పర్షియన్ మూలం: హొస్సేన్ మోర్తెజాయిన్ అబ్కేనార్
ఆంగ్లం: సారా ఖలిలీ
తెలుగు: కొల్లూరి సోమ శంకర్
చీకట్లో నిలుచున్నట్లుగా అనిపిస్తోంది అతనికి. ఏ చప్పుళ్ళూ లేవు. అంతటా చీకటీ, నిశ్శబ్దమూ. అతనికీ ఏమీ కనిపించడం లేదు, ఎందుకంటే అతని కళ్ళకి గంతలు కట్టి ఉన్నాయి. అతనలా నిలుచునే ఉన్నాడు, ఎదురుచూస్తూ. చాలా సేపటి నుంచి. గంటల కొద్దీ... అక్కడ అలా నిలుచోడం అలవాటైన పోయినట్లుగా నిలుచుని ఉన్నాడు. కాలం సాగుతోంది. గంతల వెనుకగా అది అతని కళ్ళలోకి జారింది, అక్కడ్నించి చెవుల్లోకి, తలలోకి! అతని శరీరం - మౌనం, చీకట్లతో నిండిపోయింది.
అతని చేతులు ముందుకి కట్టేసి ఉన్నాయి. సాలిటరీ కన్‌ఫైన్‌మెంట్ రూమ్ నుంచి జైలు గార్డు అతన్ని చేయి పట్టుకుని ఈ గదికి తీసుకొచ్చాడు. తమ గది నుంచి కుడివైపుకి ఓ పొడవాటి కారిడార్ గుండా నడిచినట్టు అతను గ్రహించాడు. చాలా దూరం నడిచినట్టు, అక్కడ చీకటి నిండి ఉన్నట్టు అతనికి తోచింది. కుంటుతూ మోకాళ్ళపై నడవాల్సి వచ్చింది. తనని ఈ గది దాకా తీసుకువచ్చి గార్డు వెళ్ళిపోయాడు. భారీ ఇనుప తలుపు పెద్ద చప్పుడుతో మూసుకుంది. లోహపు ప్రతినాదం అతని వెనుకా, అతని లోపలా ప్రతిధ్వనించింది.
ఇప్పుడు అతనికి ఎదురుగా చీకటి. నిశీధితో ముఖాముఖి. అతను దానిమీదే నిల్చున్నాడు. అదే తనను ముందుకీ వెనక్కీ తోస్తున్నట్లుగా భావించాడు. కాస్త దూరంలో ఎక్కడ్నించో ఓ కళేబరం నుంచి కుళ్ళిన కంపు వస్తోంది. ఆ గదిలో ఇంకెవరో ఉన్నట్టు అతనికి అనిపించింది కానీ, ఏ సవ్వడీ లేదు. అతని అరికాళ్ళు వాచిపోయాయి, పచ్చిగా ఉన్నాయి. సరిగ్గా నిలబడలేకపోతున్నాడు. అతనికి ఇప్పటికీ నొప్పిగా ఉంది. అతని మోకాళ్ళు వంగిపోయాయి, నడుం ఒంగిపోయింది, మెడ వంగిపోయింది. నేల మీద కూర్చోవాలని అనుకుంటున్నాడు, వెల్లికిల పడుకోవాలను కుంటున్నాడు, బోర్లా పడుకోవాలను కుంటున్నాడు.
సాలిటరీ కన్‌ఫైన్‌మెంట్‌లో పడేసేముందు వాళ్ళు అతని కాళ్ళని మంచం కోడుకి కట్టేసి, ఓ తీగతో అతని కాళ్ళపై కొట్టారు. అతను గట్టిగా అరిచాడు.. కేకలు పెట్టాడు. అరవగలిగినంత గట్టిగా అరిచాడు. అరిస్తే నొప్పి తగ్గుతుందని ఎవరో చెప్పగా విన్నాడు. కాని నొప్పేమీ తగ్గలేదు. కాళ్ళు వాచిపోయాయి. గాయాల నుంచి ఇంకా రసీ, రక్తమూ కారుతూనే ఉన్నాయి. తన సెల్‌లో అతను గాయలతో అటూ ఇటూ నడిచాడు. బాధతో నిట్టూరుస్తూ నడిచాడు. ఒక అడుగు, మరోకటి... నెమ్మదిగా, జాగ్రత్తగా... ఆ గదంతా మూల్గుతూ తిరిగాడు. కొరడా దెబ్బలు తిన్నాక నడవక పోతే, పాదాలు వాస్తాయని అతనెప్పుడో విన్నాడు. అతని పాదాలు వాచిపోయాయి.
