స్కీంలో 75 వేలమంది ఉన్నారు. ఆశావర్కర్లు 25 వేలమంది ఉన్నారు. ఇట్లా మొత్తం మీద స్కీం వర్కర్లే మూడు లక్షలమంది ఉన్నారు. ఒక్క అంగన్‌వాడీ వర్కర్లు మినహాయిస్తే మిగిలినవారి పరిస్థితి దారుణంగా ఉంది. మహిళలు కాబట్టి ఓపిగ్గా పని చేస్తారనే కారణంగా వీరు అధికంగా పనిచేసే స్కీముల్నే ప్రభుత్వం చేపడుతుంది.
- ఎస్.రమ,
శ్రామిక మహిళల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్
నెల నెలా జీతం రావడం లేదు
నా పేరు బన్సోడే సుశీల. పదవతరగతి వరకు చదువుకున్నాను. ఆశా కార్యకర్తగా 2008 నుంచి పని చేస్తున్నాను. మా తల్లిగారిది మహారాష్ట్రలోని దెగ్లూర్ గ్రామం. 15 సంవత్సరాల క్రితం బోధన్‌లోని శక్కర్‌నగర్‌కు చెందిన భీంరావుతో వివాహమైంది. నా భర్త టైలరింగ్ పని చేసేవారు. పని సక్రమంగా ఉండేది కాదు. కుటుంబ పోషణ భారమై మానసిక ఒత్తిడి పెంచుకుని బి.పి., షుగర్‌తో బాధపడే వారు. మూడు నెలల క్రితం ఈ సమస్య పెరిగి మెదడుకు చేరుకోవడంతో చనిపోయారు. నాటి నుంచి ఆశాకార్యకర్తగా పని చేస్తూ నేను తెచ్చిన డబ్బులతోనే కుటుంబ పోషణ జరుగుతుంది. నా భర్త బతికి ఉన్న సమయంలోనూ పనులు లేక నా కష్టార్జితంతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చాను. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చదివించుకుంటున్నాను. ఇప్పుడు ఆర్థిక భారం మరింత పెరిగింది. సమస్యలు పరిష్కరించుకునేందుకు సమ్మె చేస్తే మూడు నెలల గౌరవ వేతనం ఇవ్వలేదు. జనవరి వేతనం మాత్రమే వచ్చింది. వచ్చే రూ.700లు కూడా నెలానెలా రాకపోవడం వల్ల కుటుంబాన్ని నెట్టుకుపోవడం చాలా ఇబ్బందిగా మారింది.
బతకటమే కష్టం..
ఇక పెళ్ళిచేయడం ఎట్లా?
నా పేరు పడాల లక్ష్మి. నేను బీడి కార్మికురాలిగా పని చేస్తున్నాను. నా భర్త 2003లో గుండెపోటుతో చనిపోయారు. అప్పటి నుంచి నేను చేసే బీడి పనులతోనే కుటుంబం గడవాలి. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. చిన్న నాటి నుంచి వారిని పోషించుకుంటూ వస్తున్నాను. ఏడేళ్ల క్రితం పెద్ద కూతురి వివాహం చేశాను. చిన్న కుమార్తెను చదివిస్తున్నాను. ఇప్పుడు డిగ్రీ చదువుతుంది. నాకు ఎవరూ ఆసరా లేరు. పని చేస్తేనే పూటగడిచేది. బీడి పనులు చేసుకుంటుండగా గత నెలా పదిహేను రోజుల నుంచి కార్ఖానాలను బంద్ పెట్టారు. అప్పటి నుంచి పని లేదు. వేరే పనులు చేసుకోలేము. ఇప్పుడు పెళ్లీడుకొచ్చిన ఇంకో కుమార్తె పెళ్లి చేయాలి. కుటుంబ పోషణే భారమవగా, అమ్మాయి పెళ్ళి చేయడం మరింత కష్టతరంగా ఉంది. ఇన్నేళ్లుగా బీడిలు చేసినా చాలీచాలని కూలీ పడుతుండటంతో కుటుంబ పోషణే కష్టమవుతుంది. కొంత డబ్బు వెనుకోసుకుందామంటే వెనుకేసుకోలేని దుస్థితి. ఇదే పరిస్థితి కొనసాగితే దుర్భిక్షమే మా పరిస్థితి.
కనీస కూలీ పడటం లేదు
నా పేరు తోకల జ్యోతి. నేను 10 సంవత్సరాలుగా బీడిలు చుడతాను. సాయిలుతో 8 సంవత్సరాల క్రితం వివాహమైంది. కాని నా భర్త కొంత బలహీనంగా ఉంటారు. ఎప్పుడో ఒకసారి దొరికిన పనికి చేతనయితే వెళతారు. నేను చుట్టే బీడిలతో వచ్చే కూలితోనే కుటుంబం గడుస్తుంది. నాకు పీఎఫ్ సౌకర్యం కూడా లేదు. వర్దీ బీడిలు చేసుకుంటూ జీవిస్తున్నాము. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సహాయం పొందలేదు. మమ్మల్ని ఆదుకునేవారే లేరు. నాకు ఒక కుమారుడు 4 సంవత్సరాలు, కుమార్తె 7 సంవత్సరాల వయస్సు వారు ఉన్నారు. మా కుటుంబ పోషణమే భారమవుతుండగా వారిని పాఠశాలలకు పంపడం కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. నెల రోజుల నుంచి బీడి పరిశ్రమలు మూతపడ్డాయి. వర్దీ బీడిలకు డిమాండ్ పెరిగినా చాటన్ చేస్తుండటంతో కనీస కూలీ పడటం లేదు.
20 రూపాయలతో ఎట్లా బతకాలి?
నా పేరు అహ్మదీబేగం. నాకు 1997లో బోధన్ పట్టణంలోని రాకాసిపేట్‌కు చెందిన షేక్ ఫారూఖ్‌కు ఇచ్చి వివాహం చేశారు. లారీ డ్రైవర్‌గా నా భర్త పని చేసేవారు. రోడ్డు ప్రమాదంలో మా వివాహమైన మూడు సంవత్సరాలకే చనిపోయారు. నా అత్తగారు కూడా చాలా బీదవారు. వారికి ఉండేందుకు ఇళ్లు లేదు. దీంతో అప్పటికే నాకు జన్మించిన ఇద్దరు కుమార్తెలను నా తల్లిగారింటికి వచ్చేశాను. ఇక్కడ కూడా ఆర్థిక పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంటుంది. ఏదో ఒకటి దొరికిన పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవిస్తుండగా 2008లో ఆశా కార్యకర్తగా చేరాను. ఆశా కార్యకర్తగా పనిలో చేరాను. కాని చాలీచాలని వేతనం వస్తుంది. రోజుకు రూ. 20 నుంచి రూ. 25 కూడా కూలి రావడం లేదు. ఇద్దరు కుమార్తెలను చదివించుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. ఒక కుమార్తెను ఇంటర్ చదివించాను. రెండవ కుమార్తె 10వ తరగతిలో ఉంది. మమ్మల్ని ఆదుకునే వారు కరువయ్యారు. మూడు నెలలు కనీస వేతనం కోసం కొట్లాడినా ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మూడు నెలల సమ్మె కాలం డబ్బులు కూడా ఇవ్వడం లేదు. కుటుంబాన్ని పోషించుకోవడం చాలా సమస్యగా మారింది. పిల్లల వివాహాలు ఎలా చేయాలో తోచని దుస్థితిమాది. ప్రభుత్వం ఆదుకోవాలి. కనీస వేతనాలు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.
Sat 30 Apr 22:38:12.46699 2016