''ఉంటానమ్మా!'' కూతుర్ని చూస్తూ సామాను ఉన్న సంచీని తీసుకుని క్యాబ్‌లో కూర్చుంటూ అన్నాడు రంగనాథం.
''సరే నాన్నా! ఇంటికి వెళ్ళాక ఒక్కసారి ఫోన్ చేయండి. అమ్మని, చెల్లాయినీ, నికేతని అడిగానని చెప్పండి... పరీక్షలు దగ్గరకు వచ్చాయి, బాగా కష్టపడి చదవమన్నాని చెప్పండి, నాన్నా''
''సరేనమ్మా! నేనిక బయల్దేరతా!''
''జాగ్రత్త నాన్నా!'' అంటూ తండ్రి కూర్చున్న క్యాబ్ బయల్దేరగానే సంతోషం నిండిన మనసుతో వడివడిగా లిఫ్ట్ ఎక్కి అదే సమూహంలో తన బ్లాక్ పక్కనే వున్న మరో అపార్టుమెంటుకు పరుగులు తీసింది భానురేఖ.
ముందు గదిలో టీవీ చూస్తూ సిగరెట్లు కాలుస్తున్న రేష్మంత్ ఆమెను చూస్తూనే కాలుస్తున్న సిగరెట్లు యాష్ట్రేలో పడేసి చేతులు రెండూ చాస్తూ అడిగాడు, ''మీ నాన్న వెళ్ళినట్లేనా?'' అని.
''ఆ! ఇప్పుడే క్యాబ్ ఎక్కించి నేరుగా నీ దగ్గరకే వస్తున్నా!'' అంటూ సంతోషంగా అతని కౌగిలిలోకి ఒదిగిపోతూ అంది భానురేఖ.
''అయినా ఈ మూడు రోజుల్లో ఎక్కడన్నా కలుస్తావేమోనని ఎంతగా ఎదురు చూశానో తెలుసా?'' రేష్మంత్ టీషర్టుకున్న బటన్‌ను తిప్పుతూ గోముగా అంది మళ్లీ తనే సంభాషణని కొనసాగిస్తూ, ''ఆ... మీ నాన్న ఊరునుండి వస్తున్నారని మీ ఫ్లాట్ వైపుకు రావద్దన్నావ్! అయినా నీకు తెలియనిదేముంది చెప్పు... స్నేహితులు పార్టీ ఇవ్వందే వదిలితేనా!'' ఆమె ముంగురులు సరిచేస్తూ అంతే గోముగా సమాధానమిచ్చాడు రేష్మంత్.
''ఏంటి! పార్టీ మీ స్నేహితులకొక్కరికేనా, మరి నాకు లేదా? నిన్ను చూస్తే నాన్నకేమయినా అనుమానం వస్తుందేమోనని ఎలాగో జాగ్రత్తగా మేనేజ్ చేసుకొచ్చాను!''
''నువ్వు లేకుండా పార్టీనా, అయినా మీ నాన్న చెప్పాపెట్టకుండా ఊరినుండి రాబట్టి కానీ నువ్వు లేకపోతే నాకు అది పార్టీనే కాదు, అయినా మనిద్దరికీ చాలా స్పెషల్ పార్టీలు ప్లాన్ చేశాగా, తొందరెందుకు. ముందయితే స్నానం చేసి రెడీ అవ్వు. ఈలోగా మనిద్దరికీ స్పెషల్ డిన్నర్ బుక్ చేస్తాను. బట్టలన్నీ సర్దుకుని వచ్చేరు. ఇకనుండి నువ్వు, నేను ఇదే ఫ్లాట్లో కలిసి ఉంటామని తెలుసుగా!''
''ఆ!... మరి మా కజిన్?''
''ఎవరూ? వీరేంద్రా! అతనికి మనగురించి అంతా తెలుసులే... మనం ఎంతో కాలంగా ప్రేమించు కుంటున్నామని, మూడు రోజుల క్రితమే ఆర్యసమాజ్లో వివాహం కూడా చేసుకున్నామని... నిన్న పార్టీలో వీరేంద్ర కూడా ఉన్నాడు... అయినా ఆ ఫ్లాట్ లో అతడు ఒక్కడే ఉండలేనంత చిన్నపిల్లాడేం కాదులే!
