- ఉండ్రగొండ అటవీ ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్
నవతెలంగాణ - చివ్వెంల
ఉండ్రుగొండ అటవీ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నట్టు కలెక్టర్ కె.సురేంద్రమోహన్ తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని వల్లభాపురం ఆవాస గ్రామమైన ఉండ్రుగొండ గుట్ట అటవీ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో ఖాళీగా ఉన్న భూముల్లో తెలంగాణకు హరితహారం పథకం కింద మొక్కలు నాటేందుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అటవీశాఖ అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. అటవీ ప్రాంతంలో ఔషధ మొక్కలు పెంచడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని, అటవీ భూముల పరిరక్షణకు ఆ ప్రాంతం చుట్టూ ట్రెంచ్ వేయాలని సిబ్బందికి సూచించారు. జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న ఈ అటవీ ప్రాంతం ప్రజలకు ఆహ్లాదం, ఆనందం కల్గించే విధంగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. పర్యాటక శాఖ అధికారులతో చర్చించి ఉండ్రుగొండ అటవీగుట్టలపై ట్రెక్కింగ్ ఏర్పాటు చేసేందుకు నివేదికలు తయారు చేయనున్ననట్టు చెప్పారు. ఉరడ్రుగొండ అటవీ ప్రాంతంలో మిషన్‌భగీరథ పైపు లైన్ వేసేందుకు హద్దులు నిర్ణయించిన స్థలాన్ని ఈ సందర్భంగా కలెక్టర్ పరిశీలించారు. పైప్‌లైన్ వేసేందుకు కావాల్సిన అటవీ భూముల అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపాలని అటవీ అధికారులకు సూచించారు. అనంతరం ఉండ్రుగొండ గుట్టల్లో వెలసిన శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట డాక్టర్ రామయ్య, అటవీశాఖ అధికారి సుజాత, ఆలయ పూజారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Authorization