మల్లెపువ్వు...! అడవిలో వికసించినా అందరాని జాబిలికంటే చక్కనిది. మండువేసవిలో ....అమృతం తెస్తాయట మల్లెలు..! బహుశా ఆ రుచి చూసి మైమరిచారో..ఏమో..'పోతన' నల్లని శ్రీకృష్ణుడ్ని మల్లెపొదల మాటున దాచి, 'ఓ మల్లియలారా..! మీ పొదలమాటున లేడు కదమ్మా...! చెప్పరే..!' అని గోపికలచేత అడిగించి మరీ సంబరపడిపోయారు. ఈ తెల్లని..చల్లని ...సుందర సుకుమార సుమాలకు మురిసిన 'దేవులపలి'్ల ఏమన్నారో తెలుసుగా..! 'మనసున మల్లెల మాలలూగెనే..!' అని మనల్నీ ఓలలాడించారు కదా..!
''అడవిలో నల్లని తుమ్మెదలు ఝంకారం చేస్తూ మల్లెతీగకు విచ్చుకున్న ప్రతిమొగ్గమీద తమ పాదాలు వుంచి, వాటిని తెరవడానికి ప్రయత్నిస్తున్నట్టు నటిస్తూ, సుగంధాన్ని ఆఘ్రాణిస్తూ, వాటిని లెక్కిస్తున్నాయా..అనిపిస్తుంద''ని ఈ కుసుమాలకు కొత్త భాష్యం పలికారు కవి కాళిదాసు.
మంచుకురిసి మల్లెలను ముద్దాడటం చూసిన ప్రకృతికాంత పులకించి తన సిగలో మల్లెల్ని ముడుచుకొని మురిసిపోతుంది. అందుకేనేమో అప్పటిదాకా ఎండీ ఎండనట్టు కనిపించే మల్లెతీగలు తటాలున చిక్కని చిగురింతలతో చక్కని మెరుపులు..! ఆ లే చివుళ్లతోనే నవవధువు సిగ్గుల్లా నునులేత మొగ్గలు..!! తెల్లారి వెలుగులో అగుపించని ఆ మొగ్గలు సాయంత్రానికల్లా అమ్మ నవ్వులా చల్లగా..హాయిగా..ఆ సువాసన ఏ మమతల తీరానికో తీసుకుపోవును కాదా..! మధుర సంగీతంలా మనసును అల్లుకుపోవును కాదా!! అందుకే అంతా మల్లెలు స్వచ్ఛతకీ, మంచి స్నేహానికీ మధురస్మృతిగా భావిస్తారు.
మల్లియకు..మరెన్నో పేర్లు !
మల్లెలు మాఘమాసంలో వికసిస్తాయి. అందుకనే కాబోలు మల్లెపువ్వు ని 'మాఘ్యం' అని అంటారు. అదే ఆంగ్లంలో అయితే 'జాస్మిన్' అంటారు. హిందీలో 'ఛమేలీ'.. తమిళంలో 'మల్లిగైపూ'.. అని పలుకుతారు. మల్లిక, మల్లియ, ప్రియ, ముద్గరము, చంద్రిక, సుభగ, చంబేళీ వంటి పేర్లెన్నో...! వెన్నమొగ్గల్లాంటి ఈ మల్లియలు ఎన్ని రకాలనుకున్నారు? అబ్బో చాలానే..అంటారు సుమీ...! బొండుమల్లెలు, గుండుమల్లెలూ, దొంతరమల్లెలూ, సిరిమల్లెలూ, సెంటుమల్లెలూ, గిన్నెమల్లెలూ రేకుమల్లెలూ, గుబురు మల్లెలు, ఆకాశమల్లెలు, అడవి మల్లెలూ, జాజిమల్లెలూ, జాబిల్లిమల్లెలూ డైమండ్ మల్లెలూ, జపాన్‌మల్లెలూ, నవమల్లికలూ..ఇంకా ఎన్నెన్నో..వున్నాయట.
ఆ పరిమళమెంత మధురమో..
