న్యాయం అనేది... ఇక్కడ మరీచిక
న్యాయం అనేది... ఒక సాలభంజిక
న్యాయం అనేది... వాయిదాల వంతెన...
న్యాయం అనేది... కేవలం వెతుకులాట... అద్దరి వుందో లేదో తెలియని అనంతమైన ప్రయాణం
న్యాయం అనేది... కాయితాలూ... 'లా'ధికార్లూ... లుకలుకలూ... మతలబులూ...
న్యాయం అనేది... మూడు రంగుల 'ఆదర్శం' కాదు...
న్యాయం అనేది... కెేవలం వివిధ రంగుల కలనేత మాత్రమే
న్యాయం అనేది... చుట్టూ అలుముకున్న 'నిస్తేజపు' మంచు ... నిర్వేదపు గబ్బు...
న్యాయం అంటే... వేచివుండటం...
న్యాయం అంటే... నిస్త్రాణ...
న్యాయం అంటే... నిస్సహాయత
న్యాయం అంటే... మంచుకత్తి
న్యాయం అంటే... వాయిదాల మీద వాయిదాలు.
''అమ్మా... అమ్మా...'' లోపలికి వస్తూ... భుజానికున్న బేగ్‌ను గోడదగ్గరగా పెడుతూ... అందులోంచి తనకిష్టమయిన సపోటాలను తీసి నాకు కనిపించేలా ఎదురుగా పెట్టాడు.
నా కళ్ళు 'తనని' తరచి చూస్తున్నాయి... ఆప్యాయంగా తడుముతున్నాయి... భుజాలను పట్టి... పట్టి అలానే... కళ్ళను... చేతులు చాపి పొట్టను తడుముతున్నాయి... అది గమనించినట్లున్నాడు... లేదా... నా కళ్ళు తననీ... పొట్టనీ... తడుముతున్న వైనం తెలుసుకున్నట్లున్నాడు... లేదా... అప్పటికి 'ఆకలి' అనిపించిందేమో?
''అమ్మా... ఆకలేస్తూందే... ఏమన్నా పెట్టవే'' అంటూ నా చేతిని తన అరచేతిలో పెట్టుకుంటూ... మెల్లగా నిమురుతూ... మరో చేత్తో... నాచేతికున్న గాజులతో మెల్లగా ఆడుకుంటూ... ఆలోచన తెగిపోయింది... ఏవేళప్పుడు తిన్నాడో... అనుకుంటూ... తనకేసి ఒకసారి ఎంతో మురిపెంగా చూస్తూ ... తన జుట్టును వేళ్ళతో చెదరి పోయేలా... ఆప్యాయంగా చేతితో కదుపుతూ... మెల్లగా లేచాను.
పక్కనే కూర్చుని... కంచంలో పెట్టిన అన్నం... తన కిష్టమైన దోసకాయ పప్పూ... పెసరపప్పు పచ్చడీ... ఆపై కొద్దిగా పెరుగన్నం తిని లేచాడు.
చేతులు కడుక్కుని వస్తూ... నా కొంగుకు ఆ తడి... అతడి చేతిని శుభ్రంగా తుడుచుకుంట ... ఒక్కడుగు వెనక్కువేసి... నా భుజాలను పట్టుకుని... ''అమ్మా... కళ్ళుమూసి... యిటుతిరగవే'' ... తన కుడిచేయి మూసి... తనుకూడా కళ్ళు మూసుకునే వున్నాడప్పుడు... రెండువేళ్ళను ముక్కుపై... ఒకదాని తర్వాత మరొకటి కదుపుతూ... సరిగ్గా ఒక్క నిముషం తర్వాత... ''అమ్మా... యిప్పుడు కళ్ళుతెరచి... ఒక వేలు పట్టుకోవే'' ... అన్నాడు.
''అదికాదురా... సుబ్బూ... చిన్నప్పటినుంచీ... నీ వరస యిదేకదరా... నిర్ణయం తీసుకునేదీ... తీసుకోవాల్సిందీ నువ్వే కదరా... అవన్నీ నాకెలా తెలుస్తాయి చెప్పు... ఏది మంచిదో అదే కద మనం అనుకుని... ఆ మేరకు పనులను సానుకూలపరచుకోవడమూ జరుగుతోంది యిప్పటివరకూ... అయినా యింతవయస్సువచ్చినా... యింకా అదే పద్ధతంటే... ఆలోచించు... నీకు అవగతం కానిదంటూ ఏమీలేదు... అయినా... నీ తృప్తి కోసంకదరా... నేను ముందునుంచీ కూడా... నేను నువ్వడిగినట్లుగా 'నిర్ణయం' తీసుకుంటున్నాను'' అంటూ... ఒకవేలు పట్టుకున్నాను.
