భయం భయంతో వణికిపోతున్న అక్షరాన్ని చేతుల్లోకి తీసుకొని ధైర్యపుటూపిరులూదిన న్యాయమూర్తులకు యావత్ సాహితీ లోకం సలాం చేస్తోంది. అడవిలో కుందేలును తరుముతున్నట్లు వేటకుక్కల్లా రచయిత పెరుమాళ్ మురుగన్ వెంటపడిన మత, కుల ఛాందసవాదులను గెదిమి, ఆరిపోతున్న కలానికి పదును పెట్టమన్న న్యాయమూర్తుల వాక్యం చరిత్రాత్మకం. చిన్నబోయి చీకటిలో కూచున్న తమిళ రచయిత, కవి మురుగన్‌తో పాటు, ఆయనకు సైదోడుగా నిలిచిన ప్రగతి కాముక పుస్తక ప్రియులందరికి ఆ తీర్పు ఓ దీపావళి పండుగ. ఆ పండుగ సంబురాలను మీతో పంచుకుంటోంది ఈ వారం కవర్ స్టోరీ.
యాభరు అయిదేండ్ల తమిళ ప్రొఫెసర్ పెరుమాళ్ మురుగన్ నమక్కల్ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నారు. నమక్కల్ జిల్లాలోని తిరుచెంగోడు ఆయన స్వగ్రామం. ప్రగతిశీల రచయితగా మురుగన్ ఆరు నవలలు, నాలుగు కథాసంపుటాలు, నాలుగు కవితా సంకలనాలు రచించారు. మూడు నవలలు ఇంగ్లీషులోకి అనువదింపబడ్డాయి. తమిళనాడు ప్రభుత్వం నుండి, వివిధ సాహితీ సంస్థలనుండి గౌరవ పురస్కారాలు అందుకున్నారు.
రచయితగా మురుగన్ 2010లో రాసిన కల్పిత నవల 'మధోరుభగన్' కూడా తన అన్ని రచనల మాదిరే విమర్శకుల ప్రశంసలందుకుంది. ఈ నవలని అనిరుధన్ వాసుదేవన్ 'ఒన్ పార్ట్ వుమెన్' పేరుతో ఇంగ్లీషులోకి అనువదించాడు. ఈ ప్రచురణ 2013లో మార్కెట్‌లోకి వచ్చింది. ఇంగ్లీషు తర్జుమా సైతం మంచి సమీక్షలను సొంతం చేసుకుంది.
'మధోరుభగన్'లో తమిళనాట తమ ప్రాంతంలో ఉన్న వందేళ్లనాటి సామాజిక జీవితాల్ని అవసరాలనుండి పుట్టిన ఆచారాల్ని, వాటిని పాటించే విషయంలో ఓ కుటుంబం అనుభవాల్ని మానవీయకోణంలో ఆవిష్కరించడం జరిగింది.
తిరుచెంగోడులోని అర్థనారీశ్వర ఆలయంలో రథోత్సవం పండుగనాడు రాత్రివేళ సంతానం లేని స్త్రీలు పరపురుషునితో జతకట్టి పిల్లలను కనేవారని, వారిని దైవప్రసాదంగా భావించేవారని తను విన్న కథల ఆధారంగా ఈ నవలలో కొన్ని సన్నివేశాలు మురగన్ కల్పించారు. కాళి భార్య అయిన పొన్న ఇలా సంతానం పొందడానికి సిద్ధపడుతుంది.
