నవతెలంగాణ-మందమర్రిరూరల్
కరోనా మహమ్మారి నివారణకు ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించింది. ప్రజలు ఇంటికే పరమితమై స్వీయ నియంత్రణ, భౌతిక దూరం పాటించడం వల్లే కరోనా మహమ్మారిని నిర్మూలించవచ్చని ప్రకటించినప్పటికీ ప్రభుత్వ విభాగాల్లో మచ్చుకైన అది కనిపించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా నివారణకు దేశ వ్యాప్తంగా మార్చ్ 22వ తేదీ నుంచి లాక్‌డౌన్ విధించగా నేటికీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 20 నుంచి కొన్నింటికి లాక్‌డౌన్ నుంచి మినహాయింపునివ్వగా అందులో ఉపాధి పనులు కూడా ఉన్నాయి. ఉపాధి హమీ పనుల కూలీలకు కాస్త ఉపాధి లభించింది. ఈ క్రమంలో కూలీలు భౌతిక దూరం పాటించి కరోనా నివారణకు సహకరిస్తూ పనులు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ మండలంలో చేపట్టిన ఉపాధి పనుల్లో భౌతిక దూరం మచ్చుకైన కనిపించడం లేదు. కూలీలందరూ గుపులుగా పనులు నిర్వహిస్తుండటంతో లాక్‌డౌన్ నిబంధనలు అమలు కావడం లేదు. మండలంలో 10 గ్రామ పంచాయతీలు ఉండగా 3968 వేల కుటుంబాలకు జాబ్ కార్డులున్నాయి. మండల వ్యాప్తంగా 308 కూలీల గ్రూపులుండగా 7588 మంది కూలీలు జాతీయ ఉపాది హమీ పథకం ద్వారా ఉపాధి పొందుతున్నారు. మండల వ్యాప్తంగా ఉన్న కూలీలు గత నెల 22 వ తేది నుంచి లాక్‌డౌన్‌తో ఉపాధి లేక ఇంటికే పరిమితమయ్యారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులో భాగంగా ఈ నెల 20 నుంచి ఉపాధి పనులు ప్రారంభించినప్పటికీ లాక్‌డౌన్ నిబంధనలు పూర్తిగా అమలు కాకపోవడంతో భయం భయంగా కూలీలు పనులు చేస్తున్నారు. ఉపాధి పనులు చేసే కూలీలు భౌతిక దూరం పాటించేలా అధికారులు చూడాలని కేంద్రం ఆదేశించింది. అయినా నిబంధపలరే విరుద్ధంగా పనులు నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాలుస్తున్న వేళ నిబంధనలు కఠినతరం చేసి అమలు చేస్తున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చూడాల్సిన అధికారుల నిర్లక్ష్యం మూలంగా మండలంలో వైరస్ వ్యాప్తి చెందుతుందని పలువురు ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
మాస్కులు ధరించకుండా.. భౌతిక దూరం అంతంతే...
గ్రామల్లో కూలీల వలసలు నివారించి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో జాతీయ ఉపాధి హమీ పథకాన్ని ప్రారంభించారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కూలీలకు అందని ద్రాక్షగా మారింది. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు చేపట్టింది. దీంతో ఉపాధి పనులు ప్రారంభించి కూలీలు విధిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని పాటించాలని ఆదేశించినప్పటికీ మండలంలో ఎక్కడా అమలుకు నోచడం లేదు. కూలీలందరూ గుంపులుగా పనులు చేపట్టడం, ఎలాంటి రక్షణ చర్యలు లేకుండానే ఉపాధి కూలీలు పనులు నిర్వహిస్తున్నారు. భయం గుప్పిట్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహించాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కానరాని కనీస సౌకర్యాలు...
ఉపాధి హామీ పథకం కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించి పనుల చేపట్టాలని నిబంధనలు ఉన్నప్పటికీ మండలంలో ఎక్కడా అమలుకు నోచకపోవడంతో అసౌకర్యాలు మధ్య పనులు నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. పని ప్రదేశాల్లో కూలీలకు తాగునీరు, నీడ కోసం టెంటు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, పని ప్రదేశాల్లో చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడితే ప్రథమ చికిత్స నిమిత్తం ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందుబాటులో ఉంచాలి. కానీ అలాంటివేమీ లేకుండానే పనులు నిర్వహిస్తున్నారు. ఉపాధి కూలీలకు పూర్తి స్థాయిలో పనులు కల్పించాల్సి ఉన్నప్పటికి మొక్కుబడిగా పనులు కల్పిస్తూ మమా అనిపిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కరోనా నేపథ్యంలో భౌతిక దూరం ఖచ్చితంగా పాటించేలా అధికారులు పర్యవేక్షించి, కూలీలందరికీ పని ప్రదేశాల్లో తగిన సౌకర్యాలు కల్పించాలని పలువురు కోరుతున్నారు.
కూలీలందరికీ పనులు కల్పించాలి
మండలంలోని ఉపాధి కూలీలందరికీ పనులు కల్పించాలి. కరోనా నేపథ్యంలో కూలీలు భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు చేపట్టి లాక్‌డౌన్ నిబంధనలు అమలయ్యేలా చూడాలి. కూలీలకు పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించాలి.
- సంకె.రవి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
Authorization