Sat 21 May 15:07:11.325249 2016
Authorization
''నేను బతుకుతానో చస్తానో తెలియదు. కానీ ఏడ్చి కన్నీళ్ళు కారుస్తూ, దేవిరిస్తూ మాత్రం చావను. యుద్ధం చేస్తూ చస్తాను. నేను నరకానికే పోతానుగాక. కాని అక్కడా నా అంత మెరుగైన మనిషి మరొకడుండడు. అనుకున్నది సాధించడానికి ఏమైనా చేస్తాను. నాకు నీతులు చెప్పకండి. గతం నన్ను చంపాలనుకున్నది. ఈ క్షణం నుంచి చచ్చేదాకా నేను నా ఆశయాలకు అనుగుణంగా బతుకుతాను. నగంగా ఆకలికి మాడి చావాల్సి వచ్చినా సరే, నేను నా నమ్మకాల్ని మాత్రం తాకట్టు పెట్టను'' అంటాడు జాక్ లండన్ అనే అమెరికన్ రచయిత. నమ్మిన ఆశయాలకోసం ప్రాణ త్యాగం చేసినవారు చరిత్రలో కొందరే ఉన్నారు. క్రీస్తు పూర్వం నాటి వాడయిన సోక్రటీస్ నుంచి భారత స్వాతంత్య్ర వీరుడు భగత్ సింగ్ వరకు.. వేనవేల ఏళ్ళ చరిత్రలో కొందరు మాత్రమే ప్రాణాలను తృణప్రాయంగా భావించి నమ్మిన సిద్ధాంతం కోసం సమకాలీన సమాజానికి, ఏలికలకు ఎదురు నిలిచారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే తమ ఆశయాల సాధన కోసం ఎవరు ఎటువంటి మార్గాన్ని అనుసరించారని. సమకాలీన సమాజ విశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ సంస్కృతినో, సిద్ధాంతాన్నో ప్రతిపాదించేవారు తప్పనిసరిగా ఆ సమాజానికి ఆమోద యోగ్యం కాని పద్ధతుల్లోనే దాన్ని సాకారం చేసే పని ప్రారంభించవలసి ఉంటుంది. అటువంటప్పుడు సమాజం చూస్తూ ఊరుకుంటుందా? నమ్మక వ్యవస్థపై నడిచే మానవ సమాజాలు మార్పులను అంత తేలికగా అంగీకరించవు. పైగా ఈ మార్పులు సమకాలీన సమాజంలో ఉన్న కొందరి హక్కులకు గొడ్డలిపెట్టుగా పరిణమించడం సహజంగా జరిగే పరిణామం. సాధారణంగా ఆధిపత్య వర్గాలవారికే ఈ మార్పులు ఇబ్బందిని కలిగిస్తాయి. అందుకే వారు కొత్తదనాన్ని ప్రతిపాదించే వారిపై విరుచుకుపడతారు. భౌతికంగా వారిని అంతమొందించే ఏ అవకాశాన్నీ వదులుకోరు. అంటే మార్పుకోసం ఆలోచనాపరులు ఓ చర్యను ప్రారంభిస్తే వెంటనే ఆధిపత్య వర్గాలవారు ప్రతిచర్యతో తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తారన్నమాట.
అయితే మార్పును కోరుకునే సాహసికులకు తమ ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా వెనుదీయని తెగువ ఎట్లా వస్తుందనేది ఆశ్చర్యాన్ని, ఉత్తేజాన్ని రేకెత్తించే ప్రశ్న. నిరంతరం బతకడం కోసం యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు మనిషికి తెగువ వస్తుంది. ఎప్పుడూ అవమానాలు, ఛీత్కారాలు, ఆకలిమంటలు, దౌర్జన్యాన్ని భరించవలసి రావడం ఈ తెగువకు కారణం. తాను జీవిస్తున్న అమానవీయ పరిస్థితులవల్ల మనిషిలో సెంటిమెంట్స్ చచ్చిపోతాయి. లోకాన్ని హేతుబద్ధంగా, వాస్తవికంగా చూడటం అలవాటవుతుంది. ఫలితంగా మార్పుకోసం కొత్త ఆలోచనలు పుట్టుకువస్తాయి. అవే కొత్త సిద్ధాంతాల రూపాన్ని సంతరించుకుంటాయి. ఇవి తాము కలలు కనే నూతన వ్యవస్థకు ప్రతిరూపాలు. ఈ ప్రత్యామ్నాయ వ్యవస్థలను సాధించుకోవడం కోసం అవసరమైతే ప్రాణాలను సైతం అర్పించడం వారికి పెద్ద సమస్య కాదు. పోరాటం ఫలించి కొత్త వ్యవస్థ సాకారం అయితే తమ కష్టాలు తీరిపోతాయి. కాదు.. ప్రాణాలకే ముప్పు వస్తే రానీ.. నిరంతరం నరకప్రాయమైన బతుకు బతికినా బతక్క పోయినా ఒకటే కదా అనేది వీరి ఉద్దేశం.
అయితే అందరూ దుర్భర పరిస్థితుల్లోనే తిరుగుబాటు బావుటాను ఎగరవేస్తారనేది వాస్తవం కాదు. కొందరు కడుపునిండిన మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన మేధావులూ సమకాలీన వ్యవస్థకు భిన్నంగా ఆలోచిస్తారు. తోటి మానవుల పట్ల వారికి ఉన్న ప్రేమ, దయ; హేతువాద దృక్పథం భిన్నంగా ఆలోచింపచేస్తాయి.