''అబ్బ! ఇక చాల్లే ఆపు రేష్మంత్... మనిద్దరం పెళ్ళి చేసుకున్నామని నాన్నకు ఎక్కడ తెలుస్తుందోనని ఎంతగా భయపడి చచ్చానో తెలుసా? ఇప్పుడే కొంచెం రిలీఫ్‌గా వుంది... అయినా మా కజిన్ ఒక్కడే ఉండలేడన్నది కాదు సమస్య... నాన్న కోర్టులో దావా గురించి పదేపదే వస్తుంటారని...''
''ఈ రోజే హియరింగ్ అయిన కేసు మళ్ళా తిరిగి బెంచీమీదకు రావటానికి చాలా సమయం పడుతుంది... ఈలోగా ఎన్ని వాయిదాలు పడతయ్యో!''
''అయినా సరే! నాన్న ఈసారి వచ్చినట్లుగా ముందుగా కబురు చేయకుండా వస్తే కష్టం. అదీకాక ఊర్లో ఎవరిదన్నా కేసు హైకోర్ట్ దాకా వస్తే వాళ్ళని వెంటబెట్టుకుని నేరుగా ఇక్కడికే వస్తారు నాన్నకు కోర్టు కేసుల్లో అనుభవం ఉన్నది కాబట్టి. అదీ కాక మన ప్రేమ విషయం ఈ మధ్యనే కదా నాన్న ముందుంచింది. ఆయన కొంత సమయం తీసుకుని ఆలోచించి చెబుతానన్నారు. ఈలోగా మనం రహస్యంగా పెళ్ళి చేసుకున్న విషయాన్ని రహస్యంగానే ఉంచుదాం. ఆయన మన పెళ్ళికి సరేనని పెళ్ళి చేస్తానంటే సంప్రదాయం ప్రకారం మళ్ళా పెళ్ళి చేసుకుందాం లేదా మన పెళ్ళికి 'నో' చెప్పారనుకో అప్పుడే మనం రహస్యంగా చేసుకున్న పెళ్ళిని బహిరంగపరుద్దాం. ఏంటి, ఓకేనా?''
''ఓకే తల్లీ! నువ్వు చెప్పినట్లే చేద్దాం... సరే! ముందు త్వరగా తయారయి రా!'' నమస్కారం చేస్తున్న ఫోజులో అన్నాడు రేష్మంత్.
''అయితే ఈ సెలవలు రెండు రోజులకూ సరిపడా బట్టలు తీసుకుని వస్తా. డిన్నర్లో నా స్పెషల్ ఐటమ్స్ ఉంటాయిగా... ఆ అన్నట్టు మీ స్నేహితుల నెవరినీ మన పెళ్ళి ఫొటోలను ఏ సామాజిక మాధ్యమాల్లో పెట్టొద్దని గట్టిగా చెప్పు... నేనూ మా కజిన్ కు చెప్పాలే!''
తన ఫ్లాట్లోకి రాగానే స్నానం చేసింది భానురేఖ. గడిచిన మూడురోజుల్నీ తల్చుకుంటే మనసంతా ఉద్వేగంతో నిండిపోయింది. .
తను, రేష్మంత్ పెద్దవాళ్ళకు చెప్పకుండా ఆర్యసమాజంలో పెళ్ళి చేసుకోవడం, పెళ్ళయిన కొన్ని గంటల్లోనే నాన్న ఊరునుండి అకస్మాత్తుగా రావటం, తను వెంటనే పెళ్ళి దుస్తులు, అలంకరణనుండి మామూలుగా మారి తండ్రికి కన్పించడం, అక్కడనుండి తండ్రిని క్యాబ్ ఎక్కించే వరకు అనుక్షణం తండ్రికి ఆ విషయం తెలియకుండా అప్రమత్తంగా ఉండటం అన్నీ ఓ కలలా అన్పించాయి. ఇక ఇప్పుడు ఎవరూ వస్తారనే భయంలేదు. ఈ అపార్టుమెంటు సంస్కృతిలో ఒకళ్ళ గురించి ఒకళ్ళకి ఎటూ పట్టదు. ఇక తను ఎవరికీ భయపడాల్సిన పని లేకుండా రేష్మంత్‌తో సంతోషంగా గడపవచ్చు.
