అతని పేరు చిన్నయసూరి
అయిదు దశాబ్దాల క్రితం నాకు పరిచయం. అప్పట్లోనే నాకు అతని పేరు ప్రత్యేకంగా అనిపించింది. ప్రాథమిక పాఠశాలలో మేమిద్దరం కలిసి చదువుకున్నాం. ఎనిమిదో తరగతికి వచ్చేటప్పటికి నన్ను మా నాన్న దూరంగా పంపి చదివించాడు.
నన్ను పెద్ద చదువులు చదివించాలని కాదు. నాకు బొత్తిగా చదువు రావటం లేదని అప్పట్లో నాలాంటి వారికోసం కొన్ని ప్రత్యేక బడులు వుండేవి. అందులో దండం ప్రధానమైనది. హాస్టల్లోనే వుంచేవారు. అప్పుడప్పుడు ఇంటికి పంపించేవారు.
చిన్నయసూరి చిన్నప్పటి నుంచి తరగతి పుస్తకాలు మాత్రమే చదవలేదు. ఎప్పుడూ ఏదో ఆలోచనలో వుండేవాడు. మిగతా పిల్లలు సూరితో స్నేహం చేయటానికి ముందుకు వచ్చేవారుకాదు. అతను కూడా ఆరాటపడేవాడుకాదు. ముందు అతని మాటలు వారికి అర్థం అయ్యేవి కాదు. వేదాంతితా మాట్లాడేవాడు.
సూరికి దగ్గరగా వచ్చింది నేనే. నాకు అతని మాటల అర్థం అయ్యాయని నేను చెప్పటం లేదు. నా మీద అభిమానంతో సరళంగా మాట్లాడేవాడు. అనేక విషయాలు మా చర్చల్లో దొర్లిపోయేవి. నాకు పాఠాలు చదవటం కంటే చిన్నయసూరి మాటలు వినటానికి ఇష్టంగా వుండేది. అందుకే నాకు చదువు రాక అతనికి దూరంగా వెళ్లిపోయాను.
నాకు సూరిని వాడు అని గాని, ఒరేరు అనిగాని పిలవటం ఇష్టంవుండేది కాదు. పైగా సూరి పొట్టొడు అయినా అతని చూపులో ముఖంలో గంభీరత్వం వుండేది. అతనిదో ప్రత్యేకమైన భాష.
నేను ఇంటికి వచ్చినప్పుడల్లా సూరిని కలుసుకునే వాడిని. మొట్ట మొదటిసారి నేను ఉలిక్కిపడింది అతను ఈ ప్రపంచం మాయ అన్నప్పుడు. అది కూడా ఏడవతరగతిలో, అది నా మార్కుల విషయంలో మానాన్న అనుకోలేదు. వాడు ఎవడో మాయలో పడ్డాడు అనుకుని వాస్తవ ప్రపంచలో బతకాల్రా అని తరిమేసాడు.
నేను సెలవుల్లో కలిసినప్పుడు సూరీ నువ్వు లేని లోటు నాకు బాగా తెలుస్తుంది అన్నాను. చిన్నగా నవ్వి...
''నేను లేను అనుకోవటం సరయిందే. ఉన్నాను అనుకోవటం భ్రమ'' అన్నాడు. నాకు తల తిరిగిపోయింది.
''నువ్వు లేవా? ఈ ఆకాశం - ఆ మబ్బలు- ఈ నేల - ఈ చెట్లు ఏమీ లేవా?'' అన్నాను.
''నువ్వు వున్నాయనుకుంటే వున్నాయి. లేవనుకుంటే లేవు'' అన్నాడు ప్రశాంతంగా.
''నిజంగా అంటున్నావా? సరదాగా అంటున్నావా?'' అన్నాను అనుమానంగా.
''ఇందులో సరదా ఏముంది? నిజంగానే అంటున్నాను'' అన్నాడు.
''ఇంత చిన్నవయసులో ఇంత జ్ఞానం ఎలా వచ్చింది?'' అన్నాను
''నాదేముంది. ఆదిశంకరాచార్యుల వారు ఎనిమిది సంవత్సరాల వయసుకే నాలుగు వేదాలు చదివారు. పన్నెండు సంవత్సరలలోపే సర్వశాస్త్ర పారంగతులయ్యారు. పదహారు సంవత్సరాలకు ప్రస్థాన త్రయానకి భాష్యం రాశారు. ముఫై రెండవ ఏట నిర్యాణం చెందారు'' అన్నాడు సూరి.