అక్కడ ఎవరో ఉన్నట్లనిపిస్తోంది, కాని ఏ చప్పుడూ రావడం లేదు. కొరడా దెబ్బలు, సాలిటరీ కన్‌ఫైన్‌మెంట్ తర్వాత వాళ్ళు చెప్పారు.... విచారణకి సమయం ఆసన్నమైందని! వెయిటింగ్ రూమ్... రిగ్రెట్ రూమ్... హజీ సయీద్ గది!
కాలం స్తంభించిపోయినట్లుంది. అది పగలో రాత్రో తెలియడం లేదు. బాగా చలిగా ఉందతనికి.
కాగితం చిరు సవ్వడి విన్నాడతను. మెత్తని చప్పుడుతో చిన్న కదలిక. నిశ్శబ్దం ఎంత తీవ్రంగా ఉందంటే - అదెక్కడి నుంచి వచ్చిందో అతను చెప్పలేకపోతున్నాడు. అన్ని వైపుల నుంచి కమ్ముకొచ్చినట్టుంది. ఎవరో కుర్చీ నుంచి లేస్తున చప్పుడు విన్నాడు. మెత్తని ప్రతినాదం ఏదో తన వైపు వస్తున్నట్టు అనిపించింది. చెప్పులను ఈడ్చుకుంటూ నడుస్తున్న ధ్వని. తర్వాత మళ్ళీ నిశ్శబ్దం. తనని ఎవరో గమనిస్తున్నట్టుగా తోచింది అతనికి. ఓ క్షణం పాటు ఆ చీకట్లో తన పిడికిలిని బిగించాడు.
చీకటి అడిగింది ''నీ పేరేమిటి?''
ఆ స్వరం అతని చెవుల్లో గట్టిగా ప్రతిధ్వనించింది. అతని కింది పెదవి వణికింది. లోతుల్లోంచి అతని గొంతు సమాధానం చెప్పింది ''మోర్తజా''.
''గట్టిగా చెప్పు'' చీకటి అరిచింది.
ఓ చీకటి హస్తం అతన్ని చాచి కొట్టింది. గట్టిగా. అనూహ్యంగా. అతని చెంపలపై మంటగా ఉంది. నొప్పితో విలవిలలాడాడు, నేలపై పడిపోయాడు. అతని చెవులు మారుమ్రోగుతున్నాయి. నిశ్శబ్దం మాయమైంది. అతని చేతులు కట్టేసి ఉండడం వల్ల, అతను మెల్లగా ఒక వైపు తిరిగి భుజం ఆసరాతో లేచి నిలబడాలనుకున్నాడు. కాని లేవలేకపోయాడు. వెల్లికిల పడిపోయాడు. ఈసారి మరింత కష్టపడి భుజం, మోచేయి సాయంతో లేచి మోకాళ్ళ మీద కూర్చోగలిగాడు. అతని ఎడమ చెవిలో ఇంకా రొదగానే ఉంది. అతని చొక్కా కాలర్ పట్టుకుని పైకి లేపింది చీకటి. అతను మడమలపై నిలుచున్నాడు. అతని మోకాళ్ళు వంగి ఉన్నాయి. అతని నడుం వంగిపోయింది.
చీకటి అతన్ని మెడపట్టుకుని ఓ వైపుకి బలంగా తోసింది. అతని ముఖాన్ని ఓ చల్లని కాంక్రీట్ గోడకి అదిమిపెట్టింది. ఆ గోడ చాలా గరుకుగా ఉంది.
''ముక్కు గోడకి ఆనించు!''
పాదాలను ఈడ్చుకుంటూ అతను నెమ్మదిగా వెనక్కి నడిచాడు. గోడ ముతక వాసనొస్తోంది.
''నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు?'' కాస్త దూరం నుంచి చీకటి అడిగింది.
ఆ స్వరం పాతదిగా తోచిందతనికి.
''నాకు తెలియదు'' చెప్పాడతను.
''నీకు తెలియదా?... ఆహా...''
తన మాటలని తానే ధ్రువీకరించుకున్నట్లుగా అంది చీకటి.
''నిన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చారని అనుకుంటున్నావ్?''
అతను మౌనంగా ఉండిపోయాడు.
''నువ్వు ఏం పని చేస్తావు? నీ ఉద్యోగం ఏంటి?''
ఈ సారి ఆ గొంతులో కాస్త దయ.
''నేను వ్రాస్తూంటాను.''
''రాస్తావా?.. ఓహౌ... కుడి చేత్తోనా ఎడమ చేత్తోనా?''
అలా ఎందుకు అడిగాడో అతనికర్థం కాలేదు.
''కుడి చేత్తోనే రాస్తాను... కానీ నాది ఎడమచేతి వాటం.''
చీకటి కొన్ని వాక్యాలను గట్టిగా పైకి చదవసాగింది - ''రాజకీయనాయకుడి ఫొటో పోస్టల్ స్టాంపు సైజు కంటే పెద్దగా ప్రింటవుతోందంటే, నియంతత్వపు ప్రమాదం పొంచివున్నట్టే...''.. ''ఊ... ఆసక్తికరం''
అటువంటి భారీ చిత్రాలు ఇక్కడ కూడా ఉండే ఉంటాయని అనుకున్నాడతను. పోస్టల్ స్టాంపుల కన్నా బాగా పెద్దవి... పెద్ద ఫ్రేములో అమర్చినవి... తప్పనిసరిగా ఒకటి ఉండే ఉంటుంది. చీకట్లో వేలాడదీసి ఉంటారు. చీకట్లో మేకు కొట్టి, ఆ ఫ్రేమ్‌ని వేలాడదీసి ఉంటారు.
''ఈ నబకోవ్ ఎవరు? అతను నీకు తెలుసా?.... అబ్బా పేరు పలకడం కష్టంగా ఉంది.''
అతనేమీ మాట్లాడలేదు.
''ఓV్‌ా... ఇది పాతదే... ఏదో ఇంటర్వ్యూలా ఉందే.. నువ్వేనా ఇది రాసింది?''
కాగితం మడతలు పడుతున్న శబ్దం వినబడింది.
''నేను సెన్సార్‌షిప్‌కి లొంగను!... నిజంగా?''
జవాబేం చెప్పాలో అతనికి అర్థం కాలేదు.
''దీన్ని.... నువ్వే రాశావా?''
అతనేమీ మాట్లాడలేదు.
''అవునా?''
ఆ గొంతు దగ్గరికి వచ్చింది.
''నేను నిన్నో ప్రశ్న అడిగాను: ఇది నువ్వే రాశావా?''
చీకటి వెనుక నుంచి అతని తలని పట్టుకుని గోడకేసి బలంగా కొట్టింది.
''చెత్త నా కొ.....''
గరుకు కాంక్రీటు గోడకి అతని ముఖం గుద్దుకుంది. ఓ క్షణం పాటు చీకటి ఎర్రగా మారింది.
అతని ముక్కు మొద్దుబారిపోయింది. కట్టేసిన చేతులతో ముక్కుని తాకితే, అతనికి అక్కడ స్పర్శ తెలియలేదు. నోటి పైన ఏదో వెచ్చగా తగిలింది. వెచ్చని పలచని ద్రవం వాచిన అతని పెదవులపై నుంచి నెమ్మదిగా క్రిందకి జారింది.
''వాళ్ళిచ్చిన కాగితాలపైన నువ్వెందుకు సంతకం చేయలేదు?''
అతని కింది పెదవి మళ్ళీ ఒణికింది.