బదనాం చేసిన వైనం
ఏనాటినుంచో మురుగన్ రచనలపై కాపుగాచి వేటువేయాలని చూస్తున్న మత ఛాందస మూకలకు మారిన రాజకీయ చిత్రం ఊతమిచ్చింది. డిసెంబర్ 2014 చివరిరోజుల్లో పెరుమాళ్ అక్షరానికి కళ్లెం వేయాలని కుట్ర రచించబడింది. పుస్తకాన్నంతా వదిలేసి రథోత్సవం నాడు సంతానం కోసం స్త్రీలు పరపురుషుని సంపర్కం కోసం సంచరిస్తారన్న వాక్యాలున్న పేజీలను వేల కాపీలు ముద్రించి తిరుచెంగోడులో ఓ జాతర రోజున పంచిపెట్టారు. చౌరస్తాలో గోళీసోడా అమ్మేవాని కొడుకైన మురుగన్ మన కులగౌరవాన్ని మంట గలుపుతున్నాడంటూ అక్షరం విలువ తెలియనివారిని ఎగదోశారు. నడిరోడ్డుపై పుస్తక ప్రతులను తగలబెట్టారు. అవునంటే అవునంటూ జమగూడిన జనంతో ఊరేగింపులు, ధర్నాలు చేపట్టారు. ఎడతెరపు లేకుండా మురుగన్‌కు బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయి. వాట్సాప్‌లో వ్యతిరేక మేసేజ్‌లు పోస్టుఅయ్యాయి. తిరుచెంగోడులో దిష్టిబొమ్మ దగ్ధాలు, బంద్‌లు వరుసకట్టాయి.
పుట్టి పెరిగిన ఊర్లో గురువుగా వందలాది విద్యార్థుల గౌరవం అందుకున్న చోట.. తలతీసేసినట్లు జరుగుతున్న ఈ తంతు మురగన్‌ను తీవ్రంగా కలిచివేసింది. ఏకంగా నమ్మక్కల్ జిల్లాలోనే ఈ గొడవ శాంతిభద్రతల సమస్యగా పరిణమించింది. నమ్మక్కల్ జిల్లా రెవెన్యూ అధికారిణి ఆర్.సుబ్బలక్ష్మి శాంతి సంరక్షణలో భాగంగా తిరుచెంగోడులో ఇరుపక్షాలతో 11-1-2015 నాడు ఓ సమావేశాన్ని ఏర్పాటుచేసింది. మురుగన్ రాతపూర్వకంగా క్షమాపణ తెలిపితే తప్ప ఈ అల్లరి చల్లారదని ఆయనపై ఒత్తిడి పెరిగింది. అప్పటికే తీవ్ర మనస్తాపంతో ఉన్న మురుగన్ వారి మాటను అంగీకరించక తప్పలేదు.
ఫేస్‌బుక్‌లో..
15-1-2015 నాడు తన రచనలన్నీంటినీ ఉపసంహరించుకుంటున్నానని, పుస్తక విక్రయ కేంద్రాల్లో తన పుస్తకాలు అమ్మవద్దనీ, ఇక నుండి రచయితగా కూడా కొనసాగనని ప్రకటించాడు. అంతేకాకుండా, మురుగన్ తన ఫేస్‌బుక్‌లో, ''రచయిత పెరుమాళ్ మురుగన్ చనిపోయాడు. ఆయన దేవుడు కాదు కాబట్టి పునర్జన్మ ఉండదు, ఇక నుండి పి.మురగన్ అనే ఉపాధ్యాయుడు మాత్రమే బతికి ఉంటాడు'' అని పోస్టు చేశాడు. ఈ వాక్యాలు చదివిన రెవెన్యూ అధికారిణి సుబ్బలక్ష్మి రాత్రంతా నిద్రపోలేకపోయానని చెప్పుకుంది. ఇలా ప్రపంచంలో ఏ రచయితా ప్రకటించి ఉండక పోవచ్చు.
ఆయనపై జరిగిన మానసిక, శారీరక దాడిని పెద్దగా పట్టించుకోని మీడియా ఆయన ప్రకటనను, పోస్టింగును సంచలన వార్తగా ప్రచారం చేసింది.
దేశ వ్యాప్తంగా ప్రగతిశీల రచయితలు మురుగన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఆయనకు జరిగిన అవమానాన్ని నిరసిస్తూ. ప్రకటనలు జారీ చేసి మద్దతుగా సభలు సైతం ఏర్పాటు చేశారు.
హైదరాబాద్‌లో సైతం జనవరి 2015 చివరి వారంలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో 'ఎరుక' అనే సాహితీసంస్థ పెరుమాళ్ మురుగన్‌కు మద్దతుగా సమావేశం ఏర్పాటు చేసింది. అందులో ప్రొ||జయధీర్ తిరుమల్‌రావు, పత్రికా సంపాదకులు ఎస్.వీరయ్య, రచయిత పసునూరి రవీందర్ మురుగన్ పట్ల జరిగిన సంఘటనల్ని తీవ్రంగా ఖండించారు. అయితే అంశాల తీవ్రత పరంగా కాకుండా సంస్థలను చూసి సమావేశాలకు హాజరయ్యే అలవాటున్న మన రచయితలకు పుస్తక ప్రియులకు ఆ సమావేశం కంటి కానలేదు. అతి తక్కువ హాజరుతో ఆ కలయిక తెలుగు రచయితల్లో ముసుగుతన్నిన ప్రగతి కాముకతకు అద్దంపడుతుంది.