అప్పుడు సూరిని చూస్తుంటే శంకర భగవత్యాదులు కనిపించారు. నేను ఇంతకంటే మాట్లాడటం నా అనుభవానికి చాలదని సూరి దగ్గర నుండి వెళ్లిపోయాను
రి రి రి
నేను ఆ స్కూల్ నుండి ఇంకాస్త దూరంగా వెళ్లిపోయాను. చిన్నయసూరి కూడా ఆ ఊరి నుండి దూరంగా వెళ్లిపోవలసిన అవసరం వచ్చింది. అప్పుడు కలుసుకున్నాను.
''నీకు భగత్‌సింగ్ తెలుసుకదా'' అనడిగాను సూరితో.
''విన్నాను'' అన్నాడు.
''అతను కూడా ఇరవై మూడు సంవత్సరలకే చనిపోయాడు. అదే బ్రిటిష్ వారు ఉరితీశారు. అతని చివరిరోజుల్లో మార్క్సిజపు పుస్తకాలు చదివాడంట. భగత్‌సింగ్ చిన్నవయసులోనే ఎన్నో రచనలు చేశాడు. మనదేశం గురించి అతనికి ఎన్నో ప్రణాళికలున్నాయి'' అన్నాను.
అప్పుడు నన్ను పరిశీలనగా చూసాడు- కొద్దిక్షణాలు.
''అలా చూస్తున్నావేంటి మిత్రమా'' అన్నాను.
''నువ్వు అశాశ్వతమైన విషయాల గురించి అధ్యయనం చేస్తున్నట్లున్నావు. అది నీకేమంత సంతోషాన్ని ఇవ్వదు'' అన్నాడు.
నేను బిత్తరపోయాను
''నీకు బాధ- సంతోషం- దు:ఖం ఇలాంటివి లేవా?'' అన్నాను.
''అవన్నీ శరీరానికి సంబంధించినవి. ఆత్మకు ఇవేమీ పట్టవు. ఆత్మ సర్వస్వతంత్రమైనది. ఇంతకు ముందే చెప్పాను ఇది మాయా ప్రపంచం'' అన్నాడు.
''అదలా వుంచు మిత్రమా. కనీసం శరీరం అయినా వుందని ఒప్పుకున్నావు. భగత్‌సింగ్‌లాంటి వారు కూడా కొన్ని విషయాలను నమ్మారు మన భారతీయత గురించి. మన వేదాల గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రపంచానికే దారి చూపుతుందని గర్వంగా చెబుతున్నాం. అలాంటి దేశం బానిసత్వంలో వుంటే చైతన్యంతో విముక్తి చేయాలనుకోవటం కూడా మాయ అవుతుందా?'' అన్నాను.
''ఎవరి దారి వారిది. ఎవరి ప్రయాణం వారిది. ఆత్మకు అలాంటికి వుండవు. నేను ఆత్మాన్వేషణలో వున్నాను. అది ఈ భౌతిక ప్రపంచానికి, అలాంటి భావనకి అతీతమైంది'' అని వెళ్లిపోయాడు.
కాలం గడుస్తూనే వుంది. చిన్నయసూరి గురించి పట్టించుకునేంత తీరిక నాకు దొరకలేదు. నేను భౌతిక ప్రపంచంలో బతుకుతున్నాను. ఓ కాలంలో మనిషికి ఇన్ని తాపత్రయాలు లేవు. ఇంత వస్తు ప్రపంచం కూడా లేదు. ఇంత అభివృద్ధి కూడా లేదు.
చిన్నయసూరిలానే నాకు గోర్కీ అనే మిత్రుడు తర్వాత కాలంలో పరిచయం అయ్యాడు. అతనికి తల్లిదండ్రులు ఏదో పేరు పెట్టారు. అది మార్చుకున్నాడు. అతను రచయిత కాదు, చిన్నయసూరిలానే విపరీతంగా చదివాడు. నిరంతరం చదువుతూనే వుంటాడు.
సూరి గురించి గోర్కీకి చెప్పినప్పుడు చిన్నగా నవ్వాడు.
