- సర్పంచులు, ఉప సర్పంచుల మధ్య ముదురుతున్న విభేదాలు
- ముందుకు సాగని అభివృద్ధి పనులు
- 30 రోజుల ప్రణాళిక బిల్లుల చెల్లింపుల్లోనూ వివాదం
- కొత్త సమస్యలతో తలలు పట్టుకుంటున్న కార్యదర్శులు
నవతెలంగాణ- గాదిగూడ
పల్లెల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. ముప్ఫై రోజుల ప్రణాళిక, ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టినా పనులు కానట్టు తెలుస్తోంది. దీనికి సర్పంచులు, ఉప సర్పంచుల మధ్య విభేదాలే కారణమనే ప్రచారం జరుగుతోంది. ఇద్దరి మధ్య విభేదాలను పరిష్కరించడం పంచాయతీ కార్యదర్శుల నెత్తినొప్పిగా మారింది. గ్రామాలను ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దడంలో సర్పంచ్, ఉప సర్పంచులు పారదర్శకంగా పనిచేస్తారని ప్రభుత్వం చెక్ ఇద్దరికి కలిపి చెక్‌పవర్‌ను కట్టబెట్టినా.. చాలా పంచాయతీల్లో ఇద్దరి మధ్య పొసగక అభివృద్ధి నిలిచినట్టు తెలుస్తోంది.
మండలంలో 25 పంచాయతీలు ఉన్నాయి. మండలంలో ఆరు పంచాయతీలు ఆరు ఏకగ్రీవం కాగా, 19 పంచాయతీలకు ఎన్నికలు జరిగి సర్పంచులను ఎన్నుకున్నారు. వార్డు సభ్యులుగా ఎన్నికైన వారు ఉప సర్పంచులను ఎన్నుకున్నారు. అయితే గతంలో సర్పంచ్, కార్యదర్శులకు కలిపి చెక్ పవర్ ఉండేది. దీన్ని మారుస్తూ ప్రభుత్వం సర్పంచ్, ఉప సర్పంచ్‌లను కలిపి చెక్ పవర్ అధికారాన్ని ఇచ్చింది. దీంతో చాలా పంచాయతీల్లో సర్పంచులు, ఉప సర్పంచులు ఒకే పార్టీకి చెందిన వారైనప్పటికీ, రెండు గ్రూపులుగా ఏర్పడి పర్సంటేజీల కోసం పట్టుబడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో చాలా గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోతుండగా, రెండు గ్రూపుల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు కార్యదర్శులకు పడరానిపాట్లు పడుతున్నట్టు తెలుస్తోంది. నిధుల వినియోగం, ఖర్చులను పంచాయతీ కార్యదర్శులతో కలిసి తామే బాధ్యత వహించాల్సి ఉంటుందని సర్పంచులు చెబుతున్నారు.
ముందుకు సాగని అభివృద్ధి పనులు
సర్పంచ్, ఉప సర్పంచుల మధ్యవిభేదాలతో చాలా అభివృద్ధి పనులు ముందుకు సాగనట్టు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో మొక్కలు పూర్తి స్థాయిలో నాటకపోగా.. నాటిన మొక్కలకు ఫెన్సింగ్‌లు సైతం అమర్చనట్టు తెలుస్తోంది. అంతేకాకుంండా 30 రోజుల ప్రణాళికలో చేపట్టిన పనులు, కొనుగోలు చేసిన సామాగ్రి లెక్కలు కావాలని కొన్ని పంచాయతీల్లో ఉప సర్పంచులు సర్పంచులను నిలదీయడంతో వివాదాలు మరింత పెరిగినట్టు తెలుస్తోంది. 30 రోజుల ప్రణాళిక సమయంలో ప్రభుత్వం ఎలాంటి బడ్జెట్ కేటాయించకపోయినా, అప్పులు చేసి మరీ పనులను చేశామని, అనంతరం వచ్చిన నిధుల నుంచి ఉప సర్పంచులు వాటా అడుగుతున్నారని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత ఖర్చు పెట్టి పనులు చేసినా అవమానపరుస్తున్నారని, బహిరంగంగానే చెబుతున్నారు. ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాలతో అభివృద్ధి పనులు ఆగిపోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఇటీవల ప్రభుత్వం పంచాయతీలకు ట్రాక్టర్లు కొనుగోలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సర్పంచులు, ఉప సర్పంచుల మధ్య సయోధ్య కుదరనట్టు తెలుస్తోంది. అంతేకాకుండా మల్టీపర్పన్ వర్కర్లను ఎంపిక చేయాలని చెప్పడంతో ఎంపికలో సర్పంచులు, ఉప సర్పంచులు పోటీపడుతున్నారు. జాయింట్ చెక్ పవర్ తెచ్చి తంటా పంచాయితీల అభివృద్ధి ఆటకంగా మారాయని పలువురు పేర్కొంటున్నారు. గ్రామానికి మొదటి పౌరుడు అనే ప్రొటోకాల్ హోదా మినహాయిస్తే దాదాపు ఉప సర్పంచ్‌కు కూడా సర్పంచులతో సమానంగా అధికారాలు ఉన్నాయి. ముఖ్యంగా నిధుల వెచ్చింపు, ఆర్థిక అవసరాలు, గ్రామాల్లో అభివృద్ధి పనుల విషయంలోనే సర్పంచ్ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ విషయంలో ఉప సర్పంచ్ ను కూడా భాగస్వామ్యం చేయడంతో ఇద్దరి మధ్య సమన్వయం ఉండాలి. ఒకరికొకరు సహకరించుకోవాలి. లేదంటే ప్రతీరోజు పంచాయితీ తప్పదు. ఇప్పటికైనా సర్పంచులు, ఉప సర్పంచులు విభేదాలు వీడి అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
Authorization