Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిర్యాదులకు ఎన్‌ఐసీ వెబ్‌సైట్‌లో
ప్రత్యేక ఏర్పాట్లు
- డిజిటల్ ఇండియాలో భాగంగా నిర్ణయం
నవతెలంగాణ-ఆదిలాబాద్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో సాంకేతిక అంశాలకు సంబంధించిన విషయాలను నేషనల్ ఇన్ఫర్‌మాటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ)చూస్తుంది. ఉమ్మడి జిల్లా కేంద్రాలన్నింటిలోనూ ఇవి ఉన్నాయి. ఎన్‌ఐసీ సేవలు వినియోగించుకున్న ఆయా శాఖలు, అధికారులు సాంకేతికపరంగా ఏమైనా సమస్యలు తలెత్తితే ఫిర్యాదు నమోదు చేసేందుకు సరైన వ్యవస్థ లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మొబైల్ లేదా ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినా పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. ఇక మీదట ఆ ఇబ్బందులు తీరనున్నాయి. ఫిర్యాదులకు సత్వర పరిష్కారంతోపాటు పారదర్శకత పెంచాలన్న ఉద్దేశంతో ఎన్‌ఐసీ ముందుకు సాగుతోంది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుల నమోదు, పరిష్కారానికి ఆన్‌లైన్ విధానం అమలుకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో 'నవతెలంగాణ' కథనం.
ఫిర్యాదుల నమోదు ఆన్‌లైన్‌లోనే
బయోమెట్రిక్ అటెండెన్స్ విధానంలో యంత్రంపై వేలిని పెట్టగానే ఉద్యోగి విదుల్లోకి వచ్చిన సయం నమోద వుతుంది. ఆధార్ అనుసంధాన బయోమెట్రిక్ హాజరు విధానం ప్రస్తుతం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ కార్యాలయంలో అమలులో ఉంది. కలెక్టరేట్‌లోనూ అమలు చేసే యోచనలో ఉన్నారు. మెదక్ కలెక్టరేట్‌తో పాటు పలు కార్యాలయాల్లోనూ ఈ విధానం అమలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఎన్‌ఐసీ ఈమెయిల్ ఐడీలు కలెక్టర్, జేసీలతోపాటు పలు శాఖలకు ఉన్నాయి. దీని ద్వారా ఉచితంగా మెయిల్ సదుపాయం అమల్లో ఉంది. ఆయా సేవలకు సంబంధించి ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తినా ఇక మీదట ఫిర్యాదులను ఆన్‌లైన్‌లోనే నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందు కోసం సైట్‌లోకి వెళ్లి జిల్లాను ఎంపిక చేసి.. ఫిర్యాదును నమోదు చేయాలి.
ఫిర్యాదుదారులకు సమాచారం
సర్వీస్ డెస్క్‌కు వచ్చిన ఫిర్యాదు సంబంధిత డీఐఓ (డిస్ట్రిక్ట్ ఇన్ఫర్‌మాటిక్ అధికారి)కి వెళుతుంది. జిల్లా స్థాయిలోనే సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటే వెంటనే పరిష్కరించి, ఫిర్యాదుదారుడి మొబైల్‌కు, ఈమెయిల్‌కు సమాచారం చేరవేస్తారు. ఒక వేళ సమస్య రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాల్సి ఉంటే హైదరాబాద్‌లోని ఎన్‌ఐసీ కార్యాలయానికి కేంద్ర స్థాయి అయితే ఢిల్లీలోని ఎన్‌ఐసీ కార్యాలయానికి ఫార్వర్డ్ చేస్తారు.
ఉమ్మడి జిల్లాకు సేవలు ఇక్కడి నుంచే..
ఎన్‌ఐసీకి సంబంధించి.. సాంకేతికపరంగా సలహాలు, సూచనలు సంగారెడ్డిలోని ఎన్‌ఐసీ కార్యా లయం నుంచే ఇస్తారు. సంగారెడ్డితోపాటు సిద్దిపేట, మెదక్ జిల్లా పరిధిలో ఎన్‌ఐసీ సేవలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడి నుంచే పరిష్కారం చూపాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేసిన సర్వీస్ డెస్క్‌కు వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి కూడా ఇదే వర్తిస్తుంది.
మెరుగైన సేవలకు అవకాశం: రాకేష్, ఎన్‌ఐసీ డీఐఓ
ఎన్‌ఐసీ సర్వీస్ డెస్క్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదుల నమోదుకు అవకాశం కల్పించడంతో సేవలు మెరుగుకు అవకాశం ఉంటుంది. ఫిర్యాదును పరిష్కరించడంతో పాటు ఫిర్యాదుదారు మొబైల్‌కు, ఈమెయిల్ ఐడీకి సమాచారం చేరవేయడంతో పారదర్శకత పెరుగుతుంది. ఎన్‌ఐసీ సేవలు వినియోగిస్తున్న అధికారులు, శాఖలన్నీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.