కోర్టుకెక్కిన సంప్రదాయవాదులు
హిందుమతతత్వవాదులు మురుగన్‌ను వెంటాడడం మానుకోలేదు. ఐపిసిసెక్షన్ 292 కింద మురుగన్‌ను అశ్లీల రచయితగా ప్రకటించి, ఆయన రచనలను నిషేధించాలని వారు చెన్నై హైకోర్టులో దావావేశారు. వ్వవహారం కోర్టుకు వెళ్లడంతో మురుగన్ మరింత కుంగిపోయాడు. కోర్టు నోటీసుకు జవాబుగా మురుగన్ తన ఆఫిడవిట్‌లో..నవలలో అభ్యంతరకరంగా పేర్కొన్న సన్నివేశాలు, పుటలు తొలగిస్తానని, తిరుచెంగోడు పేరును మార్చుతానని, తన రచనల ద్వారా ఎవరి మనోభావాలు దెబ్బతీయనని పేర్కొన్నాడు. మధోరుభగన్ ఆంగ్ల అనువాదాన్ని ప్రచురించిన పెంగ్విన్ సంస్థ తరపున న్యాయవాదిగా పౌరహక్కులనేత వి.సురేష్ మురుగన్ కోసం కోర్టులో వాదించాడు.
కోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తే తను, తన కుటుంబం మరెన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందోనని మురుగన్ చింతిస్తున్న వేళ- కోర్టు తీర్పు పూర్తిగా మురుగన్ రచనలను సమర్థించింది.160 పేజీల్లో సోదాహరణంగా ఉన్న ఈ తీర్పు మురుగన్‌కే కాకుండా గతితార్కిక దృక్పథం గల రచయితలందరికి కొండంత గుండె ధైర్యాన్ని ఇచ్చింది.
అశ్లీలత, దేశ సమగ్రతకు ముప్పు, రాజ్యాంగ వ్యతిరేకత రచనలను నిషేధించే అధికారం ప్రభుత్వానికుంది. ఆయా పుస్తకాలను పూర్తిగా చదివి, అభ్యంతరకర అంశాలపై కూలంకుషంగా చర్చించిన మీదటే వ్యతిరేక లేక నిషేధ నిర్ణయాన్ని తీసుకోవాలి. అంతే కాని తమకు నచ్చని విధంగా రాశాడన్న కోపంతో రచయితను మానసిక క్షోభకు, శారీరక హింసకు గురిచేసే హక్కు ఎవరికీలేదు.
ఒక పుస్తకం చదవాలా వద్దాని నిర్ణయం తీసుకునే అవకాశం పాఠకుడికి ఉంది. పుస్తకం నచ్చకపోతే విసిరిపారేయండి. ఒకరికి సరైనది మరొకరికి కాకపోవచ్చు. పుస్తకాన్ని పూర్తిగా చదవకుండా రచయిత దృష్టికోణాన్ని పట్టుకోకుండా అక్కడొక వాక్యం, ఇక్కడొక వాక్యం ఎత్తి చూపుతూ పుస్తకాన్ని అంచనా వేయడం తప్పు.
