Sat 12 Aug 14:43:51.238855 2017
Authorization
రవీంద్రుని వివరణ
15 ఆగస్టు, 1947లో భారత దేశం స్వతంత్ర దేశం అయినప్పుడు జాతీయగీతమనేది లేదు. ఇప్పుడు మనం జాతీయ గీతంగా పాడుకుంటున్న 'జన గణ మన' గీతం బెంగాలీ భాషలో 1911లోనే రవీంద్రనాథ్ ఠాగూర్ రచించినప్పటికీ 1950లో కానీ దాన్ని జాతీయగీతంగా పరిగణించలేదు. అయితే రవీంద్రుడు రాసిన ఈ గీతం అప్పట్లో వివాదానికి గురయింది. ఆయన ఈ గీతాన్ని బ్రిటీష్ రాజు 5వ జార్జి కోసం రాశాడనే విమర్శ ఉంది. కాని ఆ ఆరోపణ నిజం కాదని, తన స్నేహితుని కోరికపై రాసిందని పేర్కొన్నారు రవీంద్రుడు.
చేనేత వస్త్రాన్నే వాడాలి!
జాతీయ పతాకంగా పింగళి వెంకయ్య రూపొందించిన నమూనాను స్వీకరించిన భారత ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలను విధించింది. చట్టప్రకారం ఖాదీ వస్త్రం లేదా చేనేత వస్త్రాన్ని మాత్రమే జాతీయ జెండాగా వాడాలి. దీన్ని అతిక్రమించినవారికి మూడేండ్ల జైలు శిక్షతోపాటు జరిమానా కూడా ఉంటుందని చట్టం చెబుతోంది. కానీ ఈ నిబంధనను ఎవరు పాటిస్తున్నారు? ఇప్పుడు అనేక రకాల వస్త్రాలను జాతీయ జెండాగా వాడుతున్నారు.
ఇప్పటికీ ఉత్తేజపరుస్తూ...
భారత దేశ స్వాతంత్య్ర ఉద్యమ సందర్భంగా అతి తక్కువ వయసులో జైలుపాలైన వారు రాణి సరోజ్ గౌరీహర్. ఆమెకు ఆరు నెలల వయసు ఉన్నప్పుడు తల్లి సత్యవతి రావత్‌తో పాటు ఆమెనూ బ్రిటీష్‌వాళ్లు జైల్లో ఉంచారు. ఆ తరువాత ఆమె న్యాయశాస్త్రంలో పట్టాతో పాటు, పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్‌లో డిప్లమో పొందారు. తన టీనేజ్ (1942)లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఇదంతా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగిన కథ.ఇప్పుడు ఎనభైల్లో ఉన్న ఆమె తెల్లగా నెరిసిన జుట్టుతో ఆగ్రావాసులను ఉత్తేజపరుస్తూ కనిపిస్తుంది.
మహిళా రెజిమెంట్‌ని నడిపిస్తూ...
లక్ష్మీ సెహగల్ భారత స్వాతంత్య్ర పోరాటంలో ఆయుధాన్ని పట్టి పాల్గొన్న స్ఫూర్తి ప్రదాత. ఎమ్‌బిబిఎస్ చదివి మద్రాసులో డాక్టర్‌గా కొంతకాలం పనిచేశారామె. వైవాహిక జీవితం విఫలమవ్వడంతో సింగపూర్ వెళ్ళారు. అక్కడ ఇండియా నుంచి వచ్చే వలస కూలీల కోసం ఆసుపత్రి స్థాపించి సేవలందించేవారు. ఈ తరుణంలోనే సుభాస్ చంద్రబోస్ అనుచరులతో ఆమెకు పరిచయం అయింది. బోస్ 'ఆజాద్ హింద్ ఫౌజ్'లో మహిళా విభాగాన్ని ఏర్పాటుకు పిలుపునివ్వడంతో ఆయన సైన్యంలో చేరి మహిళా విభాగం 'రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్'కి కెప్టెన్ హోదాలో నాయకత్వం వహించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటీష్ సేనలతో పోరాడుతూ బర్మాలో శత్రువులకు చిక్కారు.