''ఇలాంటి వారిని చాలా మందిని చూశాను. వాస్తవంలో బతుకుతూ అంతా మాయ అంటారు. భ్రమ అంటారు. ఇందులో చదువుకున్నవారు, మంచి ఉద్యోగాలు చేసేవారూ వుంటారు. అందులోనూ ప్రపంచంలోని తత్వవేత్తలను చదివిన వారుంటారు. ఎవరు ఏం చెప్పినా ఇదేదీ నిజం కాదు అనటమే కదా!'' అన్నాడు.
నేను తలూపాను
''అందులోనే అసలు రహస్యం వుంది. ఇవేవీ వాస్తవం కానప్పుడు దేనినీ మార్చుకోవలసిన అవసరం రాదు. ముఖ్యంగా ఇలాంటి వారికి బతుకుతెరువు సమస్యకాదు. ఎలాంటి త్యాగాలూ చేయనవసరం లేకుండా, జనం మీద ఏ శ్రమా లేకుండా బతికేయవచ్చు'' అన్నాడు.
''అలా అంటావా!'' అన్నాను
''మనం ప్రపంచానికి, మతానికి చెందిన తీవ్రవాదం, ఉగ్రవాదం, ప్రమాదం అనుకుంటాం. ఈ మాయావాదులకు మించిన ప్రమాదకారులు ఇంకొకరు వుండరు. అది వారికీ తెలియదు. వాళ్లు ఈ ప్రపంచంలో ఘర్షణ లేకుండా చేస్తున్నామనుకుంటారు. ఒక్కటి ఆలోచించు ఇలాంటి వారందరికీ వేదాలు, ఉపనిషత్తులు, గీత ప్రమాణాలు కదా. ఈ ప్రపంచం మాయ లేదా మిధ్య అయితే అవన్నీ కూడా మాయ కాదా?'' అన్నాడు.
నేను ఆలోచనలో పడిపోయాను. గోర్కీ మాటల్లో వాస్తవం వుందనిపించింది. అనునిత్యం మనిషి ఆరాటాలూ, పోరాటాలు కనీస జీవితానికో, విలాస జీవితానికో మాత్రమే కదా. ఇప్పటి వరకు సామాన్యుడు చెప్పిన తత్వశాస్త్రం ఎక్కడయినా వుందా? కూలివారు, శ్రమజీవులు మాట్లాడే మాటలు ఎవరయినా ప్రచారం చేస్తున్నారా? అంటే ఈ ప్రపంచాన్ని సంస్కరించేది మార్చేది మేధావులు మాత్రమేనా?
అయినా జీవితాన్ని జీవించినట్లు నటిస్తూ, ఇహ లోకంలో ఉన్నవన్నీ అనుభవిస్తూ, పరలోకం ఏదో వుందని నమ్మించటం, నమ్మటం అసలు సిసలు మాయ కదూ!
మారణానంతర జీవితం గురించి ఎవరికి తెలుసు? ఎవరు ఏ ఆధారంతో చెప్పగలిగారు? గోర్కీ భాషలో చెప్పాలంటే అదంతా మిత్ కాదూ! అతనే అన్నాడు.
''ఇలాంటి వారందరూ కొన్నింటిని అభ్యాసం చేస్తారు. కొన్నివందల, వేల విషయాల్ని గుర్తుంచుకుంటారు. తత్వగ్రంథాలలోని రహస్యాలను విశ్లేషిస్తారు. మనకు అందని అంశాలున్నాయంటారు. వాటి గురించి చెప్పరు. మనుషులు విజయాలు ఎలా సాధించాలో చెప్పేవారికి ఇలాంటి వారికి పెద్ద తేడా ఏమీ లేదు. రేపు మీ చిన్నయసూరి మహర్షి కవచ్చు. బ్రహ్మశ్రీ కావచ్చు. ఆధునిక యంత్రాల్ని ఆధునిక భాషనీ వాడుకుంటూ నాలుగు తరాలకు సంపాదించుకుంటాడు.
సూరి అలా మారతాడా అనుకున్నాను. ఇప్పటికే అలా మారిపోయివుంటాడేమో. అతని పేరు మారి వుండవచ్చు. ఎక్కడో ఆశ్రమాలు కట్టించి వుండవచ్చు. నేనయితే జీవన పోరాటంలో అతన్ని గుర్తించక పోవచ్చు.