''ఎందుకంటే వాళ్ళు రాసింది నిజం కాదు.....''
అతను రక్తం రుచి చూశాడు.
''నేనక్కడ లేను.... వాళ్ళెవరో నాకు తెలియదు... నేను గూఢచారిని కాదని చెప్పాను... ''
''ఓహౌ.. వాళ్ళెవరో నీకు తెలియదా? నిజమా... మరి అక్రమ సంబంధాల మాటేమిటి? నీకే సంబంధాలు లేవని చెప్పుకుంటున్నావుగా...?''
''నాకే అక్రమ సంబంధాలు లేవు.''
''ఏదో ఒక దాన్ని నువ్వు ఒప్పుకోవాలి... నీ ఇష్టం.... నువ్వు సంతకం చేయాలి... అంతే... వేరే మార్గం లేదు. అలా చేస్తేనే నువ్వు బయటపడతావ్.''
అతను మౌనంగా ఉండిపోయాడు. కాసేపయ్యాక, ''నా వల్ల కాదు...'' అంటూ గొణిగాడు.
కాసేపు నిశ్శబ్దం. ''నీవల్ల కాదా... అదీ చూస్తా...'' అంది చీకటి.
ఉన్నట్టుండి, తన వైపు ఎవరో వస్తున్న బూట్ల చప్పుడు అతను విన్నాడు. అప్పుడే అతనికి అర్థమైంది, ఆ గదిలో మరొక వ్యక్తి కూడా ఉన్నాడని. బహుశా అతనిని ఇక్కడికి తీసుకువచ్చిన జైలు గార్డు అయ్యుంటాడు. పక్కగా నిలబడి ఆజ్ఞల కోసం ఎదురుచూస్తున్న వారికెవరికో చీకటి సైగ చేసినట్టుంది.
ఎలా జరిగిందో అర్థమయ్యే లోపే అతను ఒక్క ఊపులో తోయబడ్డాడు. నేల కూలాడు. అంతే, ఒక్కసారిగా బూట్లు అతనిపై విరుచుకుపడ్డాయి. కుడి, ఎడమల నుంచి నిర్దాక్షిణ్యంగా పొట్టలోనూ, పక్కటెముకలోనూ, ముఖం మీదా, కాళ్ళ మీదా, వీపు మీదా తన్నసాగాయి. ఇద్దరు వ్యక్తులు అతన్ని కొడుతున్నట్టుగా ఉంది.
బాధతో విలవిలలాడుతున్నాడతను. చీకట్లో దొర్లుతున్నాడు. మళ్ళీ ఏదో చేతి సైగ అందుకున్నట్టుగా... బూట్లు తన్నడం ఆపాయి. గదిలో మరో వైపుకి వెళ్ళిపోయాయి.
కాసేపు మళ్ళీ నిశ్శబ్దం. అతను ముడుచుకుపోయి ఉన్నాడు. చీకటి విసిరిన పంజా దెబ్బకి గిలగిలలాడుతున్నాడు. ఒక పన్ను విరిగి, ఆ ముక్క నాలికపై పడింది.
చిన్న ధ్వని వినిపించింది!
విరిగిన దంతాన్ని, నాలుకతో పెదవుల మూలకి తోశాడతను.
''మోర్తాజా.... కనీసం దేవుడి కోసమైనా.... నా మీద దయతలచు....''
అది మెహ్రీ స్వరం! నేల వైపు నుంచి తలెత్తి చీకటి వైపు చూశాడు.
''వాళ్ళేం చెబితే అది చెరు... దేవుడి కోసమైనా ఒప్పుకో....
ఆమె ద్ణుఖం ఆగడం లేదు.
''మోర్తజా నేను బాధతో చచ్చిపోతున్నాను... నా మీద దయతలచు...''
చిన్న ధ్వని మళ్ళీ వినిపించింది!
మెహ్రీ స్వరం ఇక వినిపించడం లేదు.
''పాపం ఆమె నీ గురించి ఎంతో బెంగగా ఉంది...''
అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. కాగితాల కదలిక చప్పుడు మళ్ళీ వినిపించింది.