వేసవి సెలవుల్లో అమ్మమ్మవాళ్లూరెళితే.. చూడాలీ... ఎంత ఆనందమో.. మల్లెతోటలూ మామిడితోటల్లో తిరగడమేగా పనీ..పిల్లలమంతా కలిసి జామ్మంటూ మల్లెతోటల్ని చూట్టానికి పోవటం... రా..రమ్మని పిలిచే మొగ్గల్ని తుంచడానికి ఎన్నెన్ని తంటాలో తెలుసా...! ఆ మల్లెలు ఎలా వుండేవనుకున్నారు... ముదురాకుపచ్చని గుబుర్ల నడుమ చిన్నివి.. కొంచెం బుల్లి లడ్డూల్లా కొన్ని, ఇంకొంచెం పెద్దవీ, ద్రాక్షగుత్తుల్లాంటి గుబురు మల్లెలు, తెల్లని బుడిపెల్లాంటివీ, తెల్లని గులాబీ సైజులో మరికొన్ని.. మరి కన్నెపిల్ల కన్నుల్లాంటి మొగ్గలో..! అవైతే ఇక చెప్పలేం... వీటినే జడమల్లెలని కూడా అంటారు. చూపుడువేలు మొదటిభాగమంత సైజులో వుంటాయవి. మరి పందిరిమీదున్న మొగ్గలో.. ఒకటా.., రెండా..ఎన్నెన్నో.. వాటిని చూట్టానికి తెగ ఆరాటం.. తోటమాలి చూడకుండా తెంపటానికి ఓ పోరాటం.. ఆ తొందరలో పసిరిమొగ్గలు కూడా తెంపేసి, తెగ బాధపడేవాళ్లం. ఆ తోటంతా కళ్లు గిరగిరా తిప్పుతూ మల్లెల పరిమళంలో పడిపోవాల్సిందే..!
మల్లెల పరిమళం ఎంత మధురం..ఎంత ఆహ్లాదం.. విరజాజుల సువాసన, పారిజాతం.. చెంగల్వ, బంగారువన్నె సంపెంగ, నైటిక్వీన్... ఇవన్నీ కూడబలుక్కుని ఎవరో పేరంటానికి పిలిచినట్లే... చెట్టపట్టాలేసుకొని చెంగుచెంగున వేసవిలో చందనం తోడ్కొని ..పెళ్లింటికి విడిదికొచ్చినట్టే.. పగలంతా మొగ్గలు..! సాయంవేళ పువ్వులు..! అందుకేనేమో సువాసనాభరితమైన ఈ సుమాల్ని చూసీచూడగానే అమ్మలుగన్న అమ్మలకూ ముద్దూ మురిపాలూ. అందునా మల్లెలయితే మరీనూ మనసంతా వాటిచుట్టూనే... మామూలువాళ్లను కూడా భావుకులుగా మార్చివేసే మహత్తూ, గమ్మత్తూ మల్లెపువ్వుకే దక్కింది.
జాలువారిన మాలికలు..!
మరి కవుల హృదయాల్లో జాలువారిన రాగమాలికలెన్నో కదా..! వాటిలో మల్లికకే అగ్రతాంబూలం. శ్రీనాధుడు తన చేతికి మల్లెపూదండ చుట్టుకొని..ఆ తరువాతే కవితలూ కావ్యాలూ రచించేవాడని చెప్తారు ! ఇక మన తెలుగు చిత్రసీమ కవిమహాత్ములంతా.. మల్లెలతో హేమంతం.. వసంతం.. మేళవించి పల్లవించినవారే.. 'మంచు కురిసే వేళలో..మల్లె మురిసేనెందుకో... 'ఆత్రేయ' ఆశ్చర్యం..! 'మల్లియలారా..! మాలికలారా...! మౌనముగా వున్నారా..? మా కథనే విన్నారా..?' అని సినారె ప్రశ్నించారు. ఇక మనం ఊహించని విధంగా 'దాశరధి' 'మల్లెపువ్వులూ...! పిల్లనవ్వులూ..! నీ కోసమే...నీ కోసమే...ఇటు రావోయి రావోయి...!' చిలిపితనం ఒలకబోశారు. ఇక 'ఆరుద్ర' ప్రేమ సందేశం వినండీ..'తోటలోకి రాకురా..! తుంటరి తుమ్మెదా..! గడుసరి తుమ్మెదా...! మా 'మలె'్ల మనసెంతో చల్లనిదీ...అది ఏ వన్నె చిన్నెలూ ఎరుగనిదీ..!' వినే వుంటారు కదా..! ఆసుకవి 'మల్లెమాల' 'మల్లి విరిసింది..పరిమళపు జల్లు కురిసిందీ..!' అని వర్ణించారు. 'వేటూరి సుందరరామ్మూర్తి' 'మల్లెలు పూచే...వెన్నెల కాచే...! ఈ రేయి హాయిగా..!' సుతిమెత్తని సాహిత్యాన్ని అందించారు. ఆయనే 'మల్లెపువ్వు' సినిమాలో 'ఎవరికి తెలుసు చితికిన మనసు..చితిగా రగులుననీ...నిప్పులు చెరిగే నా గీతంలో నిట్టూరుపులే సంగీతం..నా తోటకు 'మల్లిక' లేనేలేదనీ..! విరహగీత రచన హృదయ విదారకంగా వుంటుంది... చిత్రమేమిటంటే ప్రణయగీతాలూ.. విరహగీతాలూ మల్లెపూవునుద్దేశించి ఆలపించినవే .
