నవతెలంగాణ- ఆదిలాబాద్‌టౌన్
అంతర్జాతీయ మార్కెట్‌లో క్వింటాలు గంజాయి ధర రూ.20 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. గంజాయి అక్రమ రవాణాలో ఆరితేరిన కొందరు..అటవీ ప్రాంతంలో వ్యవసాయ భూములున్న అమాయక రైతులకు డబ్బులు ఆశ చూపి గుట్టుచప్పుడు కాకుండా మొక్కలు పెంచుతున్నారు. పసుపు, మక్కతోపాటు ఇతర పంటల్లో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నారు. అనంతరం పంట చేతికి రాగానే రహస్యంగానే దానిని ఎండబెట్టి ప్యాకింగ్ బ్యాగుల్లో, సూట్‌కేసుల్లో నింపి నేరుగా మహారాష్ట్రకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాకు సరిహద్దున గల భోకర్, ధర్మాబాద్, నాందేడ్, హిమాయత్‌నగర్ వంటి ప్రాంతాల మీదుగా ముంబాయి వంటి ముఖ్య నగరాలకు సరఫరా చేస్తున్నారు. కొందరు దళారులు, అక్రమార్కుల దందాలో అమాయక రైతులు బలవుతున్నారు.
ఇతర జిల్లాల నుంచి రవాణా
ఇక్కడ సాగు చేయడంతోపాటు ఇతర జిల్లాల నుంచి సైతం గంజాయి అక్ర మంగా రవాణా అవుతోంది. జిల్లా మీదుగా జాతీయ రహదారి ఉండడంతో..ఇతర జిల్లాల నుంచి మహారాష్ట్రకు జిల్లా మీదుగా తరలుతోంది. ఇప్పటికే గంజాయి సాగు చేస్తున్న వ్యవసాయక్షేత్రాలపై పోలీసులు, ఎక్సైజ్ అధికారులు తరచూ దాడులు నిర్వహిస్తున్నారు. గంజాయి సాగు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో అక్రమార్కుల్లో ఆందోళన మొదలైంది.వాహనాల తనిఖీల్లోనూ గంజాయి సైతం పట్టుబడుతోంది. గంజాయి సాగు, రవాణాకు సంబంధించి సమాచారం తెలి సిన వెంటనే దాడులు చేసి..ధ్వంసం చేయడంతోపాటు తగుల బెడుతున్నారు.
కోట్లకు పడగలు
ఏజెన్సీ ప్రాంతాలైన బోథ్, ఇచ్చోడ, సిరికొండ, గుడిహత్నూర్, బజార్‌హత్నూర్ మండలాల్లో ఈ గంజాయి సాగు జోరుగా సాగుతోంది. రైతులతో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు చేయిస్తున్న ముఠాలు, కిలోకు వెయ్యి చొప్పున సేకరించి, బహిరంగ మార్కెట్లో కేజీ రూ.5 వేల నుంచి 6 వేలకుపైగా విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. దళారులు వాటిని 10, 15 గ్రాముల ప్యాకెట్లుగా మార్చి రూ.300 నుంచి రూ.500 వరకు అమ్ముతున్నట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో రైతులకు మిగిలేది అంతంత మాత్రమేకాగా దళారులు కోట్లకు పడగెత్తుతున్నారు.
ఇవే ఉదాహరణలు
ఇటీవల విశాఖ పట్టణం నుంచి కొనుగోలు చేసిన తీసుకొస్తున్న గంజాయిని పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. రూ.14 లక్షల విలువ చేసే 70 (140 కిలోలు) ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.బజార్‌హత్నూర్ మండలానికి 12 కిలో మీటర్ల దూరంలో మోర్కండి, ఇందిరానగర్ గ్రామశివారు ప్రాంతాల్లోని భూముల్లో పెద్దఎత్తున గంజాయి సాగు చేస్తున్నట్టు అందిన సమాచారం మేరకు స్వయంగా ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు వారియర్ నేతృత్వంలో దాడులు చేసి గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు.వీటి విలువ రూ.20 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
Authorization