Sat 22 Dec 22:56:44.842122 2018
Authorization
కాలం పరుగులు తీస్తూనే ఉంది. సంవత్సరాలు గడిచిపోతుంటాయి. మానవీయత ఎంత ఎదిగిందన్నదే ప్రశ్నార్థకం. మనిషి మనిషిగా పరిణతి చెందిన విధం ఎంతన్నదే ప్రమాణం. నిన్న ఉన్నట్టుగా ఇవాళ ఉండదు. ఇవాళ్టి మాదిరిగా రేపు ఉండదు. మార్పు అనివార్యం. అయితే అది జీవితాన్ని ఉద్దీపింపజేసేదిగా ఉండాలి. మానవాళికి మరింత మేలు చేసేలా రూపొందాలి. పదుగురి మేలు కోరే స్వభావం మనుషుల్లో ఇనుమడించాలి. వ్యక్తులయినా, వ్యవస్థలయినా ఈ దిశగా పురోగమించినప్పుడే సాగిపోయే కాలానికి సార్థకత. మార్పు వేగవంతమై, మనిషికి మరింత శుభాన్ని చేకూర్చినపుడే ఆ కాలపు చరిత్రకు తగిన స్థానం ఉంటుంది.
సహస్రాబ్ది మొదటి శతాబ్దిలో పద్దెనిమిది సంవత్సరాలు గడిచిపోయే సందర్భంలో ఉన్నాం. 21 వ శతాబ్దం గురించి ఇరవయ్యో శతాబ్ది చివరి దశలో ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఎంతో సాధించాలని కలలు గన్నాం. సృష్టికి ప్రతిసృష్టి చేసే వైజ్ఞానిక పురోగతి అయితే కనిపిస్తున్నది. కానీ మనిషిని మనిషిగా చూసే స్వభావం మెరుగుపడలేదు. మనుషులు సరుకులుగా మారిపోయారు. మార్కెట్‌కు అవసరమైన కొనుగోలుదారులు, వినియోగదారులుగా మాత్రమే కాదు, తమకు తెలియకనే అమ్ముడుపోయే సరుకులయ్యారు.
టీవీ చూసే ప్రేక్షకులు, సోషల్ మీడియాను అనుసరించే వారు ఏకకాలంలో వినియోగదారులుగానూ, అమ్మకపు సరుకులుగానూ పరిణమించారు. మనకు ఏం కావాలో మనం నిర్ణయించుకోకముందే మార్కెట్ మనకేం కావాలో చెబుతుంది. పురోగామి కాలపు మనుషులుగా ఉండాలంటే నువ్వొక సెల్‌నెంబరుగానూ, ఆధార్ కార్డుగానూ, డెబిట్ కార్డుగానూ, బీమాదారుడిగానూ ఉండాలని మార్కెట్ శాసిస్తున్నది. ఇరవయ్యేళ్ళ వయసులోనే యాభై ఏళ్ళ తర్వాతి జీవితానికి పొదుపు చేయమని, చెమటోడ్చమని ప్రవచిస్తోంది.
వాణిజ్యబేహారుల సూత్రీకరణలే బతుకుగా తలపోసి, యవ్వనంలోని వగరునీ, పొగరునీ, ఆరోగ్యాన్నీ హరింపజేసుకునే రీతిన మనుషులు బతికేస్తున్నారు. కనుక ఇక్కడ శైశవం, బాల్యం, కౌమారం, యవ్వనం తమ అసలు స్వభావాన్ని కోల్పోయాయి. పని చేయడం కోసమే మనుషులు పుట్టినట్టుగా, ఇరవయ్యేళ్ళ తర్వాతి కెరీర్ కోసం మూడేళ్ళ వయసులో ఆటపాటల్ని వదులుకోవాలనే సూక్తిముక్తావళిని పిల్లల మీద రుద్దుతున్నారు. ఇదే జీవితంగా తలపోస్తున్నారు.
ఈ క్రమాన బతుకు గురించి తెలియకముందే రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఈ దిశలోనే మనమీంచి 2018 వెళ్ళిపోతుంది. కానీ ఈ సంవత్సర కాలంలో మనం బతికిన క్షణాలెన్ని? ప్రశాంతంగా గడిపిన రాత్రులెన్ని? ఏ రంది లేకుండా జీవించిన రోజులెన్ని? ఏదో సాధించడం సంగతలా ఉంచండి, మనుషులుగా హాయిగా, ఏ చీకూ చింతా లేకుండా గడిపిన కాలం ఎంతన్నది ఆలోచించండి. ఈ ఏడాది కాలాన్ని అవలోకించండి. యాంత్రికంగా గడిపిన రోజులెన్ని? జవజీవాలతో ఉత్సాహంగా తుళ్ళిపడిన రోజులెన్నో చూసుకోండి. ఇతరులకు చేసిన మేలు ఎంత? నిజాయితీగా, నిర్భీతిగా, కపటత్వం లేకుండా గడిపిన కాలం ఎంతో యోచించండి. అప్పుడే మీరు నిజంగా బతికిన రోజులెన్నో తెలుస్తాయి. మీ కోసం మీరు బతికిన కాలం ఎంతో బోధపడుతుంది.