Sat 29 Aug 18:44:46.44005 2015
Authorization
నేర్చుకున్నవారే ఇతరులకు నేర్పగలరు. వెలుగుతున్న దీపమే మరికొన్ని దీపాల్ని వెలిగించగలదు. చీకట్లో ఉన్నవారికి వెలుగు ఎంత ముఖ్యమో, నేర్చుకోవడం ప్రతి ఒక్కరికి అంత అవసరం. దీన్ని గుర్తించడమే కాదు, గుర్తించి అనుసరించడం మీదనే మన విజ్ఞత ఆధారపడి వుంది. ''పుస్తకాల నుంచి నువ్వేం నేర్చుకుంటావన్నది విషయం కాదు. పుస్తకాలు నీ నుంచి దేన్ని బయటకు వెలికి తీస్తాయన్నది ముఖ్యం. అదే నిన్ను మార్చగలిగింది'' అని ఒక రచయిత చెబుతారు. అందుకని మనం చదివే పుస్తకాలు మనలోని శక్తుల్ని జాగృతం చేయాలి. లోపలి ప్రపంచంలోని నైపుణ్యాన్ని, ప్రతిభనీ వెలికి తీసి సానబెట్టాలి.
పుస్తకాలే కాదు నిత్యజీవితంలోని అనుభవాలు, తారసపడే సంఘటనలు, మనం చేసే సంభాషణలు అంతిమంగా మన లోపలి ప్రపంచాన్ని ఎంతోకొంత విస్తృతం చేయాలి. సారాంశంలో మెరుగుపరచాలి. చేసిన పనినే చేస్తుంటారు చాలామంది. అలా చేయాల్సి రావడం అనివార్యం కావచ్చు. కానీ ఆ పనిలో మెరుగుదల చూపాలి. వేగం పెరగాలి. కొన్నాళ్ళ కిందట రెండుగంటల్లో చేసిన పనిని రెండేళ్ళ తర్వాత గంటలో చేయడం అలవడాలి. అవగాహనలో నైశిత్యం పెంపొందాలి. అభివ్యక్తిలో నవ్యత తొంగిచూడాలి. చేసిన పనినే కొత్తగా చేయడం అలవడాలి.
వైవిధ్యం లేనప్పుడు కొత్తరంగాల వైపు కూడా చూపు సారించాలి. నూతన పథాల వైపు ప్రయాణించాలి. దారులే లేని పరిస్థితులుంటే దారులు వేసుకోవడమెలానో యోచించాలి. ఏ రంగమైనా ఎవరో ఒకరు మొదలు పెట్టడం వల్లనే సాధ్యమైందని గుర్తు పెట్టుకోవాలి. తొలి అడుగు, తొలి ప్రయత్నం ఎక్కడో చోట మొదలు పెట్టాల్సిందే. ఆవిధంగా ఓ కొత్తరంగంలోకి అడుగు మోపడం తప్పనిసరయితే వెనుకంజ వేయకూడదు. పాదం మోపి నడక నేర్వడం ఆరంభిస్తే అనుభవమే అన్నీ నేర్పుతుంది. ఇలా నేర్చుకోడానికి సిద్ధంగా ఉండే మనస్తత్వం ఉండడం ప్రధానం.
ఇవాళ మనం వాడుతున్న ఫేస్‌బుక్ అనే సాధనాన్ని కేవలం ఒకే వ్యక్తి రూపొందించి ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. తర్వాత కోట్లాదిమంది జీవితంలో భాగమైంది. అంతకన్నా ముందు 'చిప్' కనిపెట్టిన శాస్త్రవేత్త జాక్ కిల్బీ. 1958లో ఆయన రూపొందించిన చిన్నపాటి చిప్ ఇవాళ మొత్తం ప్రపంచాన్ని మార్చివేసింది. ఎలక్ట్రానిక్స్ రంగంలో పెను విప్లవాన్ని ప్రోది చేసింది. నోబెల్ అవార్డు గ్రహీత జాక్ కిల్బీ ప్రయోగాలు, ఆవిష్కరణలు అనేకం. నేర్చుకోవడం, ప్రయోగాలు చేయడమనే ప్రక్రియను ఆయన ఎన్నడూ ఆపలేదు. ఈ లక్షణమే చోదకశక్తి కావాలి. చొచ్చుకుపోవడానికి ప్రేరణగా నిలవాలి. నేర్చుకునే ప్రక్రియ మనిషిని వెలిగిస్తుంది. ఒక అనుభవం తర్వాత మరో అనుభవం కొత్త శక్తిని అందిస్తుంది. సృజనాత్మకంగా జీవించడానికి దోహదం చేస్తుంది. అందుకే నేర్చుకోవడం జీవితంలో అంతర్భాగం కావడం అవసరం.