నవతెలంగాణ-దండేపల్లి తమకు రావాల్సిన భూమిని ఆడపడుచు పేరుతో పట్టా చేసేందుకు యత్నిస్తున్నారని, న్యాయం చేయాలని కోరుతూ బాధితులు గురువారం వాటర్‌ట్యాంక్ ఎక్కి ఆందోళన చేసిన ఘటన మండలకేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం.. మండలంలోని తాళ్లపేట గ్రామానికి చెందిన కళావతికి లింగయ్యతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. 2008 సంవత్సరంలో కళావతి భర్త లింగయ్య మృతి చెందాడు. ఆయన ద్వారా సంక్రమించిన 39గుంటల భూమిని కళావతి సాగు చేస్తూ జీవిస్తోంది. ఈ భూమిని కళావతికి తెలియకుండా ఆమె అత్త ఆడ కూతురు పేరున పట్టా చేసేందుకు యత్నించింది. దీన్ని అడ్డుకుని రెవెన్యూ అధికారులకు కళావతి ఫిర్యాదు చేసింది. ఆడపడుచు భూమిని వేరే వారికి అమ్మినట్లు తెలుసుకున్న బాధితురాలు దండేపల్లి పోలీసులను ఆశ్రయించింది. న్యాయం చేయాలని వేడుకున్నా పట్టించుకోవడం లేదని కళావతి తన ఇద్దరు పిల్లలు, అన్నయ్య బొలిశెట్టి దేవెందర్‌తో కలిసి వాటర్‌ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న లక్షెట్టిపేట సీఐ నారాయణనాయక్ బాధితులకు భరోసా ఇచ్చాడు. దీంతో వారు ఆందోళన విరమించారు.