Sat 18 Jul 18:01:46.701479 2015
Authorization
కొత్తదనం, వినూత్నం, నవీనత, నిత్యనూతనం వంటి పదాలు కేవలం వర్ణన కోసం నిర్దేశించలేదు. ఇవన్నీ దైనందిన జీవితంలో ప్రతిఫలించాలి. అప్పుడే జీవితం నవనవోన్మేషంగా ఉంటుంది. మనం చేస్తున్న పనిలోనూ ఇవి ప్రస్పుటం కావాలి. రోజూ చేసే పనినే కొత్తగా చేయాలి. సరికొత్తగా సృజించాలి. పరిపూర్ణత కోసం తపించాలి. అలాంటప్పుడే వ్యక్తిగత జీవితంలోనూ, సామాజిక కార్యకలాపాల్లోనూ సిసలయిన సృజన వికసించడం సాధ్యం. ముఖ్యంగా సాహిత్య, కళారంగాల్లో అసలుసిసలు దనం చూపాలి. కాపీ కొట్టడం, అనుకరించడం చేస్తూనే ఒరిజినాలిటీ అని చెప్పుకోవడం భావదారిద్య్రం.
'ఎవరి నుంచయితే దొంగిలించామో వారిని క్షమించడం కష్టం' అంటారు చలం. ఈవిధంగా మనుషుల నైజాన్ని వ్యక్తం చేశారు. ఇతరుల భావాలని స్వీకరించినప్పుడు, తమ అవసరాలకు అనుగుణంగా వాడుకున్నప్పుడు మూలకర్తని ఉదహరించాలి. కానీ తామే సృజించామని చెప్పడం, తిమ్మినిబమ్మిని చేసే ఎత్తులు వేయడం రసహీనం. ఒరిజినాలిటీకి విరుద్ధం. తమదయిన సొంత గొంతుకనీ, శైలినీ ప్రదర్శించకుండా అరువు తెచ్చుకున్న టెక్నిక్‌తో జిమ్మిక్కులు చేయడం గారడీతనం. అయినా దానినే మహత్తరం, అద్భుతమని ప్రచారం చేసుకోవడం సాహిత్య కళారంగాల్లో పెరుగుతున్న రసహీనతకు నిదర్శనం.
అనువాదం, అనుసృజనలతో పేచీలేదు. కానీ ఒక పుస్తకంలోని కొన్ని భాగాల్ని యధాతథంగా తీసుకొని సొంత రచనగా చెప్పుకుంటే దొంగతనం చేసాడంటాం. నలుగురి కవితల్లోని కొన్ని కవితాపాదాలు తీసుకొని ఓ కవితగా రాసి చెలామణి చేస్తే దొంగతనంగా, నీచమైన పనిగా పరిగణిస్తాం. ఈ సూత్రం సినిమాలకి సైతం వర్తిస్తుంది. కథ కావచ్చు, సంభాషణలు కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు... ఏది ఎక్కణ్నించి తీసుకున్నా మూలకర్తని ఉటంకించకపోతే దొంగతనమే అవుతుంది. ఈవిధంగా కాపీ కొట్టడం, దొంగిలించడమే గాక దానిని తమ సొంత ప్రతిభగా, తమదైన సృజనాత్మక అద్భుతంగా చెప్పుకోవడం సంస్కార రాహిత్యం. సారహీనతకు చిహ్నం.
కొట్టేయడం అలవాటుగా మారాక, సొంత గొంతుకనీ, సొంత బాణీనీ సంతరించుకోడానికి ప్రయత్నించరు. దొంగిలించడమే సౌఖ్యమని తలపోస్తారు. అంతటితోనే ఆగరు. అదే ఒరిజినాలిటీగా, తమదైన సృజనగా చెలామణి చేసుకోడానికి ప్రయత్నిస్తారు. ఈరకమైన దుస్థితిలో కొట్టుమిట్టాడే ఇవాళ్టి తెలుగుసినిమాలో నూతనత్వం, వినూత్నం, కొత్తదనం అనే పదాలకు చోటు లేదు. అలనాటి చిత్రాల్లోనే వీటి ఆనవాళ్ళు కనిపిస్తాయి. అందువల్లనే ఒక మిస్సమ్మ, ఒక రోజులు మారాయి లాంటి చిత్రాలని క్లాసిక్స్‌గా పరిగణించి సగర్వంగా చెప్పుకుంటాం. సొంతదనం కోసం, పరిపూర్ణమైన సృజనావిష్కారం కోసం తపన చెందిన వారి కృషిని తలుచుకుంటాం. వారి నుంచి స్ఫూర్తిపొందే తరం ఎక్కడన్నదే ఇప్పటి ప్రశ్న.