బంధం..అనుబంధం..
వేసవి సెలవుల్లో వూరెళ్లడం, అక్కడ మల్లెతోటల్లో తిరగడం, చిన్ననాటి స్నేహితులతో ఆటపాటలు, పెద్దోళ్లతో పెళ్లిళ్లకు వెళ్లి ఉల్లాసంగా గడిపేయడం.. వీటన్నిటిలో కూడా మల్లెలతోనే మరపురాని అనుబంధం. చాలా భాగం గ్రామసీమల్లో వేసవొచ్చిందంటే మొదలు మల్లెపూల జడలు. పెద్దవాళ్లందరికీ అదో వేడుక. మల్లెలతో జడలు అల్లడం కూడా ఓ చక్కని కళ..! మహదానందంగా వుంటుంది. ఆడపిల్లలందరికీ పూలజడలు వేయడమంటే కొంతమందికి మహా సరదా..! ఆ పూట ఆ ఇంట్లో అదో చిన్నపాటి పెళ్లివేడుకలాంటిదే. ఆ చిన్నపిల్లలు కూడా తన జడనే చూడాలీ..అన్నట్లు జడను చూపుతూ ఒయ్యారంగా తిరుగుతుంటారు. ఇంటినిండా బంధువులు వుండటం, కొత్త బట్టలు వేసి, గోరింటాకు పెట్టి, పూల అలంకరణతో కొత్తగా వచ్చిన సువాసన తోడై, ఆ సందట్లో ఈ పూలజడ వేయించుకున్న చిన్నారి సరదాగా తిరుగుతూ వుంటుంది. పూలజడ నలగకుండా...ఆ పాపని కనిపెట్టుకొని వెంటే తిరుగుతూ వుంటారు అమ్మమ్మో..నానమ్మో..! వాళ్లకదే అబ్బురం. అసలు పూలజడ అల్లించాలనుకున్నపుడే, సన్నాహాలు మొదలవుతాయి. మల్లెపూలు తెచ్చిపెట్టే అమ్మికి రెండ్రోజుల ముందే గంపెడు పూలు కావాలని చెబుతారు. ఆ మరుసటి రోజునుంచే ఆమె తెచ్చే మొగ్గలకోసం ఎదురుచూపులు. పొడవైన మొగ్గల్ని ఏరడం కూడా ఓ కళే. ఇక ఈ తంతుతో ఆ ఇంట సుమదళాల శోభ. ఆ తరువాతుంటుంది అసలు సిసలైన కథ.
ఎవరి జడ బావుందో పెద్దమ్మలంతా చేరి వర్ణనలు. వారి సంభాషణంతా పువ్వులూ.. నవ్వులూ.. ఇప్పుడే వుంటుంది అసలు తమాషా..! ఆ రోజు నిద్రలో పూలజడ నలిగితే ఎలా?! అందుకని జడలు అల్లించుకున్న ఆడబిడ్డలకంటే, చుట్టూ వున్న వారి పర్యవేక్షణే ఎక్కువ. ఆ పిల్లల్ని అపర సత్యభామల భంగిమలో ఒకవైపే బజ్జోవాలని హితబోధలు. తెల్లారిన తరువాత మెడనొప్పులు షరామామూలే. కాస్త ఓపిక పట్టుతల్లీ...! మా బుజ్జి కదూ..! అని లాలించి, జడ బరువు లేదులే.. అని బుజ్జ గిస్తారు.. మల్లె పూల పరిమళంతో జడ బరువే అని పించదేమో..! అలా మళ్లీ మళ్లీ పిల్లలకు మల్లెపూల కాలంలో వంకీల జడ, ముద్దజడ, కనకాంబరం, మల్లెల కలబోత మరువం, మల్లెలతో జడలు వేయిస్తూ మురిసి పోవడం.. అదో ముచ్చట. ఈ నవయుగంలో ఆ వేడుకలన్నీ కథలు కథలుగా చెప్పుకునే తీరికా లేదనుకోండి. కానీ, పెళ్లిసందడిలో మల్లెపూలకే పెద్ద పందిరి సుమండీ..! ఈనాటికీ ముస్లిమ్స్ వివాహ వేడుకలో ముఖ్యంగా పెళ్లికొడుకుని మల్లెపూలతో అలంకరించడం చూడ ముచ్చటగా వుంటుంది.