''ఇప్పుడు.... వీటి మీద సంతకం చేయాలనిపిస్తే... లే... నా దగ్గరకి రా...''
అతను మోచేతులతో సాయంతో లేచి, మోకాళ్ళపై కూర్చున్నాడు. అలాగే సగం నక్కి ఉన్నాడు.
''లేవడానికి నా సాయం కావాలా?''
అతని చెవుల్లో ఇంకా మెహ్రీ మాటలే మారుమోగుతున్నాయి. 'బాధతో నన్ను చంపేస్తున్నావ్...'
అతని తల వాలిపోయింది. చీకటి నేల వాసన తెలుస్తోంది. విరిగిన దంతాన్ని నాలుక బయటకి లాగింది. థూ... అని ఉమ్మాడు.
మళ్ళీ చీకటి చేతి సైగ అందుకునే బూట్లు అతనివైపు నడిచాయి. ఓ చేయి అతన్ని రెక్కలు పట్టుకుని లేపడానికి ప్రయత్నించింది. అతను విదిలించుకోడానికి ప్రయత్నించాడు. అతనికి నిలబడాలని లేదు.
బూట్లు ధరించిన వ్యక్తి... బహుశా జైలు గార్డు అయ్యుండచ్చు.... చీకటి కేసి చూసినట్లున్నాడు. తర్వాత ఏం చేయమంటారన్నట్టుగా ఉన్నాయోమో ఆ చూపులు. ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్టు... దూరంగా వెళ్ళమన్నట్టు చీకటి సైగ చేసినట్టుంది... బూట్లు దూరంగా వెళ్ళి నిలుచున్నాయి.
మళ్ళీ నిశ్శబ్దం. అతని పెదవులపై దురదగా ఉంది. తల వేలాడిపోతోంది. అతని ముఖం కట్టేసిన చేతులకు సమీపంలో ఉంది. నోటిలో రక్తం యొక్క ఉప్పదనం అతని ఇంకా తెలుస్తోంది.
ఖణ్‌మన్న శబ్దం!
లోహమేదో నెమ్మదిగా ఖంగుమంటున్న శబ్దం విన్నాడతను.
ఖణ్!
ఆ శబ్దం దేన్నుంచి వస్తోందో అతనికి అర్థం కాలేదు. రెండు లోహపు ముక్కలు ఒకదాన్ని మరొకటి తాకితే వచ్చే చప్పుడులా ఉందది.
నిశ్శబ్దం మరింత ఎక్కువయింది. మధ్యమధ్యలో చిన్నగా ఖణ్‌మనే శబ్దం వినబడుతూనే ఉంది.
కుర్చీ కిర్రుమనడం తెలుస్తోంది. ఆ చీకట్లోనే దూరంలోని చెప్పులు తన వైపు రావడం అతను గ్రహించాడు.... గట్టిగా నొక్కసాగాయా చెప్పులు... ఎముకలు విరిగిపోయేటంతగా...
ఖణ్!
మళ్ళీ ఖణ్‌మన్న ధ్వని వినబడింది. ఈ సారి మరింత దగ్గరగా... చెవి పక్కనే!
''నువ్వు... నేర్చుకోవాలి... సంతకం పెట్టమని అడిగినప్పుడు.... పెట్టాలి.''
ఖణ్!
''ఏదేమైనా సరే....''
ఆ శబ్దం... ఇనుప పటకారు లేదా కటింగ్ ప్లయర్ ఇనుప కొసలను తాటిస్తే వచ్చే చప్పుడు లాంటింది.
చెమటతో కలిసిన గాఢమైన 'టీ రోజ్ కొలోన్' వాసన బలంగా సోకింది.
''ఏ చేత్తో రాస్తానని చెప్పావు.... కుడి చెయ్యి కదా...''
అతని చేతి ఎముకలు విరుగుతున్నాయి.
ఖణ్!
చల్లని ఆ ఇనుప వస్తువు... పటకారు లేదా కటింగ్ ప్లయర్ కొస అతని మధ్య వేలిపై నిలిచింది.
