నవతెలంగాణ-సికింద్రాబాద్ ధర్మశాలల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు. మోండా మార్కెట్ డివిజన్ పరిధిలోని మాటిక నాగయ్య ధర్మశాల, గ్రెయిన్ మర్చంట్ ధర్మశాలల అభివృద్ధి వెంటనే చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. శనివారం బోయిగూడ మార్కెట్ వద్ద గల నాగయ్య ధర్మశాల, గ్రెయిన్ మర్చంట్ ధర్మశాలను అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. పాత గాంధీ ఆస్పత్రికి వచ్చే రోగుల బంధువుల కోసం దాతల సహకారంతో ఈ ధర్మశాలలను నిర్మించినట్టు ఆయన వివరించారు. సికింద్రా బాద్‌కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం ధర్మశాలలను అన్ని వసతులు, సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని, అధునాతన ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి తనకు సమర్పించాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆకుల రూప, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ సురేందర్ తదితరులు ఉన్నారు.