గోర్కీ కూడా నాకు దూరంగా వెళ్లిపోయాడు. అతను ఈ సమాజాన్ని మార్చుకోవాలి. వాళ్లు భవవాదులయినా, భౌతిక వాదులయినా కేవలం వ్యాఖ్యానించటం చాలదు అంటుండేవాడు. బహుశా ఆచరణలో రావటానికి కారణం నేను ఎరిగిన అనేక రకల భావాలకు చెందిన వ్యక్తులే అనుకుంటాను.
చిన్నయసూరినో గోర్కీనో అంటి పెట్టుకుని వుంటే చాలా విషయాలు ముఖ్యంగా సూక్ష్మ విషయాలు అర్థం కావు.
రి రి రి
ప్రపంచం గురించిన అవగాహన అసలు అంశం. మనుషులకి సత్యం కావాలి సత్యం అనేక రకలుగా వుండదు. సత్యాన్ని తెలుసుకునే మార్గాలు మాత్రం అనేకం వుంటాయి.
నాకు కిరణం, జాన్ అబ్రహం, రషీద్, మల్లయ్య మారిగ చెంచుకొటేడు, భాస్కర్ చౌదరి, రమేష్ నాయుడు, కీర్తి అగర్వల్, శంకర్, శాస్త్రి, ఇంకా అనేకమందితో పరిచయాలు అయ్యాయి, సంభాషణ జరిగింది. అందరి పేర్లూ రయాలంటే అదోగ్రంథం అవుతుంది. అందులో తెలుగువారు, తమిళులు బెంగాలీలు, గుజరాతీలు, కళాకారులు, సంగీత, గాన, నృత్య కోవిదులు వున్నారు.
తమ కళలు భగవత్ ప్రసాదం అన్నవారున్నారు. సమాజం తమను తయారు చేసింది అన్నవారున్నారు. సమాజం తమను తయారు చేసింది అన్నవారున్నారు. వారందరూ కూడా తమ భౌతిక పరిస్థితుల నుండి రూపుదిద్దుకున్నారు అనేది అర్థం అవుతోంది.
ఎంతోమంది తమ కళలూ రాజకీయాలూ పోరాటాలూ అశాశ్వాతం, భ్రమా అనుకోవటం లేదు. వాటిని తమతో అంతం కావాలని కూడా కోరుకోవటం లేదు. ఆస్తుల వరకు కుటుంబాలకు, మిగతావి మానవజాతికి అంకితం కావాలి అనుకుంటున్నారు. ముఖ్యంగా ఎవరికి వారు తమ జీవిత పరిధిలో అనుభవించిన వాటికి అగ్రస్థానం ఇస్తున్నారు. తమ సంఖ్యతో మాత్రమే ఈ ప్రపంచం ఏలాలనుకుంటున్నారు.
అయితే తాత్కలిక సత్యం ఏమిటంటే అతి కొద్దిమంది మాత్రమే ప్రపంచాన్ని దగ్గర చేస్తున్నారు. ప్రపంచంలోని ప్రతిదీ వారి ఆధీనంలో వుంటోంది. మనుషులందరూ ఒకటే అనేది అందమైన పదజాలానికి, నెరవేరని ఆశకి పరిమితం అయింది.
ఇప్పుడు దేశం- దేశభక్తి- మతం- కులం- ప్రాంతం- జెండర్ ఏదీ కూడా సంపూర్ణం కాదు. ఈ భౌతిక ప్రపంచాన్ని నడిపించే శక్తి అదృశ్యంగా వుందని అనుకుంటాం. అది మనిషి పరిణామక్రమంలో ఏర్పడిన ఆర్థిక శక్తే. ఇది నా భావన మాత్రమే. అప్పుడుప్పుడు నాకు చిన్నయసూరి మాటలు గుర్తొస్తాయి.
ఈ ప్రపంచం ఏదొక రోజు అంతం అవుతుంది. అప్పటి దాకా మనం ఇదంతా శాశ్వతం అనే భ్రమలోనే బతుకుతుంటాం. మన చిన్నతనంలో మనమీద పడే ప్రభావాలు అంత త్వరగా వదలవు- మనం ఎంత ఎదిగినా.
ముఖ్యంగా ఈ వస్తువుల ప్రపంచం, ఈ పరుగులు, ఈ అరాచకం. ఇప్పటి సృజన- కీర్తి-ప్రచారం- గతం- ఇవన్నీ గమనిస్తున్నాప్పుడు ఇదంతా శాశ్వతం అనుకునే మనుషుల్ని చూసినప్పుడు చిన్నయసూరి నన్ను ఆవహించుతాడు.