బొండుమల్లెల ముందు ఎండవేడి వుఫ్...!
ఎండలు మండే సమయం...అయితేనేమ్..! విరిసిన వెన్నెలవో..చెలీ..చెలీ..! నీవెవరో...! అన్నట్టు నేలపై వెన్నెల జాలువారినట్టు విరబూసిన మల్లెల్ని ప్రకృతి ప్రసాదిస్తుంది. చీకటి వెంట వెలుగులా.. ఎండల్లో హారు.. వెన్నెల్లో హారు..! అనుకుంటూ బుల్లి బుల్లి మల్లెలు.. చల్లని మల్లెలు.. అరిటాకులో చుట్టి అందిస్తే.. ఆ ఆనందమే వేరు. విరిసీవిరియని మల్లెలతో ఒత్తుగా కొన్ని, అచ్చంగా మల్లెమొగ్గలతో వదులుగా కాసిన్ని.. మరువంతో మరిన్నీ.. కనకాంబరాలతో కొన్నేసి, ఎల్లో కనకాంబరాలతో ఇంకొన్ని, దూరం.. దూరంగా...నూ, చిక్కగా అల్లినవి.. గుండుమల్లెల ఘుమఘుమలు.. అబ్బ..ఆ వాతావరణమే గమ్మత్తుగా, చందనం చల్లినంత చల్లగా, మన చుట్టూ మల్లెతోట తిరుగుతున్నట్టే అనిపిస్తుంది. ఆడపిల్లలంతా అల్లిబిల్లి ఆడుతున్నట్టు మహత్తుగా వుంటుంది. కావాలంటే... ఇంటిముందు మల్లె అంటొకటి నాటి, వచ్చే వేసవికి మల్లెల వసంతం చూద్దురూ..!
మల్లిక పుట్టుక
ఆంగ్లంలో 'జాస్మిన్' గా పిలిచే మన మల్లెపువ్వు పుట్టినిల్లు ఆస్ట్రేలియా పరివాహక ప్రాంతంగా ఓ అధ్యయనంలో తేలిన విషయం. అప్పటి బ్రిటీష్ పరిపాలనలో మల్లెల పరిమళానికి ముగ్ధులైన పుష్ప ప్రేమికులంతా కామన్‌వెల్త్ దేశాలకు, అటు తర్వాత ఇతర దేశాలకూ ఈ సంపదను కొంత తీసుకుపోయినట్లు చరిత్ర చెబుతోంది. ముఖ్యంగా అమెరికా, ఇతర యూరప్ దేశాలు, భారత్ ఉపఖండానికీ మల్లెసుమగంధం అబ్బింది అందుకేనట. అయితే పూవు పరిమాణం మాత్రం ఒక్కో దేశానికి ఒక్కో రకంగా వుంటుందని ఫ్లోరి కల్చర్ నిపుణుల పరిశోధనలో వెల్లడైంది. ఆయా దేశాల్లోని వాతావరణం, ఉష్ణోగ్రతల ప్రభావం కారణంగానే మల్లెపువ్వు విరబూస్తుందని చెప్తారు. దేశం ఏదైనా మల్లెల సువాసనకు మించిన పరిమళం మరే పువ్వుకీ సొబగలేదనేది అంతస్సారం. అందాకా ఎందుకండీ..! నవమల్లిక! ఎలా వికసించిందనుకున్నారు.. మనదగ్గరే...! మొక్కల్ని ప్రేమించే ఒకతను ఏటెల్లకాలం సన్నజాజులు పూస్తాయి కదా..! మరి అలాగే మల్లెల్ని ఎందుకు పూయించకూడదనే కుతూహలం కలిగి, మల్లియకూ సన్నజాజికీ కలిపి అంటుకట్టాడంట. ఆ మేలుకలయికే 'నవమల్లిక..!' ఈ నవజాతి 360 రోజులూ...విరబూసి అరనవ్వులు రువ్వుతోంది తెలుసా..!
మల్లె తోటలకు కేరాఫ్ రాయపురం
ఆ గ్రామానికి వెళితే మల్లెల వాసన గుబాళిస్తుంది. బొండు మల్లె, సింగిల్ మల్లె, జాజి మల్లెలకు ఆ ఊరు ప్రసిద్ధి. గ్రామంలో ఏ ఇంటికి వెళ్లినా పూల మొక్కలే స్వాగతం పలుకుతాయి. వ్యవసాయ భూమిలోనే కాకుండా ఇంటి పెరట్లో మల్లె తోటలు సాగు చేసుకుంటూ ఆయా కుటుంబాలు ఆర్థికంగా నిలబడుతున్నాయి.
