తాజ్‌మహల్! లక్షలాది శ్రమజీవుల స్వేదాన్ని ఘనీభవింపజేస్తే రూపుదిద్దుకున్న అద్భుత కట్టడం! చక్రవర్తులు, సామ్రాజ్యాలు పోయినా నాటి మానవ సంకల్పానికి, అద్వితీయమైన సాంకేతిక పరిజ్ఞానానికి తాజ్ నిలువెత్తు నిదర్శనంగా నిలిచి ఉంది. మానవ జాతి ఈ భూమిపై ఆవిష్కరించిన అద్భుతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అటువంటి తాజ్‌మహల్‌పై కొందరు సంకుచిత మనస్కులు అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలోకి లాగుతున్నారు. ఎప్పుడో 17వ శతాబ్దంలో నిర్మితమైన ఈ చలువరాతి మహాకావ్యానికి మతం రంగు పులిమి రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటున్నారు. చరిత్రలో అసలు ఏం జరిగిందో తెలిస్తే కాని ఇప్పుడు ప్రచారంలోకి తెస్తున్న విషయాలు అభూతకల్పనలని అర్థం కావు. అందుకే 'సోపతి' అందిస్తోంది ఈ ముఖపత్ర కథనాన్ని.
ఎం.ఎస్ రామారావు గానం చేసిన ''ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించు జహాపనా!'' అనే గీతం ఎప్పుడైనా విన్నారా? తన భార్య ముంతాజ్ కోసం అద్భుత సమాధి 'తాజ్‌మహల్'ని నిర్మించిన షాజహాన్‌ని తలుచుకుంటూ పాడిన పాట అది. పాట విన్నంత సేపూ మనసు ఏదో అయిపోతుంది. పండు వెన్నెల్లో తాజ్‌మహల్ మన కండ్ల ముందు సాక్షాత్కరిస్తుంది! ఒక్కసారి ఆగ్రా పోయి తాజ్‌ని దర్శిస్తే ఎంత బాగుండు అనిపిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఉన్నవారైనా భారతదేశం వస్తే ముందు దర్శించాలనుకునేది తాజ్‌మహల్‌నే కదా. నియంతలు, సైనికపాలకులు, దేశాధ్యక్షులు... ఈ నేలపై కాలిడిన విదేశీ పాలకులు ఎందరు ఈ కట్టడ శోభకు ఫిదా అయిపోలేదూ! సామాన్యుడు, ధనికుడు అనే తేడా లేకుండా ఎందరో ప్రేమికులు ఆ సమాధిని చూస్తూ తమను తాము మరిచిపోయి తన్మయత్వంతో గంటలు క్షణాలుగా గడపడంలేదు!
ముంతాజ్‌పై ప్రేమతో...
భారతీయ చారిత్రక కట్టడాలో మొదటి స్థానాన్ని ఆక్రమించిన తాజ్‌మహల్ నిర్మాణం గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో నమ్మదగిన విషయాలను పరిశీలించినప్పుడు ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి. మధ్య యుగంలో మొదటి సారిగా భారతదేశాన్ని ఒక సామ్రాజ్యంగా నిర్మించిన అక్బర్ చక్రవర్తి మనుమడు షాజహాన్ (1628-1658). ఇతడి భార్య పేరు అర్జుమందాబేగం. ఈమెనే 'ముంతాజ్ మహల్' అని పిలిచేవారు. ఈమె షాజహాన్ తండ్రియైన జహంగీర్ భార్యల్లో ఒకరైన నూర్జహాన్ మేనకోడలు. అట్లాగే జహంగీర్ చక్రవర్తి వజీర్ (ప్రధానమంత్రి) అయిన మిర్జా ఘియాస్ బేగ్ ఇత్మదుద్దౌలా మనుమరాలు కూడా. షాజహాన్ చక్రవర్తి నిజానికి స్త్రీలోలుడు. ఎందరు అంత:పుర కాంతలున్నా ఆయనకి తన భార్య ముంతాజ్ మహల్ అంటే విపరీతమైన ఇష్టం. వారి అనురాగానికి గుర్తుగా ముంతాజ్ 13మంది పిల్లలకు జన్మనిచ్చింది. బుర్హాన్‌పూర్‌లో14వ శిశువుకు జన్మనిస్తూ ప్రసవించలేక మరణించింది.