'మనం ఎన్ని భ్రమల్లో బతుకుతున్నాం మిత్రమా' అని అతను నా ముందు నిలబడి అడుగుతున్నట్లు అనిపిస్తుంది. మనిషికి ఇవేవీ శాశ్వతం కాదు అనే భావన కూడా అవసరమా!?
రి రి రి
నేను పుట్టి పెరిగిన ఊరుకి దూరంగా వచ్చి ఎంతో కాలం అయింది. మళ్లీ ఎప్పుడన్నా ఆ ప్రాంతాలు చూడాలని నాకుండేది. వాస్తవంగా మాట్లాడుకుంటే ఊరితో అనుబంధం అంటే అక్కడ మనకంటూ చిన్నదో పెద్దదో ఆస్తి వుండాలి. అప్పుడు అమ్ముకోవటానికయినా వెళ్లాలి. అలా కాకున్నా మన బంధువులో మిత్రులో అయినా వుండాలి. మా బంధువుల్లో కొంత మంది కడుపుపట్టుకుని వెళ్లిపోయారు. తర్వాత కొంత మంది చనిపోతే పిల్లలు ఆస్తులు అమ్ముకున్నారు.
ప్రస్తుతం ఓ దళిత మిత్రుడు వుండాలి. అతను మాతోపాటు చదివాడు. మధ్యలోనే చదువు మానేశాడు. అతనయినా వున్నాడో వెళ్లిపోయాడో తెలియదు. అయినా ఓ సారి మా గ్రామం చూసి రావలనిపించి బయలుదేరాను.
పెద్ద మార్పు లేదు. కొన్ని పెంకుటిళ్లు డాబాలుగా మారాయి. కొత్తగా గుడి కట్టించారు. అలాగే అంబేద్కర్ విగ్రహం, కొన్ని ఇతర విగ్రహాలు కనిపించాయి. చిన్నచిన్న పూరిళ్లున్నాయి. ప్రభుత్వం కట్టించిన ఇళ్లు ఇంకా సాంతం నిర్మాణం పూర్తి కాకుండా వున్నాయి. మనుషుల్లో మాత్రం మార్పుకనిపించింది. ఇది వరకటిలా సైకిళ్లు లేవు- ఒకటో అరో తప్ప. బైకులు తిరుగుతున్నాయి. ఆటోలు కనిపిస్తున్నాయి.
ఇదివరకు ఎన్నో చెట్లు వుండేవి. అవేవీ లేవు. వానలకీ, తుఫాన్లకీ విరిగిపోయి వుంటాయి. రోడ్లు అప్పటిలానే వున్నాయి గతుకులు గతుకులుగా. నేను నా మిత్రుడు జాకబ్‌ని వెతుకుంటూ వెళ్లాను. అతను ఇంటి బయట ఓ కుక్కి మంచంలో కనిపించాడు. నన్ను చూడగానే గుర్తుపట్టాడు.
జాకబ్ మాత్రం నల్లబడి పోయాడు. ఇంతకు ముందు ఎరుపు రంగు కాదు. అయినా నిరంతరం ఎండల్లో పని చేయటం వల్ల ఇంకా నలుపు అతనిలో కలిసి పోయింది. నన్ను కౌగిలిచుంకున్నాడు.
''నిన్ను చూస్తాననుకోలేదు'' అన్నాడు ఆసాంతం చూస్తూ.
''నిన్నూ మన ఊరినీ చూద్దామని వచ్చాను'' అన్నాను .. మంచినీళ్ల లోటా అందిస్తే తాగాను.
''జాకబ్ నిన్ను ఇలా చూస్తాననుకోలేదు. నీ బతుకులో మంచి మార్పులు వస్తాయనుకొన్నాను'' అన్నాను.
''ఎలా వస్తుంది ప్రసాద్. మన నుదుటి మీద పైవాడు అలా రాసాడు'' అన్నాడు.
''అలా అంటే నేను ఒప్పుకోను జాకబ్'' అన్నాను.
''మీరు అగ్రకులంలో పుట్టారు కాబట్టి మా బాధలు మీకు తెలియవు. అయినా భూమి వున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కుంట భూమిలేని మాలాంటి వాళ్ళ బతుకులు ఎలా మారతాయి'' అన్నాడు.