మురగన్ నవలలో సెక్షన్ 292 కింద చర్యలు తీసుకోవలసిన అంశం ఏదీలేదు. భారతీయ పురాణాల్లో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఒక కల్పిత రచనలో జనపదంలో ప్రచారం ఉన్న ఓ సాంప్రదాయ విషయాన్ని పాత్రల పరంగా, కథాపరంగా ప్రస్తావించడంలో తప్పేమీలేదు, పైగా ఓ పుస్తకాన్ని చదివి నొచ్చుకోకుండా ఉండడం చాలా సులభం, ఆ పుస్తకాన్ని మూసివేస్తే చాలు అన్న రచయిత సాల్మన్ రష్డీ వ్యాఖ్యను తీర్పులో ఉదహరించారు న్యాయమూర్తులు. రాజ్యంగంలోని 3వ విభాగం ప్రకారం పౌరుల ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 19 పౌరులందరికీ భావప్రకటనా స్వేచ్ఛను ప్రసాదించింది. 'రచయిత పెరుమాళ్ భయపడవలసిన అవసరంలేదు. అతను రాయాలి. తన రచనా, వస్తు పరిధిని పెంచుకోవాలి'' అని తీర్పు చివరి వాక్యం ద్వారా ఆయన వెన్నుతట్టారు న్యాయాధీశులు.
కోర్టు తీర్పు అనంతరం మురుగన్ ''ఒక భారీ విస్ఫోటనం తర్వాత పువ్వు మళ్ళీ వికసిస్తోంది, మరింత మెరుస్తూ, మరిన్ని పరిమళాలను వెదజల్లుతుంద''ంటూ కవితాత్మకంగా స్పందించాడు.
ఈ సంచలన తీర్పు ప్రగతిశీల రచయితలను ఉత్సాహపరచింది. హిందూవాద ప్రభుత్వం దేశాన్ని ఏలుతున్న సమయంలో ఈ తీర్పు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.
జస్టిస్ సంజరు కిషన్ కౌల్
ఈ సందర్భంగా జస్టిస్ సంజరు కిషన్ కౌల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ప్రముఖ చిత్రకారుడు ఎమ్.ఎఫ్ హుసేన్ వేసిన చిత్రంపై వచ్చిన కేసును కొట్టివేశారు. హుసేన్ భారతమాత చిత్రాన్ని నగంగా వేశారంటూ ఆయనపై వేసిన పిటిషన్‌కు తీర్పునిస్తూ చిత్రకారుడి సృష్టిని ఓ బొమ్మగా కాకుండా అందులోని భావాన్ని పట్టుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. 90 ఏళ్ల పెయింటర్ ఇంట్లో కూచొని హాయిగా తనకు నచ్చిన బొమ్మలను క్యాన్వాసుపై వేసుకోవచ్చని తీర్పు ముగించారు. అయినా తనపైన పెరుగుతున్న ఒత్తిడిని ఇష్టపడక ఎమ్.ఎఫ్ హుసేన్ భారతదేశాన్ని వీడి లండన్‌లో నివసిస్తూ అక్కడే 2011లో మరణించారు. జస్టిస్ ఎస్.కె.కౌల్ చెన్నై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండడం వల్లే మురగన్ బతికిపోయాడంటే ఎవరూ కాదనలేరు. ఎందరు న్యాయనిర్ణేతలు ప్రజాస్వామిక దృక్పథంతో ఉంటారు! కోర్టు తీర్పులే రచయితలను రక్షించాలనంటే వారి రచనలు చదివిన వారి బాధ్యత ఏమిటి? తోటి రచయితను కాకుల్లా పొడుస్తున్నా చూసీ చూడనట్లుగా నటించడమేమిటి? ఇట్లాగయితే సామాజిక ప్రయోజనం చేకూర్చే రచనలు రావడం తగ్గిపోతుంది. ప్రగతి నిరోధక శక్తులు పెచ్చరిల్లి చరిత్రను లిఖిస్తాయి.
రచనలపై, పుస్తకాలపై ప్రజాస్వామ్య బద్ధంగా నిరసనలు తెలియజేయవచ్చు. కేవలం మతపరమైన విశ్వాసాల ప్రాతిపదికన నిరసనకు దిగకూడదు. వాటిపై తర్కబద్ద చర్చ జరగాలి. అప్పుడే ఇరుపక్షాలు రాజ్యాంగం ఇచ్చి భావ ప్రకటనా స్వేచ్ఛను సమర్థవంతంగా వాడుకున్నట్లవుతుంది.
