Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్మాణాల్లో ఆలస్యం
- ఈ ఏడాదీ విద్యార్థులకు తప్పని తిప్పలు
- ఒక్కటీ పూర్తికాని పరిస్థితి
- హడావుడి పనులతో నాణ్యతాలోపం
నవతెలంగాణ-ఆదిలాబాద్ ప్రతినిధి
పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించాలని ఎనిమిదేళ్ల క్రితమే సుప్రీం కోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వమూ మరుగుదొడ్ల నిర్మాణాల్లో శ్రద్ధ చూపలేదు. కొన్ని పాఠశాలల్లో నామమాత్రంగా పనులు చేపట్టినా ఇప్పటికీ పూర్తికాని పరిస్థితి. ఈ సమస్యతోనే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకే రాలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఈ ఏడాది జూన్ వరకు పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మిస్తామని చెప్పింది. కాని జిల్లాలో ఎక్కడా మరుగుదొడ్లు పూర్తి కాలేదు. ఈ నెల చివరి వరకైనా అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసి నివేదిక పంపించాలని ఇటీవల ప్రభుత్వం కలెక్టర్‌ను ఆదేశించింది. కలెక్టర్ సైతం ఆర్‌విఎం, ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు హడావుడిగా పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీని వల్ల పనుల్లో నాణ్యత లోపిస్తుందని పలువురు పేర్కొంటున్నారు.
ఒక్కటీ పూర్తికాని మరుగుదొడ్డి
స్వచ్ఛభారత్‌లో భాగంగా స్వచ్ఛ పాఠశాల పేరుతో పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో సర్వశిక్షాభియాన్ కింద మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.39 కోట్లు మంజూరు చేసింది. జిల్లాలో 2646 కొత్తగా, 1206 మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులు ఏప్రిల్‌లో ప్రారంభించి జూన్ 15 నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఒక్కటి కూడా పూర్తి కాలేదు. కొత్తగా చేపట్టిన ఒక్కో మరుగుదొడ్డికి రూ.1.25లక్షలు కేటాయించారు. మంజూరైన నిధుల్లో నుండి 50శాతం అంటే జిల్లాకు సుమారు రూ.19.50కోట్ల నిధులను ముందుగానే పాఠశాలల యాజమాన్య కమిటీలకు అధికారులు విడుదల చేశారు. ఈ కమిటీలు సూచించిన వారే పనులు చేపట్టాల్సి ఉంది. ఏప్రిల్‌లో నిధులు మంజూరైతే, మే నెలలో పనులు ప్రారంభించారు. వేసవి కాలం కావడం వల్ల జిల్లాలో పనులు చేపట్టిన చోట్ల నీరు లేక, మెటీరియల్ దొరక్క, కూలీలు అందుబాటులో లేక పనులు నత్తనడకన సాగాయి. పనులు పాఠశాల యాజమాన్య కమిటీలకు అప్పగించడంతో ఇష్టం వచ్చిన కాంట్రాక్టర్లకు అప్పగించారు. రాజకీయ జోక్యం పెరిగింది. దీంతో పనుల్లో జాప్యం జరిగిందని అధికారులు చెబుతున్నారు. కొత్తగా చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణాల్లో నేటికీ 150 పనులు ప్రారంభించలేదు. ప్రారంభించిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. సుమారు 703 మరుగుదొడ్లు బేస్‌మెంట్ దశ కంటే తక్కువ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. 709 బేస్‌మెంట్ స్థాయిలో ఉన్నాయి. 459 లెంటల్ లెవల్‌లో ఉండగా, 334 మరుగుదొడ్లకు స్లాబ్ వేశారు.
పనుల వేగంతో నాణ్యతాలోపం
మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ నెలాఖరులోగాలైనా పూర్తి చేయాలని కలెక్టర్‌కు పది రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్ కూడా సంబంధిత అధికారులతో సమావేశమై నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు వేగవంతంగా చేయాలని కాంట్రాక్టర్లపై ఒత్తిడి పెంచారు. దీంతో పనుల్లో నాణ్యతాలోపం కనిపిస్తుందని విమర్శలు వస్తున్నాయి. నాణ్యమైన ఇసుక వాడాల్సి ఉండగా, నాసిరకం నల్ల ఇసుక వాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. సమీప వాగుల్లోంచి అందుబాటులో ఉన్న ఇసుకను తీసుకొచ్చి వినియోగిస్తున్నారు. అంతేకాకుండా క్యూరింగ్ సరిగా చేయడం లేదని తెలుస్తోంది. దీని ద్వారా నిర్మాణాలు ఎక్కువ కాలం ఉండే అవకాశం లేకుండాపోతుంది. మరుగుదొడ్డి వెంటిలేషన్ కోసం 3 అడుగుల వెడెల్పు, 2 అడుగుల పొడవుతో ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఎక్కువ చోట్ల డబ్బులు మిగుల్చుకునేందుకు 9 ఈంచుల పొడువు, 18 ఈంచుల వెడెల్పు ఉండే వాటిని అమర్చుతున్నారు.
ఈ నెలాఖరులోగా అన్ని పూర్తి చేస్తాం: విజరుకుమార్, ఆర్‌విఎం పిఓ
మరుగుదొడ్ల నిర్మాణాలు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశాలున్నాయి. ఇప్పటి వరకు పూర్తికాని నిర్మాణాలను నెలాఖరులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు 2646 మరుగుదొడ్ల పనుల్లో 150 పనులు మొదలు పెట్టలేదు. మొదలు పెట్టిన పనుల్లో అన్ని 90శాతం పూర్తి దశలో ఉన్నాయి. పది రోజుల్లోగా మిగతావి పూర్తి చేస్తాం.