''అది... అది... చాలు అమ్మా... యిప్పటివరకూ... నాకోసం నువ్వెంత కష్టపడ్డావో... కష్టపడుతున్నావో... నాకు తెలుసమ్మా... యింక నీకు ఎటువంటి కష్టం కలగకుండా నేను చూసుకుంటానమ్మా... నువ్వు మనసులో కోరుకున్నదీ... నేనుకూడా... అనుకుంటున్నదీ... తప్పక నెరవేరుతుందమ్మా... అందుకని కూడా నన్నాశీర్వదించమ్మా''... రెండు చేతులతో నమస్కరిస్తూ... వంగొని నాపాదాలను... తన చేతులతో అద్దుకుంటూన్నప్పుడు... నా పాదాల మీద రెండు కన్నీటి చుక్కలు... అలానే... సుబ్బూ తలమీద... నాకంట్లోంచి జారిపడ్డఆనందబాష్పాలు.
అయినా యిప్పటివరకూ ఏమీ కాలేదు.
ననన
మూడుసార్లు... నా పేరు పిలవడమూ... నేను ఎంతో వినమ్రంగా... లోపలకు వెళ్ళడమూ... అంతవరకూ చాలా ధైర్యంగా వుంటాను... అలా వున్నాననే అనుకుంటూనే... అక్కడ ఆ పిలుపుకోసం ఎదురు చూస్తాను... ఎప్పుడయితే... నా పేరు పిలుస్తారో... అంతే... అంతవరకూ ఉగ్గపట్టుకున్న ధైర్యంకాస్తా ... ఏ దెయ్యం ఎగరేసుకుపోతుందో... బేలనయి... బెంబేలెత్తుతూ... వడివడిగా లోపలకు వెళతానా... అంతా ఎంతసేపు... వెళ్ళినంతసేపుండలేదు ఎప్పుడూ కూడా... మరలా వాయిదా వరకూ... వేచివుండటం...
అయినా యిప్పటివరకూ ఏమీ కాలేదు.
ననన
ఎప్పుడూ కూడా... అట్లానే... చాలా ఉదాశీనంగా వుంటుంది అక్కడి వాతావరణమంతా... రొటీన్... రాటెన్ ప్రక్రియ... ఆ వైఖరీ... వాళ్ళ ప్రవర్తనా... 'గంభీరంగా' కనిపించాలని... తెచ్చిపెట్టుకున్నట్లుగా 'గొప్ప' హిపోక్రసీ.
ఏవేవో ప్రశ్నలతో నన్నుక్కిరిబిక్కిరి చేయడమూ... చాలా అగౌరవంగా మాట్లాడడమూ... ఏవేవో సైగలూ... వాళ్ళ శారీరక భాష... అంతా కూడా ఎంతో మార్మికతతో కూడినవిధంగా వుంటుంది. చాలా అనాగరికమైన వైఖరితో... అసహ్యంతో... అసహనంతో ... బయటకు వస్తాను. వాయిదా... మరల ... మరల ... వాయిదా ...
అయినా యిప్పటివరకూ ఏమీ కాలేదు.
ననన
నా ప్రమేయంలేకుండా బలవంతంగా నా శరీరాన్ని ... ఛిద్రం చేసిన పైశాచికత్వం... కూౄరత్వం... అమానుషత్వం... 'మృగాడి'నన్న అహంకారం ... సాంఘికంగా... సామాజికంగా... నన్ను చిన్న చూపు చూడడానికి అవకాశం కల్పించడం... యిదంతా కూడా...నా యిష్టం లేకుండానే... సంఘంలోనూ... కుటుంబపరంగా కూడా... ఆ నా వునికి .. అర్థంలేనిదయ్యింది. బంధువులూ... పరిచయస్థులూ... అందరూ... అందరూ కూడా... నిజానికి అప్పటి నా పరిస్థితికి... మద్దతిచ్చి... జీవితంమీద భరోసా కల్పించాల్సిన వాళ్ళందరూ కూడా... నన్నే వేలెత్తి చూపడమూ... ప్రస్తుతానికి నన్ను నేను మానసికంగానూ భౌతికంగానూకూడా... అందరినుంచి వెలి అయి... యిదుగో యిక్కడకు వచ్చిపడ్డాను.