ఈ హఠాత్పరిణామానికి షాజహాన్ చక్రవర్తి ఖిన్నుడయ్యాడు. తాత్కాలికంగా ముంతాజ్ మృత దేహాన్ని జైనాబాద్ గార్డెన్‌లో సమాధి చేశారు. ఆ తరువాత ఆరు నెలలకు దేహాన్ని ఆగ్రాకి తీసుకువచ్చి ప్రస్తుతం తాజ్‌మహల్ ఉన్న స్థలంలోనే ఒక చోట పూడ్చిపెట్టారు. తాజ్ నిర్మాణం పూర్తయిన తరువాత తిరిగి ముంతాజ్ దేహ అవశేషాలను తాజ్ మహల్‌లో పూడ్చిపెట్టారు.
యమునానదికి కుడిగట్టున తాజ్ నిర్మితమయింది. నిజానికి తాజ్‌మహల్ నిర్మాణానికి ముందు ఈ ప్రదేశంలో అజ్మీర్‌కి చెందిన కఛ్వాహాల హవేలీలు నాలుగు ఉండేవి. ఈ ప్రదేశం అంతా చాలా ప్రశాంతంగా, అందంగా ఉండేది. షాజహాన్ చక్రవర్తి తన భార్యకు శాశ్వత ప్రాతిపదికన గొప్ప సమాధిని నిర్మించాలనే తలంపుతో తగిన స్థలం కోసం అన్వేషణ చేయించగా ఈ ప్రదేశం గురించిన సమాచారం అందింది. దీంతో అంబర్ (రాజస్థాన్) రాజు జైసింగ్ ద్వారా ఈ స్థలాన్ని కొనుగోలు చేశాడు షాజహాన్. మొగలాయీల కాలంలో జరిగే పరిపాలనా విషయాలన్నీ ఫర్మానాల (డిక్రీలు) రూపంలో రికార్డవ్వడం ఆనవాయితీ. అందుకే చరిత్రకారులు అసలు చరిత్రను తెలుసుకోవడానికి సమకాలీన పుస్తకాలను, ఫర్మానాలను శోధించినప్పుడు తాజ్‌మహల్ స్థల సేకరణ, నిర్మాణ విశేషాలు ఉన్న నాలుగు ఫర్మానాలు కనిపించాయి. ఇదే సమాచారం షాజహాన్ ఆస్థాన చరిత్రకారుడైన 'అబ్దుల్ హమీద్ లాహిరి' రచించిన 'బాద్షా నామా' గ్రంథంలోనూ కనిపిస్తున్నది.
అత్యంత నైపుణ్య కార్మికుల తరలింపు
అద్భుతమైన ఈ మహా కట్టడాన్ని నిర్మించడానికి ఎందరో కార్మికులు, సాంకేతిక నిపుణులు, కళాకారులు అవసరమయ్యారు. షాజహాన్ తన సామ్రాజ్యంలో ఉన్న అత్యంత నైపుణ్యంలవారినే కాక మధ్య ఆసియా, ఇరాన్ నుంచి కూడా రావించాడు.. తాపీపనివారు, రాళ్లుమోసేవారు, రాళ్లు సైజులవారీ కోసేవారు, చెక్కేవారు, చిత్రకారులు, కాలిగ్రాఫర్స్, డోమ్‌ను నిర్మించేవారు, ఇతర వృత్తిపనివారు కలిసి లక్షల్లో ఇక్కడ పనిచేశారు. నిర్మాణానికి అవసరమైన నీటి కోసం యమునానది ఒడ్డు పొడవునా బావులు తవ్వించాడు. లోపలి నిర్మాణానికి అవసరమైన ఇటుకలను స్థానికంగానే తయారు చేయించారు. అయితే పైన తాపడానికి ఉపయోగించిన పాలరాతిని మాత్రం రాజస్తాన్ లోని మర్కానా నుంచి తెప్పించారు. గోడలు, ఇతర భాగాల్లో పొదగడానికి అవసరమైన విలువైన రాళ్లను మొగల్ సామ్రాజ్యంలోని దూర ప్రాంతాల నుంచే కాకుండా శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్‌ల నుంచీ తెప్పించారు. ఇక రకరకాల ఎర్ర ఇసుకరాయిని ఇరుగుపొరుగున ఉన్న సిక్రి, ధోల్‌పూర్ క్వారీల నుంచి గ్రహించారు. మొత్తం మీద 1631లో ప్రారంభమైన ఈ నిర్మాణం 1648లో ముగిసింది. అంటే తాజ్ మహల్ పూర్తవ్వడానికి 17 ఏండ్లు పట్టిందన్నమాట.
