Sat 31 Dec 12:04:11.498152 2016
Authorization
కాల యవనికపై మరో నూతన సంవత్సరం ఆవిష్కారమవుతున్న సందర్భం. కొత్త ఆశలు మోసులెత్తుతున్న సన్నివేశం. సంతోషాతిరేకాలతో 2017 సంవత్సరానికి స్వాగతం పలికిన సమయం. మరో ఏడాది గడిచిపోయిందన్న చింత కన్నా, కొత్త ఏడాదిలోకి అడుగిడామన్న ఆనందమే అంతటా పల్లవిస్తున్న చిత్రమైన దృశ్యం. ఆగామి కాలానికి స్వాగతం పలకడం అనివార్యం. అయితే కొత్త సంవత్సరంలోనైనా పాత కష్టాలు తీరుతాయా అన్నదే సందేహం. కొత్త క్యాలెండర్ రావడం కాదు, జీవితం నవనవోన్మేషమైన అనుభవాలతో సంతరించుకుంటుందా అన్నదే ముఖ్యం. కష్టాల గాథలు పునరావృతం కాకుండా ఉంటాయా అన్నదే అసలు ప్రశ్న.
శతాబ్దాల మానవ జీవితమంతా ఒక పునరుక్తి అంటారు ఓ తత్వవేత్త. మానవ ప్రయాణాన్ని గమనిస్తే చరిత్ర అనేకానేక సందర్భాలు పునరావృతం కావడం చూస్తున్నాం. పునరుక్తి ఉండొచ్చు కానీ నవ్యత లేదనలేం. కష్టాలు, సుఖాలు, ఆనందాలు విషాదాలు మేళవించి ఉండటం సహజం. వీటన్నిటిని కలుపుకొని కాలం సాగిపోతుంటుంది. ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎంతగా మానవ హననం సంభవించినా, సముద్రాలు ముంచెత్తినా, భూకంపాలు కకావికలం చేసినా కాలం ప్రవహిస్తూనే ఉంటుంది.
నిశ్చల నిశ్చితాలు అంటూ ఏవీ ఉండవని కాలగతిని గమనిస్తే తెలుస్తుంది. ఒక దశ నుంచి మరో దశకు మానవ ప్రయాణం సాగుతూనే వుంది. కానీ అభివృద్ధి పేరిట జరుగుతున్న పర్యావరణ విధ్వంసం, ధరణి ఉనికినే సవాల్ చేసే సంక్షోభాలు మానవ మనుగడని ప్రశ్నార్థకం చేస్తున్నాయని ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించడం గమనార్హం. శాస్త్ర, సాంకేతిక రంగాల పురోగతి భూమ్మీద మానవ జీవనాన్ని మరింత సౌకర్యవంతం, సులభతరం చేయాలి. కానీ అసమానతలు, ప్రకృతి గమనాన్ని మార్చేసే విపరీత పోకడలు భూమి ఉనిక్కి ప్రమాదంగా పరిణమించడం ఆందోళనకరం.
సహజసిద్ధమైన ప్రకృతి చక్రాన్ని ధ్వంసం చేసే పారిశ్రామికీకరణ వైపరీత్యాల గురించి ప్రకృతి తత్వవేత్త మసనోబు ఫుకుఓకా ఏనాడో చెప్పారు. వ్యవసాయం వాణిజ్యజూదంగా మారడంలోని విపత్తుల్ని 'గడ్డిపరకతో విప్లవం' పుస్తకంలో వివరంగా చర్చించారు. ఆహార పంటల కన్నా వాణిజ్యపంటలకు ప్రాధాన్యమివ్వడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించారు. ఈ ప్రశ్నల ప్రాసంగికత ఇప్పుడు మరింత స్పష్టంగా అర్థమవుతోంది. కూడు, గూడు, గుడ్డ వంటి మౌలికావసరాల్ని తీర్చలేని పాలనావ్యవస్థల ముందు ఇంకా అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. వీటిని ఈ కొత్త సంవత్సరంలో మరింత ఎక్కువగా ఎదుర్కొవడం తప్పనిసరి. అభివృద్ధికి మానవముఖం ఉండడమే కాదు, అభివృద్ధి ఫలితాలు అందరికీ సమంగా అందాలి. లేనట్టయితే వందేళ్ళ కిందటి మాదిరిగా మహా విప్లవాలు మళ్ళీ తలెత్తుతాయి. ఎందుకంటే చరిత్ర పునరావృతమవుతుందనే మాట నిజం కనుక.