నిజానికి అప్పటికి నాకు తెలిసిన జ్ఞానం అంతకూడా... తల్లిదండ్రుల చాటున పక్షిలా మాత్రమే కదా అయినా...''బంధువులు ఎంత చెడ్డవారైనా వదులుకోవద్దు... ఎందుకంటే... మురికినీళ్ళు దప్పిక తీర్చలేకపోయినా కనీసం మంటలను ఆర్పడానికి పనికి వస్తాయి కదా!''... గుండె మంటలను ఎలానూ వాళ్ళు కేవలం ఎగదోయడానికే గదా వున్నారనిపించే లాంటి వాతావారణం...
అందుకనే అనుకుంటా... అప్పుడప్పుడు... మరీ మనసు స్వాంతన కోరుకుంటున్నప్పుడు వున్న ఒకరిద్దరు స్నేహితులూ కూడా మొహం చాటేయడంతో... నిజానికి అప్పటి వాళ్ళ ప్రవర్తన కూడా అర్థం చేసుకోవచ్చుకూడా. ఎందుకంటే వాళ్ళు జీవితంలో స్థిరపడాలంటే... నా ఉనికి... కానీ... నా నీడ కానీ... వాళ్ళ మీద పడకూడదని కదా వాళ్ళ... వాళ్ళ తల్లిదండ్రులు... అలాంటి నిర్ణయం తీసుకున్నారు. నా జీవితం అయితే యిలా అయింది కానీ లేకపోతే నేను కూడా అందరిలా... ప్చ్... యిప్పుడు ఏమనుకుంటే ఏం గ్లాని.
''కష్టాల్లో వున్నప్పుడు మిత్రులు... బంధువులూ దూరమైనారని బాధపడకు... ఎందుకంటే... నీవు ఒంటరిగానే జయించగలవని వారు నమ్మినందుకు సంతోషించు.''
అయినా యిప్పటివరకూ ఏమీ కాలేదు.
ననన
అందరకూ వెలి అయి... నేనంటే... యింతదూరం వచ్చాను గానీ... నాకు ఏమాత్రం యిష్టంలేకుండా నా శరీరంమీద చూపించిన ఆ దాష్టీకం... నన్ను చాలాసార్లు... అంతమొందించుకోవలనిపించింది కూడా... కానీ... అవును... శరీరం మీదైతే తమ ప్రతాపం చూపించగలిగారు గానీ... నా ఉక్కులాంటి మనసును ఎవరుమాత్రం ఏం చేయగలరు... కచ్చితంగా అంతే... నన్ను నేను సంబాళించుకున్న ఆ క్షణం... జీవితంలో ఎంతో విలువైనది.
ఇటువంటి ఈతిబాధలతోటే... ముందు అమ్మా... ఆ తరువాత పద్ధెనిమిదీ... పంథొమ్మిది నెలల సమయంలోనే నాన్న కూడా... నన్నొంటరిని చేసివెళ్ళిపోవడంతో... యింక అక్కడ వుండీ ఏం చేయ్యాలి... ఏడవడం తప్ప... గుండెలవిసేలా ఏడిస్తే... పరిస్థితులు మారిపోతాయా... అలా అయితే... ఎంతకాలమైనా సరే... నేను ఎదురుచూస్తాను ఏడుస్తూ... ఏడుస్తూ...
నాకు సుదీర్ఘమయిన వర్తమానమయితే వుంది.సంఘటనల సమాహారమే భవిష్యత్తన్నా... చరిత్రన్నా కూడా నాకు భయం.
అప్పటికి నాలుగున్నర నెలల గర్భిణిని... ఒంటరిగా ప్రయాణం... అనంతంగా... అవిశ్రాంతంగా యిదుగో... యిక్కడ... యిలా నిలదొక్కుకోగలిగానంటే... అవును... నేను బతకాలి... కాదు కాదు... జీవించాలి. నాకోసం కాదు... నా కడుపులో ప్రాణం పోసుకుంటూన్న బాబు కోసం... బతకాలి. ఏదో చదువుండబట్టి యిలా అయినా నిలదొక్కుకోగలిగాను. ప్రస్తుతా నికి యిది చాలు యింక ముందు రోజుల సంగతంటారా అంతే అప్పటికప్పుడు పరిస్థితులకనుగుణంగా వర్తించడమే నాముందున్న కర్తవ్యం.
అయినా యిప్పటివరకూ ఏమీ కాలేదు.