విస్మయం గొలిపే దృశ్యం
తాజ్‌మహల్ మొత్తం 60 బీగాల స్థలంలో నిర్మితమయింది. మొత్తం స్థలం దక్షిణం నుంచి ఉత్తరానికి (నదివైపుకు) నీరు పారేలా లాండ్‌స్కేప్‌ని తయారుచేశారు. తాజ్ మహల్ ప్రాంగణంలోకి అడుగుపెట్టాలంటే ఎదురు (దక్షిణం)గా ఉన్న పెద్ద ద్వారం గుండా ప్రవేశించాలి. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకోవాలి. తాజ్‌ని చూడటానికి వెళ్లే యాత్రికులకు దాని ప్రాంగణంలోనికి అడుగిడేవరకు మనకు కనిపించదు. ఈ ద్వారం లోకి అడుగిడుతామో లేదో నిలువెత్తు తాజ్ ఒక్కసారిగా విస్మయం కలుగజేస్తూ దర్శనమిస్తుంది. ఇదే ప్రాంగణంలో ఆగేయ దిక్కున అక్బరాబాది బేగం సమాది (సహేలీ బుర్జ్1)ó, నైరుతి దిక్కున ఫతేపురి బేగం సమాధి (సహేలీ బుర్జ్ 2) ఉన్నాయి. వీరిద్దరూ షాజహాన్ భార్యలే. తాజ్ ప్రాంగణంలో నీటి కాలువలు, ఫౌంటెన్స్, అందమైన తోట కనుల విందు చేస్తాయి. షాజహాన్ మరణించిన తరువాత తాజ్ మహల్‌లో ముంతాజ్ సమాధి పక్కనే అతడి మృతదేహాన్నీ పూడ్చిపెట్టారు. ఆ విధంగా తన ప్రియమైన భార్య పక్కనే షాజహాన్ కూడా శాశ్వత స్థానాన్ని పొందాడు.
ఇదీ సంక్షిప్తంగా తాజ్‌మహల్ నిర్మాణానికి సంబంధించిన కథ. ఇందులో నిర్మాణంలో పొల్గొన్న వాస్తు నిర్మాణ నిపుణులు, వాస్తుశైలిలో ఉన్న విశేషాలు... లాంటి ఎన్నో సంగతులు చేర్చలేదు. అవన్నీ చెప్పుకొస్తే పెద్ద గ్రంథమే అవుతుంది. ప్రస్తుత సమస్యను అర్థం చేసుకోవడానికి ఈ మాత్రం సమాచారం చాలు.
