''బ్రతుకు కొనసాగవలె మంచిబాటలోన
మరణ మదియుండవలె, లోకమాన్యమగుచు
చావు బ్రతుకులు నిల యశస్కరములైన
నరుని జీవిత మది ధన్యమరయ మిత్ర !''
జీవన సత్యమార్గమున మనిషి మనుగడకు ఆవశ్యమైన పరమసత్య భావాన్ని సుస్పష్టంగా విప్పిచెప్పిన కవి, పద్యాల పాత్రలలో అక్షరామృతాన్ని పంచిన విలక్షణ సత్కవివరేణ్యులు, తన కృతి 'మిత్రప్రబోధ'లో పద్య జీవన దివ్యౌషధాలను ప్రపంచానికి అందించిన మాన్యశ్రీ పాటిబండ్ల వెంకటపతి రాయలు కవి. మన తెలంగాణలో 'పాటి' అంటె అక్షరాలు దిద్దే పలక అని అర్ధం. 28 డిసెంబర్ 1914లో పాటిబండ్ల కోటయ్య, లక్ష్మిదేవి గార్ల కలల పంటగా కృష్ణాజిల్లా వీరులపాడు గ్రామంలో జన్మించారు.
ఉభయ భాషాప్రవీణ, తెలుగు, హిందీ, సంస్కృతంలో ప్రావీణ్యత సాధించి, హిందీ ఉపాధ్యాయులుగా 1948ప్రాంతంలో వీరి నెల జీతం కేవలం రూ.25.
విద్వత్కవులు జంగా హనుమయ్య చౌదరి గారు వీరి గురువులు అన్నయ్యగారైన వెంటక రామయ్యచౌదరి మంచికవి కూడా. ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి ముందు కొంతకాలం వ్యవసాయం చేసి, కొందరు నచ్చచెప్పడం వలన తను నేర్చుకున్న విద్యను నలుగురికి నేర్పించడం ఆరంభించారు. 1930లో రాత్రిబడి వయోజన విద్య బోధనకు శ్రీకారం చుట్టారు వెంకటపతిరాయలు.
1932లో శాసనోల్లంఘనం పేరుతో సత్యాగ్రహంతో పాటు యువకులను ఉత్సాహపరుస్తూ చైతన్యవంతమైన కవితలెన్నో రచించారు. అలా రచించిన కవితలను పోస్టర్లుగా చేసి ఊళ్లో రాత్రి వేళల్లో గోడల మీద అతికించేవారు. 19325లో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికైన రాయలువారు 1936లో గాంధీ మహాత్మున్ని పలుమార్లు దర్శించారు. గ్రామస్తుల నుండి విరాళాలు సేకరించి మహాత్మునికి సమర్పించారు.
అన్నపూర్ణ గారితో పాణిగ్రహణం చేసిన వీరికి కోటేశ్వరరావు(ఎం.టెక్), ద్వితీయ పుత్రులుగా ఇప్పుడు మన నిజామాబాద్‌లోని సుప్రసిద్ధ డాక్టర్, సాహితీ సాంస్కృతిక నాటక కళారాంగాల నిపుణులు, సహృదయ శేఖరులు జనవిజ్ఞాన వేదిక నిర్వాహకులు డా. పి. రామ్మోహన్‌రావు గారు..కాగా, తృతీయంగా సరళాదేవి కూతురు.
''మిత్ర ప్రబోధ'' 400 పద్యాల గ్రంథము
'' నా దక్షిణ భారత యాత్ర విశేషాలు''
'' నా ఉత్తర భారత యాత్ర విశేషాలు''
'' నాలో నేను''(జీవితానుభవ కథ)
'' బుద్ధం శరణం గచ్ఛామి''
ఇలా ఎనిమిది గ్రంథాలు ఆవిష్కరించిన సాహితీ సహజ ప్రతిభామూర్తి గౌరవనీయులు వెంకటపతి రాయలువారు. తన 70సంవత్సరాల ఏట ఓంటిరిగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ పర్యటించిన అనుభవాలను గ్రంథస్థం చేసిన నిత్య చైతన్యశీలి రాయలువారు.
సాహితీ సామాజిక ప్రయోజనాలు ఆకాంక్షిస్తూ వెంకటపతిరాయలు వారు చేసిన పలు ప్రసంగాలు యువతకు మార్గదర్శకాలు. వంద సంవత్సరాల వయస్సు ఆరోగ్యకరంగా పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక సాహితీ, సాంస్కృతిక సంస్థ 'భావన' నిర్వాహకులు రాయలవారిని ''శత వసంత సాహితీ మూర్తి'' పురస్కారంతోనూ, 101లో అడుగిడిన రాయలవారిని ఇందూరు యజ్ఞసమితి వారు శ్రీమన్మధనామ ఉగాది రోజున వెంకటపతిరాయలవారిని ''జీవన సాఫ్ల్య పురస్కారం''తో ఘనంగా సన్మానించారు.
నిజామాబాద్‌లోని సాహితీ సాంస్కృతిక సంస్థల సభ్యులందరూ వెంకటపతి రాయలవారిని ఘనంగా సత్యరించగా, 101 ఏళ్ల రాయలవారు మెత్తని చల్లని తీయని స్వరంతో స్పందిస్తూ ఇందూరు ఆత్మీయతను, కళలను ప్రశంశిస్తూ, అసూయ, ఈర్ష్యాద్వేషాలు దరిరానివ్వకుండా వేళకింత భోజనం చేస్తూ, తోటి వారికి ఉపయోగపడితే అదే మనిషి దీర్ఘాయుస్సుకి మూల సూత్రమని వివరించారు.
సోమవారం పుట్టిన వెంకటపతి రాయలవారు 27-4-2015 సోమవారం నాడే మన నిజామాబాద్‌లోనే తన పెన్నుపక్కన పెట్టి కన్ను మూసిన వెంకటపతిరాయలవారు తన నేత్రాలను దానం చేసి మరణానంతరం ఆదర్శంగా నిలిచిపోయారు...పోయి నిలిచారు.
Authorization