నవతెలంగాన-రెబ్బెన
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ విషయంలో గ్యాస్ వినియోగం విషయాన్ని జిల్లా అధికారులు విస్మరించారు. ఇప్పటికీ అధిక శాతం పాఠశాలల్లో కట్టెల పొయ్యిలపైనే వంట చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఫలితంగా పాఠశాలల ప్రాంగణాల్లో పొగ కమ్ముకోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవు తున్నారు. నిర్వాహకులకు సైతం అవస్థలు తప్పడంలేదు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచడంతోపాటు పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టింది. గ్రామీణప్రాంత విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని పోషకాహారలోపాన్ని అధిగమించడానికి జిల్లాలో మధ్నాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు.ప్రొటీన్లు కలిగిన శక్తినిచ్చే ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని కొనసాగిస్తున్నారు.
మండలంలో ఇదీ పరిస్థితి
రెబ్బెన మండలంలో మొత్తం 57 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ప్రాథమిక పాఠశాలలు 46, ప్రాథమిక ఉన్నత పాఠశాలలు 5, ఉన్నత పాఠశాలలు ఆరు అలాగే కేజీబీవీ, గురుకుల పాఠశాల, ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో వందలాది మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి పౌష్టికాహారం అందించేందుకుగాను సర్కార్ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. అయితే గ్యాస్ పొయ్యిలు అందజేయకపోవడంతో నిర్వాహకులు కట్టెలపొయ్యిపైనే వంటచేసి వడ్డిస్తున్నారు. పది కిలోల బియ్యం, కూరగాయల భోజనం తయారు చేయడానికి సుమారు పదిహేను నుంచి ఇరవై కిలోల కట్టెలు అవసరం పడుతున్నాయి. గతంలో కొన్ని పాఠశాలలకు గ్యాస్ పొయ్యిలు అందజేసినప్పటికీ సిలిండర్లు ఇవ్వకపోవడంతో విని యోగంలోలేక మూలనపడ్డాయి.
వంట తయారీకి ప్రతిబంధకం
చాలాచోట్ల చాలా కాలంగా కట్టెల పొయ్యిపైనే వంట చేస్తున్నారు. గ్యాస్ కనెక్షన్లు అందుబాటులో ఉన్నా పాఠశాలల్లో వివిధ కారణాలతో వీటిని వినియోగించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మధ్యాహ్న భోజన పథకం అమలులో కొన్ని నిబం ధనలు సైతం గ్యాస్ పొయ్యిలపై వంట తయారీకి ప్రతిబంధకంగా మారుతున్నాయి. గ్యాస్ వినియోగానికి అదనంగా నిధులు విడుదల చేయకపోవడం, మధ్యాహ్న భోజనం కోసం విద్యార్థులకు కేటాయించిన మొత్తం నుంచే గ్యాస్ సిలిండర్లు తీసు కోవాల్సి రావడంతో దీనిపై నిర్వాహకులు ఆసక్తి చూపడంలేదు. కట్టెల పొయ్యిపై వంట చేస్తుండడంతో పాఠశాల ప్రాంగణంలో వాయు కాలుష్యంతో విద్యార్థులు అనా రోగ్యాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారయంత్రాంగం, ప్రభుత్వం స్పందించి ప్రతి పాఠశాలకు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని పలువురు కోరుతున్నారు.
Authorization