ఆలోచన వచ్చిందే తడవు భానురేఖ చెక్కిళ్ళు గులాబీరంగు అద్దుకున్నాయి. వెంటనే తేరుకుని అలమరనుండి పెళ్ళి కోసమని ప్రత్యేకంగా కొన్న చీరల్లోనుండి ఒకదాన్ని తీసుకుని గబగబా కట్టేసుకుంది. అలమర్లో ఎవరికీ కనిపించకుండా భద్రంగా దాచి వుంచిన రేష్మంత్ తన మెడలో కట్టిన తాళిబొట్టు, మెట్టెలు, నల్లపూసలు ధరించి అలంకరణ మొత్తం అయిందని డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలో తృప్తిగా చూచుకున్నది ఒక్కసారి.
మరు నిముషం, 'అమ్మో! ఇక ఐదు నిముషాల్లో రేష్మంత్ ముందు ఉండకపోతే సెల్ ఫోన్ మోగటం మొదలవుతుంది. పర్ఫ్యూమ్ ఒక్కటీ స్ప్రే చేసుకుంటే సరి!'' అనుకుంటూనే రకరకాల పరిమళాలు వెదజల్లే స్పే'లు ఉంచిన డ్రెస్సింగ్ టేబుల్ అలమరా తలుపు తీసింది భానురేఖ. .
'ఏంటీ! ఇక్కడేదో పెద్ద కాగితమే ఉన్నదే, నాన్నగాని మర్చిపోయి వెళ్ళలేదుగదా అనుకుంటూ అక్కడే వున్న దాన్ని అందుకుని మడత విప్పింది భానురేఖ.
'అరె! ఇది చేతిరాతలో ఏదో ఉత్తరంలాగా వున్నది... అవును, అనుమానం లేదు... ఇది నాన్న చేతిరాతే' అనుకుంటూనే క్షణాల్లో ఆ ఉత్తరంలో ఉన్న ''అమ్మా! భానూ!'' అంటూ మొదలయిన అక్షరాల వెంట భానురేఖ కళ్లు ఆత్రంగా పరుగులు పెట్టసాగినయి.
''ఇలాంటి పిలుపు కొన్ని వేల సార్లో, లేక లక్షల సార్లో పిలిచుంటాను నువ్వు పుట్టిన దగ్గరనుండి. కానీ ఈ పిలుపు ఈసారి మాత్రం నాకే ఎందుకో కొత్తగా అనిపిస్తోంది.
నువ్వు నీ ఇంటరు పూర్తయి మన ఇంటికి, ఊరికి దూరంగా ఉన్నప్పటినుండి నేను నిన్ను కలవటానికి ఎన్నోసార్లు వచ్చాను. అది నీ చదువయినా, ఉద్యోగం అయినా, అది ఏ ఊరయినా కలిసి వెళ్తున్న ప్రతిసారీ నా బంగారు తల్లిని వదిలి వెళ్ళాల్సి వస్తోందని బాధగా వెనుదిరిగేవాడిని. నా భాను తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళను వదిలి ఒక్కతే ఎలా ఉంటుందో అని. ఆ బాధ నిన్ను వదిలి వచ్చిన రెండు రోజుల వరకు అలాగే ఉండిపోయేది. అదే మాట మీ అమ్మతో అంటుంటే ''చాల్లేండి చోద్యం! మన భాను ఎన్ని సంవత్సరాలనుండి విడిగా ఉండటంలేదు. మీ భయమే కాని. రేపోమాపో పెళ్ళి చేసి అత్తగారింటికి పంపించాల్సిన వాళ్ళం. దాని గురించి పదేపదే ఆలోచించి మనసు పాడుచేసుకోకండి'' అని అది చెప్పిన కారణం సరయినదే అని మనసుకు సమాధానం చెప్పుకున్నా నా మెదడు మాత్రం నీ గురించే ఆలోచిస్తుండేది. ఆ బాధ ఎప్పటి వరకూ అంటే నిన్ను కలవడానికి ఏదో ఒక సాకు దొరికేటంత వరకు. నిన్ను కలిసే వరకు కొత్త ఉత్సాహంతో పనిచేసే వాడిని. మీ అమ్మేం తెలివి తక్కువది కాదుగదా. వెంటనే గ్రహించేసేది. ''ఏంటీ! భానుని కలవటానికి ముహూర్తం