Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోసాలు, ఎగవేతలపై దృష్టి పెట్టండి
- రుణ మంజూరీలో నాణ్యత పెరగాలి..
- 8 శాతం స్థిరమైన వృద్ధికి కృషి జరగాలి:
- బ్యాంకుల చీఫ్‌ల సమావేశంలో జైట్లీ
న్యూఢిల్లీ: రుణ మోసాలు, ఉద్దెశపూర్వక ఎగవేతల విషయంలో బ్యాంకులు ప్రభావవంతమైన చర్యలు చేపట్టాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బ్యాంకుల అధినేతలకు సూచించారు. మంగళవారం ఆయన ప్రభుత్వ రంగ బ్యాంకుల ముఖ్య అధికారులతో వార్షిక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) ప్రగతిని సమీక్షించారు. మొండి బాకీలు, రుణ పుస్తకాల నాణ్యతను పెంపొందించే విషయమై ఆయన చర్చించారు. గత ఏప్రిల్‌లో నిర్వహించిన వార్షిక ఆర్థిక సమీక్షా సమావేశం తర్వాత ఆ స్థాయిలో బ్యాంక్‌ల కొత్త చీఫ్‌లతో జైట్లీ చర్చలు జరపడం ఇదే తొలిసారి. ఇటీవల బ్యాంకు ఆఫ్ బరోడా, విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత జైట్లీ నిర్వహించిన తొలి సమావేశం కావడంతో.. ఈ సమావేశంలో విలీనం దిశగా కూడా వాడిగావేడిగా చర్చ జరిగినట్టుగా సమాచారం. అనంతరం ఆర్థిక మంత్రి సమావేశం వివరాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. బ్యాంకులు చాలా జాగ్రత్తగా రుణాలివ్వాలని మంత్రి జైట్లీ ట్వీట్ చేశారు. సమాగ్రాభివృద్ధితో ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగడానికి 8 శాతం వృద్ధి రేటు అవసరమని మంత్రి పేర్కొన్నారు. స్వచ్ఛ రుణాలను బ్యాంకులు ప్రోత్సహించాలన్నారు. ఇదే సమయంలో ఎలాంటి మోసం జరిగినా, ఉద్దేశ్యపూర్వకంగా ఎగవేతలు చోటు చేసుకున్న వాటి నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాలని బ్యాంకు అధికారులకు సూచించారు. మొండి బాకీల రికవరీకి కావాల్సిన చర్యలపై బ్యాంకులు దృష్టి సారించాలని ఆయన ఈ సమావేశంలో సూచించారు.
ప్రమాదాలు తెలిసొచ్చాయి..
మంత్రి జైట్లీ మరో ట్వీట్ చేస్తూ బ్యాంకుల ఆర్థిక సమ్మేళిత చర్యలు చేపట్టడం, కొనుగోలు శక్తి పెరగడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థలో క్రమబద్దీకరణ చోటు చేసుకోనుందని ఆయన అన్నారు. దీంతో స్థిరంగా దేశం 8% వృద్ధి రేటుతో ముందుకు సాగేందుకు దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. దివాలా చట్టం, దివాలా స్ముతి, నోట్లరద్దు, జీఎస్‌టీ, డిజిటల్ చెల్లింపులు వంటి సంస్కరణ చర్యల మూలంగా దేశ ఆర్థిక సామర్థ్యం, ప్రమాదాలను అంచనా వేయడానికి వీలు పడిందని ఆయన అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బ్యాంకులు దాదాపుగా రూ.36,551 కోట్లు రికవరీ చేశాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోల్చితే ఇది 49 శాతం అదనం. 2017-18లో బ్యాంకులు మొత్తంగా రూ.74,562 కోట్లు రికవరీ చేశాయి. ఇదే సమయంలో 21 పీఎస్‌బీల్లో ఇండియన్ బ్యాంకు రూ.1,258.99 కోట్లు, విజయా బ్యాంకు రూ.727.02 కోట్ల చొప్పున మాత్రమే లాభాలు నమోదు చేశాయి. మిగితా బ్యాంకులన్నీ నష్టాలు చవి చూశాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుల ఆర్థిక ఫలితాలపై కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది.