Sat 03 Jun 15:35:45.469209 2017
Authorization
సాహిత్యమే జీవితంగా, జీవితమే సాహిత్యంగా కడవరకు జీవించిన అద్భుతమైన సృజనశీలి ఆరుద్ర (31 ఆగస్టు 1925-04 జూన్ 1998) వర్థంతి ఈరోజు. తెలంగాణ సాయుధ పోరాటం ప్రేరణతో 23 సంవత్సరాల వయసులోనే 'త్వమేవాహం' (1948) కావ్యాన్ని రచించిన ఆరుద్రని తెలుగు సమాజం, ప్రత్యేకించి తెలంగాణ సమాజం గుర్తు చేసుకోవాలి. తన 73 ఏళ్ళ జీవితంలో అర్ధ శతాబ్దానికి పైగా నిరంతరం రచనలు చేసిన మనీషి. కవిత్వం, కథలు, నవలలు, నాటికలు, విమర్శ, పరిశోధన, సినిమా పాటలు అనేకం రచించారు. ఆధునిక సమగ్రాంధ సాహిత్యచరిత్ర 14 సంపుటాలు రచించడం చిన్న విషయం కాదు. తెలంగాణ సాహిత్యచరిత్రకు దీనిలో తగిన స్థానం దక్కలేదన్నది నిజమే అయినప్పటికీ ఇలాంటి చరిత్ర రచనకు పూనుకొని నిర్వహించడం సామాన్య విషయం కాదు. విస్తృతమైన పరిశోధన, విస్తారమైన అధ్యయనం ఆరుద్ర నుంచి నేర్చుకోవాల్సిన అంశం. అలుపెరగని సాహిత్యకారుడు ఆరుద్ర.
'రాముడికి సీత ఏమవుతుంది?, గుడిలో సెక్స్, వేమన్నవాదం' వంటి రచనలు చేయడం కోసం ఆరుద్ర ఎంతగా పరిశ్రమించాడో చెప్పలేం. దాదాపు నాలుగు వేల సినిమా పాటలు రాశాడు. నాటికలు రచించాడు. అందమైన అనువాదాలు చేశాడు. సాహిత్య, సాహిత్యేతర అంశాలపై వందలాది వ్యాసాలు రచించిన ఆయన ప్రజ్ఞ అమేయమైంది. కవిత్వంలో కూనలమ్మ పదాలు, ఇంటింటి పద్యాలు, ఎంచిన పద్యాలు, శుద్ధ మధ్యాక్కరలు వంటివి ఎన్నో రచించారు. ఇక అభ్యుదయ రచయితల సంఘం వ్యవస్థాపకులలో ఒకరిగా ఉన్నారు. అభ్యుదయ సాహిత్యోద్యం కోసం చివరిదాకా నిలబడ్డారు. యవ్వనప్రాయంలో నమ్మిన విలువలనే అంతిమక్షణం దాకా శిరోధార్యంగా భావించారు. ఎక్కడా జారిపోలేదు. విశ్వాసాల్ని వదులుకోలేదు. విలువల్ని విస్మరించలేదు. ప్రజల పక్షాన, ప్రజా ఉద్యమాల పక్షాన నిలబడి మాట్లాడారు. మాటకీ చేతకీ అంతరం లేని జీవితాన్ని గడిపారు. మరీ ముఖ్యంగా నిత్యమూ నిరంతరమూ అధ్యయనంలో, వ్యాసంగంలో మునిగి తేలడం ఆరుద్ర జీవితంలోని గొప్పదనం.
కవిగా, రచయితగా బతకడమంటే ఎలా ఉండాలో ఆరుద్ర నుంచి నేర్చుకోవాలి. రచన పార్ట్‌టైమ్ వ్యవహారం కాదు, అది జీవితకాలపు సృజనాత్మక కలాపం. విశ్రమించడానికి వీల్లేని రంగం. ఇష్టపూర్తిగా అంకితమై ఈదులాడాల్సిన సముద్రం సాహిత్యం. ఈ ఈదులాటలో ఆరితేరిన నైపుణ్యం గల సృజనశీలి ఆరుద్ర. ఎన్నెన్ని ప్రయోగాలు చేశాడో చెప్పనలవి కానిది. ఏదో ఒక ప్రక్రియకు పరిమితం కాలేదు. అనేకానేక ప్రక్రియల్ని చేపట్టి నిర్వహించడం సృజనశీలి ప్రతిభని సానబెడుతుంది. కార్యరంగాన్ని విస్తరించుకోడానికి వీలవుతుంది. ఇందుకు తార్కాణం ఆరుద్ర జీవితం.
ఇవాళ సాహిత్యరంగంలో ఉన్నవారు ఆరుద్రని చదవాలి. ఆరుద్ర సృజనాత్మక కృషిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రధాన స్రవంతి ఆలోచనలకు భిన్నంగా మరోచూపును సంతరించుకొని లోకాన్ని పరికించాలి. పాలకవర్గాల ప్రలోభాలకు లొంగకుండా ప్రజల పక్షాన నిలిచి నిజాయితీగా వ్యవహరించాలి.