Sun 22 Apr 07:07:42.227704 2018
Authorization
''ప్రవీణన్న పిల్చక రమ్మన్నడు'' ''ఎందుకూ?''
వచ్చిన వాళ్ళిద్దరూ తటపటాయింపుగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఆ అలికిడికి జీవన్ అమ్మానాన్నా లేచి వచ్చారు. రాత్రి పదకొండు గంటలయ్యింది. ఊరంతా మాటుమణిగి ఉంది. దూరంగా మర్రిచెట్టు దగ్గర కారు ఆగుంది. నిశ్శబ్దపు నిశీధి ఏదో అలజడిని రేకెత్తిస్తోంది.
''మన ప్రెసిడెంట్ సార్! ఈ దగ్గర్నే ఆక్సిడెంటయింది. అర్జంట్ గా బ్లడ్ కావాలిట. నిన్ను తోలుకు రమ్మన్నరు'' అందర్నీ చూసి విషయం వివరించారు వచ్చిన వాళ్ళు.
''పదండి'' జీవన్ నిర్వికారంగా చెప్పులు తొడుక్కుని సెల్ ఫోన్ తీసుకుని బయటకు నడిచాడు.
తల్లిదండ్రులకు అసలు విషయం అర్థమయింది. రమేష్ సార్‌కి ప్రమాదమయ్యింది. వాళ్ళబ్బాయీ, తమ కొడుకూ ఒకే చోట చదువుకుంటున్నారు. ఆపదొచ్చింది కాబట్టి బిడ్డను పిల్చకపోతుండ్రు అని సరిపెట్టుకుని కారు కదిలేవరకూ నిలబడ్డారు.
చీకటిని చీల్చుకుంటూ కారు దూసుకుపోతోంది. జీవన్ తల దిమ్మెక్కింది. తననెక్కడికో తీసుకుపోతున్నారు. ఏదో కుట్ర జరుగుతోంది. అమ్మానాన్నా కంగారుపడతారని మరేం మాటాడకుండా వచ్చేశాడు. ఎలా తప్పించుకోవాలి?
మరీ ఇంత కక్ష పెంచుకున్నాడా ప్రవీణ్? కులానికి ధనం తోడయితే అంత బలమొస్తుందా? తన తప్పేమిటీ?
యూనివర్శిటీ హాస్టల్లో ఉంటూ స్కాలర్షిప్స్ సహాయంతో చదువుకుంటున్నాడు. తనకి చాలా కలలున్నాయి. ఈ రమేష్ బాబు గారి కొడుకు ప్రవీణ్ చాలా దర్జాగా యూనివర్సిటీ క్యాంపస్ తనదే అన్నట్టు బృందాన్నేసుకుని తిరుగుతూంటాడు. తామిద్దరిదీ ఒకటే ఊరన్న దగ్గరితనం గాని, హైస్కూల్ నుంచీ కలిసి చదివామనే భావన గాని ఏ కోశానా లేని ప్రవీణ్ యూనివర్సిటీకి వచ్చేసరికి కులాల చరిత్ర సమస్తం తెలుసుకున్నవాడిలా దళితులను కించపరుస్తున్నట్టుగా మాట్లాడుతాడు.
''అన్నా చారు తాగుతావా?'' ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్న ప్రవీణ్ బృందంలో ఒకడైన రఘు మెల్లగా అన్నాడు.
''వద్దు. వద్దు. పోనీరు'' అన్నాడు జీవన్ గంభీరంగా. చీకట్లో రోడ్‌కి అటూ ఇటూ అస్పష్టంగా కనిపిస్తున్న పరిసరాలు తనని చూసి జాలిపడుతున్నట్టుగా వెనక్కి పరిగెడుతున్నాయి. ఈ కారు ప్రయాణానికీ, కిందటి వారం జరిగిన సంఘటనకీ ఏదో సంబంధం ఉంది..
తనకి ప్రవీణ్ వార్నింగ్ ఇవ్వనే ఇచ్చాడు. దాని ఫలితమా ఇది?
తన క్లాస్ మేట్ స్వాతికి తనలాగే సాహిత్యమన్నా తను చదివే పుస్తకాలన్నా ఇష్టం, గౌరవం. సమయం దొరికినప్పుడల్లా చాలా ఉత్సాహంగా, స్వేచ్చగా చర్చిస్తుండేది. అది ఎవరికీ తెలియని రహస్యమేమీ కాదు. ఒకసారి లైబ్రరీ దగ్గర చెట్టు కింద కూర్చుని ఏదో పుస్తకం తిరగేస్తున్న తన దగ్గరికి ప్రవీణ్ దూకుడుగా వచ్చాడు. ''స్వాతితో ఎందుకు మాటాడుతున్నావ్?'' కోపంగా అన్నాడు.
''తప్పేమిటీ! ఆమె నా క్లాస్ మేట్. పైగా సాహిత్యం మా ఇద్దరికీ ఇష్టం!''