పెట్టేసినట్లున్నారే... హుషారుగా కన్పిస్తున్నారు... ఎప్పుడేంటి? ఏ పిండివంటలు చేసి ఉంచేది? ఆ... ఇదుగో భానుకి నచ్చుతుందని కొత్త డ్రస్ ఒకటి కుట్టించి రెడీగా పెట్టాను... మర్చిపోకుండా పట్టుకుని వెళ్ళండి'' అని నన్ను ఆటపట్టిస్తుండేది. దానికి నా నవ్వే సమాధానమయ్యేది. అయినా మీ అమ్మకు తెలీదా నా ముగ్గురి సంతానంలో ఇద్దరు నా కళ్లముందే ఉంటారు రోజూ. నా ప్రాణానికి ప్రాణమయిన నా భాను ఒక్కతే కదా నా దగ్గర ఉండదని. ఆ ఉత్సాహం నిన్ను కలిసి వెనుతిరిగే క్షణంలోనే ఆవిరయిపోయేది. నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళలేక ఎంతో భారంగా వెనుదిరిగినా గుండెల నిండా ఆత్మవిశ్వాసాన్ని నింపుకుండే వాడిని. నా కూతురు తెలివిగలది. ఒక్కతే ఉన్నా జాగ్రత్తగా ఉండగలదని. కాని ఈసారి మాత్రం నేను భారంగానే కాదు చాలా బాధగా వెనుదిరుగుతున్నాను. చాలా సంతోషంతో ఉన్న నువ్వు బహుశ: గమనించగలిగిన స్థితిలో లేవనుకుంటా. కాని ఇప్పుడు మాత్రం నాకూతురు నేను ఊహించిన దానికంటే చాలా చాలా తెలివి గలదని మాత్రం అర్థం చేసుకున్నా, తల్లీ! భానూ!
నీకు ఇలా ఉత్తరం రాయాల్సి వస్తుందని ఏనాడూ ఊహించలేదు. అసలు ఏ ఉత్తరమూ రాయకుండానే వెళ్ళిపోదామనుకున్నాను మొదట. నా మదిలో నలుగుతున్న ఘర్షణ నీకు తెలియజేయకుండా వెనుదిరగలేకున్నా, భానూ! నువ్వు పుట్టినప్పటినుండి ఈ చేతులతో పెంచి పెద్ద చేశాను. నీ చిన్నతనం నుండి నీతోనే ఉండి నీ సంతోషాన్ని, దు:ఖాన్ని, బాధని, ఆనందాన్ని నీతోపాటు అనుభవించాను. అలాంటిది నేను వచ్చిన రోజు నీ ముఖంలో వెలిగిపోతున్న సంతోషాన్ని గమనించలేనా? ఆనందంతో నిండిన నీ మనస్సును కనిపెట్టలేనా?
దానికి కారణమేమయి ఉంటుందా అని ఆలోచించాను. ఉద్యోగంలో ప్రమోషనుగాని ఇచ్చారా, లేక కంపెనీ తరుపున విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చిందా అని గబగబా ఆలోచన చేస్తున్న మనసుని అదుపు చేసుకున్నాను. ఇంతలోనే నాకెందుకీ తొందర? అంతలోనే నా భాను అరగంట తర్వాతయినా నాకు చెప్పకపోదులే అనే భరోసా... ఆ క్షణం తర్వాతే గుర్తించగలిగాను. నన్ను చూడగానే నీలో కలిగే ఆనందం ఈసారి నీ ముఖంలో కన్పించలేదు. దాని స్థానంలో నన్ను చూసిన నీలో కలిగిన తొట్రుపాటు నన్ను దాటిపోలేదు.
కాని మరుక్షణం నన్ను నేను సర్దిచెప్పుకున్నాను. ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉందేమోనని. అదీకాక చెప్పాపెట్టకుండా నేను వచ్చింది పని దినాల్లో కదా.
పది నిముషాల తర్వాత అర్థం చేసుకోగలిగా. నా రాక నీకు ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వకపోగా చాలా అసౌకర్యంగా ఉందని.