ననన
వాయిదాకీ... వాయిదాకీ మధ్య నా ఆలోచనలలో వచ్చిన మార్పులే తప్ప మరక్కడంటూ ఏమీ గమ్యం కనపడడంలేదు...
ఈ మధ్యలో ఎవరో చెప్పారు... 'బెయిలు' వచ్చిందనీ... చట్టం యిచ్చిన 'కొత్త' రెక్కలతో... ఎగిరిపోయాడనీ... మరి యింక నాకు ఏమీ వినబుద్ధెయ్యలేదు... అసహనంతో నిలువునా కాలిపోతున్నానిపించింది కూడా.
అవును యిప్పుడు ఏడవాలనిపిస్తోంది గుండెలవిసేలా... గుండెల్లో రగులుతూన్న బడబాగ్ని జ్వాలలను నా కన్నీళ్ళతో ఆర్పేయాలి... అవును... ఆర్పేయగలగాలి... లేకుంటే... ఆ జ్వాలలు నన్ను నిలువునా భస్మీపటలం చేసేస్తాయి... అందుకయినా సరే... ఏడవాలి.
అలాగే... ''జీవితంలో హెచ్చుతగ్గులు రావటం కూడా మనమంచికే అనుకోవాలి. ఎందుకంటే ఈసీజీలో వచ్చే సరళరేఖ కూడా మృత్యువును సూచిస్తూ హెచ్చరించి మేలు చేస్తుంది కదా.'' అవును అందుకే నేను యిక్కడ యీ భూమిమీద నా గుండెలలో సెలవేసిన జ్ఞాపకాలను కన్నీటితో కడగలేను అందుకే ''అంతరిక్షంలో ఏడిస్తే కన్నీళ్ళు బయటకు రావు'' అనిపించడంలో అసహజం కూడా ఏమీ లేదనిపించింది.
అయినా యిక్కడ యిప్పటివరకూ ఏమీ కాలేదు.
ననన
బాబు... సుబ్బూ... ఎదుగుదలంతా కూడా... ఏడవతరగతి బోర్డుపరీక్షలూ... పదవతరగతీ... ఆపై నాలుగు కిలోమీటర్ల దూరంలోని కాలేజీకి రోజూ రానూ... పోనూ... మొత్తం ఎనిమిది కిలోమీటర్ల నడక... నడక... నిర్విరామంగా... ఆశగా... అప్పుడు కూడా ఏ గ్రూపు తీసుకోవాలనేందుకోసం... సుబ్బూ చేసిన పని... తన ముక్కుమీద... రెండువేళ్ళనూ ఆనించుకుని... అందులో ఒకటి నన్ను పట్టుకోమనడమూ... ఆ ప్రకారంగానే... ముందుకు భవిష్యత్తులోకి పయనమయిపోవడమూ అదే నిత్యకృత్యం అయిపోయింది. ఆ తర్వాత... డిగ్రీలో కూడా... తనకిష్టమయిన సబ్జెక్టులు తీసుకోవచ్చు కదా... కుదరదు... నా 'అనుమతి' కూడా కావాలంటాడు... అదయిన వెంటనే... రెండు బేంక్‌లలో ఉద్యోగంవచ్చింది. అప్పుడు కూడా... యిల్లాగే. అలానే... మరో రెండేళ్లకు... యిదుగో... యిలా. ఏం చేస్తున్నాడో... ఎలా వున్నాడో... అక్కడ సౌకర్యాలు ఎలా వున్నాయో... యిప్పటికి కూడా... నాకిది కావాలని అడగడం తెలియదు... పెట్టినదేదో తినడమే.
అయినా యిక్కడ యిప్పటివరకూ ఏమీ కాలేదు.
ననన
ఒత్తిడి... ఆరాటం... తెలియని భయం... మొదలైనవి 'నామవాచకాలు' మాత్రమేనా? అయితే అవిలేని జీవితాలుండవా... ఏమో... వుండే వుంటాయి... మనకు తెలీడంలేదేమో... మొదటినుంచీ కూడా నాకు తెలిసినవి కేవలం... అవే... అవి మాత్రమే... నన్ను శాసించేవీ... ముందుకు నడిపించేవీ కూడా అవడంతో... ప్రత్యేకంగా నాకు ఏమీ తెలియకపోయినా... కాలగమనంలోని వేగమూ... పరుగూ... మాత్రమే తెలుసు... చాలా సందర్భాలలో ఆ వేగమూ... పరుగూ... అందుకోలేక సతమతమయిపోవడమూ... దాంతో మరింతగా ఒత్తిడి... తెలియని భయంతో 'పలవరింతలూ'... తదితరాలు మాత్రమే నన్ను నియంత్రించేవి.