మురుగన్ లాగే తమరచనలపై అనవసరపు రాద్ధాంతాన్ని ఎదుర్కొన్న రచయితలు ఇంకా ఉన్నారు. సాల్మన్ రష్డీ నవల 'సెటానిక్ వర్సెస్'ను ఇరాన్ కన్నముందే మన దేశం 1988లో నిషేధించింది. టైమ్ మ్యాగజైన్ ఎంపిక చేసిన అత్యుతమ 50 మంది ఆంగ్లరచయితల్లో రష్డీ ఒకరు. అందులో ఆయన స్థానం పదమూడు అటువంటాయన మ్యాజిక్ రియలిజం ప్రక్రియలో రాసిన ప్రముఖ నవలగా 'సెటానిక్ వర్సెస్' ప్రశంసలందుకుంది. సోషియో ఫాంటసీ ప్రధానంగా రాసిన ఈ నవలలో ఇద్దరు మిత్రుల మధ్య చర్చలో మత ప్రస్తావన వస్తుంది. అదొక్కటే ఈ నిషేధానికి కారణం.
బంగ్లా రచయిత్రి తస్లీమా నస్రీన్ తన 'శోధ్' నవల తెలుగు అనువాదం ఆవిష్కరణ సభకు రాగా హైదరాబాద్‌లో కొందరు ఛాందసవాదులు దానిని భగం చేశారు. ఆగస్టు 2007లో జరిగిన ఈ సంఘటనలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ ఫర్నిచర్ ధ్వంసంతో పాటు రచయితలపై పాత్రికేయులపై దాడి జరిగింది. రచయితలు, అభిమానులంతా చక్రవ్యూహంతో రచయిత్రిని కాపాడడం కష్టసాధ్యమైంది. పోలీసులు నలుగురిని అరెస్టు చేసి వదిలిపెట్టారు.
రోహిన్‌టన్ మిస్త్రీ బొంబాయిలో పుట్టి పెరిగి కెనడాలో స్థిరపడ్డ రచయిత. ఆయన రాసిన 'సచ్ ఎ లాంగ్ జర్నీ' బొంబాయి యూనివర్సిటీ బి.ఎ.విద్యార్థులకు పాఠ్యగ్రంథంగా ఉండేది. బొంబాయి సెయింట్ జేవియర్ కాలేజీలో బి.ఎ.చదువుతున్న బాల్‌థాకరే మనుమడు ఆదిత్యథాకరే ఈ పుస్తకంలో తనతాత బాల్‌థాకరే గురించి తప్పుగా రాశారని ఫిన్సిపల్‌కు ఫిర్యాదు చేశాడు. బొంబాయి యూనివర్సిటీ ఉపకులపతి తన విశిష్ట అధికారాలను ఉపయోగించి వెంటనే ఆ పుస్తకాన్ని సిలబస్‌లోంచి తొలగించాడు. ఈ తొలగింపు 2010లో జరిగింది. ఎందుకని అడిగే దిక్కేలేదు.
రచయితలను, వారి రచనలను అడ్డుకుంటే సమాజ అభివృద్ధి కుంటుపడుతుంది. కాలంతో పాటు సమాజమూ మారాలి. మత విశ్వాసాలు ఉండొద్దని ఎవరూ అనడంలేదు. కానీ మూఢవిశ్వాసాలను ఎత్తి చూపి, చరిత్ర నగ స్వరూపాన్ని వెలికి తీసి చూపేవారి హక్కులను కాలరాసి హింసించడం క్షమించరాని నేరం. ''మళ్ళీ వికసిస్తున్న పువ్వు పరిమళాలను'' ఆఘ్రానించడానికి దేశం యావత్తూ ఎదురుచూస్తోంది. అదే సమయంలో మరో దాడికి సంప్రదాయవాదులూ కాచుకొని కూర్చున్నారు. అప్రమత్తంగా ఉండాల్సింది మాత్రం మీరు, నేను.. మనందరం!
రచయిత సెల్ :9440128169
స్వాతంత్య్రానికి ముందు
పుస్తకాల నిషేధమనేది ఈ మధ్య మొదలైంది కాదు. దానికీ చరిత్రుంది. స్వాతంత్య్రానికి పూర్వం కూడా బ్రిటీష్ ప్రభుత్వం చేతిలో పలు పుస్తకాలు ఈ అగౌరవం పొందాయి.
1920లో వచ్చిన ఉర్దూ చిరుపొత్తం 'రంగీలా రసూల్' మహ్మద్ ప్రవక్తపట్ల అసభ్యకర సన్నివేశాల చిత్రణ ఉందన్న కారణంగా 1924లో నిషేధింపబడింది.
