- సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేణ శంకర్
నవతెలంగాణ-మంచిర్యాల
మల్టీ నేషనల్ కంపెనీలకు రూ.68 వేల కోట్లు మాఫీ చేసిన బీజేపీ ప్రభుత్వం వలస, అసంఘటితరంగ కార్మికులు, కూలీల పట్ల అనుసరిస్తున్న వైఖరి సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేణ శంకర్ అన్నారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయం ముందు నాయకులతో కలిసి నల్ల జెండాలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలస కార్మికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజకీయ పరంగా మాట్లాడాలని అన్నారు. వలస కార్మికుల కోసం మరిన్ని రైళ్లు, బస్సులు నడపాలని, ఆహారం అందజేయాలని తెలిపారు. వారికి రూ. 10వేల ఆర్థిక సాయం అందజేయాలని, రేషన్‌కార్డు లేని వారందరికీ బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని అన్నారు. రాష్ట్రంలో ఉన్న కూలీలు, అసంఘటితరంగ కార్మికులకు సంక్షేమ నిధి నుంచి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి కలందర్ అలీఖాన్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, ఇప్పకాయల లింగయ్య, చంద్రశేఖర్, ఎండీ అక్బర్‌అలీ, ఎం.కొమురయ్య, లింగం రవి, చాలా మహేందర్‌రెడ్డి, మిట్టపల్లి పౌలు, రాజేశ్వరరావు పాల్గొన్నారు.
Authorization