అందుకే అనుకుంటా... నేను కేవలం కార్యాలయంలో వున్నప్పుడు... ఎంతవరకూ అవసరమో అంతవరకూ... ఆ తరువాత... నాకున్న తోడల్లా... నాకున్న ఆశల్లా... నా భవిష్యత్తంతా కూడా... సుబ్బూ మీదే... వాడితోనే నా లోకం.. నా మనుగడ... నా శ్వాస... నా ధ్యాస... అంతెందుకూ... నా ఉచ్ఛ్వాస... నా నిశ్వాస కూడా వాడే... అందుకే వాడి భవిష్యత్తుకు మాత్రమే ఆశల నిచ్చెన వేయడమూ... వాడితోనే నా ప్రయాణమూ... ఆలంబనా... ''నిశ్శబ్దానికెపుడూ శబ్దమంటే విసుగే... కానీ... శబ్దానికే నిశ్శబ్దమంటే భయం.'' నాకున్న ఆనేకానేక భయాల్లో... యీ శబ్దభయం ఒకటని నేను గుర్తించేసరికే... కాలం నామీద తన ప్రతాపం చూపగలిగింది. అయినా... నో రిగ్రెట్స్... అయ్యామ్‌హేపీ... ఎస్... అయ్యామ్ ఆల్వేస్ హేపీ... కానీ... ఒక్కటే... అది... అది
ఇప్పటివరకూ యింకా ఏమీ కాలేదు.
ననన
అవును... యిక్కడ యిప్పటివరకూ ఏమీ కాలేదు... దాదాపు రెండున్నర దశాబ్దాల నా నిరీక్షణ... అది అనంతమైనదే...
అంతం లేనిదే... అందుకే కాబోలు...
ుష్ట్రవ జీబర్‌ఱషవ సవశ్రీayవస bబ్ aశ్రీరశీ ్‌ష్ట్రవ జీబర్‌ఱషవ సవఅఱవస.
నా కన్నీళ్ళకిప్పుడు దాదాపు అర్ధశతాబ్దం దాటుతోంది...
అవును... దాడి భౌతికం... దాడి అమానుషం... దాడి అతి హేయం...
అన్యాయం నిజం... అవమానం నిజం... దౌర్జన్యం నిజం... సూర్యుడు నిజం అన్నీ నిజాలే భువిలో ఏదీ అబద్దం కాదు.
నేరం నిజం... బాధ నిజం... కోర్టులు నిజం... సాక్ష్యాలూ... ఖాకీలూ... నల్లకోట్లూ... నిజం... నిజం...
ఎప్పుడయినా... ఎక్కడయినా... నేరం నిజమైనప్పుడు... ''శిక్షలు భయం పుట్టించనప్పుడు చట్టాలు సవ్యంగా అమలు కావు''. కచ్చితంగా నిజం... యిదే నిజం... అందుకే... నేను నేనులానే జీవిస్తాను... అయామ్ మి... నేను నేనే... అందుకే... ూవ్ ఎy ళస్త్రష్ట్ర్ bవ ఎఱఅవ
ఇప్పటివరకూ యింకా ఏమీ కాలేదు.
ననన
ఇంతలో... గుమ్మం ముందు కేబ్ ఆగిన సవ్వడి... తత్తరపడుతూ... తొందరపడుతూ... వడివడిగా గుమ్మం దగ్గరకు వెళ్ళాను... కాలింగ్ బెల్ మ్రోగకుండానే తలుపు తీసాను ...
అక్కడ... అవును... అక్కడ... నా సుబ్బూ... కాదు... కాదు... వాడిప్పుడు... కేవలం సుబ్బూ కాదు వాడిప్పుడు...
భరత్... సుబ్రహ్మణ్యం భరత్... అరుపిఎస్ అవును అరు.పి.ఎస్.
అవును... అంతకు ముందునుంచే... ఆ తరువాత నుంచీ కూడా... అప్పట్నించీ... యిప్పటికీ... ఎప్పటికీ... నేను... నేను... శకుంతలను అవును నేను... శ ... కుం ... త ... ల ... నే.
అందుకే ...!
- బుర్రా లక్ష్మీనారాయణ
Sat 07 Apr 12:10:22.559745 2018