''నీ ముందు ఏ కాగితం పెడితే దానిపై సంతకం చేయడం నువ్వు నేర్చుకోవాలి.''
ప్లయర్‌ని గోరు మీద నొక్కింది చీకటి. గాయం... బాధ....
''నువ్వు నేర్చుకుంటావు.... ప్రతీ ఒక్కరు నేర్చుకుంటారు...''
ఇంకా గట్టిగా గుంజింది చీకటి. నొప్పి తీవ్రమైంది. గోరు కింద మంట మొదలయింది.
''నువ్వు వేగంగా నేర్చుకుంటావు.... చాలా తొందరగా నేర్చుకుంటావు...''
కటింగ్ ప్లయర్ కొస అతని వేలి గోరుపై భాగాన్ని పట్టుకుంది. అతని వేలు వణుకుతోంది. తన వేలి నుంచి గోరుని పూర్తిగా బయటకి లాగేస్తున్న భావన అతనికి కలిగింది.
''ఆమె నిన్ను ఎంతగా బ్రతిమాలుకుందో విన్నావుగా...''
క్రమంగా అతని అరచేయి, చేయి, భుజం కూడా వణకసాగాయి.
''ఆమె ఏడుపు నువ్వు విన్నావుగా...?''
గోరుని వేలి నుంచి వేరుచేసినందువల్ల కలిగిన నొప్పి శరీరమంతా వ్యాపించింది.
''ఎందుకు? .... ఇలా ఎందుకు చేస్తున్నావ్ మొర్తజా?''
అతనికి ఊపిరి ఆడడం లేదు. గరగర మంటున్నాడు.
చీకటి ప్లయర్‌ని మెల్లగా గుంజింది. కుదురు నుంచి తన గోరు బయటకి వచ్చేసినట్టనిపించిది అతనికి.
మళ్ళీ నిశ్శబ్దం ఆవరించింది. అతని మొత్తం శరీరం ఆ వేలుగా, ఆ సలిపే గోరుగా మారిపోయింది.
''నువ్వు నేర్చుకుంటావ్...'' మెల్లిగా అంది చీకటి.
గోరుని లాగి పడేశాడు.
తన మొండెం నుంచి భుజం వేరయిపోతున్నట్టు అనిపించింది. హఠాత్తుగా అక్కడున్న చీకటంతా తెరిచి ఉన్న అతని నోటి నుంచి ప్రవహించింది.
రచయిత గురించి
హుస్సెన్ మోర్తెజాయిన్ అబ్కేనార్ (Hossein Mortezaeian Abkenar) 1966లో ఇరాన్‌లోని టెహ్రాన్‌లో జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ టెహ్రాన్ నుంచి పెర్‌ఫార్మింగ్ ఆర్ట్స్‌లో బాచిలర్స్ డిగ్రీ పొందారు. ఆర్ట్ యునివర్సిటీలోనూ, ఇతర స్వతంత్ర సంస్థలలో క్రియేటివ్ రైటింగ్ బోధించారు.
ఇరాక్‌తో ఇరాన్ యుద్ధం చేసినప్పుడు, అబ్కేనార్ యువకుడు. యుద్ధానికి కారణాలేమిటో ఆయనకి తెలియదు. కానీ యుద్ధం చాలాకాలం కొనసాగుతుందని గ్రహించారు. అప్పుడాయన వయసు 19 ఏళ్ళు. యువతకు సైన్యంలోకి వెళ్లడం తప్పనిసరి కాబట్టి సైన్యంలో సేవ చేయవలసి వచ్చింది. ఆయన రెండు సంవత్సరాలు సైన్యంలో పని చేశారు. ఆయన యుద్ధరంగానికి పంపారు. తనకు తెలియని ఒక దేశం ప్రజలపై తానెందుకు వ్యతిరేకత, ప్రతీకారం కనబరచాలో ఆయనకి అర్థం కాలేదు. తను బలవంతంగా యుద్ధం చేస్తున్నానని బాధపడ్డారు. యుద్ధ సమయంలో ఆయన చాలా భయంకరమైన విషయాలు చూశారు: బాంబు దాడులు, భయంకరమైన హత్యలు, స్వీయ గాయాలు, సైనికుల ఆత్మహత్యలు! యుద్ధం నుండి తిరిగి వచ్చిన చాలా సంవత్సరాల వరకూ ఆ బీభత్సం ఆయనని వెంటాడుతునే ఉంది.