''అలా అన్నావు బాగుంది. ఇప్పుడు మీ కులాల్లో పుట్టకపోయినా, దళితులం అని రాయించుకుంటున్నారు. మీ ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుంటే వచ్చే తరంలో అయినా మీకు వచ్చే అవకాశాలు వాడుకోవాలనుకుంటున్నారు'' అనగానే జాకబ్ చిన్నగా నవ్వడు.
''మీకు భూములు ఇస్తున్నారని విన్నాను. నీకు అలాంటిది రాలేదా?''
''అదంతా మాయ ప్రసాద్. ఇళ్లు చూస్తున్నావుగా. రాళ్ళూరప్పల భూములు కొంత మందికి యిచ్చారు. ఎట్టా చేస్తారు ఎవసాయం. ఎప్పుడో అమ్ముకున్నారు. ఈ బతుకులు బాగుపడవులే'' అన్నాడు.
''ఇదంతా దేవుడు చేస్తున్నాడని అనుకుంటున్నావా? అవునూ నీకు ఎంతమంది పిల్లలు?'' అన్నాను
''దేవుడు చేస్తన్నాడో మనుషులు చేస్తన్నారో వదిలేరు. పిల్లలంటావా- పుట్టారు నలుగురు. పురిట్లో ఒకరు, రెండేళ్లయ్యాక ఇంకొకరు పోయారు. అమ్మాయికి పెళ్లి చేసి పంపా. కొడుకు కూలి పనుల కోసం వలస బోయాడు'' అన్నాడు.
నా గురించి నా మధ్య తరగతి జీవితం గురించి చెప్పాను. పిల్లలు చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నేను రిటైరయ్యాను పెన్షన్ వస్తోందన్నాను.
''భగమంతుడు మా ముఖం మీద అదీ రాయలేదు. ఓపికున్నంత వరకు చాకిరీ చేయాలి. తర్వాత పోవాలి. పిల్లలకి చదువు చెప్పించలేక పోయాను. అన్నీ ఎదురు దెబ్బలే అన్నాడు.
నాకు గోర్కీ గుర్కొచ్చాడు. ఇలాంటి వారి కోసమే అతను పని చేయాలనుకున్నాడు. అలాంటి వారు చాలా మందున్నారు. త్యాగాలు చేస్తున్నారు. అయినా మార్పురావటం లేదు. ఇంకో జాకబ్ లాంటి కోట్లాది మంది తమ కర్మ అనుకోవటం మించి ముందుకు రావటం లేదు. ఎన్ని వందల సంవత్సరాలు కావాలి ఈ బతుకులు మారటానికి?
మేం తిరిగి బస్‌స్టాండ్ దగ్గరికి వస్తుంటే ఇద్దరు ముగ్గురు పాతతరం వారు జాకబ్‌ని ఎవరీ మనిషి అని అడిగి, మా తాతని, నాన్నని తలుచుకుని, చిన్నప్పుడు చూశాం గుర్తుపట్టలా అన్నారు. 'చావో, బతుకో యిక్కడే. పిల్లలకీ వూరూ వొద్దు, ముసలివారూ వద్దు' అని గొణిగారు.
జాకబ్ అర్జెంట్‌గా పనుంది వెళ్తానంటే వెయ్య రూపాయలు తీసి ఇవ్వబోయాను.
''పెన్షన్ వెయ్యి రూపాయలు రాయిస్తానంటే వద్దన్నాను ప్రసాదూ. నాకంటే లేనివాళ్లున్నారు. అదేదో వాళ్లబ్బ సొమ్ముయిచ్చినట్లు వెయ్యి రూపాయల్తో నెలంతా గడిచిపోద్దని మీటింగులు చెబుతారు. నన్ను వెతుక్కుంటూ వచ్చావు. నీ ప్రేమ చాలు'' అని వెళ్లిపోయాడు.
మనుషుల్లో ఎంత గొప్పవారున్నారు. అవసరం వున్నా లేక పోయినా ఎదుటివారి నుండి ఆశించే మనుషుల్ని నేను ఇప్పటి వరకు చూస్తూనే వున్నాను.
బస్‌కోసం ఎదురు చూస్తుంటే కాస్త దూరంగా ఇద్దరు మనుషులు నడిచి రావటం కనిపించింది.
దగ్గరకు వచ్చాక ఆశ్చర్యం కలిగింది
అతను చిన్నయసూరి. నేను పలకరించాను ఆనందంగా..