ఇంతవరకూ ఎప్పుడూ ఎదురవ్వని స్థితి. ఎప్పుడూ అనుభవంలోకి రాని కొత్త అనుభవం. నా కూతురేనా నన్ను రాకూడని సమయంలో పరాయివాళ్ళు వచ్చినట్లుగా చూస్తోంది... అని మనసులో బాధతో కూడిన ఆందోళన కాసేపు. తేరుకుని అప్పుడు సరిగా గమనించగలిగా నిన్ను... నీ ముఖంలో ఆనందాన్ని, నీ మనసులో దాచి ఉంచిన సంతోషాన్ని... దాని వెంట నన్ను చూడగానే ఇబ్బందిగా పెట్టిన నీ ముఖకవళికల్ని. దానికి తోడు వెంటనే నీనుంచి వచ్చిన ప్రశ్నలు ''కోర్టు పనిమీదేనా నాన్నా వచ్చింది? ఎన్ని రోజులుంటారు?'' నన్ను చూడగానే ఎప్పుడూ వేసే ప్రశ్నలు ''అమ్మని కూడా తీసుకురావాల్సింది... మామ్మా చెల్లి, తమ్ముడూ ఎట్లా ఉన్నారు? ఆమ్మ నాకోసం ఏం పంపించింది?'' అంటూ గబగబా నా సంచీని వెతకటం... వాటికి పూర్తిగా విభిన్నమయిన నీ ప్రశ్నలు, చర్యలు- కనీసం నా ఎదురుగానైనా కూర్చోకుండా, నే చెప్పే విషయాలకి నువ్వు జోడిస్తున్న కృత్రిమ నవ్వు... ప్రతిక్షణం సెల్ ఫోన్ మీదనుండి మరలని నీ దృష్టి...
ప్రతిసారి నే ఒక్కడినే ఒంటరిగా వచ్చి నిన్ను కలిసి వెళ్తుండే వాడిని, ఇక్కడి విషయాలు చెప్పుంటే మాత్రం మీ అమ్మ ముఖం సంతోషంతో వెలిగిపోతుండేది. ఏదో ఒకటి రెండుసార్లు మాత్రమే నాతోపాటు నిన్ను చూడటానికి వచ్చినట్లు గుర్తు. నేనొక్కడినే కలిసి వెళ్తే తను కూడా కలిసినట్లేనని నామీద, నీమీదా ఉన్న భరోసా అది. పెద్ద వయసులో వున్న మీ మామ్మని, నీ చెల్లెలు, తమ్ముడిని వదిలి రాలేని పరిస్థితి మరి. కాబట్టే వచ్చివెళ్ళిన ప్రతిసారి పూసగుచ్చినట్లు తను అడిగేది నేను ఏ విషయమయినా చెప్పకుండా వదిలేస్తానేమోనని.
కాని మొదటిసారిగా ఈ సారి మాత్రం నాతోపాటు అమ్మను కూడా తీసుకు రాలేకపోయానని మాత్రం బాగా అన్పిస్తోంది.
నాతో పంచుకునే ఈ మొహమాటపు నవ్వు, సంభాషణ కాకుండా, మీ అమ్మతో అయితే మనసు విప్పి అన్ని విషయాలు చెప్పుకుని ఉండేదానివేనని.
చిన్నతనంలో బడిలో జరిగిన ప్రతి విషయం (నేను ఆఫీసునుండి రావటం ఆలస్యం) మొదట నాతోనే పంచుకునే దానివి. తరువాతే మీ అమ్మకు... అది క్రమేణా కాలేజీకీ వచ్చేసరికి నాకు చెప్పే విషయాలు వేరు, మీ అమ్మకు చెప్పే విషయాలు వేరుగా మారిపోయింది. అదే ఇప్పటి వరకూ నడుస్తూ వచ్చింది.
అందుకే అన్పించింది మీ అమ్మని నా వెంట తీసుకుని వస్తే ఈ తపన నా మనసులో ఎక్కువసేపు ఉండేది కాదని. ఇదంతా నేను వచ్చిన మొదటి రోజు వరకు మాత్రమే...
కాని, రెండో రోజునుండే అర్థమయింది నా ఆలోచన తప్పని... నా ఆందోళన ఆ రకంగా తీరేది కాదని...
క్రితంసారి వరకు నేనున్న సమయంలో ఏదో ఒకటి రెండు సమయాలల్లో మాత్రమే నీ ఫోనును పక్కకు తీసుకు వెళ్ళి మాట్లాడేదానవు. ఫోను మోగిన ప్రతిసారీ, ''సారీ! నాన్న ఊరునుండీ వచ్చారు... నేను బయటకు రాలేను' అని ఫోను కట్ చేసేదానవు. 'నాన్నా ఇది చేసి పెట్టనా, అది చేసి పెట్టనా, ఇంకా ఏంటి విషయాలు' అని నేనున్నంత సేపూ నా చుట్టూనే తిరిగే భానూనే నాకు తెలుసు.
