Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర
- కుటుంబ సభ్యులతో ఓ ప్రజాప్రతినిధి నిరసన
నవతెలంగాణ-లోకేశ్వరం
తన భూములు తనకు ఇప్పించాలని కోరుతూ పదేండ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న ఓ ప్రజాప్రతినిధికే న్యాయం జరగడంలేదంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటనే ప్రశ్నకు అద్దంపడుతోంది ఈ ఘటన. వివరాల ప్రకారం.. మండలంలోని ధర్మోర గ్రామానికి చెందిన గ్రామ ప్రథమ పౌరుడు, సర్పంచు కదం శ్రీనివాస్‌రావు పటేల్‌కు 65 ఎకరాల భూమి ఉండగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ కింద ముంపునకు గురైంది. దీంతో అప్పటి ప్రభుత్వం పునరావాసం కింద డీ-1 పట్టాపై 75-77, 75-51, 75-56, 75-99 సర్వే నెంబర్లలో రైతులకు భూములు ఇచ్చింది. ఇందులో భాగంగా శ్రీనివాస్‌రావు పటేల్‌కు 15 ఎకరాల భూమి వచ్చింది. ఈ భూములతోపాటు 185 సర్వే నెంబర్‌లో గొడిసెర గ్రామానికి చెందిన రైతు భూమారెడ్డి వద్ద కొనుగోలు చేసిన 5 ఎకరాల 8 గుంటల భూమిని సైతం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో వీరి కుటుంబం రోడ్డునపడింది. దీంతో బాధితుడు శ్రీనివాస్‌రావు పటేల్ కోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ స్పందించడం లేదు.దీంతో సోమవారం తన కుటుంబ సభ్యులతో కలిసి గ్రామం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్రగా వచ్చి నిరసన తెలిపాడు. ఉన్నతాధికారులు కలగజేసుకుని తన భూములు తనకు ఇప్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. తన భూముల్లో రాచాపూర్ గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాలకు ఇండ్లస్థలాలు ఇవ్వడం సరికాదని వాపో యారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తన కుటుంబం రోడ్డున పడకుండా కాపాడాలని వేడుకున్నారు. ఒకవేళ సమస్యను పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తానన్నారు. 30 సంవత్సరాలుగా ఆ భూముల్లో పంటలు సాగుచేస్తున్న ప్రభుత్వం, అధికారులు ఏమాత్రమూ ఆలోచించకుండా మరో గ్రామానికి చెందినవారికి పునరావాసం కింద ఇండ్ల స్థలాలు ఇవ్వ డం భావ్వంకాదని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ విన్నవించారు.