''ఆహా... స్వాతి మా బాబాయి కూతురని తెల్సా? మన ఊళ్ళో గూడెమోళ్ళు మీరు. ఇక్కడి కొచ్చినంత మాత్రాన అంతరాలు పోతాయా?''
జీవన్ కి నవ్వొచ్చింది. ఈ పుస్తక పఠనం వల్ల సమాజం బాగా అర్ధమవుతూ అందరిమీదా ఇదివరకట్లా కోపం రావడం లేదు.
''అయితే?''
''మా చెల్లితో దోస్తీ వద్దు. ఎవరి గిరిలో ఆళ్ళుండాలే''
''అదేమిటో మీ చెల్లికే చెప్పు''
''నువ్వేమిటో బ్లడ్ డొనేషన్లు అంటూ మందిని వెంటేస్కుని పోతుండావంట. ఈమె వస్తున్నదంట''
''నేనెవర్నీ బలవంత పెట్టలేదే? నాకు బ్లడ్ డొనేట్ చేయడం చాలా కాలం నుంచి అలవాటు'' తాపీగా అన్నాడు. -
''అంతేలే. బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి జాతితో పనేంది?'' హేళనగా నవ్వాడు ప్రవీణ్. అదేదో పెద్ద జోకులా మిత్రబృందం పగలబడి నవ్వారు. ఒంటికి కారం రాసుకున్నట్లయింది జీవనకి.
'ఛా. వీళ్ళతో మాటలేంటి? అసలా అమ్మాయిని తనతో మాటాడొద్దని చెప్పాలి. తనకి భవిష్యత్ గురించి చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఈ గోలంతా ఎందుకు?' అనుకున్నాడు.
''మా ఆడపిల్లల గురించి మేం చాలా కేర్ తీసుకుంటాం. గుర్తు పెట్టుకో..'' ప్రవీణ్ హెచ్చరిస్తూ తన బృందంతో కదిలాడు.
తను ముభావంగా ఉండడం చూసి స్వాతి అంతా విని, ''ఏడ్చాడ్లే. వాడేంటి నాకు కేర్ టేకర్? నేను ఈ సిటీలో పుట్టి పెరిగినదాన్ని. మా నాన్న మరీ అంత అడ్డగోలుగా పెంచలేదు. నువ్వసలు వాడ్ని పట్టించుకోకు'' అని ఓదార్చింది. ఇది జరిగి పది రోజులయ్యింది.
దాని ఫలితమేనా? తననిలా లాక్కుపోవడం? తననేం చెయ్యబోతున్నారు?
కారు కీచుమని శబ్దం చేస్తూ ఆగింది. ఉలిక్కిపడిన జీవన్ తేరుకుని చుట్టూ చూశాడు. ధగధగలాడుతున్న లైట్లతో భవ్య హాస్పిటల్స్ కళకళలాడుతోంది. జీవన్ బాగా ఆశ్చర్యపడ్డాడు. తనేమిటో రకరకాలుగా భయపడ్డాడు. ప్రవీణ్ పరిగెత్తుకొచ్చి, ''అన్నా నీది ఓ గ్రూప్ అని తెలుసు...'' అంటూ జరిగిన ప్రమాదం గురించి చెబుతూ లోపలికి లాక్కుపోయాడు. ఏడ్చి ఏడ్చి అతని మొహం ఎర్రబడింది. జీవన్ ఇంకేమీ వినిపించుకోకుండా అలవాటుగా తన కర్తవ్యం నెరవేర్చాడు. రమేష్ సార్‌కి ఏం పర్వాలేదని అందరూ అనడం వినిపిస్తోంది. ప్రవీణ్‌కి గాని, తతిమ్మ మిత్రులకి గానీ ఇదివరకటి చులకనా, తిరస్కారం గానీ లేవు. 'అన్నా! అన్నా!' అంటూ ఏదేదో చెబుతూ జీవన్‌తో ఆప్యాయంగా మాట్లాడుతున్నారు.
ఒక ప్రమాదకరమయిన సంఘటన ఇంత మార్పుని తీసుకొస్తుందా? ఇదంతా తాత్కాలికమా? తెల్లవారుతుండగా బయటకు రాబోతున్న జీవన్ విచారంగా నవ్వుకున్నాడు.
''అన్నా, ఉండు కారొస్తంది'' ప్రవీణ్ గేటు దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. ఇంతలో ఎవరో వెళ్ళి కారుతో మెయిన్ గేట్ దగ్గరకొచ్చారు.
''దేవుడిలా వచ్చావన్నా'' ప్రవీణ్ గొంతు బొంగురుపోయింది. జీవన్ చేతులు అభిమానంగా ఊపాడు.
కారెక్కబోతున్న జీవన్ నవ్వుతూ అన్నాడు ''ప్రవీణ్ ఇప్పుడు నా రక్తం మీ నాన్న రక్తంలో కలిసిపోయింది. మనం ఏ జాతి?''
ఏదో అర్థమయినట్టుగా తలపంకించి కదిలిపోతున్న కారు వైపు చూస్తూ దీర్ఘంగా నిట్టూర్చాడు ప్రవీణ్.
- దాసరి శిరీష