Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుర సమరానికి ఇటు అధికార యంత్రాంగం, అటు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. గడిచిన వారం రోజుల వ్యవధిలో చోటు చేసుకున్న పరిణామాలు పట్టణాల్లో సందడికి దారి తీశాయి. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో దాఖలైన పిటీషన్‌ను కోర్టు కొట్టివేయడంతో ఎన్నికలకు గ్రీన్‌సిగల్ లభించిన విషయం తెలిసిందే. దీంతో వారం రోజులుగా ఉమ్మడి జిల్లాల్లోని అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి నెలకొంది.
నవతెలంగాణ - కాగజ్‌నగర్
జులై రెండో తేదీతో మున్సిపల్ పాలకవర్గాల గడువు ముగిసింది. అప్పటి నుండి మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రతిష్టంభన నెలకొంది. నిబంధనల మేరకు మున్సిపల్ ఎన్నికల నిర్వహణ చేపట్టడం లేదంటూ హైకోర్టులో దాఖలైన పిటీషన్‌ను గత వారం హైకోర్టు కొట్టివేయడంతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. వారం రోజుల నుండి అధికారయంత్రాంగం ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి ప్రారంభమైంది. జిల్లాలో ఏడు పాత మున్సిపాలిటీలుండగా, ఏడు కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటయ్యాయి. పాత మున్సిపాలిటీల్లో నోటిఫైడ్ ఏరియా అయిన మందమర్రి మున్సిపాలిటీకీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. మిగిలిన ఆరు మున్సిపాలిటీల్లో కాగజ్‌నగర్, భైంసా, నిర్మల్ మున్సిపాలిటీలకు సంబంధించి వార్డుల విభజనపై వ్యక్తిగత పిటీషన్‌లు హైకోర్టులో పెండింగ్‌లో ఉండడంతో ఈ మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ మున్సిపాలిటీలపై హైకోర్టులో విచారణ ఈ నెల ఆరో తేదీనే జరగాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల విచారణకు రాలేదు. కొత్త మున్సిపాలిటీల్లో ఆసిఫాబాద్, ఉట్నూరు మున్సిపాలిటీలకు సాంకేతిక కారణాల రీత్యా ఎన్నికలు జరిగే అవకాశం లేదు. మిగిలిన ఎనిమిది మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి ప్రారంభమైంది. అధికారయంత్రాంగం ఇప్పటికే ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. తుది ఓటరు జాబితాను విడుదల చేయడంతో పాటు పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల సిబ్బంది ఎంపిక, వారికి శిక్షణ లాంటి కార్యక్రమాలను కూడా చేపట్టింది. ఇక ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ రావడం ఆలస్యం ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
సిద్ధమవుతున్న రాజకీయపార్టీలు
పుర పోరుకు అన్ని రాజకీయపార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్ ఇన్నాండ్లు ఆపిన అభివృద్ధి పనులను ఆయా వార్డుల్లో చేపడుతూ ప్రజల మన్ననలు పొందే చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రతిపక్ష కాంగ్రెస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తిచూపే ప్రజాందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ఈ నెల ఎనిమిదో తేదీన కొత్త జిల్లాల వారీగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్‌ల ముందు ధర్నా కార్యక్రమాలను నిర్వహించింది. ఇక బీజేపీ పట్టణాలపై దృష్టి సారించాలని కింది స్థాయి శ్రేణులకు నాయకులు దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా పట్టణాల్లో బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడంలో బీజేపీ నిమగమైంది. అన్ని పార్టీల నుండి ఆశావహలు కూడా అధికంగా ఉండడంతో పట్టణాలలో ఎన్నికల సందడి ఇప్పుడే కనిపిస్తోంది. ఒక్కో వార్డు నుండి ఐదారుగురు పోటీలోఉండడంతో అన్ని వార్డుల్లో ఇదే చర్చ కొనసాగుతోంది. ఏ అభ్యర్థికి బలముంది అనే విషయంలో పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. బలాలు, బలహీనతలు ఆధారంగా టిక్కెట్లిచ్చి పార్టీ సత్తాను చూయించుకునేందుకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి.