Sat 09 Nov 23:46:57.672595 2019
Authorization
కిత్తూరు రాణి చెన్నమ్మ జయంతి ఉత్సవాలు కర్ణాటక ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. ఏటా అక్టోబర్ 23 నుండి మూడు రోజుల పాటు కిత్తూరులో ఈ వేడుక ఎంతో కోలాహలంగా సాగుతుంది. జానపద కళారూపాల ప్రదర్శన, మల్లయుద్ధ పోటీలతో ఊరంతా పండుగలా మారిపోతుంది.
1857లో జరిగిన మొదటి స్వాతంత్య్ర యుద్ధం కన్నా ముందే బ్రిటీష్ పాలకులను ఎదిరించిన రాణి చెన్నమ్మ వీరగాథ ఝాన్సీలక్ష్మీబాయి జీవితానికి దగ్గరగా వుంటుంది. సిపాయిల తిరుగుబాటుకు 30 ఏళ్ళ ముందే బ్రిటీష్ వారితో యుద్ధం చేసిన తొలి యోధురాలు చెన్నమ్మ.
ఝాన్సీలక్ష్మీబాయి చరిత్ర తెలుగింట బిడ్డలకు ఆమె పేరు పెట్టుకుని, పాఠ్యపుస్తకాల్లో పాఠంగా చదువుకునే దాకా చేరినా రాణి చెన్నమ్మ వీరత్వం కన్నడ నేలను దాటినట్లు కనిపించదు. చరిత్ర నిర్మాణంలోని లోపాలకు ఇది నిదర్శనం.
23 అక్టోబర్ 1778న జన్మించిన చెన్నమ్మకు 15వ ఏటనే కిత్తూరు రాజు మల్ల సర్జతో వివాహమైంది. భర్త అండదండలతో గుర్రపుస్వారీ, కత్తిసాము, విలువిద్యలలో ఆరితేరింది. సుఖంగా సాగుతున్న జీవితం భర్త, పుత్రుడి మరణంతో అతలాకుతలమైంది. 1824లో ఇద్దరూ కొన్ని రోజుల వ్యవధిలో గతించడంతో కిత్తూరు రాజ్యపాలనా బాధ్యతలను తానే స్వీకరించి, అదే సంవత్సరం శివలింగప్ప అనే బాలుడిని దత్తత తీసుకుని పట్టాభిషిక్తుడిని చేస్తుంది. అప్పటికే ఈస్ట్ ఇండియా కంపెనీ దత్తత నిషేధ చట్టం తీసుకొచ్చింది. సొంత బిడ్డలేని పక్షంలో రాజ్యం కంపెనీ హస్తగతమవుతుంది. దత్త పుత్రుడి పట్టాభిషేకం తెలిసిన కంపెనీ, చెన్నమ్మ చర్యపై అగ్గిమీద గుగ్గిలమై, వెంటనే శివలింగప్పను సింహాసనం మీద నుంచి తొలగించి రాజ్యాన్ని కంపెనీకి అప్పగించమని ఆర్డరు వేస్తుంది.
కిత్తూరు ధార్వాడ్ కలెక్టరేట్ పరిధిలోకి వస్తుంది. దాని కలెక్టర్‌గా జాన్ థాక్కరే, కమిషనర్‌గా చాప్లిన్ వున్నారు. వారిపై బొంబాయి రెసిడెన్సీలోని లెఫ్ట్‌నెంట్ కల్నల్ వుంటాడు. తన నిర్ణయాన్ని ఆమోదించమని చెన్నమ్మ ఆ లెఫ్ట్‌నెంట్‌ను ఉత్తరం ద్వారా కోరగా, అది తిరస్కరించబడి తమ ఆదేశాల్ని అమలు చేస్తున్న క్రమంలో బ్రిటీష్ వారు కిత్తూరులోని ధనరాసులను, వజ్రవైడూర్యాలను స్వాధీనం చేసుకునేందుకు సైన్యాన్ని పంపారు. 20 వేల సైన్యం, 500పైగా తుపాకులతో బ్రిటీష్ సైన్యం కిత్తూరుపై దండెత్తింది. ఆ యుద్ధం అక్టోబర్ 1824న జరిగింది. దానిలో బ్రిటీష్ సేన భారీగా దెబ్బతింది. సైన్యానికి నాయకత్వం వహించిన కలెక్టర్ జాన్ థాక్కరే చనిపోయాడు. ఇద్దరు బ్రిటీష్ సైన్యాధికారులు వాల్టర్ ఇలియట్, స్టీవెన్‌సన్ బందీగా చిక్కారు. చెన్నమ్మ సేనాని అయిన ఆమతూరు బాలప్ప దాడికి బ్రిటీష్ సేన పారిపోయింది. యుద్ధం ఆపేద్దామని, సామరస్యంగా సమస్యను పరిష్కరించు కుందామని కమిషనర్ చాప్లిన్ కోరడంతో ఇద్దరు బందీలను చెన్నమ్మ వదిలిపెడుతుంది.
అయితే మాట తప్పిన బ్రిటీష్ మరింత సైన్యంతో కిత్తూరుపై మళ్ళీ యుద్ధానికి వచ్చింది. ఈసారి ముంబయి సేనను కూడా కలుపుకుని భారీ సైన్యంతో తలపడింది. రెండో యుద్ధంలో కిత్తూరు సేన చేతిలో షోలాపూర్ సబ్‌కలెక్టర్ బంధువు థామస్ మన్రో ప్రాణాలు కోల్పోయాడు. సేనాని సంగోలి రాయన్నతో కలిసి చెన్నమ్మ తన వీరత్వాన్ని ప్రదర్శించింది. చివరకు ప్రాణాలతో పట్టుబడి బెయిల్‌హౌంగల్ కోటలో బందీగా వుండి, ఖైదీగానే 2 అక్టోబర్ 1829 న మరణించింది.
