- తమ గోడు పట్టించుకోవాలంటూ రోడ్డుపై రైతుల బైటాయింపు
మంచిర్యాల డీసీపీ హామీతో ఆందోళన విరమణ
నవతెలంగాణ-దండేపల్లి
మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతు ఎద్దు బుచ్చయ్య తన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ మనస్తాపం చెంది మంగళవారం గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే లక్షెట్టిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు మంచిర్యాల ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుని కుటుంబ సభ్యులు, స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం...బుచ్చయ్యకు చెందిన ఏడు ట్రాక్టర్ల ధాన్యం సుమారు 45 రోజులు దాటినా తూకం వేయడం లేదు. తూకం వేయమని అడిగినప్పుడల్లా రేపు, ఎల్లుండి అంటూ దాటవేస్తూ వస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయడానికి ఒక్కో రైతు వద్ద నుంచి రూ.3వేల వరకు వసూలు చేస్తున్నారు. దీంతో పాటు తూకం వేసిన ధాన్యం బస్తాలను తరలించడానికి ఒక్కో బస్తాకు రూ.3 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వర్షం వచ్చినప్పుడల్లా ధాన్యాన్ని కాపాడుకోవడానికి తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో బాధిత రైతు టార్పాలిన్ కవర్లు లేక బోరాలు అద్దెకు తెచ్చుకున్నాడు. వాటికి డబ్బులు చెల్లించేందుకు కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో ఎంతకీ ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో మనస్తాపం చెంది మంగళవారం పురుగులమందు తాగాడు. బాధిత రైతుకు న్యాయం చేయాలని పలు గ్రామాలకు చెందిన రైతులు ధర్నాకు దిగారు. రైతుకు సత్వర న్యాయం చేయాలంటూ, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేసి తరలించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ సంఘర్ష్ సంతోష్‌కుమార్, లక్షెట్టిపేట సీఐ నారాయణనాయక్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా ఎంతకి వినలేదు. సుమారు రెండు గంటలపాటు అక్కడే భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో మంచిర్యాల డీసీపీ ఉదరుకుమార్‌రెడ్డి, ఇన్‌చార్జి ఎసీపీ నరేందర్ అక్కడ చేరుకొని న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం చర్చల నిమిత్తం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలివెళ్లారు.
Authorization