Sat 25 Jul 18:01:39.385633 2015
Authorization
ఒక రాజ్యంలో చాలా పెద్ద అడవి ఉండేది. అందులో ఎన్నో రకాల జంతువులు నివసిస్తుండేవి. చాలా రోజులుగా వర్షాలు కురవకపోవడం వల్ల ఆ అడవిలో కుంటలన్నీ నీళ్ళు లేక ఎండిపోయాయి. ఒక దగ్గర మాత్రం కొద్దిగా నీళ్ళున్నాయి. అడవిలోని జంతువులన్నీ అక్కడికే వచ్చి నీళ్లుతాగేవి. ఒకసారి ఓ ఏనుగు ఆ కుంట దగ్గరికి వచ్చి నీళ్ళు తాగుతోంది. అప్పుడే అక్కడికి వచ్చిన సింహం ''నేను ముందు నీళ్ళు తాగాలి. నువ్వు ఆగు'' అంది.
దానికి ఏనుగు ''నేను ముందు వచ్చాను కాబట్టి నేను తాగి వెళ్ళిన తర్వాత నువ్వు తాగు'' అంది.
కానీ సింహం ఒప్పుకోలేదు. పెద్దగా గర్జిస్తూ... ''నేను ఈ అడవికి రాజును. ఇక్కడున్న అన్నిటిపైనా నాకు హక్కుంది. అందుకే నేను ముందు తాగాలి'' అంది.
కానీ ఏనుగు వినిపించుకోలేదు. నేనే ముందు తాగాలి అని వాదించింది. సింహం, ఏనుగుల మధ్య మాటా మాటా పెరిగి, పెద్ద గొడవలా తయారయ్యింది. ఇంతలో అక్కడికి నక్క, తోడేలు వచ్చాయి. ఏనుగు, సింహం మధ్య గొడవ చూస్తూ... 'ఈ రెండూ కొట్టుకుంటే ఏదో ఒకటి చస్తుంది. దాన్ని తినొచ్చు' అని అక్కడే కాసుక్కూచ్చున్నాయి నక్క, తోడేలు.
అంత గొడవపడుతూ కూడా నక్కని, తోడేలుని సింహం, ఏనుగు గమనించాయి. 'ఇప్పుడు పంతానికి పోయి మేమిద్దరం కొట్టుకుని చస్తే, తినాలని గుంటనక్కలాగా కూర్చున్నాయి. మనకే నష్టం' అని దేనికదే మనసులో అనుకున్నాయి ఏనుగు, సింహం.
ముందుగా ఏనుగే ''సరే మృగరాజా... ఈ అడవికి రాజుకు కనుక నువ్వే ముందు నీళ్ళు తాగు, తర్వాత నేను తాగుతాను'' అంది.
కానీ సింహం ''ఈ అడవికి రాజునైన నేను మీ అందరి అవసరాలు తీర్చడం నా బాధ్యత. అందుకే నువ్వు తాగి వెళ్ళు. తర్వాత నేను తాగుతాను'' అంది. అలా రాబోయే ఆపద గ్రహించి ఏనుగు, సింహం తెలివిగా రాజీకి వచ్చాయి.
ఏనుగు సరేనని కుంటలోకి వెళ్ళి నీళ్ళు తాగిన తర్వాత, సింహం వెళ్ళి తాగింది. చెట్ల వెనుక నక్కిన తోడేలు, నక్క తమకిక ఇక్కడ ఆహారం దొరకదని గ్రహించి వెళ్ళిపోయాయి. ఏనుగు, సింహం కూడా దేనిదారిన అది వెళ్ళిపోయింది.