ఈసారి మాత్రం పదేపదే ఫోను పక్కకు తీసుకు వెళ్ళి చాలా సేపటి వరకు మాట్లాడుతూ అదీ నాకెక్కడ విన్పిస్తుందోనని ఎంతో చిన్న గొంతుకతో. నువ్వు ఎటు వెళ్ళినా ఫోను నీ దగ్గరే ఉంచుకుని వెంట వెంటనే సమాధానం చెప్పటం నేను గమనించలేదంటావా?
మా ఆఫీసులో నా కొలీగ్స్ అడుగుతుంటారు 'రంగనాథ్ ఎప్పుడూ నా కూతురు, నా కూతురు అని పెద్దకూతుర్ని కలవరిస్తూ ఉంటాడు... వేరే ఊళ్ళో ఉన్నా తరచూ వెళ్లి చూసొస్తాడు... రేపు పెళ్ళి చేసి కూతుర్ని అత్తగారింటికి పంపితే ఇంత స్వేచ్ఛగా అనుకున్న ప్రతిసారీ ఎలా కలవగలడని. ఎంతయినా ఆ ఇంటికి కాస్తో కూస్తో పరాయివాడివే కదా! అని''.
'ఆనాటి సంగతి కదా! అప్పుడు చూసుకుందాంలే, అయినా నా కూతురి దగ్గర నేను పరాయివాడిని ఎట్లా అవుతాను'' అని వాళ్ళ అమాయకత్వానికి నాలో నేనే నవ్వుకునే వాడిని.
కాని, ఇప్పటికే నీ మనసులో నేను పరాయివాడినయ్యానని అర్ధమయి మనసంతా ఎంత బాధతో నిండిపోయిందో బహుశ: నీకు చెప్పినా అర్థంకాదేమో.
నువ్వు పుట్టినప్పుడు మా అమ్మ, అదే నీ మామ్మ చాదస్తం కొద్దీ అన్నమాట గుర్తుకొస్తోంది. 'మొదటిసారి అబ్బాయి పుడితే బాగుండేదిరా' అని. కానీ ఆనాడే దానికి నేను గొప్పగా చెప్పిన సమాధానం ''అదేంటమ్మా! అబ్బాయి కాకపోతేనేంటి? అది నాకూతురు... నా రక్తం పంచుకు పుట్టింది' అని.
నువ్వు ఎదిగేకొద్దీ నీ ఎదుగుదల చూసి అనుక్షణం సంబరపడేవాడిని. నువ్వు ఏ పరీక్షలు రాసినా ఎంత రాత్రయినా నీతోపాటే మేల్కొని కూర్చునేవాడిని. నీకు గుర్తుండే ఉంటుంది మీ అమ్మ సున్నితంగా కసురుకుంటుండేది, 'మీరు పొద్దున్నే ఆఫీసుకు వెళ్ళాలి... భాను చదువుకుని పడుకుంటుందిలే' అంటూ. నేనోరోజయినా వింటేనా...
నువ్వు సంగీతం క్లాసునుండి ఒంటరిగా రాగలవని తెలిసినా పోకిరీ కుర్రాళ్ళు నా కూతుర్ని ఎక్కడ ఏడిపిస్తారోనని నువ్వు వచ్చేదాకా గుమ్మం బయటే నిల్చుని ఉండేవాడిని గుర్తుకొచ్చిందా?
ఏదయినా కొత్త వస్తువు కనబడి నీకు ఉపయోగపడుతుందంటే చాలు కొని తీసుకువచ్చేవాడిని. అది చూసి మీ అమ్మ, ''ఇంట్లో ఉన్న మిగతా ఇద్దరు పిల్లలూ ఎదుగుతున్నారు, వాళ్లు మనసు చిన్నబుచ్చుకుంటారు, ఏ వస్తువయినా కొనేటట్లయితే ముగ్గురుకీ తీసుకురండని చెప్పేది. అయినా అప్పుడప్పుడు ఆ విషయం మర్చిపోయి నీకొక్కదానికే కొని తెచ్చి మీ అమ్మకు కోపాన్ని తెప్పిస్తుండేవాడిని.
