Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2018-19లో 7.4% వృద్ధి అంచనా
- రెపో రేటు 6.5 శాతంగా కొనసాగింపు
ఆర్బీఐ సమీక్షలో నిర్ణయం
ముంబయి : కేంద్ర ప్రభుత్వంతో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాకు పెరుగుతున్న విభేదాలపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ స్పందించడానికి నిరాకరించారు. ఆర్బీఐపై సెక్షన్ 7 ప్రయోగం, రిజర్వు నిధుల బదిలీ తదితర అంశా లపై ఆయన మాట్లాడటానికి ఆసక్తి చూపలేదు. రిజర్వు బ్యాంకు ఐదో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష బుధవారం ముగిసింది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపిసి) ఈ నెల 3 నుంచి 5 వరకూ మూడు రోజుల పాటు సమీక్ష నిర్వహించింది. అనంతరం ఉర్జిత్ మీడియాతో మాట్లాడారు. ఆర్బీఐ స్వయంప్రత్తి ఇతర అంశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు తాను ప్రస్తుతం సమాధానం ఇవ్వలేనని, తాము ఈ సమీక్షలో ద్రవ్య పరపతి విధానం, సూక్ష్మ ఆర్ధిక వ్యవస్థపై మాత్రమే చర్చించామన్నారు.
ఆర్బీఐ స్వయంప్రత్తి నిర్వీర్యంపై గళమెత్తిన డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య కూడా ఉర్జిత్ తరహాలోనే సమాధానమిచ్చారు. క్రితం అక్టోబర్ నుంచి కేంద్రం-ఆర్బీఐ మధ్య చోటు చేసుకున్న ఘర్షణ తర్వాత పటేల్ తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. మోడీ ప్రభుత్వం ఆర్బీఐపై సెక్షన్-7 ప్రయోగించి ఈ స్వయంప్రత్తి కలిగిన సంస్థపై అజామాయిషీకి ప్రయత్నించిన విషయం తెలిసిందే. అదే విధంగా కేంద్ర బ్యాంకు వద్ద ఉన్న రూ.9.6 లక్షల కోట్ల నుంచి మూడో వంతు తమకు బదిలీ చేయాలని ఒత్తిడి చేసింది. దీనిపై ఆర్బీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎలాగైనా ఈ నిధులను చిక్కించుకోవాలన్న ప్రభుత్వం దీనిపై ఆర్బీఐతోనే ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి తీర్మానం చేయించింది. మరోవైపు ఎన్‌బీఎఫ్‌సీలకు భారీగా నిధులు అందించేలా ఆర్బీఐ చర్యలు తీసుకోవాలని కేంద్రం ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. అక్టోబర్ 10కి ముందుకు ఒక్క వారంలోనే మోడీ సర్కార్ డజన్ డిమాండ్లతో కూడిన లేఖలను ఆర్బీఐకి అందజేసిందని రిపోర్టులు వచ్చాయి. ఈ పరిణామాలు కేంద్రం, ఆర్బీఐ మధ్య తీవ్ర అంతరాలను పెంచింది. ఈ పరిణామాలను చాలా మంది నిపుణులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ అంశాలపై ఉర్జిత్ పటేల్ స్పందించకపోవడం గమనార్హం.
వడ్డీ రేట్లు యథాతథం
ఐదో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. దీంతో రెపో రేటు 6.5శాతంగాను, రివర్స్ రెపో6.25శాతంగా ఉండనుంది. ఆరుగురి సభ్యుల్లో ఐదుగురు కూడా వడ్డీ రేట్ల యథాతథానికే ఓటు వేశారు. అయితే ఎస్‌ఎల్‌ఆర్ రేటులో 25 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికిగానూ జీడీపీ వృద్ధి రేటు 7.4శాతంగా అంచనా వేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగానికి గానూ జీడీపీని 7.5శాతంగా ఉండొచ్చని పేర్కొంది. విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ వరుసగా రెండోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. క్రితం అక్టోబర్ సమీక్షలోనూ ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దష్ట్యా వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగానే ఆర్బీఐ తాజాగా కీలక రేట్లను యథాతథంగా ఉంచింది. గతంతో పోలిస్తే చమురు ధరలు తగ్గడం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో ఆర్బీఐ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. తదుపరి ద్వైమాసిక సమీక్ష 2019 ఫిబ్రవరి 5 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనుంది.
సమీక్ష ప్రధానాంశాలు..
- రెపో రేటు యథాతథంగా 6.5శాతంగా కొనసాగింపు.
- రివర్స్ రెపో రేటు ఎప్పటిలాగే
6.25 శాతమే.
- 2018-19 ఆర్థిక సంవత్సరానికిగానూ జీడీపీ వద్ధి రేటు 7.4శాతంగా అంచనా.
- 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగానికి గానూ జీడీపీ 7.5శాతంగా అంచనా.
- ప్రస్తుత అక్టోబరు - మార్చి కాలంలో
రిటైల్ ద్రవ్యోల్బణం 2.7-3.2శాతంగా ఉండొచ్చని విశ్లేషించింది.
- ఎంపీసీ భేటీ మినెట్స్‌ను డిసెంబర్ 19న వెల్లడించనున్నారు.