మన వారసత్వ సంపద
ఇటీవల మతతత్వ శక్తులు తాజ్‌మహల్‌ని అనవసరమైన వివాదాల్లోకి లాగుతూ ప్రకటనలు చేస్తున్నాయి. అది కేవలం ఒక సమాధి మాత్రమేనని అంతకు ఎక్కువకాదు, తక్కువా కాదు అన్నట్లు మాట్లాడుతున్నారు. అంతేనా! ఒకవేళ అదే నిజమైతే మరి ప్రపంచ వింతల్లో తాజ్ మహల్ ఒకటిగా ఎందుకు గుర్తింపు పొందింది? అట్లా గుర్తింపు పొందటం భారతీయునిగా ప్రతి ఒక్కరు సంబరపడే విషయమే కదా? ఇవ్వాళ ఇండియా అనగానే యాత్రికులకు ముందు గుర్తొచ్చేది తాజ్ మహలే కదా! అప్పట్లోనే సుమారు 50 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ మాసోలియం మొగలాయీల కళావనంలో వికసించిన పుష్పం అని చెప్పక తప్పదు. ప్రపంచంలోని దాంపత్య ప్రేమకు, సామరస్యానికి, విశ్వాసానికి ఇది తిరుగులేని నిదర్శనం. సర్వాంగ సుందరమైన కళ, అత్యంత నైపుణ్య నిర్మాణ కౌశలం కలయికే ఈ స్మారక కట్టడం. అద్భుతమైన కళాప్రతిభను, అసాధారణమైన శాస్త్రీయ దృక్పథాన్ని, ప్రశంసనీయమైన సాంకేతిక నైపుణ్యాన్ని, అపురూపమైన అందాన్ని ప్రదర్శిస్తున్నది. ఈ అందం, నైపుణ్యం, వైభవోపేతమైన అలంకరణ, ఆకర్షణీయమైన హుందాతనం , అలరించే ఉద్యానవనాలు, పరిపూర్ణమైన నిర్మలత్వం, వాస్తుకళాసృష్టిలోని పొందిక... ఇవన్నీ కలిసి ఈ కట్టడాన్ని ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిపాయి. మొగల్ వాస్తుకళకు చెందిన తార్కిక క్రమ పరిణామమే ఈ నిర్మాణం అని చరిత్రకారులు అంటున్నారు.
మరి ఇటువంటి అద్భుత కట్టడాన్ని కేవలం స్పశానంలోని ఒక ముస్లిం సమాధిగా చిత్రించే ప్రయత్నం చేయడం దేనికి సంకేతం? నిర్మాణం పూర్తయి సుమారు అయిదు శతాబ్దాలు అవుతుంటే ఇప్పుడు ఈ బురదజల్లే కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నట్లు? అది ముస్లిం చక్రవర్తులు నిర్మించినది కావడం వల్లనే కదా? మొగలాయి చక్రవర్తులు ఎక్కడో మధ్య ఆసియా, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాల నుంచి వచ్చినవారు కాబట్టి వారు విదేశీయులని, వారి కట్టడాలు కూడా మనవి కాదనే వాదన ఎంతవరకు సమంజసం?
మధ్యయుగాల్లో... అరాచకం తాండవించిన రోజుల్లో రాజ్య విస్తరణ కాంక్షతో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది రాజులు, తెగలవారు సారవంతమైన భూములను, మంచి జీవన పరిస్థితులను వెతుక్కుంటూ దండెత్తడం మామూలు విషయమే. ఆ సమయంలో భారత దేశంలోని సిరిసంపదలు, భౌగోళిక పరిస్థితులు మొగలాయీలను ఆకర్షించడంతో వారు భారతదేశంలో అప్పుడున్న రాజ్యాలపై దండెత్తి వచ్చారు. బాబర్‌తో ప్రారంభమైన రాజ్య విస్తరణ తరువాతి కాలంలో మహాసామ్రాజ్య స్థాపనకు నాంది పలికింది. మొగల్ పాలకులు ఎవరూ భారతదేశాన్ని కొల్లగొట్టి సంపదను తమ మాతృభూమికి తీసుకువెళ్లలేదు. కాకపోగా వారు ఇక్కడి వ్యవసాయాన్ని, పరిశ్రమలను, వర్తక వాణిజ్యాలను పెంపొందించడానికి అనేక విధాలుగా పాటుపడ్డారు. తాజ్ మహల్, ఎర్రకోట, ఫతేపూర్ సిక్రీ... ఇట్లాంటి ఎన్నో బృహత్ నిర్మాణాలు రూపుదిద్దుకున్నాయంటే సంపద ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సంపద సృష్టిలో మొగల్ చక్రవర్తుల పాత్రేమీ లేదా? ఈ భూమిలో పుట్టి, ఈ భూమిని పాలించి, ఈ మట్టిలో మట్టిగా కలిసిపోయిన మొగలాయీ పాలకులు విదేశీయులు ఎట్లా అవుతారు. వారు సృష్టించిన ఇండో-ఇస్లామిక్ సంస్కృతి భారతీయ కీర్తి కిరీటంలో కలికితురాయి కాకుండా ఎటు పోతుంది? కేవలం హిందువుల ఓట్లు దండుకోవడానికి మతతత్వవాదులు పన్నిన పన్నాగంలో భాగంగానే తాజ్ మహల్‌ని వివాదాస్పదం చేస్తున్నారు.