బహుశ: నీకు పన్నెండేళ్ల వయసులో అనుకుంటా నా స్నేహితుడి కూతురు పెళ్ళయితే అందరం వెళ్ళాం. ఇంటికి రాగానే నేను మామ్మతో ''అమ్మా! భానుకి దిష్టి తియ్యమ్మా'' అన్నా, ఎప్పుడూ అనని మామ్మ కూడ, ''నీకు అదంటే ఎక్కువ ప్రేమరా, పిల్లలు ముగ్గురు చక్కగా తయారయి నీవెంట వచ్చారు దిష్టి తీయ్యమనేట్టయితే ముగ్గురికీ తియ్యమనాలి, అలాంటిది భానుకొక్కదానికే తియ్యమంటావేమిటిరా... అని నెమ్మదిగా కసురుకుంది. -
ఏ బంధువు ఇంటికి వచ్చినా ఒకటే ప్రశ్న. ''మీ భాను పెళ్ళి ఎప్పుడు?' అని. మా అమ్మ- అదే మామ్మ, మీ అమ్మ ఒకటే పోరు పెడుతున్నారు. ఈ సంవత్సరం ఎలా అయినా నీ పెళ్ళి చేసేయాలని.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయి రెండు సంవత్సరాలనుండి ఉద్యోగం చేస్తున్నావు. సంవత్సరం నుండి వచ్చిన ప్రతిసారి 'పెళ్ళి సంబంధాలు చూడమంటావా?' అని అడుగుతునే ఉన్నా నీనుండి ఏ సమాధానం లేదు.
మూణెల్లనాడు వచ్చినప్పుడు ఎవర్నో ప్రేమిస్తున్నాని మాత్రం చెప్పావు. ఏ మాత్రం ఊహించని ఒక కొత్త విషయం. తట్టుకోలేకపోయాను. అయినా నీకు మాత్రం 'నో' చెప్పలేదు. ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుందామని చెప్పి వెళ్ళాను. అప్పటినుండి నువ్వు మన ఊరు వచ్చింది లేదు. నేనూ ఇక్కడకు వచ్చే అవసరం పడక రాలేదు.
కోర్టు పనిమీదే వచ్చినా, నీతో పెళ్ళి విషయం చర్చించి ఎలాగయినా ఒక నిర్ణయానికి రావచ్చని వచ్చాను. - అసలు మీ అమ్మ కూడా నాతోపాటు రావాల్సింది. కాని చివరి నిముషంలో మామ్మకు ఆరోగ్యం బాగోలేక రాలేదు.
అయినా రాకుండా ఉండటమే మంచిదయింది. ఇక్కడ నువ్వు ఎవరికీ చెప్పకుండా రహస్యంగా పెళ్ళి చేసుకున్నావని తెలిస్తే నాలాగా తట్టుకుని గుండె దిటవు చేసుకోలేకపోయేది. ఎంతయినా తల్లి మనసు కదా! కూతురికి చేయబోయే పెళ్ళి గురించి ఆమె ఆలోచనలు ఆమెవి.
ఇదేమిటి అన్ని విషయాలు ఇంత కరెక్టుగా ప్లాను ప్రకారం చేస్తే, నాకెలా తెలిసిందని కంగారు పడుతున్నావా? లేక మీ చిన్నాన్న కొడుకు, అదే 'వీరేంద్ర'ని అనుమానిస్తున్నావా?
వాడిని అనుమానించాల్సిన పనేం లేదు. ఎందుకంటే నాటకంలో వాడి పాత్ర వాడు సక్రమంగానే నిర్వహించాడు.
అయినా సరే నాకెలా తెలిసిందంటావా? నువ్వు పుట్టిననాటినుండి నీ వెంట నడిచా... అలాంటిది పసుపుతాడు పడిన నా భాను మెడని, భాషికం కట్టిన నా భాను నుదుటిని, మెట్టెలు తొడిగిన నా చిన్నారి భానుని నేను గుర్తించలేననుకున్నావా? అయినా ఇన్ని సంవత్సరాలనుండి నిన్ను అలా చూడాలనే కదా కలలు కన్నది, ఊహించుకుని మురిసిపోయింది. నువ్వు వాటన్నిటినీ తీసి నా ముందుకొచ్చి నిలబడినా గుర్తించలేనా?
ఏమ్మా నిన్ను కని పెంచినందుకు నీ సంతోషంలో పాలు పంచుకునే హక్కు నాకు లేదంటావా?
లేదా, హక్కుల గురించే అనుకున్నట్లయితే నువ్వు ఎలాగయినా మేజరు కాబట్టి నీ పెళ్ళి విషయంలో ఎలాంటి నిర్ణయమయినా తీసుకునే హక్కు నీకున్నదంటావా?
