Sat 12 Aug 14:23:43.484966 2017
Authorization
ఈవారం కవర్ స్టోరీ 'దోస్తానా' చదువుతుంటే మా చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో గుర్తుకొచ్చాయి. మళ్లీ ఒక్కసారి బాల్యం తిరిగి వస్తే ఎంత బాగుండు! బాల్యానికి ఈ ప్రపంచం కుళ్లు తెలియదు కాబట్టి కల్మషం లేని స్నేహాలు చిగురిస్తాయి. పెరిగి పెద్దవాళ్లయిన తరువాత సమాజంలోని కుళ్ళు కుతంత్రాల ప్రభావంతో స్నేహితులూ మారిపోవడం నిజమే. ఇక రకరకాల స్నేహాల్లో ఉన్న మర్మం; పైకి స్నేహాన్ని నటిస్తూ లోపల గోతులు తవ్వే స్నేహితుల గురించిన విశ్లేషణా బాగుంది. స్త్రీ పురుషుల మధ్య ఉండే స్నేహం గురించి చెప్పిన విషయాలు బాగున్నా భారతీయ సమాజం ఇప్పట్లో ఇటువంటి స్నేహానికి అంగీకారం తెలపడం కష్టమే అనాలి.
-ఎన్.సురేందర్, పెద్దపల్లి; బి.సూర్యకుమారి, మేడ్చల్;
వి.దాస్ హైదరాబాదు
పోస్ట్‌మేన్ సేవలను గుర్తించి...
ఈవారం కవిత్వంలో వనపట్ల సుబ్బయ్యగారి రచన 'డాక్ సేవక్'లో పోస్ట్‌మేన్‌ల క్లిష్టమయిన డ్యూటీని, వారి ఆదాయ లేమిని, దుర్భర జీవితాలను కండ్లకు కట్టినట్లు తెలియపరిచారు. సమానమైన పనికి సమాన వేతనం, పర్మినెంట్ నేచర్ ఆఫ్ వర్క్‌లో టెంపరరీ, కాంట్రాక్టు లేబర్ ఉండరాదని కోర్టుతీర్పులున్నా... గత డెబ్భరు ఏండ్లుగా వివిధ పార్టీల ప్రభుత్వాలు మాత్రం పోస్ట్‌మేన్‌ల జీవితాలను మెరుగు పరిచింది లేదు. ఎక్స్‌ట్రా డిపార్ట్‌మెంట్ పేరుతో దోపిడీ కొనసాగిస్తున్నారు. ఈ మెయిల్, ఫేస్‌బుక్, వాట్స్ ఆప్, ఇంటర్నెట్ ఛాటింగులు, కొరియర్లు, చరవాణులు, ఎన్నివచ్చినా, ఎంతో అభివృద్ధి చెందిన అమెరికాలో కూడా డాక్ సేవకుల పనిభారం పెరుగుతున్నదే కానీ తరగడంలేదు. కనుక ఇప్పటికైనా పాలకులు పోస్ట్‌మేన్‌ల కీలక బాధ్యతలను, కష్టాలను దృష్టిలో పెట్టుకుని సరియైన వేతనం, ఉద్యోగ భద్రత, పనిపరిస్థితులు, రక్షణలు కల్పించాలి.
-తుమ్మల మోహనరావు, కూకట్‌పల్లి