తేజోమహాలయం ఉండేదా?
తాజ్ మహల్ ఉన్న ప్రదేశంలో పూర్వం తేజోమహాలయం ఉండేదని, దాన్ని పడగొట్టి షాజహాన్ ఇక్కడ ప్రస్తుతం ఉన్న తాజ్‌ని నిర్మించాడని మరో కట్టుకథ ప్రచారంలో ఉంది. దీన్ని ప్రచారంలోకి తీసుకువచ్చినవాడు ఒక జాతీయవాద రచయిత. ఇతడికి చరిత్ర రచనా విధానమే తెలిసినట్లు లేదు. ఆధారాలు లేకుండా కేవలం అనుమానంతో, ఊహలపై ఆధారపడి పుస్తకాలు రాశాడు. అతడి గ్రంథాన్ని ఆధారం చేసుకొని హిందు మతతత్వవాదులు తాజ్‌కి హానిచేయాలని చూస్తున్నారు.
2001లో తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌లో బమియాన్ పట్టణంలో ఉన్న అత్యంత ఎత్తయిన బుద్ధ విగ్రహాలను బాంబులతో కూల్చివేసిన సంగతి ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. అప్పుడు భారత దేశంలో ఉన్నది మతతత్వపార్టీగా పేరున్న బీజేపీదే. అప్పటి ప్రధానితో పాటు, సంఫ్‌ుపరివార్ శక్తులన్నీ ఈ కూల్చివేతను నిర్ద్వంద్వంగా ఖండించాయి. ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పాయి ప్రపంచదేశాలకు ఉత్తరాలు రాసి బుద్ధ విగ్రహాల విధ్వంసాన్ని ఆపమని కోరారు. ఇక ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్ దళ్ వంటి హందువాద సంస్థలు పెట్టిన గగ్గోలు అంతా ఇంతా కాదు.
అప్పుడు చూపిన విజ్ఞత ఇప్పుడు ఏమయిందన్నది ప్రశ్న. చారిత్రాత్మకమైన తాజ్‌మహల్‌ను తమ రాజకీయక్రీడకు ఉపయోగించుకోవాలని కాషాయ మూకలు చూడటం ఆక్షేపణీయం. చరిత్రకు వక్రభాష్యాలు చెబుతూ తాజ్‌మహల్ ప్రతిష్టని మసకబార్చే కుటిల వ్యూహాలు అభ్యంతరకరం. ప్రజలకు ఉన్న మతపరమైన నమ్మకాల్ని ఆసరా చేసుకొని భావోద్వేగాలు రెచ్చగొట్టే హిందూత్వ శక్తులు 'తాజ్'ని కేంద్రంగా చేసుకొని అసంబద్ధంగా, ఇష్టానుసారంగా మాట్లాడటం మతతత్వశక్తుల దుష్టపన్నాగాలకు పరాకాష్ట. ఈ సందర్భాన ఆలోచనాపరులయిన వారు వెనువెంటనే స్పందించడంతో కాస్త వెనక్కి తగ్గారు. మనదేశ చరిత్రలో అందమైన అంతర్భాగం తాజ్‌మహల్.
తాజ్ కాలం సిగలో మల్లెపూవు! చరిత్ర చెక్కిలిపై చెరగని సంతకం!! దాన్ని కాపాడుకోవడం ప్రతి భారతీయుడి కర్తవ్యం.
- జి.శివరామకృష్ణయ్య, 7702508259
Sat 11 Nov 16:21:01.649458 2017