Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదే దారిలో బీఎస్‌ఈ, ఎమ్‌సీఎక్స్‌లు..
- సెబీ సలహా మేరకు ఎక్స్ఛేంజీల చర్యలు
- స్వతంత్ర సంస్థగా కేఫిన్ టెక్నాలజీస్
- నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మెన్‌గా నాయర్
ముంబయి: కార్వీ స్టాక్‌బ్రోకింగ్ సంస్థకు సోమవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ సంస్థకు చెందిన ట్రేడింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేసింది. ఈ నిర్ణయం అన్ని విభాగాలకు వర్తిస్తుందని ఎన్‌ఎస్‌ఈ తెలిపింది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ విధించిన పలు మార్గదర్శకాలను పాటించని కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా ఎన్‌ఎస్‌ఈ తన ప్రకటనలో తెలిపింది. కార్వీ బ్రోకరేజీ సంస్థ ఖాతాదారుల సెక్యూరిటీలను దుర్వినియోగం చేసినట్లు గుర్తించింది సెబీ నవంబర్ 22న గుర్తించి అప్రమత్తమైంది. ఖాతాదారుల సొమ్మును ఇతరాలకు వినియోగించినట్లు గుర్తించడంతో ఈ చర్యలు తీసుకొన్నట్లు సమాచారం. మరోవైపు దాదాపు రెండు వేల కోట్ల కుంభకోణానికి పాల్పడినట్టుగా అనుమానిస్తున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ లైసెన్స్‌ను బీఎస్‌ఈ, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీ, ఎంఎస్‌ఈఐలు కూడా ట్రేడింగ్ లైసెన్స్‌ను రద్దు చేశాయి. దీంతో కొత్త ఖాతాదారులను తీసుకోకుండా సెబీ ఆంక్షలు విధించినట్టయింది. అంతేకాదు.. ప్రస్తుతం ఉన్న ఖాతాదాలకు సంబంధించిన పవర్ ఆఫ్ ఆటార్నీపై కూడా ఆంక్షలు విధించింది. దీంతోపాటు ఎక్స్ఛేంజీలు ఈ సంస్థపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది.
కార్వీ ఫిన్‌టెక్ పేరు మార్పు...
మాతృ సంస్థ కార్వీ స్టాక్ బ్రోకింగ్‌పై ఆర్థిక అభియోగాలు పెరిగిపోతున్న నేపథ్యంలో అనుబంధ సంస్థ కార్వీ ఫిన్‌టెక్ తన పేరును మార్చుకుంది. జనరల్ అట్లాంటికి ప్రధాన వాటాదారుగా ఉన్న కార్వీ ఫిన్‌టెక్ సంస్థ తన పేరును కేఫిన్ టాక్నాలజీస్‌గా మార్చుకుంది. దీనికి తోడు తమ సంస్థ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మెన్‌గా ఎం.వి.నాయర్‌ను కూడా నియమించకన్నట్టుగా సోమవారం తెలిపింది. ఆయన నియామకం వెంటనే అమలులోకి వస్తుందని సంస్థ తెలిపింది. నాయర్ ప్రస్తుతం ట్రాన్స్‌యూనియన్ సిబిల్ చైర్మెన్‌గాను ఒక ప్రయివేటు ఈక్విటీ సంస్థ, మరో వెంచర్ క్యాపిటల్ ఫండ్ కంపెనీకి సలహాదారుగాను వ్యవహరిస్తున్నారు. ప్రయివేటు ఈక్విటీ దిగ్గజం జనరల్ అట్లాంటీ కార్వీ ఫిన్‌టెక్‌లో ప్రధాన వాటాను నియంత్రిస్తూ వస్తోంది. క్లయింట్ల సొమ్ము దుర్వినియోగం విషయంలో సెబీ సీరియస్ అయిన నేపథ్యాన కార్వీ గ్రూపు చైర్మెన్, ఎండీ పదవికి సి.పార్థసారథి గత వారం కార్వీ ఫిన్‌టెక్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఏర్పడిన కేఫిన్‌టెక్ సంస్థలో కార్వీ గ్రూపు 18 శాతం వాటాను కలిగి ఉంది. కేఫిన్ టెక్నాలజీస్ సంస్థ కార్పొరేట్ రిజిస్ట్రీ సేవలు, బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలు, డేటా ప్రాసెసింగ్ సర్విసులు అందిస్తోంది. కేఫిన్ టెక్నాలజీస్ సంస్థ పలు ఎంఎఫ్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ సంస్థలకు చెందిన రికార్డ్ కీపింగ్‌ను కూడా నిర్వహిస్తోంది.
83వేల మంది ఇన్వెస్టర్లకు మేలు..
కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ సంస్థ విషయంలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సకాలంలో స్పందించి అప్రమత్తంగా వ్యవహరించడంతో దాదాపు 83000 మంది ఇన్వెష్టర్లకు మేలు జరిగింది. కార్వీ అక్రమ కార్యకలాపాలను సెబీ సకాలంలో గుర్తిచడంతో పాటు వాటి నుంచి ఇన్వెష్టర్లకు పెద్దగా ముప్పు సంభవించకుండా వెనువెంటనే చర్యలు చేపట్టిన నేపథ్యంలో భారీ ప్రమాదం తప్పింది. సెబీ చర్యతో కార్వీ సంస్థ అక్రమంగా తనఖా పెట్టిన స్టాక్ మళ్లీ వారివారి డీమాట్ ఖాతాల్లోకి వచ్చి చేరుతున్నాయి. దీంతో 83వేల మంది ఇన్వెష్టర్లకు మంచి జరిగిందని చెప్పొచ్చు. సెబీ ఆదేశాలతో ''నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ'' (ఎన్‌ఎస్‌డీఎల్) ఆయా ఇన్వెస్టర్లకు చెందిన స్టాక్‌ను తిరిగి వారి ఖాతాల్లోకి మళ్లించింది. దీంతో 90 శాతం ఇన్వెస్టర్లకు చెందిన స్టాక్ వారి ఖాతాల్లోకి వచ్చి చేరాయి. మిగతా ఇన్వెస్టర్లకు చెందిన స్టాక్స్ వారు చెల్లించాల్సిన బకాయిలను పూర్తి చేయగానే.. వారివారి డీమాట్ ఖాతాల్లోకి వచ్చిన చేరుతాయని ఎన్‌ఎస్‌డీఎల్ తెలిపింది. కార్వీ సంస్థ 95000 మంది క్లయింట్లకు చెందిన దాదాపు రూ.2300 కోట్ల విలువైన సెక్యూరిటీలను తనఖా పెట్టి దాదాపు రూ.600 కోట్ల మర నిధులను అక్రమంగా స్థిరాస్తి వ్యాపారానికి మళ్లించిందని నియంత్రిత సంస్థలు గుర్తించిన సంగతి తెలిసిందే.