నవతెలంగాణ-జన్నారం
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్- 19(కరోనా) మహమ్మారి రోజురోజుకూ వికృత రూపం దాల్చుతోంది. వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్-19 పాజిటివ్ కేసులు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. జనతా కర్ఫ్యూ తర్వాత అంతా సద్దుకుంటుంది అనుకున్న సందర్భం లో ప్రధాని పిలుపు మేరకు ప్రజలు మరో పక్షం రోజు లు లాక్‌డౌన్‌లో పాల్గొని ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరించారు.లాక్‌డౌన్ పొడగింపుతో ఇప్పట్లో పరిస్థితి సద్దుమణిగేలా లేదని భావించిన వలస కూలీలు పట్టణాల నుంచి సొంతూర్లకు కాలినడకన తరలివెళ్తున్నారు.
మే 7తో ముగిసిపోతుందా?
కోవిడ్19 (కరోనా) నియంత్రణకు మందులేదు. ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ నియంత్రణకు ఇంట్లోనే ఉండటం, భౌతిక దూరం పాటించడం, ప్రభుత్వం నిబంధనలు పాటించడం ఒకటే మార్గం. ఇవాళ కాకుంటే రేపైనా లాక్‌డౌన్ ముగుస్తుంది. తర్వాతైనా ఆర్‌టీసీ బస్సులో ప్రయాణం చేయొచ్చా? ఆ తర్వాత వైరస్ సోకితే పరిస్థితేంటి? మళ్లీ పాత రోజులొస్తాయా? వైరస్ వ్యాప్తి చెందకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందా? ఇంకా అనేక ప్రశ్నలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. మే 7 తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగితే తమ పరిస్థితేంటి? అంటూ పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలు, వలస కూలీలు, పారిశ్రామికవేత్తలు, వీరూ వారని కాదు. అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వాలకు పలు సమస్యలు పెను సవాళ్ళుగా మారనున్నాయి. ప్రభుత్వం సమర్థవంతంగా పని చేయకపోతే ప్రజల నుంచి తిరుగు బాటు వచ్చే అవకాశం కూడా ఉంది.
అనుభవాలు.. పాఠాలు కావాలి...
కొన్ని దేశాలు కరోనాను కట్టడి చేయడంలో ఫలితాలు సాధిస్తుంటే, మరికొన్ని దేశాలు భారీ మూల్యం చెల్లించుకుంటున్నాయి. నేడు ప్రాణాలు మాత్రమే కోల్పోతున్నారు, నిర్లక్ష్యం వహిస్తే రాబోవు రోజుల్లో ప్రాణాలతో పాటు ఆర్థిక అగాధంలో కూరుకుపోవడం కాయమంటూ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనాలో కరోనా విజృంభించి వందలాది మందిని పొట్టనబెట్టుకుంటే, మన దేశం కాదు... మనకు రాదు అనుకున్న పాలకుల చిన్న నిర్లక్ష్యం మూలంగా దేశమంతా గృహనిర్బంధంలో ఉండిపోవాల్సి వచ్చిందని పలువురు విమర్శిస్తున్నారు. మే 7 తర్వాత రాష్ట్రంలో, దేశంలో ఇదే పరిస్థితి కొనసాగితే తదుపరి తీసుకునే చర్యల పట్ల ప్రజలను ఇప్పటి నుండే మానసికంగా సిద్ధం చేయాలి. వారికి ఆర్థిక భరోసా కల్పించాలి. వైరస్ కట్టడికి గృహనిర్బంధం ఒకటే పరిష్కారం కాకూడదు. ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలి.
ఆరోగ్యం పట్ల పెరిగిన శ్రద్ధ...
నష్టాల్లో-లాభాలు,కష్టాల్లో-సుఖాలు, ద్ణుఖంలో-సంతోషాలను వెతుకుతున్నట్టు కరోనా తీసుకొచ్చిన కష్టకాలంలో ఆరోగ్యానికి సంబంధించిన లాభాలు అనేకం ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థల నివేదికల ప్రకారం గతేడాది ప్రపంచవ్యాప్తంగా జ్వరం, దగ్గు, జలుబు ఇలాంటి వ్యాధుల వల్ల 27 లక్షల మంది చనిపోయినట్టు పేర్కొన్నాయి. ప్రజలు గృహనిర్బంధం తో చాలా రకాల జబ్బులు వ్యాప్తి చెందడం లేదని వైద్యులు తెలుపుతున్నారు. ఇంట్లోనే ఉండి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల పక్షవాతం, తలనొప్పి, బీపీ, షుగర్, మొదలైన వ్యాధులు అదుపులోకొచ్చాయి. సమయానికి భోజనం చేస్తూ టెన్షన్ తగ్గించుకోవడం తో మెడ నొప్పి, కండరాల నొప్పులు, గ్యాస్ ట్రబుల్ దరి చేరడం లేదు. మద్య నిషేధం పూర్తిస్థాయిలో అమలు కావడంతో గొడవలుగానీ, రోడ్డు ప్రమాదాలు, హత్య లు, లైంగికదాడుల వంటి నేరాలు ఆగాయి. వ్యాధి నిరోధకశక్తిని పెంచుకుంటే వ్యాధులు ధరిచేరవని డాక్టర్లు, స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో ప్రజలు పౌష్టికాహారం తీసుకోవడం వైపు మొగ్గు చూపుతున్నారు. రానున్న రోజుల్లో ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పొచ్చే అవకాశం కూడా ఉంటుంది.
ఉపాధి-ఆర్థిక భరోసా కలిగించాలి
భారత ప్రభుత్వం నివేదికల ప్రకారం 2017 ఆర్థిక సర్వేలో ఏటా 90 లక్షల మంది అంతర్రాష్ట్ర వలసలుంటాయని పేర్కొన్నారు. అంటే మనదేశంలో వలస కూలీల ప్రాధాన్యతను అంచనా వేయొచ్చు. ప్రధానమంత్రి 14 రోజుల లాక్‌డౌన్ విధించినప్పుడు ఎక్కడివారు అక్కడే ఉండి సహకరించిన వలస కూలీలు లాక్‌డౌన్ పొడిగించడంతో తమకిక ఉపాధిలేదని, ఆర్థిక కష్టాలు భరించలేమని భయపడి పెద్ద పెద్ద నగరాల నుంచి వేలదిమంది స్వస్థలాలకు బయలుదేరేందుకు రోడెక్కిరు. అంటే ప్రజల్లో ఓపిక క్రమక్రమంగా సన్నగిల్లుతోందనడానికి ఇది ఒక ఉదాహరణ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు, నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నప్పటికీ, దాతలు ముందుకొచ్చి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నా... ప్రజల్లో అభద్రతాభావం పెరుగుతోంది. ప్రభుత్వాలు వలసలను సమర్థవంతంగా కట్టడి చేయడానికి చర్యలు తీసుకుంటూనే, భద్రతతో కూడిన మెరుగైన రవాణాకు కృషి చేయాల్సి ఉంది.
నిబంధనలు కఠినం చేసి.. సంక్షేమంపై దృష్టి పెట్టాలి...
మే 7 తర్వాత కూడా కొత్త కేసులు నమోదైతే పరిస్థితేంటనే ఆందోళనలో ప్రజలుండగా, దీనికి సరైన సమాధానం చెప్పే స్థితిలో ప్రభుత్వం లేదు. ఈ నేపథ్యంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలెక్కువగా ఉన్నప్పటికీ వివిధ వృత్తిరిత్యా పట్టణాలకు వలస వెళ్లేవారు. కానీ పరిస్థితి ప్రస్తుతం అందుకు భిన్నంగా తయారైంది. పట్టణాల్లో మురికి వాడల్లో చిన్న ఇండ్లు, ఇరుకు గదుల్లో నివసించడం వల్ల వైరస్ వ్యాప్తిచెందే అవకాశం ఎక్కువ. పండుగలు, ఆడంబరాలు, ఉత్సవాలు, కార్యక్రమాలను ఎక్కువగా పట్టణాల్లోనే నిర్వహిస్తారు. ఇలాంటివన్నీ కనీసం ఆరు మాసాలు కట్టడి చేయాలి. వైరస్ వ్యాప్తికి గురయ్యే ప్రదేశాలను గుర్తించి ఆ ప్రాంతాల్లోని ప్రజలందరికీ పరీక్షలు నిర్వహించాలి.
నిరంతర వైద్య సేవలు కొనసాగించాలి
గతంలో మలేరియా లాంటి వ్యాధులను అరికట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక వైద్య బృందాన్ని నియమించి నిరంతరం పరీక్షలు జరిపించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి అనారోగ్యానికి గురైన వారికి మందులిచ్చి, రక్త నమూనాలు తీసుకెళ్లేవారు. ఈ ప్రక్రియ నిరంతరం జరిగేది. ఇప్పుడు కూడా ఆశా వర్కర్లకు, ఇతర సిబ్బందికి ప్రత్యేక శిక్షణనిచ్చి నిరంతరం వైద్య పరీక్షలు జరిగేలా, సామాజిక ఆరోగ్య సమాచారాన్ని పొందుపర్చాలి. వ్యాధిని గుర్తించడం ఎంత ముఖ్యమో దానిని కట్టడి చేయడం కూడా అంతే ముఖ్యం. వయసు మీరిన డాక్టర్లను సూపర్ వైజర్‌గా, యువ డాక్టర్లను పేషంట్ కన్సల్టేషన్‌లో ఉండేలా చూడాలి. ప్రజలకు ఉచితంగా పౌష్టికాహారాన్ని అందించాలి. మనదేశంలో చిన్నపిలలు 42 శాతం పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలి. పేదవారు వ్యాధి నిరోధకశక్తిని పెంచుకునే విధంగా ప్రభుత్వం ఆరోగ్య, ఆహార, రక్షణ చర్యలు చేపట్టాలి. నేటి పరిస్థితుల్లో పాలకులు తీసుకునే నిర్ణయాలే కీలకం. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రజల నుంచి సామాజిక తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది.
Authorization