1999లో ఆయన రచిందిన కథా సంపుటి ''ది కన్సర్ట్ ఆఫ్ ఫర్‌బిడెన్ టార్స్'' వెలువడింది. 2003లో ''ది ఫ్రెంచ్ పెర్ఫ్యూమ్'' అనే మరో కథాసంపుటాన్ని వెలువరించారు. దీనికి లవాలా పురస్కారం లభించింది. ఇరాన్-ఇరాక్ యుద్ధ నేపథ్యంతో 2006లో ఆయన ఒక నవల రాశారు. దాని పేరు ''స్కార్పియన్ ఆన్ ది స్టెప్స్ ఆఫ్ ఆండీమెష్క్ ట్రెయిన్ స్టేషన్'' (Scorpion on the Steps of Andimeshk Train Station) లేదా ''బ్లడ్స్ డ్రిప్పింగ్ ఫ్రం దిస్ ట్రెయిన్'' (Blood’s Dripping From This Train). ఈ నవల ఎన్నో ప్రశంసలు పొందింది. ఈ నవలకు గాల్‌షిరి అవార్డు, మెహ్రెగన్ అవార్డు, వార్షిక వావ్ అవార్డు లభించాయి.
ఇరాన్‌లో - సంగీతం, సాహిత్యం, సినిమా, పెయింటింగ్స్, చిత్రకళ - ప్రతీదానిపై సెన్సార్‌షిప్ ఉంది. రాజకీయ మరియు మతపరమైన కారణాల వల్ల సజనాత్మకకీ, కళల ప్రదర్శనకీ అనేక అడ్డంకులు ఉన్నాయి. కళాకారులు ఈ అడ్డంకులను సులభంగా అధిగమించలేరు. ఒకవేళ ఎవరైనా అధిగమించడానికి ప్రయత్నిస్తే ఆ కళాకారుడి రచనలు నిషేధించబడతాయి. లేదా అతను ఇబ్బందుల్లోకి పడతాడు, జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది లేదా జైలులో నిర్బంధిస్తారు. విప్లవం, మతపరమైన మార్పులు, యుద్ధం, నిర్బంధాలు, మరణశిక్షలు, ఇమ్మిగ్రేషన్, అధికార దుర్వినియోగం, అవినీతి - వాటి గురించి రాసినందుకు రచయితపై ఒత్తిడి పెరిగింది. మహిళల సమస్యలపై, రాజకీయ సమస్యలపై, యుద్ధంలో దష్టి కేంద్రీకరించడం, జైళ్ళు, హింస తదితర అంశాలపై కథలు రాసినందుకు, తొలి నవలలో ఉద్దేశపూర్వకంగా ఒక యుద్ధ వ్యతిరేక స్థితి గురించి రాసినందుకు అబ్కేనార్ పుస్తకాల అమ్మకం మరియు ప్రచురణ ఇరాన్‌లో నిషేధించబడ్డాయి.
ప్రశాంతమైన, నిర్భయ స్థితిలో రాయాలనుకునే అబ్కేనార్‌కి 2013-14లో హార్వర్డ్ యూనివర్శిటీ వారి స్కాలర్‌షిప్ లభించడంతో అమెరికాకి వెళ్ళిపోయారు. 2014 నుండి 2017 వరకు అతను బెవర్లీ రోజర్స్, యూనివర్సిటీ ఆఫ్ నెవడా, లాస్‌వేగాస్‌లో కరోల్ సి. హార్టర్ బ్లాక్ మౌంటైన్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫెలోగా ఉన్నారు.
ఇటీవలి సంవత్సరాలలో ఇరాన్‌లో జరుగుతున్న ఘటనలూ, విషయాలతో ఓ నవల రాస్తున్నారు.
Sat 06 Jan 23:07:18.221236 2018