''చిన్నయసూరీ నువ్వు నువ్వేనా?'' అన్నాను. చిన్నగా తలూపాడు. తన రెండో అబ్బాయిని పరిచయం చేసాడు. తమకు ఈ ఊర్లో ఇంటి స్థలం పదిసెంట్లు వుందని, అది అమ్మటానికి వచ్చాం అన్నాడు.
నేను ఊహించినట్లు స్వామీజీ అవతరంలోకి మారలేదు, ప్రవచనాలు చెప్పటం లేదు. అతని కొడుకుని చూస్తే కళ కనిపించలేదు. సూరి దుస్తులు, వాలకం చూస్తుంటే పేదరికం గీతకు ఇవతలే వున్నాడు అనిపిస్తోంది.
''నువ్వు పెళ్లి చేసుకుంటావని అనుకోలేదు'' అన్నాను మెల్లగా. అప్పుడు సూరి కొడుకు ముఖంలో ఓ బాధ, కోపం కలగలిసిన భావం మెరిసింది ఓ క్షణం. సూరి మాట్లాడలేదు. ఎంత మంది పిల్లలు అని అడిగాను. ఓ అమ్మాయి అన్నాడు. మీ అల్లుడేం చేస్తున్నాడని అడిగాను.
''అది పెళ్లి చేసుకోలేదు. అడవుల్లోకి వెళ్లింది'' అన్నాడు నిర్లిప్తంగా. నేను దిగ్భ్రాంతితో చూస్తున్నాను.
''బతికి వుందో లేదో కూడా తెలియదు'' అన్నాక అర్థం అయింది.
''నువ్వు నీ తత్వం గురించి పిల్లలకు చెప్పలేదా?'' అన్నాను. సూరి కొడుకు నాకేసి చూసాడు. చిన్నగా నవ్వాడు.
''ఎవరి ఆత్మ ప్రభోదం వారిది'' అన్నాడు మెల్లగా.
''ఆత్మ సర్వస్వతంత్రమైనది అనేవాడివి. అది ప్రభోదం చేస్తుందా?'' అన్నాను. అప్పుడు సూరి కొడుకు మాట్లాడాడు.
''బతకటం చేతకానివారు, బతుకుల్ని మార్చాలి అనుకోనివారు ఎన్ని వేదాంతాలయినా మాట్లాడతారు మాస్టారూ. నేను ఆయన నా తండ్రిగా మాట్లాడటం లేదు. మా అమ్మ ఆరోగ్యం చెడిపోయింది. మా అక్క ఉద్యమంలోకి వెళ్లిపోయింది. ఇవన్నీ లౌకిక విషయాలుగా కూడా ఆయన చూడరు. ఈ రోజు అమ్మ పదిరోజులు బతకాలంటే ఇక్కడ భూమిని అమ్మవలసి వచ్చింది. మీ స్నేహితుడికి జబ్బు చేస్తే ఏం చేయాలో తెలియదు...'' అన్నాడు కాస్త ఆవేశంగా.
''నువ్వు ఏం చేస్తున్నావు బాబూ..'' అన్నాను.
''ఇంతకు ముందు వరకు వారి ప్రబావంలో వున్నాను. ఇదంతా మాయ అనుకున్నాను. అందుకే ఏ లక్ష్యమూ పెట్టుకోలేదు. చివరకి అక్క వెళ్లిపోయినప్పుడు నాన్నకి అన్యాయం చేసిందుకున్నాను. ఇప్పుడిప్పుడే తత్వం బోధ పడుతోంది'' అన్నాడు.
సూరి మాత్రం కొడుకుని వారించటం లేదు. అలా అని అతని ముఖంలో సంఘర్షణ కనిపించటం లేదు.
''ఎవరయినా తాము ఓ సిద్ధాంతాన్ని నమ్మితే ఎవరు కాదన్నా దానికి కట్టుబడి వుండాలి. అలాంటిది మా నాన్నలో లేదు. పెళ్లి చేసుకున్నారు. అది ఎవరి బలవంతంతో అయినా పిల్లల్ని కన్నారు. వారి బాధ్యతలు పట్టలేదు. పోనీ ఈ మాయ ప్రపంచపు అనుభావాన్ని ప్రపంచనికి అందించారా అంటే అదీ లేదు ఆత్మాన్వేషణలో వున్నాను అన్నారు'' అంటుంటే...
