నవతెలంగాణ-మంచిర్యాల సింగరేణి పరిధిలోని నర్సరీల్లో పనిచేస్తున్న కార్మికులకు యాజమాన్యం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం(సీఐటీయూ) ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 6వ రోజుకు చేరుకుంది. యాజమాన్యం మొండివైఖరిని నిరసిస్తూ నర్సరీ కార్మికులు జీఎం కార్యాలయం ఎదుట గురువారం కండ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గుల్ల బాలాజీ మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఇటీవల నిర్వహించిన చర్చల్లో డిప్యూటీ జనరల్ మేనేజర్ అమరేంద్రరెడ్డి కార్మికులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని అన్నారు. లేకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి దూలం శ్రీనివాస్, జిల్లా అధ్యక్షురాలు వెలుపల కుమారి, కల, శిరీష, సర్వజన, మల్లేష్, భూపతి రావు, భాగ్యరాజు పాల్గొన్నారు.