Sat 18 Jul 19:14:55.922516 2015
Authorization
స్టేట్ తో మనకు పనేంటి?
స్టేట్ ధిక్కారమే మన పని కదా
పాలకులు మారితే మనకేంటి?
మనం పాలితుల పక్షం కదా
విభజన రేఖలతో సంభోగం
మట్టికి సంతోషమే
కానీ మనం గీతల్ని చెరిపే
రాతల రాయుళ్ళం కదా
ఉషోదయం అందరికీ ముద్దే
రాకాసి రాత్రుల మీద
దండయాత్ర కదా మనకి సంబరం
యుద్ధానంతర విశ్రామం స్వార్థపరులకే
కలల కత్తులతో కలతిరిగే
వీరులకు విశ్రాంతి ఎక్కడీ
ఏ గడ్డమీద ఎవరున్నా
మట్టిబిడ్డల కోసం పోరు నడపాల్సిందే కదా
శ్రీకాకుళంలో పక్షులు నవ్వితే
ఆదిలాబాద్‌లో అడవి ఆడాల్సిందే
అనంతపురంలో కలం కదిలితే
కరీంనగర్‌లో అక్షరం పొడవాల్సిందే
కులాలు.. మతాలు.. ప్రాంతాలు
ఎవరి అస్త్రాలైతే మనకెందుకు
మన విల్లంబులు జనం కదా
చీల్చడం వాళ్ళ వృత్తి కావచ్చు
గోడల్ని కూల్చడం మన ప్రవృత్తి కదా
మనమెట్టా విడిపోతాం
ఖండాలుగా నరికినా
ఖండాతరాలకు విసిరినా
అక్షరాల చేతులతో అల్లుకుపోతాం
పాటల తోటల్లో మనల్ని మనమే జల్లుకుపోతాం
రంగుల లోయల్లో పెనవేసుకుపోతాం
ప్రాంతాల మధ్య బట్వాడా మనుషులకే గాని
కలాలకూ గళాలకూ కాదు
వాళ్ళ వలల్లో మనమెందుకు పడిపోతాం
అసలెందుకు విడిపోతాం
(రాష్ట్రాలు విడిపోవచ్చు కాని కవులూ కళాకారులూ విడిపోకూడదు)
- ప్రసాదమూర్తి, 8498004488