ఇదేరకంగా సాజిద్ జహీర్ మరో ముగ్గురు రచయితలతో కలిసి 1932లో ప్రచురించిన 'అంగార్' అనే కథల సంపుటి కూడా ముస్లిం మత పెద్దల కోరికమేరకు 1933లో బ్రిటిష్ ప్రభుత్వం నిలిపివేసింది.
బ్రిటిష్ పాలనను వ్యతిరేకించిన బయటి దేశ పుస్తకాలను కూడా మన కంటపడనీయలేదు. ప్రసిద్ధ అమెరికన్ చరిత్రకారిణి కేథరిన్ మాయో 1927లో రచించిన 'మదర్ ఇండియా' ను భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. 1926లో భారతదేశాన్ని సందర్శించిన ఈ రచయిత్రి గాంధీ పోకడలను తప్పుపట్టింది. 1936లో ఈ పుస్తకం మనదేశంలో నిషిద్ధమైంది.
స్వతంత్ర భారతంలో...
దేశ స్వాతంత్య్ర అనంతరం కూడా పలుపాకిస్తానీ రచయితల పుస్తకాలను భారత ప్రభుత్వం అడ్డుకొంది. భారత హిందూ పురాణాల పాత్రలపై, ముస్లిం మత విశ్వాసాలపై వచ్చిన కొన్ని బయటి దేశాల రచయితల పుస్తకాలను మనదేశం నిరాకరించింది.
ఐరిష్-ఇండియన్ దంపతుల సంతానమైన ఏబ్రారు మెనెన్ 1954లో రాసిన 'రామాయణ' స్వతంత్రభారతం నిషేధించిన తొలిపుస్తకాలలో ఒకటి. ఇదే క్రమంలో 'డార్క్ ఆర్ట్', 'కాప్టివ్ కాశ్మీర్' అనే బయటి పుస్తకాలను వివిధ కారణాల వల్ల దేశంలోకి అనుమతించలేదు.
టైమ్ మ్యాగజీన్‌కు ఢిల్లీ కరెస్పాండెంట్‌గా పనిచేసిన అలెగ్జాండర్ క్యాంప్ బెల్ రాసిన 'దిహార్ట్ ఆఫ్ ఇండియా' కూడా 1959లో నిషేధానికి గురయ్యింది. భారత దేశంలోని పాలనను, ఆర్థిక వ్యవస్థ విధానాలను తప్పుపడుతూ వ్యంగ్యవ్యాఖ్యానం ఈ పుస్తకంలో ఉండడమే ఇందుకు కారణం.
ఇదే రకంగా 'నైన్ అవర్స్ టు రామా' అనే పుస్తకాన్ని 1962లో నిషేధించింది. అమెరికన్ ప్రొఫెసర్ స్టాన్లీ ఓల్‌పెర్ట్ రాసిన ఈ పుస్తకంలో గాంధీని చంపిన గాడ్సే పట్ల సానుకూలత, రక్షణ వ్యవస్థ వైఫల్యం ప్రస్తావించబడ్డాయి.
బెట్రెండ్ రస్సెల్ సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన ప్రసిద్ధ రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి. 1962లో జరిగి భారత చైనాయుద్ధం నేపథ్యంగా రస్సెల్ రాసిన 'అన్‌ఆర్మ్‌డ్ విక్టరీ' మనకు నిషిద్ధ గ్రంథం.
భారత సంతతికి చెంది వి.ఎన్.నైపాల్ ట్రినిడాడ్ నివాసి. ఈ ఆంగ్ల రచయిత నోబెల్ పురస్కార గ్రహీత కూడా.1960 పూర్వ దశకంలో భారతదేశాన్ని సందర్శించిన ఈ రచయిత 1964లో 'ఎన్‌ఏరియా ఆఫ్ డార్క్‌నెస్' అనే ట్రావెలోగ్‌ను రాసాడు, మన దేశంపై, ప్రజలపై దుర్భావనలు ప్రకటించిన ఈ పుస్తకం వెంటనే ఇక్కడ నిషేధింపబడింది.
- బి.నర్సన్
Sat 16 Jul 18:21:35.311386 2016