వరుసగా పట్టుబడుతున్న మద్యం నిల్వలు
- బ్లాక్ మార్కెట్లో సొమ్ము చేసుకుంటున్న దళారులు
- మూడు రెట్లు పెంచి అమ్ముతున్న వైనం
- గ్రామీణ ప్రాంతాల్లో మద్యం సరఫరాపై అనుమానాలు
ఒక వైపు ప్రపంచం కరోనా వైరస్ దెబ్బకు విలవిల్లాడుతుంటే మరో వైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మద్యం సరఫరా అవుతూనే ఉంది. ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మద్యం నిల్వలు పట్టుబడడమే దీనికి నిదర్శనం. లాక్‌డౌన్ నేపథ్యంలో వైన్ షాపులను మూసి ఉంచాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. అయినా వ్యాపారులు రహస్య ప్రాంతాల్లో మద్యాన్ని నిల్వ చేసి విక్రయిస్తున్నారు. ఎక్కువ ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో ఉన్న ధరలతో పోలిస్తే మూడు రెట్లు పెంచి అమ్ముతున్నారు. ఒకవైపు ప్రభుత్వం మద్యం దుకాణాలను పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ చేశామని చెబుతున్నప్పటికీ పల్లె ప్రాంతాల్లో మాత్రం విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి.
నవతెలంగాణ-ఆసిఫాబాద్
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించి దాని నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో అన్ని రకాల దుకాణాలు మూసి ఉంచాలని, వ్యక్తులు భౌతికదూరం పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా మద్యం దుకాణాలు, బార్‌అండ్‌రెస్టారెంట్‌లు సైతం మూసి ఉన్నాయి. కానీ లాక్‌డౌన్‌నూ మద్యం సరఫరా అవుతోంది. వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా రహస్య ప్రాంతాల్లో మద్యాన్ని నిల్వ ఉంచి సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మద్యం పట్టుబడింది. కాసిపేట, జన్నారం, తాండూర్ ప్రాంతాల్లో మద్యం కాటన్‌లు పట్టుబడ్డాయి. మద్యాన్ని సరఫరా చేస్తూ వ్యక్తులు సైతం అక్కడక్కడ దొరికారు. ఇలా లాక్‌డౌన్‌లోనూ వ్యాపారులు మద్యం సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మద్యం ధరలను అమాంతం పెంచి విక్రయిస్తున్నా మందుబాబులు ఎంతైనా సరే కొనుగోలు చేస్తున్నారు. గతానికి ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ధరల్లో పోలిక కూడా లేదు. బెల్టు షాపుల నిర్వాహకులైతే ఇష్టం వచ్చిన ధరకు అమ్ముతూ మందుబాబుల జేబులు కొల్లగొడుతున్నారు.
మద్యం రాకపై పలు అనుమానాలు
గత నెల 23 నుండి రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. అప్పటి నుండి నిత్యావసర సరుకులకు, కూరగాయలకు మినహా ఏ దుకాణామూ తెరిచి ఉంచడానికి వీలు లేదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా మద్యం దుకాణాలు కూడా మూతబడ్డాయి. అయితే ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ ప్రకటించి ఇప్పటికి 20 రోజులు దాటినప్పటికీ బెల్టు దుకాణాల్లో మద్యం లభ్యతపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించేవారు. పట్టుకున్న మద్యాన్ని ఎక్సైజ్ అధికారులకు అందించేవారు. కానీ ఇప్పుడు వారు ప్రత్యేక విధుల్లో ఉండడం వల్ల దీనిపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. ఎక్సైజ్ అధికారులు జిల్లాలో ఎక్కడా కూడా దాడి చేసిన సందర్భాలు లేవు. ఎక్కడి నుండైన సమాచారమొస్తే టాస్క్‌ఫోర్స్ బృందాలు దాడులు చేసి మద్యం నిల్వలు స్వాధీనం చేసుకుంటున్నాయి. అలా ఆదివారం తాండూర్ మండలంలో బీరు, లిక్కర్ కాటన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఏదేమైనా గ్రామీణ ప్రాంతాల్లో మద్యం సరఫరాపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. కొన్నిచోట్ల మద్యం దుకాణాలు అర్ధరాత్రి పూట కొంత సమయం ఎవరికీ తెలియకుండా తెరుస్తున్నారని, త్వరగా పని చేసుకుని మూసేస్తున్నారని తెలిసింది. ఇదే జరిగితే ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడిచినట్లవుతుంది. ఎక్సైజ్ అధికారులు మాత్రం లాక్‌డౌన్ పీరియడ్ కంటే ముందుగా కొంత మంది వ్యక్తులు మద్యం స్టాక్ పెట్టుకున్నారని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామీణ ప్రాంతాల్లో మద్యం అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దష్టికొస్తే చర్యలు : మోషన్ అలీ, ఎక్సైజ్ సీఐ
గ్రామీణ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలపై మా దష్టికి ఎటువంటి అంశాలు రాలేదు. అటువంటి అమ్మకాలు జరిగినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటాం. రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహిస్తాం. ఎవరైన మద్యం అమ్మినట్లయితే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం.
బ్రాండ్ పేరు గరిష్ట ధర ప్రస్తుత ధర
ఎంసీ పుల్ బాటిల్ 560 1120
రాయల్ స్టాగ్ 880 1360
రాయల్ చాలెంజ్ 840 1680
బ్లెండర్స్ ప్రైడ్ 1080 2120
చీప్ లిక్కర్ 80 280
బీర్ 120 350
Authorization