- దగా పడుతున్న పత్తి రైతు
- నామమాత్రంగా తనిఖీలు
- ప్రయివేటు వ్యాపారుల వైపు
మొగ్గుచూపుతున్న వైనం
నవతెలంగాణ- ఆసిఫాబాద్
సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు కుమ్మక్కై రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. తేమ శాతం 8 ఉన్నప్పటికీ నిర్ణయించిన ధర కంటే తక్కువ చెల్లింపులు చేసి తీవ్రంగా నష్టపరుస్తున్నారు. దీంతో ఆరుగాలం చమటోడ్చి పత్తి పండించిన రైతులు గిట్టుబాట ధర లభించక పుట్టెడు కష్టాల్లో కూరుకుపోతున్నారు. వీరి దిగుబడులు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు మాత్రం కోట్ల రూపాయలకు పడగలెత్తుతున్నారు. వ్యాపారులు, అధికారుల మాయాజాలానికి అన్న దాతలు దగా పడుతున్నారు.
జిల్లాలో మొత్తం 14 సీసీఐ కేంద్రాలు
జిల్లాలో జైనూర్, కౌటాలలో ఒకటి చొప్పున, కొండపల్లి ఎక్స్‌రోడ్ వద్ద 4, ఆసిఫాబాద్‌లో 6, వాంకిడిలో రెండు మొత్తం 14 సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.వీటి ద్వారా జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు లక్షా 26 వేల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. వీటిలో ప్రయివేటు ద్వారా 49,265 క్వింటాళ్లు, సీసీఐ ద్వారా 77,585 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 3385 మంది రైతులు పంటను విక్రయించారు.
దగా పడుతున్న పత్తి రైతులు
జిల్లాలో పత్తి విక్రయం జోరందుకుంది. రైతులు మొదటి విడత పత్తి ఏరి సమీపంలోని సీసీఐ కేంద్రాలకు అమ్మకానికి తరలిస్తున్నారు. అయితే ప్రభుత్వం పత్తికి మద్దతు ధర క్వింటాలుకు రూ.5550లు నిర్ణయించింది. రైతులు తీసుకువచ్చే పత్తిలో ఎనిమిది శాతం తేమ మాత్రమే ఉండాలని సూచించింది. పత్తిలో తేమ పెరిగినకొద్దీ ప్రతి ఒక్క శాతానికి రూ.50 చొప్పున క్వింటాలుకు తగ్గుతుందని, 12 శాతం కంటే ఎక్కువగా తేమ ఉన్నట్లయితే పత్తి కొనుగోలు చేయకూడదని నిర్ణయించింది.దీంతో సీసీఐ కేంద్రాలకు పత్తి అమ్మకానికి తీసుకువస్తున్న రైతులు ఆ జాగ్రత్తలు పాటిస్తు న్నారు. అయినప్పటికీ నిర్వాహకులు ఏదో ఒక సాకుతో నిర్ణయించిన ధర కంటే తక్కువగా చెల్లించి సొమ్ముచేసుకుంటున్నారు. 8 శాతం తేమ ఉన్నప్పటికీ తక్కువ డబ్బులు చెల్లించడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కౌలు రైతుకు కొత్త కష్టాలు
ఇప్పటికే ప్రభుత్వం కౌలు రైతులను పట్టించుకోవడంలేదు. వారికి రైతుబంధు పథకాలను వర్తింపజేయడంలేదు.దానికితోడు సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో కౌలు రైతు నోట్లో వెలక్కాయ పడ్డట్లయ్యింది. తప్పని సరిగా పట్టాపాస్‌బుక్ జిరాక్స్, బ్యాంకు అకౌంట్ పాస్‌బుక్ లాంటివి తీసుకురావాలని, అప్పుడే పంటను కొనుగోలు చేస్తామని చెప్పడంతో వారు తప్పని పరిస్థితుల్లో దళా రులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదునుగా భావించి వారు కోతలు విధించి అందినకాడికి దండుకుంటున్న పరిస్థితి నెలకొంది.
నామమాత్రంగా తనిఖీలు
సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద అధికారుల తనిఖీలు నామమాత్రంగా కొనసాగు తున్నాయి. ప్రతి సంవత్సరం మార్కెటింగ్ అధికారులకు ఎంతోకొంత ముడుపులు అందుతున్నాయని, అందువల్లనే వారు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తు న్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద తేమ పేరుతో నిరాకరించిన పత్తిని పక్కనే దళారులు ఉండి కొనుగోలు చేస్తున్నారని సమాచారం.ఇది అధికారులకు తెలిసినా పట్టించుకోవడంలేదని విమర్శలొస్తున్నాయి.
Authorization