హీరో భగత్ సింగ్
షహీద్ భగత్ సింగ్‌కి భారత స్వాతంత్య్ర పోరాట యోధుల్లో అగ్ర స్థానం ఉంది. 23 ఏండ్ల వయసులోనే ఎంతో పరిపక్వత సాధించి బ్రిటిష్‌వాళ్ల గుండెల్లో నిద్రపోయాడాయన. 1928లో తన సహచరుడు శివరాం రాజ్‌గురుతో కలిసి లాహోర్‌లో జాన్ శాండర్స్ అనే బ్రిటీష్ అధికారిని కాల్చి చంపాడు. నిజానికి పోలీస్ సూపరింటిండెంట్ జేమ్స్ స్కాట్‌ని చంపాలనుకుని పొరపాటున శాండర్స్‌ని చంపారు.స్కాట్ జరిపించిన లాఠీచార్జి వల్ల ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు లాలా లజపతిరారు కోలుకో కుండా మరణించాడనే కోపంతో ఈ చర్యకు దిగారాయన. ఆ మరుసటి ఏడాది ఏప్రిల్‌లో మిత్రుడు బతుకేశ్వర్ దత్‌తో కలిసి ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై బాంబు విసిరి, గేలరీ నుండి కరపత్రాలు విసిరి 'ఇంక్విలాబ్ జిందాబాద్' నినాదాలు ఇస్తూ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేవరకు అక్కడే ఉన్నారు. అంటే కావాలనే పట్టుబడ్డారన్నమాట. చివరికి బ్రిటీష్‌వాళ్లుఆయన్ని ఇరవై మూడేండ్ల వయసులో మార్చి 1931లో ఉరితీశారు. ఇక్కడ కనిపిస్తున్న భగత్ సింగ్ ఫొటో లాహోర్ రైల్వే పోలీస్ స్టేషన్ దగ్గర రహస్యంగా తీసిన ఫొటో ఇది. 25 అక్టోబర్ 1926లో లాహోర్ దసరా బాంబు సంఘటనతో సంబంధం ఉందనే నెపంతో 1927లో మొదటి సారిగా అరెస్ట్ చేసినప్పుడు (మే 29 నుంచి జులై 4 వరకు) తీసిన చిత్రం ఇది. ఈ పొటోలో కనిపిస్తున్న మరోవ్యక్తి లాహోర్ సి.ఐ.డి డీఎస్పీ గోపాల్ సింగ్ పన్ను.
సీక్రెట్ రేడియో
అది రెండవ ప్రపంచ యుద్ధకాలం. బ్రిటిష్‌వాళ్లపై వత్తిడి తెచ్చి స్వాతంత్య్రాన్ని సాధించడానికి ఇదే సరైన సమయం అని గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. దేశభక్తులెందరో తమకు తోచిన రీతిలో ఉద్యమానికి తోడ్పడ్డారు. అందులో ఉషా మెహతా ఒకరు. గుజరాత్ వాసి అయిన ఉష చిన్నతనం నుండి గాంధీజీ ఉపన్యాసాలు వింటూ పెరిగారు. ఎనిమిదేళ్ల వయసు నుండే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు.14 ఆగస్టు, 1942 నాడు ఉష, మరికొందరు సహచరులు కలిసి ఒక సీక్రెట్ కాంగ్రెస్ రేడియో స్టేషన్‌ని ప్రారంభించారు. డాక్టర్ రాంమనోహర్ లోహియా, అచ్చుత్‌రావ్ పట్వర్థన్, త్రికమ్‌దాస్ వంటివారు ఉషా మెహతా బృందానికి సహకరించినవారిలో ఉన్నారు. ఈ రేడియో గాంధి, ఇతర ప్రముఖ నాయకుల పిలుపులను రికార్డు చేసి ప్రసారం చేసేది. బ్రిటీష్‌వాళ్ల కంటపడకుండా దాదాపు రోజూ ఒక చోటు నుండి మరో చోటికి రేడియో కేంద్రాన్ని మారుస్తూ ఉండేవారు. అయినా చివరికి 12 నవంబర్, 1942న పోలీసులు ఈ రేడియోను కేంద్రాన్ని గుర్తించి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. అట్లా ఉషా మెహతా జైలుకు చేరారు.
క్విట్ ఇండియాను ప్రారంభించి...
భారత స్వాతంత్య్ర పోరాటం అంతిమ దశ 'క్విట్ ఇండియా' ఉద్యమంలో అరుణా అసఫ్ అలీ పోషించిన పాత్ర ఎందరికో ఉత్తేజాన్నిచ్చింది. పంజాబ్‌లోని కల్కాలో జన్మించిన అరుణ... అసఫ్ అలీని పెండ్లాడిన తరువాత కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. కొన్ని ఏండ్లపాటు జైలు జీవితం గడిపారు. ఆమె సాహస కార్యాల్లో ముఖ్యమైనది బొంబాయిలోని గొవాలియా టాంక్ మైదాన్‌లో కాంగ్రెస్ జెండాను ఎగురవేయడం. 8 ఆగస్టు, 1942 న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఉద్యమం ప్రారంభానికి ముందు రోజే గాంధీజీతో సహా ప్రముఖ నాయకులనందరినీ పోలీసులు అరెస్టు చేశారు. అయినా మరుసటి రోజు (9 ఆగస్టు)న మిగిలిన కాంగ్రెస్ నాయకులతో సభను జరిపి అధ్యక్షత వహించింది పిన్న వయస్కురాలైన అరుణ. అట్లాగే ఉద్యమ వేదిక అయిన గొవాలియా టాంక్ మైదానంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేసింది. ఇది క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమయిందని చెప్పడానికి సూచిక అయింది. పోలీసులు సభపై కాల్పులు జరిపారు. ప్రాణాలకు తెగించి ఆమె చూపిన చొరవతో బ్రిటీష్‌వాళ్లను గజ గజ లాడించిన క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమయింది.