- టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు దేగం యాదాగౌడ్ నవతెలంగాణ-ఆర్మూర్ కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని కాంటాచేసి త్వరగా తరలించాలని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు దేగాం యాదాగౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని పిప్రి దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో రైతులు రోజుల తరబడి పడిగాపులు కావాల్సి వస్తుందని అన్నారు. తన నంబరు ఎప్పుడు వస్తుందో అంటూ రైతులు రోజులతరబడి ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఒకపక్క అకాల వర్షాలతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ధాన్యపు గింజ కొనే వరకు తమ బాధ్యత అంటుందే తప్ప చేతల్లో చూపడం లేదని ఆయన విమర్శించారు. వాతావరణ పరిస్థితుల కారణంగా ధాన్యం చెడిపోతే బాధ్యులు ఎవరని ఆయన ప్రశ్నించారు. మరోపక్క బస్తాకు ఐదు కేజీల కడ్తా తీసుకోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి త్వరితగతిన తరలించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట టీడీపీ నాయకులు జక్కం లింగారెడ్డి, రాజారెడ్డి తదితరులున్నారు.