''మీ నాన్న గారికి ఊహ తెలిసినప్పటి నుంచి ఆ పనిలోనే వున్నారు'' అన్నాను.
''ఆ అన్వేషణలో విఫలం అయ్యారు. ఇంతకు ముందు మహానుభావులు చెప్పిన వాటిని అనుభవంతో పోల్చుకోలేదు. వారి జీవితాల్ని పరిశీలించలేదు. ఆత్మ కనిపించదు. అది శరీరం కాదు అంటారు. కనిపించే శరీరాన్ని, పంచేద్రియాల్ని పట్టించుకోకుండా, వాటి విధుల్ని నిర్వహించకుండా సత్యం ఎలా తెలుస్తుంది చెప్పండి'' అన్నాడు.
''ఆత్మ గురించి నీ ఉద్దేశం ఏమిటి బాబూ'' అన్నాను
''అదంటూ వుంటే భౌతికమైన మన శరీరంలో వుంది. మనం చేసే కర్మలను బట్టి, వాటి ఫలితాల్ని బట్టి మనుషుల మనసుల్ని నిర్దేశిస్తుంది. అంటే మన మెదడు అనే భౌతిక పదార్థం నుండి వచ్చే ఆలోచనలను అది రూపుదిద్దుతుంది, ఎప్పుడయితే మెదడు పని చేయదో అప్పుడే ఆత్మ ప్రయాణం ఆగిపోతుంది'' అన్నాడు.
అశాశ్వతం, మాయ అనుకున్న చిన్నయసూరి రక్తం పంచుకు పుట్టిన అతని కొడుకు ఎంత గొప్పగా చెప్పాడు! ఆ రకంగా సూరి జీవితం ధన్యమైంది అనుకున్నాను.
''మరణానంతరం ఆత్మ వుంటుంది. దానికి మరణం లేదు అంటారు కదా బాబూ'' అన్నాను.
''అవన్నీ మరణానికి ముందు చెప్పే మాటలు. మిగతాది కల్పన. మనుషులకు కల్పనను మించిన శాంతి, సౌఖ్యం వుండదు. అసలు ఈ సృష్టికే మరణం వుంది. ఆది వుంది, అంతం వుంది, ప్రాణం పోకడ గురించి ముందుగా మనం చెప్పలేం. పుట్టుకని కూడా. సృష్టికి ఆదీ అంతం వున్నప్పుడు ఆత్మకు లేకుండా ఎలా వుంటుంది? భావాలయినా పదార్థమైనా ఎప్పుడో ఒకప్పుడు శూన్యంలో విలీనం కావల్సిందే'' అన్నాడు
చిన్నయసూరి ఇంకేదో కొత్త , సిద్థాంతాన్ని ప్రతిపాదిస్తున్నట్లు నాకు అనిపించింది
''ఇంతకూ నీ ప్రయాణం ఎటు?'' అని అడిగాను.
''అమ్మ ఎక్కువ రోజులు బతకదు. ఆమె పట్ల నా బాధ్యతను పూర్తి చేసుకున్నాక, ఈ భౌతిక ప్రపంచ వాస్తవాన్ని కొందరు ఎలా తలకిందులు చేస్తున్నారో, సృష్టి ఫలితాల్ని స్వంతం చేసుకుంటున్నారో తెలియ చెప్పే ప్రయత్నం చేస్తాను. మనుషులకు ఒకే జన్మ వుంటుంది. అదే జన్మరాహిత్యం అని వివరిస్తాను. నా ఆలోచలనలను, ఆమోదించే వారిని కలుపుకుంటాను. మనం ఏం చేయాలనుకున్నా ఇప్పుడే చేయాలి. తర్వాత ఆ అవకాశం వుండదు అంటాను''
''నిన్ను ఈ ప్రపంచం ఆమోదిస్తుందా?'' అన్నాను.
''అలాంటి నమ్మకం లేకుంటే అడుగు ముందుకు పడదు. ఇదంతా మాయ అనుకున్నవారు చివరిక్షణం వరకు బతుకుతున్నారు గాని బలవంతంగా చనిపోవటం లేదు కదా'' అన్నాడు.
చిన్నయసూరి కంటే అతని కొడుకు నాకు అర్థం అవుతున్నట్లు అనిపిస్తోంది.
సెల్ : 9246573575
Sat 14 May 18:47:22.830427 2016