శివలింగప్పతో తిరిగి రాజ్యస్థాపన చేసేందుకు సంగోలి రాయన్న గెరిల్లా యుద్ధాన్ని కొనసాగించాడు. కొంతకాలానికే బ్రిటీష్ సేనలకు చిక్కడంతో ఆయనను ఉరివేసి చంపివేశారు.
ఇలా దత్తతను ఒప్పుకోని బ్రిటీష్ కంపెనీతో ఝాన్సీలక్ష్మీబాయి కన్నా ముందే పోరాడి ఓడిన రాణిగా చెన్నమ్మ చరిత్ర చెబుతోంది.
ఈస్ట్ ఇండియా కంపెనీ రాజ్య విస్తరణలో భాగంగా తెచ్చిన 'డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్' చట్టం 1818 దాకా అంతగా పట్టించుకోలేదు. 1818 నుండి 1834 దాకా దత్తతను కొన్ని రాజ్యాలకు అంగీకరించి, కొన్నింటికి తిరస్కరించింది కంపెనీ. తిరస్కరణ కారణంగానే రాణి చెన్నమ్మ బ్రిటీష్ వాళ్ళతో యుద్ధానికి దిగింది. 1841 నుండి దత్తతను పూర్తిగా నిషేధించింది. గవర్నర్ జనరల్‌గా 1848లో డల్‌హౌసీ రాకతో ఈ నిబంధన కచ్చితంగా అమలు కావడంతో సతారా, జైపూర్, సంబల్‌పూర్, నాగ్‌పూర్, ఉదరుపూర్, ఝాన్సీ రాజ్యాలు 1849 నుండి 1854 దాకా బ్రిటీష్ ఆధీనంలోకి వెళ్ళాయి. 1857లో జరిగిన తొలి స్వాతంత్య్ర సమరానికి ఇదో ప్రధాన కారణంగా చరిత్ర చెబుతోంది.
బ్రిటీష్ వారిని ఎదురొడ్డిన రాణి చెన్నమ్మకు సైదోడుగా నిలిచిన సంగోలి రాయన్న గురించి కూడా చెప్పుకోవాలి. చెన్నమ్మ ఓటమి తర్వాత కూడా 1824 నుండి రాయన్న బ్రిటీష్ వారిపై తన పోరు ఆపలేదు. స్థానికులతో కలిసి ఓ సైన్యం సిద్ధం చేసుకుని బ్రిటీష్ కార్యాలయాల దహనం, వారి ధనాగారాలపై దాడి కొనసాగించాడు. ఆయన్ని మోసంతో ఏప్రిల్ 1830లో బందీగా పట్టుకుని మరణదండన వేసింది బ్రిటీష్ ప్రభుత్వం. రాయన్నను 26 జనవరి 1831 నాడు ప్రజల ముందర మర్రిచెట్టుకు ఉరితీశారు. సుమారు 7 అడుగుల ఎత్తుండే రాయన్న చనిపోయేనాటికి ఆయన వయసు 32 ఏండ్లే. బెలగావి జిల్లాలోని నందగడ్‌లో ఆయన సమాధి, గుడి, స్మారక చిహ్నాలు ఇప్పటికీ ప్రజల గౌరవాన్ని పొందుతున్నాయి.
రాణి చెన్నమ్మ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిధులు కేటాయిస్తోంది. 2006 నుండి కిత్తూరు ఉత్సవ్ మొదలైంది. రాణి పేరిట అక్కడ మూడు రోజుల జాతర కొనసాగుతున్నది.
బెంగళూరు నుండి కొల్హాపూర్‌కు వెళ్ళే రైలుకు రాణి చెన్నమ్మ ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టారు. 1962లో కన్నడంలో బి.ఆర్.పంతులు నిర్మాణ దర్శకత్వంలో సినిమా వచ్చింది. అందులో చెన్నమ్మగా బి.సరోజాదేవి, మల్లుసర్జదేశాయిగా రాజ్‌కుమార్ నటించారు.
1977లో తపాలాశాఖ చెన్నమ్మ పేరిట స్టాంపు విడుదల చేసింది. బెళగావి జిల్లా కేంద్రంలో రాణి చెన్నమ్మ విశ్వవిద్యాలయం వుంది. 11-9-2007 న పార్లమెంటు భవనంలో ఆనాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ రాణి చెన్నమ్మ విగ్రహం ఆవిష్కరించారు.
ఇప్పటికీ లండన్ మ్యూజియంలో ఉన్న చెన్నమ్మ ఖడ్గాన్ని తిరిగి దేశానికి తెప్పించాలని ఈ సంవత్సరపు వేడుకల సందర్భంగా కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానాన్ని చేసింది. 2012లో 'క్రాంతివీర సంగోలి రాయన్న' సినిమా రావడం మరో విశేషం.
వీరత్వానికి, ప్రాణ త్యాగానికి సిద్ధమైన ఈ స్వాతంత్య్ర సమర యోధుల చరిత్ర ఒక్క ప్రాంతానికే కాకుండా దేశానికే ఆదర్శం. స్ఫూర్తిదాయకం.
- బి.నర్సన్,
9440128169