- మున్సిపాలిటీల్లో పాగా వేసే ప్రయత్నం
- ఎత్తుకు పై ఎత్తులు.. మారుతున్న సమీకరణాలు
- చేరికలతో బిజీబిజీగా పార్టీలు
నవతెలంగాణ-మంచిర్యాల
మున్సిపల్ ఎన్నికలకు హై కోర్టు గ్రీన్ సిగల్ ఇచ్చింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. త్వరలో తేదీలు ప్రకటించనుండగా, అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. జిల్లాలో ఎన్నికలు జరగనున్న ఆరు మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. పార్టీల్లోకి వలసలను ప్రోత్సహిస్తూ చేరికలతో ఒకవైపు, వార్డుల్లో ప్రచారంలో మరోవైపు నాయకులు బిజీబిజీగా గడుపుతున్నారు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. మొత్తానికి ఆరు మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని అన్ని పార్టీలు ఆరాటపడుతున్నాయి.
జిల్లాలో పాతవి, కొత్తవి కలిపి మొత్తం ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండడంతో మందమర్రి పట్టణంలో ఎన్నికలు నిర్వహించకపోగా, మంచిర్యాల, బెల్లంపల్లి క్యాతన్‌పల్లి, నస్పూర్, లక్షెట్టిపేట, చెన్నూర్ ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. వార్డుల విభజనకు ముందు ఈ ఆరు మున్సిపాలిటీల్లో మొత్తం 118 వార్డులు ఉండగా.. ఆ సంఖ్య ఇప్పుడు 150కి పెరిగింది. తాజా పరిస్థితులను చూస్తే మున్సిపాలిటీల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్ బలంగా కనిపిస్తున్నా.. ప్రజల్లో అసంతృప్తి అనేది స్పష్టంగా కనిపిస్తోంది. మాజీ ఎంపీ వివేక్ బీజేపీలో చేరడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో కాస్త ఉత్సాహం కనిపిస్తున్నా.. గెలిచే అవకాశాలు తక్కువేననే చర్చ జరుగుతోంది. అయితే గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పోటీ ఇచ్చిన కాంగ్రెస్ బలంగానే కనిపిస్తోంది. ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలోకి చేరాలని ఆహ్వానాలు అందిస్తున్నట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ కూడా ఇతర పార్టీల్లోని నాయకులను పార్టీలో చేర్చుకోవాలని చూస్తుండగా, ప్రస్తుతం ఉన్న నాయకులు ఆందోళన చెందుతున్నారు. అయితే చేరికలు, మారుతున్న పరిణామాలు రానున్న ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతాయోననే ఆసక్తి నెలకొంది.
ఎవరి ప్రయత్నాలు వారివి..
జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉండగా, ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీకి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే మున్సిపాలిటీల్లో పార్టీని గెలిపించి తమ పట్టు నిలుపుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. మెజార్టీ కౌన్సిలర్ స్థానాల్లో గెలిచి మున్సిపాల్టీని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. చేరికలతో దూకుడును పెంచారు. అభివృద్ధి కార్యక్రమాలు చేశామంటూ మాజీ కౌన్సిలర్లు వార్డుల్లో పర్యటిస్తున్నారు. వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వీలైనంత ఎక్కువ మందిని చేర్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా మున్సిపల్ చైర్మెన్ కోసం కూడా పోటీ ఎక్కువగానే కనిపిస్తోంది.
కాంగ్రెస్, బీజేపీలు కూడా..
అధికార పార్టీకి దీటుగా కాంగ్రెస్, బీజేపీలు కూడా పావులు కదుపుతున్నాయి. మాజీ ఎంపీ వివేక్ చేరికతో జిల్లాలో పట్టుపెరిగిందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. పెద్ద ఎత్తున నాయకులను బీజేపీలో చేరాలని ఆహ్వానాలు పంపుతున్నారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తున్నారు. కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌తో పోల్చుకుంటే బీజేపీకి జిల్లాలో క్యాడర్, కార్యకర్తలు కూడా తక్కువే. మాజీ ఎంపి వివేక్ చేరికతో కాస్త బలం పెరిగినట్టు కనిపిస్తున్నా.. అది క్షేత్రస్థాయిలో లేదనే చర్చ జరుగుతోంది. దీంతో బీజేపీ కంటే కాంగ్రెస్సే బలంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్‌కు దీటుగా నిలిచింది కాంగ్రెస్ పార్టీయే. ఓటమిని చవిచూసిన ధైర్యాన్ని కోల్పోకుండా టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీఇచ్చేట్లు కనిపిస్తోంది. కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ కాంగ్రెస్ జిల్లా నాయకులు ముందుకు సాగుతు న్నారు. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్ వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నిస్తు న్నారు. అయితే ఎన్నికలు జరిగే తేదీలు, రిజర్వేషన్ల ఖరారు తరువాతే రాజకీయాలు పూర్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Authorization