అయినా ఈ మధ్యనే కదమ్మా నీ ప్రేమ విషయం నాకు చెప్పింది. నేను ఇంట్లో మామ్మతో, అమ్మతో కూడా చర్చించి నిర్ణయం తీసుకోవాలి కదా!
మామ్మది పెద్ద వయసు. అందుకే నీ పెళ్ళి కళ్లారా చూడాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నది.
''ఇన్ని ఆశలు, కలలు నా చుట్టూ అల్లుకోమని నేనేనాడన్నా చెప్పానా! నాకు ఎలా కావాలో అలా జీవించాలనుకోవడం నా హక్కు కాదా? ఆ మాత్రం స్వాతంత్య్రం నాకు లేదా?' అని నువ్వనుకోవచ్చు.
అనుబంధాలు, ఆత్మీయతలు అంత పటిష్టంగా ఉండబట్టే కదమ్మా అక్కడెక్కడో ఊర్లో అన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న మా ఆలోచనలన్నీ అనుక్షణం నీ చుట్టూనే తిరిగేది..
ఇంక నీ చెల్లెలు, తమ్ముడి గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదనుకుంటాను. నువ్వెక్కడున్నా వాళ్ళకు ఎప్పుడూ నీ గురించి తలపులే. నీ పెళ్ళికి ఎన్ని కొత్త డ్రెస్సులు కొనిపెట్టాలో మీ అమ్మ దగ్గర ముందుగానే లిస్టుపెట్టి ఉంచారు.
ఇంతమంది నీతో ఉన్న అనుబంధం కొద్దీ నువ్వు 'పెళ్ళి' అనే కొత్త జీవితంలో అడుగుపెట్టే మధుర క్షణాలని నీతో పంచుకోవాలని ఆశపడ్డారు.
అలా అనుకోవటం తప్పంటావా? ఏమో నీకే తెలియాలి మరి.
ఆఫీసులో నా సహోద్యోగులు ఎప్పుడూ, ''నీకేం రంగా! మీ పెద్దమ్మాయి చిన్నతనంలో బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడింది. మిగతా ఇద్దరూ అక్క వెంటే ఉన్నారు'' అని.
ఆ మాటలు వింటే అప్పుడు గర్వంగా అన్పించింది. కాని అవే మాటలు ఇప్పుడు భయాన్ని కలిగిస్తున్నాయి, తల్లీ!
వాళ్ళూ నీ బాటలో నడిచి కన్న తల్లిదండ్రులని మోసం చేస్తే తట్టుకునే శక్తి నాకు ఇక ఉండక పోవచ్చునేమో బహుశా.
బాగా పరుగుపెట్టి గెలిచాననుకునే క్షణంలో ఓటమి నన్ను గట్టిగా కౌగిలించుకున్నట్లుగా ఉంది. బాగా అలసిపోయాను నేను. ఇది నిజం.
నిన్ను కనిపెంచిన తండ్రిగా నిన్ను కోరుకునేదొక్కటే.
ఎప్పుడయినా, ఎక్కడయినా నువ్వు నన్ను చూడటం తటస్థిస్తే నేను నిన్ను చూసేలోగా నాకు కన్పించకుండా వెళ్ళిపో.
లేక నువ్వు, నేను ఒకరికొకరు ఎదురుపడిన క్షణంలో 'బాగున్నావా, నాన్నా' అని మాత్రం అడుగు చాలు.
అంతకు మించి మరేమీ కోరడు ఈ నీ తండ్రి. ఎక్కడున్నా క్షేమంగా ఉండు భానూ! ఎంతయినా నువ్వు చాలా ఎదిగిపోయావు, తల్లీ.
ఇట్లు, సదా నీ క్షేమం కోరే నీ తండ్రి, రంగనాథ్ ఉత్తరం చదవటం పూర్తవ్వగానే ఒంట్లో శక్తినంతా ఒక్కసారిగా తీసేసినట్లుగా, కంటినుండి నీరు ధారగా కురుస్తుంటే పక్కనే ఉన్న మంచంపై వాలిపోయింది భానురేఖ. డ్రెస్సింగ్ టేబుల్ పై ఉన్న సెల్ ఫోన్ మ్రోగుతునే ఉంది, ఆగకుండా...
- మల్లాది మంజుల
Sun 27 May 04:27:27.532273 2018