నల్గొండజిల్లా నకిరేకల్ నియోజక వర్గంలోని కేతెపల్లి మండలం ఇనుపాముల గ్రామ పంచాయతీ పరిధిలోని రాయపురం వివిధ రకాల పూలకు పెట్టింది పేరు. ఆ గ్రామంలో 150 కుటుంబాలున్నాయి. ఇందులో 50 కుటుంబాలు మల్లె తోటల సాగుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. తమ తమ నివాసాల్లోని ఖాళీ జాగాల్లో 2 నుండి పది గుంటల విస్తీర్ణంలో మల్లెలను సాగు చేస్తున్నారు. మల్లెతోటల సాగుకు నీటి వినియోగం కూడా తక్కువే. ఇంటి అవసరాలకు ఉపయోగించే బోరు, వ్యవసాయ బావి నీటితో తోటలకు నీరందిస్తారు. చేద బావిలో ఉన్న కొద్ది పాటి నీటితోనూ చిన్నచిన్న మడులు చేసి ఆరుతడి పద్ధతిలో మొక్కలకు నీరు పెడుతుంటారు.
ఒక్క సారి సాగు చేస్తే 20 ఏళ్లు దిగుబడి...
ఒకసారి తోట సాగు చేస్తే 20 ఏళ్ల వరకూ పూలనందిస్తుంది. మల్లె తోటల పెంపకందారులు తమకు కావాల్సిన మల్లె అంట్లు విజయవాడ, జగ్గయ్యపేట నుండి తీసుకొచ్చి నాటుతారు. ఏడాదికి రెండు సార్లు పశువుల ఎరువు వేస్తారు. తోట ఏపుగా పెరుగుతున్న సమయంలో కొద్ది మోతాదులో మందులు చల్లుతారు. దీంతో చెట్టు విపరీతంగా పూలు పూస్తుంది. సింగిల్ మల్లెను ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకూ, బొండు మల్లెను సాయంత్రం 3 గంటల నుండి 6 గంటల మధ్యలో తెంపుతారు. సింగిల్ మల్లె పరిమళాన్ని వెదజల్లితే బొండు మల్లె చూడ్డానికి బొద్దుగా ముద్దుగా కనిపిస్తుంది. మల్లె తోటల సాగుకు కూలీల అవసరం కూడా తక్కువే. సాగు చేసిన కొద్దిపాటి తోటల్లో ప్రస్తుతానికి ఎవరి కుటుంబసభ్యులు వారి తోటల్లోనే పూలను కోసుకుంటున్నారు. ఫిబ్రవరి చివరి వారం నుండి ఆగస్టు రెండో వారం వరకూ మల్లెపూల దిగుబడి వస్తూనే వుంటుంది. కేజీ మల్లెపూలను రూ.120 నుండి రూ.150 వరకూ విక్రయిస్తుంటారు. నల్గొండ, హైదరాబాద్ పట్టణాల నుండి హోల్‌సేల్ వ్యాపారులు రాయపురం వచ్చి పూలను కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. సీజన్ ముగిసిన తర్వాత గ్రామస్తులు హైదరాబాద్ నుండి పూలు తెచ్చి మాలలు కట్టి వివిధ ఫంక్షన్లకు ఆర్డర్లమీద అందజేస్తారు. మరికొందరు పూలను కోసి మాలగా అల్లి పరిసర గ్రామాల్లోనూ, నకిరేకల్, సూర్యాపేటలోనూ విక్రయిస్తుంటారు.
- సేకరణ :వై.శాంతి కుమార్, నకిరేకల్
మల్లెతోటే కుటుంబానికి ఆధారం
పదిహేను సంవత్సరాలుగా మల్లె తోట సాగుపైనే కుటుంబం ఆధారపడి వుంది. మొదట్లో రెండు గుంటల్లో సాగు ప్రారంభించి నేడు 20 గుంటల్లో చేస్తున్నాను. పూల తోటల సాగు కోసం అయ్యే పెట్టుబడి చాలా తక్కువ. పూలను తెంపడం, మందులు స్ప్రే చేయడం కుటుంబ సభ్యులమే చేసుకుంటాం. హోల్‌సేల్ వ్యాపారులు డిమాండ్‌కు తగ్గ ధర పెట్టడం లేదు. దీని వల్ల కొందరు నష్టపోవాల్సి వస్తోంది. ఏదేమైనా అన్ని ఖర్చులూ పోనూ ఏడాదికి రూ.లక్షన్నర వరకు మిగులుతుంది.
- పసల భాగ్యరాజు, రాయపురం
- జి. రాజకుమారి 9490099008
Sat 23 May 22:10:03.329719 2015